అంతన్నాడు ఇంతన్నాడు.. ఆడపిల్లకు ఆటలా అన్నాడు.!!

by Daayi Srishailam |

మన మట్టిలో మాణిక్యాల క్రీడా ప్రతిభను మట్టిలో పాతేస్తాం

అంతన్నాడు ఇంతన్నాడు.. ఆడపిల్లకు ఆటలా అన్నాడు.!!
X

దిశ, ఫీచర్స్: మహిళా క్రికెట్ జట్టు వరల్డ్ కప్ కొడితే వహ్ వా.. వహ్ వా అని మెచ్చుకుంటాం. డీపీలు మార్చుకొని దేశభక్తి బీపీలు పెంచుకుంటాం. వాట్సప్ స్టేటస్‌లు పెట్టి "వారెవ్వా" వీళ్లురా అమ్మాయిలంటే అని సలాం కొడతాం. మట్టిలో మాణిక్యాలు.. అసలైన ఆణిముత్యాలు అని కీర్తి కిరీటాలు తొడుగుతాం. ఇంత హంగామా మనం.. మన సొంతింటి ఆణిముత్యాలను ఆటల్లో ఎంకరేజ్ చెయ్యం. మన మట్టిలో మాణిక్యాల క్రీడా ప్రతిభను మట్టిలో పాతేస్తాం.!!

ఆడపిల్లల క్రీడా సామర్థ్యాన్ని గౌరవించలేమా.?

దేశం కప్పు కొట్టిన ప్రతీసారి మనం మీసం తిప్పుతాం. అరుదైన రికార్డులు సొంతం చేసుకున్న ప్రతీసారి "అమ్మాయిల ప్రతిభ"ను ఆనంద డోలికల్లో వేసి తులతూగుతాం. ఇండియా సత్తా ఇదీ.. భారత జట్టు భరోసా ఇదీ అని గొప్పలు చెప్పుకుంటాం. కానీ.. మనం చెప్పుకునే గొప్పలన్నీ.. మనం ఒలకబోసే ప్రేమలన్నీ నిజమైనవేనా.? నిజ్జంగా నిజమే అయితే.. అదే వరల్డ్ కప్పులో నా కూతురు కూడా ఉండాలని కలగంటాం కదా.? కనీసం ఆశనైనా పడమా.? కానీ అలా జరగదు. "ఆడపిల్లకు ఆటలా" అని అభద్రతగా ఫీలవుతాం. భయపడతాం. క్రీడాకారిణి కావాలని కలగన్న మన ఇంటి ఆడపిల్లను భయపెట్టిస్తాం. దేశానికి కప్పుకొట్టిన ఆడపిల్లల్ని మెచ్చుకొని వాట్సప్ స్టేటస్‌గా పెట్టుకొని మురిసిపోయినప్పుడు.. సొంతింటి ఆడపిల్లల క్రీడా సామర్థ్యాన్ని కూడా గౌరవించాలి కదా.?

వాళ్లది గొప్పగా చెప్పి మనవాళ్లను అణచివేస్తమా.?

ఆటేదైనా కావచ్చు. అమ్మాయి ఎవరైనా కావచ్చు. కానీ ఆటల్లో వాళ్లు విజయం సాధిస్తే మనమే ముందు సంబరపడి పోతాం. సంతోష పడతాం. సొంతవాళ్లు విజయం సాధించినట్లు డిస్కషన్స్ పెట్టి దినం మొత్తం చర్చిస్తాం. టీవీలో చూసో.. పేపర్లో చదివో ఎంతో గొప్పగా చెప్పుకుంటాం. వాళ్లెవరో దేశానికి సారథ్యం వహించి కప్పు కొడితేనో.. రికార్డు క్రియేట్ చేస్తేనో అంత గొప్పగా చెప్పే మనం.. మన ఇంటి క్రీడా విషయాలకు వచ్చేసరికి కిమ్మనకుండా కూర్చుంటాం. పుసుక్కున మాటమీద మాటొచ్చి "నాన్నా.. నేను కూడా క్రికెటర్‌ని అవుతా" అని అన్నరే అనుకో ఇగ ఉంటది వాళ్లకు టార్చర్. "బాగనే ఆడతవ్ తియ్ ఆటలు. ఏందమ్మా నువ్వు ఆడేది. ఇంత తిని సప్పుడేక ఉండక" అని డిస్కరేజ్ చేసి డీలా పడేస్తారు. బయట బాగనే గొప్పగా చెప్పినా ఇంట్లో ఇట్లా ఉల్టా ఐపోతారు.

