- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

కొందరుంటారు.
ఎప్పుడేం మాట్లాడాలో తెల్వదు.
ఎప్పుడేం డిస్కస్ చేయాలో కూడా తెల్వదు.
తెల్వదనేకంటే.. అన్నీ తెలిసిన మూర్ఖత్వం అనొచ్చేమో.?
ఒకదిక్కు యుద్ధం జరుగుతుంటే..
ప్రాణాలను అడ్డంపెట్టి ఆర్మీ పోరాటం చేస్తుంటే..
ఇంట్లో కూర్చొని "ఇదవసరమా.. అదవసరమా" అని కథలు రాస్తుంటారు.
యుద్ధం ఆపేస్తే.. "తుస్ ఇంతేనా" అనే వెకిలి నవ్వులు.
అసలు వాళ్ల ఉద్దేశమేంటీ.?
వాళ్ల స్టాండేంటి.?
ఎవరి పక్షమూ.? అనేవి వాళ్లకైనా క్లారిటీ ఉందో లేదో.?
- దాయి శ్రీశైలం
"వాట్సప్ యూనివర్సిటీ"లో ఒక పార్టీ.. ఒక వర్గం అనేదేం ఉండదు. దీంట్లో అందరికీ అడ్మిషన్ ఉంటుంది. ప్రతీదానికి వంకలు పెట్టడం.. అన్నీ తమకే తెలుసనుకొని బిల్డప్ ఇవ్వడం.. నేను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అని చాటిచెప్పడం వీళ్లకు తెలిసిన విద్య. కొంచెం మోటుగా చెప్పాలంటే.. "ఊరంతా ఒక చింతుంటే.. ఊసుకండ్లోనిది ఇంకో చింత అన్నట్లే" ఉంటది వీళ్ల కథ. అందుకే ముందు "వాట్సప్ యూనివర్సిటీ ఆపరేషన్" అవసరం.
ఆపరేషన్ స్టార్టవగానే..
పాకిస్తాన్‌కు.. ఉగ్రవాదులకు బుద్ధి చెప్పాలని "ఆపరేషన్ సిందూర్" స్టార్ట్ చేసిందే ఆలస్యం "వ్యాసాలు" షురూ చేశారు మనొళ్లు. "పాకిస్తాన్‌తో యుద్ధం" సరైంది కాదనీ.. వాళ్ల ఉసురు తగులుతుందనీ.. ఒకదేశంపై యుద్ధం అనేదే పద్ధతి కాదనీ రకరకాల విశ్లేషణలు రాశారు. యుద్ధాన్ని ఎవరు కోరుకోరు. యుద్ధం అవసరమా.? లేదా.? అనేవి ప్రభుత్వాలు చూసుకుంటాయి.. ఆర్మీ చూసుకుంటుంది. ముందు పౌరులుగా మన కర్తవ్యాలేంటో అవి సక్రమంగా చేస్తే సరిపోతుంది. అవన్నీ వదిలేసి ఆర్మీ సేవల్ని తక్కువచేసి.. ప్రపంచం ముందు సొంత దేశాన్ని దోషిగా చూపెట్టే ప్రయత్నం చేయడం ఎంత వరకు కరెక్టు.? మనం బలహీనంగా ఉన్నామని చెప్పడం దేనికి సంకేతం.?
సీజ్‌ఫైర్ అనేసరికి..
నిజంగా మనొళ్లు చాలా గమ్మతిగా ఉంటారు. "ఆపరేషన్ సిందూర్" వద్దే వద్దు అన్నొళ్లు.. పాకిస్తాన్ మీద ప్రేమ చూపించినొళ్లే తర్వాత మాట మార్చారు. నిన్నటిదాక "యుద్ధంతో నష్టం".. "యుద్ధమే వద్దు".. "అయ్యో పాపం వాళ్లూ మనుషులే" కదా అని రాసినొళ్లే.. సీజ్‌పైర్ ప్రకటించేసరికి వేరే నినాదం ఎత్తుకున్నారు. "ఏదో యుద్ధం చేసి పాకిస్తాన్ పని పడతారనుకుంటే తుస్సుమనిపించారు" కదా అని కొందరు. "ముందే చెప్పాం కదా మనతో ఏమీ కాదు" అని కొందరు. "పాకిస్తాన్‌తో తట్టుకోవడం మనతో అవుతుందా అసలు" అని వాట్సప్ యూనివర్సిటీ విద్యార్థులు వ్యాసాలు రాయడం షురూ చేశారు. అప్పుడేమో వద్దన్నారు. ఇప్పుడేమో ఎందుకు ఆపారంటున్నారు. అసలు వీళ్ల ఉద్దేశమేంటో ఎవరికీ అర్థంకాదు.
