- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Disha Special: నిజాలను సమాధి చేస్తున్న ప్రపంచ దేశాల యుద్ధాలు
యుద్ధాల్లో ముందుగా సమాధి అయ్యేవి నిజాలే.. పాలకులు ముందుగా నిజాలను చంపేసి, అబద్ధాలు ప్రచారం చేయడంతోనే యుద్ధాలకు బీజాలు పడతాయి.

యుద్ధాల్లో ముందుగా సమాధి అయ్యేవి నిజాలే.. పాలకులు ముందుగా నిజాలను చంపేసి, అబద్ధాలు ప్రచారం చేయడంతోనే యుద్ధాలకు బీజాలు పడతాయి. ప్రపంచంలో ఇప్పటివరకు జరిగిన అనేక యుద్ధాలకు అబద్ధాలే పునాదులుగా నిలిచాయి. తాజాగా భారత్, పాక్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతల్లోనూ ఎవరు పైచేయి సాధించారు? ఎందుకు ఏకపక్షంగా దాడులు ఆగిపోయాయి? పాక్‌లో ఉగ్రవాద, సైనిక శిబిరాలు కూలితే.. ఆ దేశం ఎందుకు విజయోత్సవాలు చేసుకున్నది? భారత్ వైపు కనీస నష్టం కూడా జరుగలేదని ప్రభుత్వం చెప్తుంటే, భారత వాయుసేన డీజీఎంవో ఏకే భర్తీ కొంత నష్టం జరిగిందని చెప్పగా.. భారత త్రివిధ సైనిక దళాల అధిపతి అనిల్ చౌహాన్ మాత్రం ఏకంగా యుద్ధవిమానాలు కూలాయని చెప్తున్నారు. పాక్ వైపు భారీగా నష్టం జరిగిందని కళ్లముందు కనిపిస్తున్నా.. భారత్ వైపు ఎంత నష్టం జరిగింది? అనేది బయటకురాలేదు. ఏకపక్షంగా సీజ్ ఫైర్ ఎందుకు జరిగిందో కూడా ఇప్పటికైతే సామాన్యులు ఎవరికీ తెలియదు.
కానీ, భారతీయులందరికీ మాత్రం పహెల్గాం దాడికి బదులు తీర్చుకున్నాం అన్న సంతృప్తి మాత్రం కచ్చితంగా ఉన్నది. యుద్ధం జరుగాలని సామాన్యులు ఎవరు కోరుకోరు.. కానీ, ఆత్మగౌరవానికి భంగం వాటిల్లిన పరిస్థితులు వస్తే మాత్రం.. యుద్ధంతోనే సమాధానం చెప్పాలని భావిస్తారు. సరిగ్గా అలాంటి సమాధానమే ఆపరేషన్ సిందూర్‌తో భారతీయులందరికీ దొరకింది. పాక్ కుయుక్తులను భారత్ ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే ఉన్నది. అయినా, దాయాది దేశం తీరుమారడం లేదు. పహెల్గాం సహా ప్రతి ఉగ్రవాదానికి కశ్మీర్ యువత తిరుగుబాటు కారణమని అబద్ధాలు ప్రచారం చేస్తున్నది. అదే సమయంలో ఉగ్రవాద మూలాలు పాక్ లో ఉన్నాయన్న సంగతిని భారత్ ఎప్పటికప్పుడు ప్రపంచం ముందు పెడ్తుతూనే ఉన్నది. ఇలా ప్రతి యుద్ధం, ఘర్షణకు అబద్ధాలే కారణం అవుతున్నాయి. - ఎస్పీ హరీశ్