దబాయించి దర్వాజ మూసేస్తే ఎట్లా.?

భారీ క్రీడలు.. జాతీయ అంతర్జాతీయ పోటీలే కాదు. ఇంట్లో ముచ్చటగా ఆడుకునే ఆటల వాసన కూడా ఉండనీయరు మనొళ్లు. ఈ రోజుల్లో అంటే మాగ్జిమమ్ స్మార్ట్ గేమ్సొచ్చి అంతా ఫోన్లలోనే నడుస్తున్నా ఇంకా చాలా పల్లెల్లో.. గ్రామాల్లో ఆటల కోసం అల్లాడిపోయే పరిస్థితులున్నాయి. ఆడపిల్లల్ని బయటకు పంపించచొద్దనే ఉద్దేశంతో "తొక్కుడు బిళ్లా".. "అష్టాచెమ్మా".. "ఒనగుంతలు".. వంటివి ఆడుకోమని చెప్పేవాళ్లు అప్పట్లో. ఇప్పుడు వాటి స్థానంలో "చెస్".. "క్యారంబోర్డ్".. వంటివి వచ్చాయి. అవి అయితే ఇంట్లో మనవాళ్లతో కూర్చునే ఆడతారు కదా.? కానీ.. మనం కనీసం ఆ ఆటలను కూడా ఆడనీయం. "ఓ పొల్లా.. ఎక్కడేం పన్లేదా.? పొద్దున్నే ఏం ఆటలివీ.? ఎక్కడ పొద్దువోకపోతే మిషిన్ కుట్టుడు నేర్సుకోపో" అని దబాయించి దర్వాజ మూసేస్తాం.

ఎంకరేజ్ పాఠాలు అందరికి కాదా.?

"ఆటలు మానసికోల్లాసానికి దోహదం చేస్తాయి" అని ఆగస్టు15నాడు స్కూల్లో స్పీచు దంచి వస్తాం. స్కూల్ లెవల్లో తాడాట.. చెంచాట.. కబడ్డీ.. ఖొఖో ఆటల పోటీల్లో నెగ్గి బహుమతి కొట్టిన అమ్మాయిల జట్టుకు ప్రైజులిస్తూ ఫొటోలకు ఫోజులిస్తాం. "కాలం మారింది. అమ్మాయిలను కూడా ఆటల్లో ప్రోత్సహించాలి" అని వాళ్లకూ వీళ్లకూ నీతులు చెప్పి ఇంటికొస్తాం. తమ్ముడితో కలిసి "ఆ మీనా కట్టా మీనా.. సింగే సాంగ్ డింగే డాంగ్" అని ఆడుతున్న అమ్మాయిని చూసి గద్దు గదుమాయిస్తాం. "ఎప్పుడు చూసినా ఆటలేనా.? ఏదైనా చదువుకోరాదు.? హోం వర్క్ చేసినవా.? ప్రాజెక్ట్ వర్క్ అయిపోయిందా.?" అని డైవర్ట్ చేస్తుంటాం. అమ్మాయిలను ఆటల్లో ఎంకరేజ్ చేయాలని చెప్పేది బయటివాళ్లకేనా.? మన పిల్లలకు కాదా.? సొసైటీలో ఉన్న అందరికీ కాదా.?

ఉండాల్సిన చోట ఉండాలి కదా.?