ఏం చెప్పాలి వీళ్లకు.?
అన్నీ తెలిసినొళ్లకంటే ఏమీ తెల్వనొళ్లే బెటరేమో. అట్లెందకూ అంటరా..? ఔను మరీ.. క్లిష్ట సమయాల్లో దేశానికి రక్షణగా నిలుస్తున్న ఆర్మీ సేవల్ని.. "ఆపరేషన్ సిందూర్"ను వ్యతిరేకించి.. నానా వంకలు పెట్టింది మేధావులు మాత్రమే. పైగా కాల్పుల విరమణకు ఒప్పుకొని నీతి తప్పిన పాకిస్తాన్‌కే వీళ్ల సపోర్ట్ ఉంటది. ఒకాయనంటాడు.. "కాల్పుల విరమణ అయిపోయింది కదా.. తప్కులు.. తపాలాలు.. చెంచాలు.. గిలాసలు కొట్టేది ఉంటదా ఏమన్నా" అనీ. దేశమంటే ఎంత చిన్న చూపో చూడండి. ఇంకొకాయన అంటాడు.. "జీతమిచ్చి పెట్టుకున్న ఆర్మీ సక్కగ పనిచేయకపోతే గిట్ల మధ్యల్నే చేతులెత్తాయాల్సి వస్తది" అనీ. అంటే ఆర్మీ చేతగాని తనం వల్లనే సీజ్‌ఫైర్ ప్రకటించారనే కదా అతడి ఉద్దేశం. ఒకసారి బార్డర్లోకి వెళ్లి చూస్తే తెలుస్తుంది.. ఇంట్లో కూర్చొని వ్యాసాలు రాస్తే కాదు.
వీరుల త్యాగాలేం కావాలి.?
సరే.. మనకు భావ ప్రకటన స్వేచ్ఛ పుష్కలంగా ఉంది.. దేని గురించయినా మాట్లాడొచ్చు. అదెవరూ కాదనలేరు. కానీ.. "స్వేచ్ఛ ఉంది కదా" అనీ ఏది పడితే అది మాట్లాడటం కూడా పద్ధతి కాదని తెలుసుకుంటే మంచిది. మన మేధావులు.. వాట్సప్ యూనివర్సిటీ విద్యార్థులు.. ప్రొఫెసర్లు పాకిస్తాన్ మీద చూపిస్తున్న ప్రేమలో పాక్ పాలకులు దేశం బాగుకోసం పదిశాతం చూపించినా ఆ దేశ పరిస్థితి అలా ఉండేది కాదేమో.? "వాళ్లకే లేని ప్రేమ మనవాళ్లకెందుకో" మరీ.? సరే.. అది వాళ్లిష్టం. కానీ ఒక్కటి. మన ఆర్మీ పాకిస్తాన్‌లో బాంబులు పేలుస్తుంటో హాహాకారాలు చేసిన మేధావులు.. యుద్ధంలో ప్రాణాలు పోగొట్టుకున్న మన ఆర్మీ గురించి ఒక్క మాటయినా మాట్లాడారా.? ఎందుకలా.? మన మురళీ నాయక్.. సచిన్ యాదవ్‌లవి ప్రాణాలు కావా.? వీళ్ల త్యాగాలకు విలువలేదా.?
