- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Disha Special : పహెల్గాం దాడిపై భారత్ అడుగులు ఎటువైపు..? ప్రతీకారానికి ఎలాంటి ప్లాన్ చేసింది?

పహెల్గాం (Pahelgam) ఊచకోత దేశంలోని ప్రతి ఒక్కరి గుండెను రగిలించింది. ఉగ్రవాదులు (Terrorists) చేసిన మారణహోమానికి కారణమైన పాక్(Pakistan) పై తక్షణమే ప్రతీకారం తీర్చుకోవాలని దేశం మొత్తం నినదిస్తున్నది. అయితే, ఈ తరుణంలో భావోద్వేగాల కంటే అనువైన సమయం ముఖ్యమని ప్రధాని నరేంద్రమోడీ (Prime Minister Narendra Modi) భావించారా? అందుకే సరిహద్దుల్లో పాక్ సైన్యం (Pakistan Army) భారీ యుద్ధ సన్నాహాలు చేస్తున్నా.. అవేమీ పట్టించుకోకుండా దైనందిన కార్యక్రమాల్లో మునిగి తేలుతున్నారా? దేశంలో జనగణన మొదలుపెట్టాలని నిర్ణయించడం వెనుక కూడా ఇదే కారణం ఉన్నదా? అంటే అవుననే సమాధానమే వస్తున్నది.
కానీ, పహెల్గాం ఘటనకు బాధ్యులైన ఉగ్రవాదులపై ఎక్కడ? ఎప్పుడు? ఎలా? దాడి చేయాలన్న విషయాన్ని పూర్తిగా సైన్యానికి వదిలేస్తున్నానని ప్రధాని చెప్పడం కూడా వ్యూహాత్మకమేనని మాజీ దౌత్యవేత్తలు, ఇంటెలిజెన్స్ అధికారులు పేర్కొంటున్నారు. శతృదేశం కోలుకోలేకుండా దెబ్బ తీయడమే దాడి ముఖ్య ఉద్దేశం అయ్యేలా ప్రభుత్వం భావిస్తున్నదని వారు చెప్తున్నారు. అందుకే సమయం తీసుకుంటున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. ఏదిఏమైనా ప్రధానమంత్రి నరేంద్రమోడీ చీఫ్ స్టాఫ్ ఆఫ్ డిఫెన్స్, త్రివిధ దళాధిపతులు, పారామిలిటరీ చీఫ్‌లతో సమావేశం కావడంతో ఇండియా, పాక్ సరిహద్దుల్లో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం మొదలైంది. రెండు దేశాల సైన్యాలు సరిహద్దుల్లో భారీగా మోహరించాయి. ఇప్పటికే పాక్ సైన్యం బోర్డర్ వద్దకు భారీగా ట్యాంకులను తరలించింది. హెలీకాప్టర్లతో పహారా నిర్వహిస్తున్నది. పహెల్గాం ఘటనలో గుర్రుమీదున్న భారత్ ఎటువంటి చర్య తీసుకుంటుందోనని పాక్ సైన్యం టెన్షన్ పడుతున్నది.
పైగా పహెల్గాం ఘటన తర్వాత ఉగ్రవాదుల వేటకు భారత్ సైన్యం ఉపయోగించిన కోడ్ నేమ్.. పాక్ సైనిక ముఖ్యులు, ఉగ్రవాద ముఠాలకు ముచ్చెమటలు పట్టిస్తున్నది. పహెల్గాం ఘటనలో వెళ్లి మోడీకి చెప్పుకో అంటూ ఉగ్రవాదులు బాధిత కుటుంబసభ్యులను గద్దించిన నేపథ్యంలో ప్రధాని మోడీ ఏం చర్యలు తీసుకుంటారన్నది ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. ఉగ్రవాదులు ఊహించని విధంగా దెబ్బ కొడుతామని ప్రధాని చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఉగ్రవాదులపై దాడికి భారత సైన్యం వద్ద ఎటువంటి అవకాశాలు ఉన్నాయి? సైన్యంపై దాడి చేస్తే పూర్తిస్థాయి యుద్ధం జరిగే అవకాశం ఉంటుందా? మొత్తానికి భారత్ సర్జికల్ స్ట్రైక్ చేస్తుందా? లేక పాక్ పై యుద్ధం ప్రకటిస్తుందా? అన్న సందేహాలను నివృత్తి చేసేలా ‘దిశ’ అందిస్తున్న ప్రత్యేక కథనం. - హరీశ్ ఎస్పీ