జెమిమా టీమిండియా జెర్సీ వేస్తే మనకిక్కడ పూనకాలు లోడింగ్స్. దీప్తిశర్మ మ్యానాఫ్ ది మ్యాచ్ కొడితే టీవీల ముందున్న మనకు ఊపొస్తుంది. పూనమ్ యాదవ్ గ్రౌండ్లోకి ఎంటరైతే మనకిక్కడ పూనకాలు లోడింగ్స్ అవుతాయి. అంత సామాజిక.. క్రీడా దృక్పథమున్నప్పుడు మన ఇంట్లోని కూతురుకో.. కోడలికో.. మరదలికో ఎందుకు క్రీడాస్ఫూర్తిని రగిలించలేం.? ఎందుకు మనవాళ్లను కూడా గడప దాటించి ఘన స్వాగతం పలికేలా చేయలేం. ఉండాల్సిన చోట ఉండి.. చేయాల్సిన సహకారం చేస్తే ప్రతీ ఇంట్లోనూ క్రీడాజ్యోతి వెలుగుతుందనే సోయి మనకెందుకు ఉండటం లేదు.? పిల్లల క్రీడాసక్తిని గుర్తించి వాళ్లకు ఇవ్వాల్సిన సమయంలో పుషప్ ఇస్తే గల్లిగల్లీకి జెమిమాలు.. మిథాలీ రాజ్‌లు.. దీప్తి శర్మలు.. పూనమ్ యాదవ్‌లు పుట్టుకొస్తారు.

వీళ్లు కూడా ఇలాంటివి ఎదుర్కొనే వచ్చారు..

ఒక్క క్రికెటనే కాదు. ఇప్పుడెన్నో అవకాశాలున్నాయి. ఎంతోమంది ఆ అవకాశాలను అందిపుచ్చుకొని విజేయులయ్యారు. క్రికెట్ అంటే మిథాలి రాజ్ గుర్తుకొస్తది.. ఝలన్ గోస్వామి గుర్తుకొస్తది. రెజ్లింగ్ అంటే సాక్షి మాలిక్ యాదికొస్తది.. గీతా ఫొగట్ యాదికొస్తది. బ్యాడ్మింటన్ అంటే సైనా నెహ్వాల్.. పీవీ సింధు. బాక్సింగంటే మేరికోమ్. అథ్లెట్స్ అంటే ఒక పీటీ ఉష.. ఒక ధ్యుతీచంద్.. ఒక హిమదాస్. వెయిట్ లిఫ్టింగ్ కరణం మల్లీశ్వరి.. చెస్ పేరుచెప్తే కోనేరు హంపి మనకు కండ్ల ముందు వారి పేర్లు కదులుతాయి. వాళ్లు ఇవాళ రికార్డులు బద్దలుకొట్టిన విజేతలు. తాము ఎంచుకున్న విభాగంలో తోపులు. కానీ.. మనమంతా ఒప్పుకోవాల్సిన ముచ్చటేందంటే.. వీళ్లు కూడా ఇలాంటిది ఏదో వివక్షనే ఆ స్థాయిదాకా వచ్చారు.

ఆ విషయంలో అందరిదీ ఒకే మైండ్‌సెట్..

