ఆడపిల్లల రక్షణ కవచం.. వకీల్ వర్షా దేశ్‌పాండే.!

by Daayi Srishailam |

మూడు దశాబ్దాలుగా మహిళల హక్కుల కోసం పోరాడుతున్న ఆమెకు యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ అవార్డ్- 2025 లభించింది

ఆడపిల్లల రక్షణ కవచం.. వకీల్ వర్షా దేశ్‌పాండే.!
X

దిశ, ఫీచర్స్: మహారాష్ట్ర బీడ్ జిల్లాలో డాక్టర్ సరస్వతి.. డాక్టర్ సుదాం ముండేల పేరు చెప్తే అక్కడి ప్రజలు వణికిపోతుంటారు. ఆడపిల్లలకు గర్భస్రావాలు..లింగ నిర్ధారణ పరీక్షలు చేసి ఎంతోమంది జీవితాలను ఆగంచేశారు ఈ దంపతులు. అలాంటి వాళ్లకు ఒకరి పేరు చెప్తే మాత్రం గుండెల్లో వణుకు పుడుతుంది. ఆమెనే వర్షా దేశ్‌పాండే. మూడు దశాబ్దాలుగా మహిళల హక్కుల కోసం పోరాడుతున్న ఆమెకు యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ అవార్డ్- 2025 లభించింది.

మహిళా వికాస్ మండల్..

వర్షా దేశ్‌పాండే మహిళల హక్కుల కోసం పోరాడుతున్న న్యాయవాది. సమాజంలో మహిళలకు ఎదురవుతున్న అన్యాయాలను చూసి చలించిపోయిన వర్ష వాళ్లకు అండగా నిలవాలనుకుంది. మద్యపానికి బానిసైన భర్తల చేతిలో హింసకు గురవుతున్న భార్యలు, తల్లిని చంపేసిన తండ్రిని చూసి భయంతో బతుకుతున్న పిల్లల కథలు ఆమెను కదిలించాయి. 1990లో ''దళిత్ మహిళా వికాస్ మండల్'' సంస్థను స్థాపించి మహిళల హక్కులు, లింగ సమానత్వం కోసం పోరాటం ప్రారంభించింది. ఆమె వాదించే ప్రతీ కేసు మహిళలకు న్యాయం జరిగేందుకే తీసుకునేది.

ఆపరేషన్ డికాయ్..

మహారాష్ట్రలోని బీడ్, సంగ్లీ, సోలాపూర్ వంటి ప్రాంతాల్లో రహస్యంగా ఆడపిల్లల గర్భస్రావాలు జరిగేవి. డాక్టర్లయిన ముండే దంపతులు ఇలాంటి అక్రమాలకు పాల్పడేవాళ్లు. వర్షా దేశ్‌పాండే ఈ రాకెట్‌ను బట్టబయలు చేయడానికి డికాయ్ ఆపరేషన్లు చేపట్టింది. గర్భవతులను డికాయ్‌లుగా పంపి హిడెన్ కెమెరాలు, రికార్డర్లతో సాక్ష్యాలు సేకరించేది. ''ప్రీ-కాన్సెప్షన్ అండ్ ప్రీ-నేటల్ డయాగ్నస్టిక్ టెక్నిక్స్ యాక్ట్'' ప్రకారం లింగ నిర్ధారణ పరీక్షలు నిషేధమని తెలిసినా ఈ పరీక్షలు చేస్తుంటే వర్ష ఆధారాలతో పట్టుకుంది. ఇలా 56 డికాయ్ ఆపరేషన్లు చేసి ఎంతోమంది డాక్టర్లకు శిక్షపడేలా చేసింది.

లేక్ లాడ్కీ అభియాన్..

ఆపరేషన్ డికాయ్ సక్సెసయ్యి మార్పు తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా తనకు ప్రశంసలు లభించాయి. తన కాన్సెప్ట్ నచ్చడంతో 2004లో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రిత్వ శాఖ ''లేక్ లాడ్కీ అభియాన్'' పేరుతో దీనిని అధికారికంగా ప్రారంభించింది. గర్భస్థ శిశువులను కుక్కలకు ఆహారంగా వేస్తున్నారని సాక్ష్యాధారాలతో నిరూపించిన వర్ష సమాజం కళ్లు తెరిపించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం మహారాష్ట్రలో 0-6 ఏళ్ల వయసు గల పిల్లల్లో 1000 మంది అబ్బాయిలకు 883 మంది అమ్మాయిలే ఉండటానికి కారణం లింగ వివక్షతే అని నిరూపించింది కూడా.

మహిళలకు అంకితం..

మహిళలు.. పురుషుల ఆమోదం లేకుండా స్వేచ్ఛగా జీవించాలనేది వర్ష చెప్పేమాట. దీనికోసం దళిత్ మహిళా వికాస్ మండల్ ద్వారా ఆమె ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. ''జుంకా భక్రీ కేంద్రం'', ''సమతా యువజాగర్'' అలాంటి కార్యక్రమాలే. ''జుంకా భక్రీ కేంద్రం'' కుటుంబాలు వదిలేసిన మహిళలు నడిపే ఫుడ్ సెంటర్. ''సమతా యువజాగర్'' అనేది బాల్య వివాహాలు, హింసకు వ్యతిరేకంగా మహిళలను చైతన్యపరిచే కార్యక్రమం. అన్యాయానికి వ్యతిరేకంగా వర్ష చేస్తున్న కృషికి గుర్తింపుగా తాజాగా యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ అవార్డ్- 2025 లభించింది. ఈ అవార్డును ఆమె మహిళా జాతికి అంకితమిచ్చింది.

Next Story