పాక్ ప్రేరిపిత ఉగ్ర శిబిరాలపై భారత్ ఇప్పటికే రెండుసార్లు మెరుపుదాడులు చేసింది. 2016 సెప్టెంబర్ 18న పంజాబ్‌లోని పఠాన్‌కోట్ యురి ఎయిర్‌ఫోర్స్‌స్టేషన్ లోకి ఉగ్రవాదులు చొరబడి భద్రతాసిబ్బందిపై కాల్పలు జరిపారు. తెల్లవారుజామున 3గంటలకు చోటుచేసుకున్న ఈ ఘటనలో 19మంది సైనికులు చనిపోయారు. భారీ సంఖ్యలో సైనికులు మృతి చెందడాన్ని సీరియస్ గా తీసుకున్న కేంద్రలోని మోడీ సర్కారు సరిగ్గా 11 వరోజు అంటే సెప్టెంబర్ 29న భారత స్పెషల్ ఫోర్సెస్ కు చెందిన కమెండోలు పాక్ సరిహద్దులు దాటి కొన్ని కిలోమీటర్ల వరకు వెళ్లి అక్కడ ఉగ్రవాద శిబిరాలపై విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో దాదాపు భారీ సంఖ్యలో ఉగ్రవాదులను హతమార్చి.. ఉగ్రశిబిరాలను నేలమట్టం చేశారు. ఈ ఘటనతో పాక్ కు షాక్ కొట్టినంత పనైంది. మరోవైపు పాక్ గడ్డపై ఉగ్ర శిబిరాలు ఉన్నాయన్న సత్యం అంతర్జాతీయ సమాజం దృష్టికి వచ్చింది. ఆ తర్వాత 2019 ఫిబ్రవరి 14న కశ్మీర్ లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై ఉగ్రవాదులు బాంబు దాడి చేశారు. ఈ ఘటనలో 49మంది జవాన్లు మృతి చెందారు. యురి ఘటనకు ప్రతీకారం తీర్చుకోవడానికి 11రోజులు వేచిచూసిన ప్రభుత్వం ఈ సంఘటనకు తక్షణమే బదులివ్వాలని నిర్ణయించింది. ఘటన జరిగిన రెండో రోజే అంటే ఫిబ్రవరి 26న ఉగ్రమూకలు ఉన్న బాలాకోట్ పై వైమానిక దాడులు చేసింది. పుల్వామా ఘటనలో భారత్ కమెండోలు మరోసారి సరిహద్దులు దాటుతారని భావించిన పాక్ కు దిమ్మదిరిగేనా.. వైమానిక దాడులు చేసింది. ఇప్పటికే భూ, వాయు మార్గాల్లో సైనిక చర్య చేపట్టిన భారత్.. పహెల్గాం ఘటనకు ఏవిధంగా స్పందిస్తుందన్నది అందరిలో ఉత్కంఠ కలిగిస్తున్నది.
మరోసారి స్ర్టైక్స్ సాధ్యమా?
ఇప్పటికే రెండుసార్లు భారత్‌తో దెబ్బ తిన్న పాక్.. భారత సరిహద్దులకు ఆనుకుని ఉగ్ర శిబిరాలను పట్టణాలకు మార్చింది. ఉగ్రవాదులను సరిహద్దులు దాటించేందుకు తాత్కాలిక లాంచ్ ప్యాడ్ లను మాత్రమే వినియోగిస్తున్నారు. గతంలో ఇవి పటిష్ట సైనిక క్యాంప్ వలే ఉండేవి. ఇప్పుడు భారత్ సరిహద్దులకు సమీపంలో ఎక్కడా ఉగ్రవాదులను ఒకేచోట భారీగా జమ కాకుండా పాక్ జాగ్రత్త పడుతున్నది. ఒకటి, రెండు గుడారాల్లో చిన్న చిన్న దళాలుగా మాత్రమే ఉగ్రవాదులు సంచరించేలా ఆదేశాలు జారీ చేసినట్లు నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. యురి, పుల్వామా ఘటనల తర్వాత భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్ చేసిన పరిస్థితులు ఇప్పుడు లేవు. ముఖ్యంగా వైమానిక దాడులు చేపట్టేందుకు అవకాశం ఇవ్వకుండా.. ఉగ్రవాదుల శిబిరాలన్నింటినీ పీఓకేలోని పట్టణాలు, జనసమ్మర్థ ప్రాంతాల్లోకి పాక్ సైనికాధికారులు షిఫ్ట్ చేశారు. ఇప్పుడు ఆ ప్రాంతాలపైకి దాడులు చేస్తే భారత్ పౌర నివాసాలపై బాంబులు కురిపించిందని అంతర్జాతీయ సమాజం ఎదుట పాక్ మొసలి కన్నీరు కార్చే ప్రమాదం ఉన్నది.