ఆ స్థాయికి వచ్చారు కాబట్టీ.. తమ టాలెంట్‌తో సత్తా నిరూపించుకున్నారు కాబట్టీ వాళ్లింట్లో వాళ్లకుగానీ.. సర్కిల్‌లో గానీ మంచి క్రీడాకారులు అనే పేరొచ్చింది. వాళ్లకొచ్చిన పేరు ప్రఖ్యాతల మాటున చలిక్కాచుకునే అవకాశమొకటి దొరికింది కాబట్టే ఇప్పుడు వారి వారి ఇండ్లలో ఏ అడ్డంకీ.. అవరోధం లేకుండా వారి ప్రయాణాలు సాఫీగా సాగుతున్నాయి. అంటే.. వాళ్లు సాధించారు కాబట్టీ అహో ఒహో అంటున్నారు కానీ.. చాలామంది క్రీడాకారులను మొదట్లో ఎవరూ ఎంకరేజ్ చేయలేదు. దాదాపు అందరూ ఆడపిల్లలకు ఆటలెందుకూ అని నిరుత్సా్హ పరిచనవాళ్లే. ఇక్కడ వేరే గత్యంతరం లేక.. ఫేమ్‌ను విజయాన్ని ఎదురించే సత్తాలేక అలా పడుంటున్నారే తప్ప.. ఆడపిల్లల ఆటల విషయంలో మనందరిదీ ఒకే రకమైన మైండ్‌సెట్.. అందరిదీ అదేవిధమైన ఆలోచన.

పొగడక.. ప్రోత్సహించక తప్పదు కాబట్టే..

మిథాలి రాజ్ మహిళా క్రికెట్లో అత్యధిక రన్స్ చేసిన మొదటి మహిళ అయింది కాబట్టీ మనం ఆమె విజయాన్ని గొప్పగా చెప్పుకుంటున్నాం. ఝలన్ గోస్వామి తన బౌలింగ్ సత్తా ఏంటో ప్రపంచానికి చూపించింది కాబట్టీ ఆమె విజయం సాధిస్తే మనం డీపీలు మార్చుకుంటాం. సాక్షి మాలిక్ రియో ఒలింపిక్స్‌లో మెడల్ కొట్టిన ఫస్ట్ ఇండియన్ ఉమన్ రెజ్లర్‌గా నిలిచినంకనే ఆమెకు జేజేలు పలుకుతున్నాం. గీతా ఫోగట్ కామన్ వెల్త్ లో గోల్డ్ మెడల్ కొట్టింది కాబట్టే ఆమె దేశానికి గర్వకారణం అంటున్నాం. ఒక మేరీకామ్.. ధ్యుతీచంద్.. హిమాదాస్ వీళ్లంతా తమ ఆసక్తులను.. అభిరుచులను చెప్పుకొని చీత్కారాలకు.. అవహేళనలకు.. నిర్లక్ష్యానికి గురై పడి.. లేచి ఎట్టకేలకు విజేయులయ్యారు కాబట్టే తప్పని పరిస్థితుల్లో వాళ్లు మావాళ్లు అని చెప్పుకుంటున్నారు.. అచ్చం మనలెక్కనే.

మనవరకు వస్తే సహించే గొప్ప మనసులు కావు..

ధ్యుతీచంద్ పేదింటి బిడ్డ. ఆమెకు అథ్లెట్ అయ్యే స్థోమతుందా.? అందులోనూ అమ్మాయా.? అబ్బాయా.? అనే అనుమానాలు. హైపర్ ఆండ్రోనిజం టెస్ట్ వల్ల నిషేధం కూడా ఎదుర్కొంది. అయినా ఆమె పోరాటం ఆపలేదు. ఎల్జీబీటీక్యూ+ కమ్యూనిటీ సభ్యురాలిగా గుర్తింపు తెచ్చుకొని అథ్లెట్ హక్కులకు ఐకాన్‌గా నిలిచింది. ఆమె పోరాట స్ఫూర్తి నచ్చింది కాబట్టే మనం ఇప్పుడు "అరే.. ఆ అమ్మాయి గ్రేట్రా" అని చెప్పుకుంటున్నాం. కానీ.. ధ్యుతీచంద్ ప్లేస్‌లో మనింట్లో అమ్మాయే ఉండివుంటే మనం ఆ స్థాయిలో సంబరపడిపోయేవాళ్లమా.? ఆమె పోరాట పటిమను కొనియాడేవాళ్లమా.? ధ్యుతీచంద్ మన అమ్మాయి కాదు కాబట్టీ ఆమె గురించి ఏవో నాలుగు మాటలు గొప్పగా అనేసి గొప్పొళ్లమైపోదాం అనుకుంటాం తప్ప.. మనవరకు వస్తే సహించే గొప్ప మనసులు లేవు మన దగ్గర.