ఉచిత సలహాలూ
ఇక కొందరుంటారు. వీళ్లే లెఫ్టినెంట్ కల్నల్స్.. వీళ్లే కమాండర్స్ అయినట్లు ఫీలవుతుంటారు. అదేదో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటే రన్నింగ్ కామెంట్రీ చేసినట్లు "ఇట్లా చేస్తే బాగుండు.. అట్ల చేస్తే బాగుండు.. ఎహే ఇది తప్పు.. అది తప్పు" అని ఉచిత సలహాలిస్తుంటారు. "యుద్ధం కోసం అందరూ కదిలినాం కదా.. మరిప్పుడు ఎవరి కోసం కాల్పులు విరమించుకున్నారు.? ఏం సాధించామని.. ట్రంప్ మెప్పు కోసమేనా.?" అని ప్రశ్నిస్తుంటారు. అంబటి రాయుడులాంటి వ్యక్తులైతే యుద్ధం పీక్స్‌లో ఉన్నప్పుడు ఆర్మీ చర్యలను తప్పుబట్టి తమ బుద్ధిని చూపించుకుంటారు. కాల్పుల విరమణకు అంగీకరించి.. తర్వాత ఆ నీతి తప్పిన పాకిస్తాన్ నీతి.. రాయుడులాంటి వాళ్ల నీతి ఒక్కటే అనే విమర్శలొస్తున్నాయి.
ఫేకుడు బ్యాచ్
"ఉచిత సలహాల" బ్యాచ్ తమ్ముడైతే.. "ఫేకుడు బ్యాచ్" అన్న అని చెప్పుకోవాలి. వీళ్లేమో ఆ యుద్ధం తామే చేస్తున్నట్లు.. ఆర్మీని తామే ముందుండి నడిపించి.. అజిత్ దోవల్‌కు అనుక్షణం గైడ్ చేస్తున్నట్లు బిల్డప్ ఇస్తుంటారు. ఒకరకంగా యుద్ధాన్ని డిస్టర్బ్ చేసింది ఈ బ్యాచే. ఎప్పటివో పాత వీడియోలు.. ఇంటర్నెట్ ఫొటోలు.. ఊహాజనిత సమాచారం పోస్ట్ చేసి.. ఏది కల్పితమో.. ఏది నిజమో తెలియనంతగా స్ప్రెడ్ చేస్తారు. "మన ఆర్మీ దాన్ని పేల్చేసిందీ.. దీన్ని పేల్చేసిందీ.. పాకిస్తాన్ కాలి బూడిదైపోయింది.. ఆర్మీ చీఫ్ అరెస్టయ్యాడు.. అధ్యక్షుడు పారిపోయాడు.. తెల్లారే సరికి పాకిస్తాన్‌లో ఇండియా జెండా ఎగురుతుంది" అని వీళ్లే వ్యూహరచన కమిటీ అధ్యక్షులైనట్లు ఫేకుతారు. దేశమ్మీద ప్రేమంటే ఇట్లా అబద్ధాలను ఫేకడం కాదని తెలుసుకుంటే మంచిది.
మీరు గొప్ప.. మేం గొప్ప..
ఇక ఇప్పుడు జబ్బలు చరుచుకునే చర్చ మొదలైంది. అమెరికా మధ్యవర్తిత్వం నడిపి ఇండియా.. పాకిస్తాన్ల మధ్య శాంతి చర్చలు జరిపి కాల్పుల విరమణ చేసి యుద్ధాన్ని ఆపేసింది కదా.? దీనికి కొందరేమో "కొండంత రాగం తీసి పాసుపండ్ల పాట పాడినట్లుంది మోడీ కథ" అని అంటున్నారు. "పోయిపోయి అమెరికా ట్రంపును నమ్మితివి.. దేశాన్ని శ్వేతసౌధంలో తాకట్టు పెడితివేంది సారూ" అని వాదిస్తున్నారు. "ఇందిరాగాంధీ అయితే ఒక్క దెబ్బకు పాకిస్తాన్‌ను తుక్డల్ చేస్తుండె" అంటున్నారు. "ఇందిరాగాంధీ చేసిన మోసమే అయ్యా ఇదీ.. దేశానికి ద్రోహం చేసింది నెహ్రూ ఇందిరాలే" అని కొందరు కౌంటర్లిస్తున్నారు. అప్పుడూ.. ఇప్పుడూ మధ్యలో అమెరికోడు ఏందని.. ట్రంపొక బిజినెస్ బ్రోకరని చెప్తూ ఎవరి గొప్పలను వాళ్లు చాటింపేస్తున్నారు.