ఎప్పుడు? ఎలా?
ప్రస్తుత తరుణంలో భారత్ సమయం చూసి పాక్ చావు దెబ్బ కొట్టబోతున్నదని మాజీ సైనిక వ్యూహకర్తల అంచనా వేస్తున్నారు. మరోవైపు అరేబియా సముద్రంలో భారత్ నౌకాదళ విన్యాసాలు జరుగుతుండటం పాక్ ను కలవరపెడుతున్నది. ఇప్పటికే భూ, వాయు మార్గాల్లో దాడి చేసిన భారత్.. ఇప్పుడు సముద్రమార్గం నుంచి దాడి చేయనున్నదా? అని భయపడుతున్నది. ఆ దిశగా కూడా యుద్ధ సన్నాహాలు చేస్తున్నది. అయితే, ఇప్పుడు అందరి మదిలో రెండు ప్రశ్నలు మెదులుతున్నాయి. భారత్ దాడి ఎక్కడ చేయనున్నది? ఎలా చేయబోతున్నది?.. ఈ రెండు అంశాలను వివరంగా చర్చిస్తే.. ఇప్పుడు పీవోకేలో దాదాపు 42 ఉగ్రవాద లాంచ్ ప్యాడ్ లు ఉన్నట్టు నిఘా వర్గాల సమాచారం. అందులో 20నుంచి 30మంది ఉగ్రవాదులు మాత్రమే ఉంటారని.. ఆ లాంచ్ ప్యాడ్లు సైతం సరిహద్దులకు చాలా దూరంగా ఉన్నాయని తెలుస్తున్నది. గత రెండు సర్జికల్ స్ట్రైక్ జరిగినప్పుడు ఉగ్రవాద శిబిరాలన్నీ భారత సరిహద్దులకు చాలా సమీపంలో ఉండేవి. కానీ, ఇప్పుడు వాటిని చాలా దూరం తరలించారు. ఇప్పుడు సరిహద్దులను నడుచుకుంటూ దాటి ఆ శిబిరాలను చేరాలంటే కొన్ని గంటలు పట్టే అవకాశం ఉంటుంది. శతృభూమిలో సైనికులు గంటల తరబడి ఉండటం అనేది చాలా రిస్క్ కాబట్టి.. ఆ అవకాశాన్ని ఎంచుకోవడం తక్కువ. ఇప్పటికే వాయు మార్గంలో దాడి చేసిన నేపథ్యంలో పాక్ సరిహద్దుల వెంబడి అత్యాధునిక రాడార్లు సిద్ధం చేసింది. చిన్నపాటి పక్షి సైజులో ఉన్న డ్రోన్ వచ్చినా.. పసిగట్టేలా ఏర్పాట్లు చేసుకున్నది. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా.. యుద్ధ విమానాలన్నీ సరిహద్దులకు సమీపంలోని స్టేషన్లకు చేరిపోయాయి. అలారం రాగానే నిమిషాల్లో యుద్ధ విమానాలు గాల్లోకి లేచేలా డ్రిల్ జరుగుతున్నది.
టార్గెట్ ఇవేనా?