బాక్సింగ్ నేర్చుకుంటా అంటే పంపిస్తమా.?

మేరికామ్ ఆరుసార్లు వరల్డ్ ఛాంపియన్. ఈ లెక్కన మనమొక అరవైసార్లు తన గురించి వాట్సప్ స్టేటస్లో పెట్టే ఉంటాం. కానీ.. మేరికామ్ బార్న్ విత్ సిల్వర్ స్పూన్ కాదు. పేదింట్లో పుట్టినా.. మగమహరాజుల హవా కొనసాగుతున్నా తను బాక్సింగ్‌ను ఎంచుకుంది. "కొడితే మూసుకొని మూలకు పడుండాలె" అనేంత వివక్ష ఉన్న పరిస్థితుల్లో పంచులతో పంచనామా చేసింది. ఇంత చేసింది కాబట్టే మేరికామ్ ఇవాళ జాతి గర్వించదగ్గ స్థానంలో నిటారుగా నిలబడింది. ఇదే మేరీకామ్‌ను ఆదర్శంగా తీసుకొని.. స్ఫూర్తిగా భావించి మన ఇంటి అమ్మాయిలెవరైనా "బాక్సింగ్ నేర్చుకుంటా" అంటే పంపిస్తామా.? అలా పంపించం కానీ.. మేరీకామ్ మరోసారి ఛాంపియన్‌గా నిలిస్తే "ఇలా ఉండాలి అమ్మాయిలంటే" అనే పాత మేధావి డైలాగులు కొడుతూ చప్పట్లు దంచుతాం.

వాళ్ల కలలు మటకు సాకారం కావద్దా.?

హిమాదాస్ దినాం పొలాల మధ్య తిరుగుతూ.. రాయినీ రప్పను దాటుకుంటూ రాటుదేలిపోయింది. అందరిలాగే తన పేరెంట్సూ "మనకెందుకు ఈ ఆటలూ" అని వందలసార్లు అనే ఉంటారు. అయినా తన సాధనను ఏనాడూ ఆపలేదు. సాధిస్తా అనే నమ్మకం వందకు వందశాతం ఉండేది. ఆ ఆత్మవిశ్వాసమే తనను నిలబెట్టింది. కట్‌చేస్తే.. హిమాదాస్ ఇవాళ ఛాంపియన్. ఫర్ ఎగ్జాంపుల్ మనింట్లోనూ తనలాంటి గోల్ ఉన్న ఒకమ్మాయి ఉండుంటే తన కలను సాకారం చేసుకోనిచ్చేవాళ్లమేనా.? ఛాంపియన్‌గా నిలబెట్టేవాళ్లమేనా.? అవేవీ చేయం. కానీ హిమాదాస్ టైటిల్ గెలిచినప్పుడు.. ధ్యుతీచంద్ గెలిచి నిలిచినప్పుడు "ఆడబిడ్డా నీకు వందనం" అని మెచ్చుకుంటాం. యే.. మన ఆడబిడ్డలూ హిమాదాస్‌లు.. ధ్యుతీచంద్‌లు కావొద్దా.? వాళ్ల కలలు మటకు సాకారం కావద్దా.?

ఎవరో ఏదో అంటారనే భయం అంతే..