అటుంటాం.. ఇటుంటాం
"ఊరందరిదీ ఒక దారైతే ఉలిపికట్టెది మరోదారి" అన్నట్లు ఇంకా కొందరు గమ్మతి మనుషులు మోపయిండ్రు సోషల్ మీడియాలో. వీళ్లు పెట్టే పోస్టులు దేన్నీ సమర్థించినట్లు ఉండవు.. దేన్నీ వ్యతిరేకించినట్లూ ఉండవు. కానీ "యుద్ధం ఎందుకనీ" అంటారు. అదే నోటితో "మళ్లొకసారి యుద్ధం జరిగితే బాగుండూ" అనీ అంటారు. "పాక్ మీద ఇండియా యుద్దం ఒక కుక్క పటాక్" అని రాసిన ఒకాయన.. తర్వాత ఇక్కడ మనం లొంగిపోయినం బాస్.. ఇంకా బాంబులేసి గెలిసేటంత సీన్మలేదు మనకూ" అని రాశాడు. పెండ్లిమేళం బ్యాచ్‌లా ఉంటుంది వీళ్ల కథ. సావుకు అదే డప్పు కొడతారు.. పెండ్లికీ అదే డప్పు కొడతారు. ఏదో పెండ్లిచూపులకొచ్చిన వాళ్లలా అన్నింట్లోనూ ఆలస్యంగా వచ్చి ఏదో ఒక పోసిత్తు వేసి ఆనంద పడుతుంటారు.
మతంతో లింకేంటి.?
"ఆపరేషన్ సిందూర్"లో భాగంగా సైన్యం వీరోచిత యుద్దం చేస్తుంటే.. అధికారులు అనుక్షణం సమీక్షించి శతృచర్యలను తిప్పికొట్టే వ్యూహాలు రచిస్తుంటే.. సోషల్ మీడియాలో మాత్రం "వాట్సప్ యూనివర్సిటీ" లేనిపోని పంచాయతీలు పెట్టుకుంది. యుద్ధానికి సపోర్ట్ చేసేవాళ్లందరీ ఒక మతం.. వ్యతిరేకించేవాళ్లది ఒక మతం అన్నట్లు పోటీలు పడి పోస్టులు పెట్టారు. అసలు యుద్ధానికి.. దేశానికి.. మతంతో లింకేంటో వాళ్లకే తెలియాలి. "ఆపరేషన్ సిందూర్"ను వ్యతిరేకించిన వాళ్లలో హిందువులు లేరా.? సమ్మతించనివాళ్లలో ముస్లీంలు లేరా.? మనం హిందువులమా.? ముస్లీంలమా.? అనేది కాదిక్కడ. మనమంతా భారతీయులం.. ఇక్కడ జరుగుతున్న భారత్- పాక్ యుద్ధంగా మాత్రమే చూడాలి కదా.?
కామ్‌గా ఉండటం బెటర్
యుద్ధ సమయాల్లో.. క్లిష్ట పరిస్థితుల్లో హైపింగ్ కోసం.. ఏవో నలుగురి ప్రశంసల కోసం.. సోషల్ మీడియాలో నాలుగు లైకుల కోసం ఏది పడితే అది.. ఎట్ల పడితే అది మాట్లాడితే నడవదు. కాస్త సంయమనంతో ఉండాలి. మనకెంతో తెలివుండొచ్చు.. మనం మేధావులమే అయుండొచ్చు. ఆ మేధావి తనాన్ని.. తెలివిని చూపించుకునే సందర్భం.. వేదిక వేరే ఉంటాయి. "ఆపరేషన్ సిందూర్" విషయంలో చాలామంది దీనిని పాటించలేదు. నోటికేదొస్తే అది వాగి.. విమర్శల పాలయ్యి క్షమాపణలు చెప్పారు. కొంతమది వారి ఉద్యోగాలు పోయాయి. ఎవరి దృష్టికోణం వాళ్లకుంటుంది. కానీ దాన్ని ప్రదర్శించడానికంటూ ఒక వేదిక ఉంటుంది. కాబట్టీ కొన్ని సందర్భా్ల్లో అతి వాదన కన్నా.. అసలు వాదించక సైలెంట్‌గా ఉండటమే మంచిది.