పాక్‌లో అంతర్జాతీయంగా ఉగ్రవాదులు దాదాపు 13వేలమంది ఉన్నారని అగ్రరాజ్యం అమెరికా ప్రకటించింది. వీరిని స్పెషల్లీ డిజిగ్నేటెడ్ గ్లోబల్ టెర్రరిస్ట్స్ (ఎస్డీజీటీ)గా ఫారిన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్టీఓ) గా ముద్రవేసింది. వీరిలో భారత్ కేంద్రంగా ఉగ్ర కార్యకలాపాలు చేస్తున్న జైషే వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ సహా లష్కర్ ఎ తాయిబాలకు చెందిన అనేకమంది ఈ జాబితాలో ఉన్నారు. గతంలో పాక్ ప్రధానిగా ఉన్న ఇమ్రాన్ ఖాన్ సైతం దేశంలో 30వేలనుంచి 40వేలమంది ఉగ్రవాదులు ఉండొచ్చని ప్రకటించారు. అయితే, అమెరికా ఈ ఏడాది జనవరిలో ఉగ్రవాద సంస్థలకు చెందిన కొన్ని వ్యాపార కేంద్రాలను గుర్తించింది. ఆ ప్రాంతాలను భారత సైన్యం టార్గెట్ చేసే అవకాశం ఉన్నది. పాకిస్తాన్‌లోని ఉగ్ర శిబిరాలను అమెరికా, ఐక్యరాజ్యసమితి భద్రతామండలి గుర్తించి నివేదికలు విడుదల చేయడంతో.. వాటిపై దాడులు చేసినా అంతర్జాతీయంగా భారత్ పై ఒత్తిడి ఉండే అవకాశం లేదు. పైగా పాక్ ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న విషయం మరోసారి చర్చనీయాంశం అవుతుంది. ఇది ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయి ఉన్న పాక్ కు మరింత తలపోటుగా మారనుంది.
పాక్ లోని ఉగ్రశిబిరాల్లో అమెరికా గుర్తించిన వాటిలో ముఖ్యమైనవి ఇవి..
1. లష్కర్ ఎ తాయిబాకు లాహోర్ శివారు ప్రాంతమైన మురిద్కే పట్టణంలో భారీ ఆస్తులు ఉన్నాయి. ఇక్కడ ఓ భారీ షాపింగ్ కాంప్లెక్స్ నిర్వహిస్తున్నది. అందులో చాలామటుకు ఉగ్ర కార్యకలాపాలే జరుగుతాయని అమెరికా సైతం ఆ నివేదికలో వెల్లడించింది. ఆ కాంప్లెక్స్ ను నేలమట్టం చేస్తే లష్కర్‌కు నిధులు ఆగిపోతాయని.. దీంతోపాటు ఆ సంస్థపై స్థానికుల్లో ఉన్న నమ్మకం కూడా సడలుతుందని నిఘా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. పాక్ సైన్యం రక్షణ కవచంలో ఉండటంతో భారత నిఘా బృందాలు కూడా అక్కడికి చేరడం సాధ్యం కావడంలేదని.. ఇప్పుడు అలాంటి టార్గెట్లను నేలమట్టం చేస్తే భారత్ సత్తా ఉగ్ర మూకలకు తెలుస్తుందని వెల్లడిస్తున్నాయి. ఈ భవనం నుంచే 2008 ముంబై దాడులకు సంబంధించిన మానిటరింగ్ జరిగిందని భారత నిఘా వర్గాలు ఆరోపిస్తున్నాయి.
2. పాకిస్థాన్‌లోని అనేక మదర్సాలు ఉగ్రవాద సంస్థలకు రిక్రూట్‌మెంట్ తోపాటు రాడికలైజేషన్ కేంద్రాలుగా వ్యవహరిస్తున్నాయి. లష్కర్ ఎ తాయిబా, లష్కర్ ఎ ఝంగ్వీ, తెహ్రీక్ ఎ తాలిబాన్ పాకిస్తాన్ (TTP) వంటి ఉగ్రవాద సంస్థలు బలూచిస్థాన్‌లోని మస్తుంగ్, ఖుజ్దార్ పట్టణాల్లో శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నాయి. ఈ సంస్థలన్నీ మదర్సాలను ఏర్పాటుచేసి అందులో ఉగ్రవాద కార్యకలాపాలు చేపడుతున్నాయి. స్థానికంగా అవి ఆధ్యాత్మిక, ఉపాధి కేంద్రాలుగా పేరుపొందాయి.
3. పాక్ ఆధీనంలోగల పంజాబ్ రాష్ట్రంలోని బహవల్పూర్‌లో జైష్ ఎ మెహమ్మద్ భారీ స్థావరాన్ని నిర్వహిస్తుంది. ఇది మసూద్ అజహర్ నాయకత్వంలో శిక్షణ, రిక్రూట్‌మెంట్ కేంద్రంగా ఉన్నట్లు నివేదికలు ఉన్నాయి. ఈ స్థావరంకూడా స్థానికంగా మదర్సాగా గుర్తింపు పొందింది. పుల్వామా దాడులకు ఇక్కడే వ్యూహరచన జరిగిందని ఆరోపణలు ఉన్నాయి.
పాక్ ఆర్మీ చీఫ్ ఎక్కడ?