ఏ పేరెంట్సూ తమ పిల్లల భవిష్యత్‌ను హరించాలని చూడరు. కాకపోతే వాళ్లెంతసేపూ బయటివాళ్లు ఏమనుకుంటారో.. అక్కడ కోచ్‌లు ఎలా ఉంటారో.. అని అభద్రతలో ఉంటారు. "ఆడపిల్లలకు ఆటలెందుకు" అనేది వాళ్ల అభిమతం కాకపోయుండొచ్చు. కానీ ఎవరో ఒకరు చెప్తారు కదా. దానికోసం ఆలోచిస్తారు. నలుగురిలో పడటం ఎందుకు మనంతలో మనం ఉంటే చాలు కదా అనుకుంటారు. అందుకే సమాజానికి భయపడో.. ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితుల ప్రభావమోగానీ.. మొత్తానికీ మనసులో ఆటల్లోకి పంపాలనుకున్నా వద్దని చెప్తారు. ఇప్పుడిప్పుడు కొందరు పేరెంట్స్ ఆలోచిస్తున్నారు. ఎవరో ఏదో అనుకోకుండా తమ పిల్లల్ని క్రీడల్లోకి తీసుకెళ్తు్న్నారు. మెంటార్లుగా తమ వెంటే ఉండి మంచిచెడ్డ అరుసుకుంటున్నారు.

అంతా అయ్యాక మావాళ్లే అంటారు..

చాలా గమ్మతైన ముచ్చటేందంటే పేరెంట్స్ పిల్లల ఆసక్తులను గమనించి ఓకే అంటారు. అన్ని విధాల సహకారం అందించి ప్రోత్సహిస్తుంటారు. "దేవుడు వరమిచ్చినా పూజారి వరమియ్యనట్లు" పేరెంట్స్ ఒప్పుకున్నా చుట్టాలు ఒప్పుకోరు. "ఏం ఆటలు.. పెండ్లిచేసి అత్తారింటికి పంపించక" అని మొగ్గదశలోనే ఆశల్ని తుంచే ప్రయత్నం చేస్తుంటారు. ఈ ఆంక్షలన్నింటినీ ఎదుర్కొని.. కష్టాలు నష్టాలు ఎన్ని ఎదురైనా ముందుకు సాగి విజయం సాధిస్తే.. "మేం ముందే చెప్పినం కదా.. మన అమ్మాయి సక్సెస్ అవుతుందనీ" అని ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. వద్దంటే వద్దూ.. ఉంటే ఉండు లేకపోతే లేదు అని వెలేసినంత పనిచేసిన ఆ నోటితోనే "ఫలానా ఛాంపియన్ మా అమ్మాయే.. మేం ఎంకరేజ్ చేస్తేనే అక్కడిదాకా వెళ్లింది" అని గప్పాలు కొడుతుంటారు.

రెట్టించిన ఉత్సాహంతో డీపీలు మార్చుకుందాం..

లింగ వివక్ష.. సామాజిక ఒత్తిడి.. ఆర్థిక సమస్యలు.. కుటుంబాల వ్యతిరేకత వంటివెన్నో ఎదుర్కోవాల్సి వస్తుంది క్రీడల పట్ల ఆసక్తి ఉన్న అమ్మాయిలు. అవన్నీ అధిగమించి బయటకొచ్చి విజేతలుగా చూసిన తర్వాతనే మనం మన అభిమానాన్ని.. దేశభక్తిని చాటిచెప్తున్నాం కానీ మన ఇంటి నుంచే అసమానతలకు స్వస్తి పలుకుదామని మాత్రం అనుకోవడం లేదు. బాక్సర్ నిఖత్ జరీన్.. క్రికెటర్ త్రిషా గొంగడి.. మౌంటెనీర్ మలావత్ పూర్ణ వీళ్లంతా ఆ కంచెలను తెంచుకొనే హీరోలుగా నిలబడ్డారు. మనవాళ్లనూ క్రికెట్.. రెజ్లింగ్.. బ్యాడ్మింటన్.. బాక్సింగ్.. అథ్లెటిక్స్.. షూటింగ్.. టెన్నిస్.. జిమ్నాస్టిక్స్.. వెయిట్‌లిఫ్టింగ్.. చెస్.. హాకీ.. ఆర్చరీ వంటి ఆటల్లో ప్రోత్సహిస్తే మనం ఇంకా రెట్టించిన ఉత్సాహంతో మన వాట్సప్ డీపీలు.. స్టేటస్‌లు మార్చుకునే అవకాశం ఉంటుంది కదా.?