ఏమవుతుంది.?
"ఏదెట్ల పోతే మాకేంటీ.? మనం అనాల్సింది అంటే సరిపోతుంది" అంటే ఎవరు ఊకుంటారు. అనవసర చర్చ.. రచ్చ.. రాద్దాంతం.. తప్పుడు సమాచార వ్యాప్తి.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు.. నిందించడం వంటివి చేస్తే చర్యలు కూడా ఉంటాయని తెలుసుకోవాలి. తప్పుడు లేదా హానికరమైన పోస్టులు.. ద్వేషపూరిత కామెంటస్ చేస్తే "సైబర్ బుల్లింగ్" ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటారు. యుద్ధ సమయంలో.. హింసను ప్రేరేపించే లేదా జాతీయ భద్రతకు ముప్పు కలిగించే పోస్టులు పెడితే శిక్షార్హం. అమెరికా వంటి దేశాల్లో అయితే సెక్షన్ 230 ప్రకారం.. కమ్యునికేషన్ డిఫెన్సీ యాక్ట్ కింద తమ పోస్టులకు కచ్చితంగా బాధ్యత వహించాల్సి ఉంటుంది. సైనిక కార్యకలాపాలకు సంబంధించిన ఫేక్ సమాచారం పోస్ట్ చేస్తే జైలుశిక్ష ఉంటుంది.
యుద్ధం మళ్లీ స్టార్టయితే..
ఇప్పటికైతే తాత్కాలిక బ్రేక్ పడింది. కానీ కొన్నిచోట్ల ఇంకా ఉద్రిక్త పరిస్థితులే కనిపిస్తున్నాయి. యుద్ధాన్ని మనమైతే కోరుకోవడం లేదు. కానీ పాకిస్తాన్ మళ్లీ తన బుద్ధి చూపించుకొని యుద్ధం అనివార్యం చేస్తే ఈసారైనా.. పౌరులు బాధ్యతగా వ్యవహరించండి. ఏది పడితే అది మాట్లాడితే ఎలాంటి చర్యలుంటాయో.. సమాజం దృష్టిలో దోషిగా ఎలా నిలబడాల్సి వస్తుందో చూశారు కదా.? అందుకే బాధ్యత అవసరం. ఇక ఫేకుడు బ్యాచ్.. భుజాలు తరుముకునే బ్యాచ్‌లు కూడా బాధ్యతగా ఉండాలి. విజయంలో మనదే పైచేయి ఉండాలనే ఆత్రంలో ఏది పడితే అది మాట్లాడి కన్ఫ్యూజ్ చేయొద్దు. ఇక్కడ తెలియనివాళ్లంటూ ఎవరూ లేరు. అన్నీ తెలిసినవాళ్లే కొంచెం సంయమనంతో ఉంటే అంతా ప్రశాంతంగానే ఉంటుంది.
ఇవి తెలుసుకోండి
👉 యుద్ధ సమయాల్లో విచక్షణ కోల్పోయి ఫేక్ సమాచారాన్ని వ్యాప్తి చేయడం ఐపీసీ.. ఐటీ యాక్ట్ ప్రకారం తీవ్రంగా పరిగణించబడుతుంది.
👉 ఐపీసీ సెక్షన్ 505.. ప్రజలలో భయాందోళనలు లేదా హింసను రెచ్చగొట్టే తప్పుడు సమాచారం వ్యాప్తిచేస్తే 3-7 సంవత్సరాల జైలుశిక్ష.