పహెల్గాం ఉగ్రదాడికి పాల్పడిన టెర్రరిస్టులకు బంధించేందుకు భారత సైన్యం చేపట్టిన చర్యలకు ఆపరేషన్ టిక్కా అని పేరు పెట్టింది. నిజానికి ఇది తాత్కాలికమైన ఆపరేషన్ కాదని.. సుదీర్ఘమైనదని పాక్ సైతం అర్థం చేసుకున్నది. ఎందుకంటే బంగ్లాదేశ్ ఏర్పాటుకు ముందు ఆ ప్రాంతంలో సైన్యం అనేక అరాచకాలకు పాల్పడింది. ఆ సమయంలో గవర్నర్ గా ఉన్న లెఫ్టినెంట్ జనరల్ టిక్కాఖాన్ ఈ మారణహోమానికి సారథ్యం వహించాడు. ఆ సమయంలో భారత్.. పాక్ సైన్యం నుంచి సామాన్యులకు రక్షణ కల్పించింది. కశ్మీర్ లో జరుగుతున్న నరమేథం మళ్లీ నాటి బంగ్లాదేశ్ ను గుర్తు చేస్తున్నాయి. అంందుకే ఉగ్ర మూకలకు సారథ్యం వహిస్తున్న ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌ను టార్గెట్ గా సైన్యం చేపట్టిన ఆపరేషన్ కు టిక్కా అని పేరు పెట్టిందని సమాచారం. అందుకే పహెల్గాం ఘటన తర్వాత నుంచి ఆసిమ్ బహిరంగ ప్రదేశాల్లోకి రావడం లేదు.. ఆయన కుటుంబాన్ని కూడా మరొక దేశానికి పంపించారని వార్తా కథనాలు వచ్చాయి. ఆసిమ్ కూడా లాహోర్, ఇస్లామాబాద్ లోని రహస్య సైనిక బంకర్లలోనే ఉంటున్నట్లు పాక్ కేంద్రంగా నడుస్తున్న మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
దౌత్యపరమైన ఆంక్షలు:
1. సిద్ధు నదీ జలాల నిలిపివేత: ఇది పాక్ నీటి సరఫరాపై గణనీయమైన ప్రభావం చూపుతుంది. ఈ దేశం మొత్తం సింధునదిపైనే ఎక్కువగా ఆధారపడుతుంది. ఈ చర్యను పాక్ ‘యుద్ధచర్య’గా అభిర్ణించింది.
2. అటారీ-వాఘా సరిహద్దు చెక్‌పోస్ట్ మూసివేత. పాక్ పౌరులకు సార్క్ సహా అన్ని వీసాల రద్దు. వారిని 48 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని ఆదేశించడం.
3. ఇరు దేశాల హైకమిషన్లలో దౌత్య సిబ్బందిని 55 నుండి 30కి తగ్గించడం. పాక్ రక్షణ సలహాదారులను భారత్ నుండి బహిష్కరించడం.
4. భారత విమానాలకు పాక్ గగనతలం మూసివేయగా.. భారత్ కూడా అదే అస్త్రం ప్రయోగించింది.
ఉగ్రవాదుల ఇండ్ల పేల్చివేత
కశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొంటున్న ఉగ్రవాదుల ఇండ్లను సైన్యం నేలమట్టం చేస్తున్నది. లష్కర్ ఎ తాయిబా దాని అనుంబంధ ది రెసిస్టెన్స్ ఫోర్స్ కు చెందిన తొమ్మిది ఉగ్రవాదుల ఇళ్లను సైన్యం కూల్చేసింది. సాధారణంగా ఇండ్ల కూల్చివేతలను బుల్డోజర్లతో చేస్తుండగా.. ఇక్కడ మాత్రం డైనమెట్లు, ఐఈడీలతో పేల్చేశారు. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడితే ఇదే విధంగా వ్యవహరిస్తామని కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ కూడా ప్రకటించారు. కశ్మీర్ లో దశాబ్దాలుగా ఉగ్రవాదం కొనసాగుతున్నా.. సైన్యం ఈ తరహా చర్యలు చేపట్టడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. కేంద్రం ప్రభుత్వం పహెల్గాం ఘటనను ఎంత సీరియస్ గా తీసుకున్నదో ఈ విషయం స్పష్టం చేస్తున్నదని విశ్లేషకులు పేర్కొంటున్నారు.