ఇంట్లోవాళ్లు ఒప్పుకున్నా: కాత్యాయినీ, కిక్ బాక్సర్ అండ్ రైడర్

అమ్మాయిలు ఆటల్లో రాణించడం అంటే మామూలు విషయం కాదు. ఎన్నో అడ్డంకుల్ని ఛేదించాలి. ఎందరివో మెప్పు పొందాలి. మన ఆసక్తి కంటే వేరేవాళ్ల అనుమతి ముఖ్యం అనుకుంటారు. నా విషయమే తీసుకోండి. నేను స్పోర్ట్స్‌లోకి మా ఫ్యామిలీ వాళ్లకు ఇష్టమున్నా మా చుట్టాల వాళ్లకు ఇష్టం లేకుండె. అదేంటో అర్థంకాదు. ఆటల్లో ఇంట్రెస్ట్ ఉన్నది నాకు. దానికి సపోర్ట్ చేసేది మా ఫ్యామిలీ. మధ్యలో వేరేవాళ్లకు ఎందుకో.? ఒకవేళ మనం సక్సెస్ అయితే అందరికంటే ముందు "మా అమ్మాయే" అని చెప్పుకుంటారు.

కొంత బెటర్: రమేశ్ నాగపురి, కోచ్ అండ్ మెంటార్

గతంలో కంటే పరిస్థితులు కొంత మెరుగయ్యాయి. ఆడపిల్లల్ని ఆటల్లోకి పంపిస్తున్నారు. ఎట్‌లీస్ట్ మాలాంటి వాళ్లు చెప్తే అయినా వింటున్నారు. ఒకప్పుడు ఎవరైనా అమ్మాయి ఆటల్లో షార్ప్‌గా ఉందని తెలిస్తే మేం అవగాహన కల్పించేవాళ్లం. మాదే బాధ్యత అని చెప్పినా "ఎట్లుంటదో ఏమో.. అక్కడెవరుంటరో ఏమో" అని సంకోచించేవాళ్లు. కొందరైతే "ఆడపిల్లలకు ఆటలెందుకు" అని ఉల్టా మమ్మల్నే అనేవాళ్లు. కానీ క్రమంగా వారి ఆలోచనా విధానంలో మార్పు వస్తోంది. కానీ పూర్తిస్థాయిలో మార్పు రాలేదు. ఆసియన్ జీన్స్‌లోనే కష్టం.. ఓర్పు.. త్యాగం ఉంటాయి కాబట్టీ సక్సెస్ రేటు ఎక్కువగా ఉంటున్నది.

ఇద్దరూ సమానమే: గీత, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్

ఒక పీఈటీగా నేను అబ్బాయిలు, అమ్మాయిలు ఇద్దర్నీ సమానంగా చూస్తాను. కానీ చాలామంది అమ్మాయిలు ఆటల్లోకి వచ్చేందుకు వెనకాడతారు. ఆడాలనే ఆసక్తి ఉంటుంది. కానీ వేరేవాళ్లు ఏమనుకుంటారో అని ఆగిపోతుంటారు. పేరెంట్స్ కూడా ఆటలు ఎంతసేపూ అబ్బాయిలకు సంబంధించినవిగానే ట్రీట్ చేస్తుంటారు. అందుకే స్పోర్ట్స్ వస్తువులు ఇప్పించమంటే అస్సలు ఇప్పించరు. అదే అబ్బాయికైతే బర్త్ డే గిఫ్ట్‌‌‌గా బ్యాటు.. బాలు ఇస్తుంటారు. అంతెందుకు ఈత అందరికీ రావాల్సిందే అని తెలుసు. కానీ ఈత నేర్చుకోమని కొడుకు మీద అరుస్తుంటారు గానీ.. కూతురు దగ్గర ఆ ప్రస్తావనే తీసుకురారు.

Next Story