👉 ఐపీసీ సెక్షన్ 295ఏ ప్రకారం.. మతపరమైన భావాలను గాయపరిచే ఉద్దేశ పూర్వక చర్యలకు 3 సంవత్సరాల జైలు శిక్ష.
👉 యుద్ధ సమయాల్లో బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు చేస్తే "అన్ లా ఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్" యాక్ట్ కింద కేసులు నమోదవుతాయి.
👉 ఐటీ రూల్స్ 2021 ప్రకారం.. సోషల్ మీడియాలో నుంచి ఫేక్ కంటెంట్‌ను 36 గంటల్లో తొలగించకపోతే కఠిన చర్యలుంటాయి.
ఎందుకంత ఆత్రుత.?: శేఖర్ మల్యాల, కోరుట్ల
ఒకవైపు "ఆపరేషన్ సిందూర్" జరుగుతోంది. ఎప్పుడేమైతుందో అని అందరూ ఉత్కంఠగా చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పరిస్థితులను గమనిస్తూ సైలెంట్ ఉండటమే బెటర్. కానీ చాలామంది ఏదో ఒకటి వాగి.. తమ మనసులో దేశం మీద ఉన్న ఉద్దేశమేంటో చూపెట్టుకున్నారు. ఇంకా కొందరేమే తప్పుడు సమాచారాలను వ్యాప్తి చేసి జనాలను గందరగోళంలో పడేశారు. అసలెందుకు వీళ్లకు ఇంత ఆత్రుత.? యుద్ధంపై జోకులేస్తే.. అది ఆర్మీపై.. దేశంపై వేసినట్లు కాదా.? ఏందో ఈ మధ్య వాట్సప్ యూనివర్సిటీ వార్తలకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. ఇకనైనా మారాలి. యుద్ధం తాత్కాలికంగానే ఆగిపోయింది. మళ్లీ జరిగినప్పుడు ఇలాంటి కుల్లు జోకులొద్దు.
మనం మనుషులం: రమేష్ జైనోజు, నాగర్ కర్నూల్
మన బాధ్యత మనకు తెలిసినప్పుడు దేశం పట్ల భక్తి ఉంటుంది. దేశం పట్ల భక్తి.. భయం రెండూ ఉండాలి మనకు. పాకిస్తాన్ మన దేశంలోకి చొరబడి.. మన పౌరుల్ని.. ఆస్తుల్ని ధ్వంసం చేస్తే చప్పుడు చేయని ఎంతోమంది.. యుద్ధం అనేసరికి పెద్ద లొల్లి చేశారు. ఇదెక్కడి సమన్యాయం.. ఇదేం దేశభక్తి.? ఈ దేశంలో ఉంటూ.. ఇక్కడి తిండి తింటూ.. గాలి పీలుస్తూ కష్టకాలంలో జోకులు వేసుకునేవాళ్లను ఏమనాలి చెప్పండి.? మరీ ఇలా తయారయ్యారేంటి జనాలు. దీంట్లో సెలబ్రిటీలున్నారు.. కామన్ జనాలున్నారు.. మేధావులూ ఉన్నారు. సరే కామన్ పబ్లికంటే ఏమో అనుకోవచ్చు. మేధావులకేమయ్యింది. దేశాన్ని కాపాడుకోవాలనే ధ్యాసలేదా.? వేరేవాళ్లకు రాసిచ్చేద్దామా మన దేశాన్ని.?
- Tags
- WhatsApp University
- misleading
- own stories
- facts
- Operation Sindoor
- India-Pakistan conflict
- India-Pakistan conflict War
- Pahalgam terror attack
- Precision strikes
- Indian Armed Forces
- Pakistan-occupied Kashmir (PoK)
- Cross-border terrorism
- Airstrikes
- Jaish-e-Mohammed
- Lashkar-e-Taiba
- Defense Ministry
- Prime Minister Narendra Modi
- Airspace closure
- Civilian casualties
- Retaliation
- Jammu and Kashmir
- Indus Water Treaty
- Anti-terror operation
- Military escalation