యుద్ధాల సమయంలో తప్పుడు ప్రచారాలు (ప్రాపగండా) కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి శత్రు దేశాలను గందరగోళంలోకి నెట్టడమే కాకుండా, సొంత దేశంలోని ప్రజల ఉత్సాహాన్ని, ఐక్యతను పెంచడానికి, యుద్ధ వ్యూహాలను రహస్యంగా అమలు చేయడానికి ఉపయోగపడతాయి. కొన్ని సందర్భాల్లో, ఈ తప్పుడు ప్రచారాలు యుద్ధ విజయాలకు కూడా దోహదపడటమే కాకుండా సైనికుల్లో, ప్రజల్లోనూ ఉత్సాహాన్ని నింపుతాయి. ఫలితంగా యుద్ధం గెలిచేందుకు అవకాశాలు పెరుగుతాయి. యుద్ధనీతుల్లో ఇది కూడా ప్రధానమైనది. వాస్తవానికి రెండో ప్రపంచయుద్ధంలో జర్మనీ సమాచార శాఖ మంత్రి గోబెల్స్ జర్మనీ ప్రజలతోపాటు ప్రపంచం మొత్తాన్ని తన తప్పుడు ప్రచారంతో నమ్మించాడు. జర్మనీకి ఉన్న బలం కంటే వెయ్యిరెట్లు ఎక్కువ ఉన్నట్లు ప్రపంచదేశాలను భయపెట్టాడు. అందుకే అమెరికా, బ్రిటన్, రష్యా ఆచితూచి అడుగువేయాల్సిన పరిస్థితి వచ్చేలా చేశాడు. ఎంతటి ప్రచారమైనా ఒకస్థాయి వరకే పనిచేస్తుంది.. ఆలోపు విజయం సాధించకపోతే జర్మనీలా దారుణ ఓటమికి గురికాక తప్పదు. నేటికీ ఎన్నో దేశాలు తప్పుడు ప్రచారాలనే అస్త్రాలుగా చేసుకుని యుద్ధానికి కాలుదువ్వుతున్నాయి. కానీ, అందులో కొన్ని విజయం సాధించగా.. మరికొన్ని ఘోర ఓటమి పాలయ్యాయి. ఇలాంటివాటిల్లో అగ్రరాజ్యం అమెరికా కూడా ఉన్నది. ఇరాక్ పై విజయం సాధించగా.. వియత్నాంలో మాత్రం చావుదెబ్బతిన్నది. ఇక పాక్ మాత్రం భారత్ పై చేసిన అన్ని యుద్ధాల్లోనూ మట్టికరిచింది. గోబెల్స్ స్థాయిలో అబద్ధపు ప్రచారం చేసి యుద్ధాలకు కాలుదువ్విన దేశాలు.. ఆ యుద్ధ విశేషాలు ఇలా ఉన్నాయి.
వియత్నాం యుద్ధం (1955–1975)
- టోంకిన్ గల్ఫ్ సంఘటన (1964)
వియత్నాం యుద్ధాన్ని అమెరికన్లు కలలో కూడా మరిచిపోలేరు. 20 ఏండ్లపాటు సాగిన ఈ యుద్ధం ఎంతో మంది అమెరికన్ మహిళలను విధవలుగా మార్చింది. మరెంతోమంది తల్లులకు గర్భశోకాన్ని మిగిల్చింది. నిజానికి ఈ యుద్ధానికి అమెరికా పాలకులే కారణం. అమెరికా నౌకలపై ఉత్తర వియత్నాం దాడి చేసిందని అమెరికా ప్రచారం చేసింది. ఈ సంఘటనను సాకుగా చూపి, అమెరికా.. వియత్నాం యుద్ధంలో పూర్తిగా జోక్యం చేసుకుంది. ముందుగా యుద్ధానికి సలహా ఇచ్చేందుకు మాత్రమే పరిమితం అవుతామని చెప్పినా.. తొమ్మిదేళ్లపాటు వియత్నాం అడవుల్లో అమెరికా సైనికులతో గెరిల్లాలపై పోరాటం చేయించారు. ఈ విషయం అమెరికా ప్రజలకు ఏమాత్రం తెలియనివ్వలేదు. చివరికి తమ భర్తలు ఏమయ్యారని సైనికుల భార్యలు, తమ పిల్లలు ఏమయ్యారని సైనికుల తల్లిదండ్రులు అమెరికా వీధుల్లో నిరసనలు తెలుపుతుండటంతో పరిస్థితి చేయిజారుతుందని అమెరికా అబద్ధపు ప్రచారం చేసింది. అమెరికా నౌకాదళంపై ఉత్తర వియత్నాం దాడి చేసిందని పత్రికలు, టీవీల్లో తప్పుడు వార్తలు ప్రసారం చేయించింది. అందుబాటులో ఉన్న మాధ్యమాల్లోనూ వియత్నాంపై భారీగా తప్పుడు ప్రచారం చేసింది. ఈ నేపథ్యంలో వియత్నాంపై దాడికి అమెరికా కాంగ్రెస్ ‘టోంకిన్ గల్ఫ్ రిజల్యూషన్’ను ఆమోదించి.. యుద్ధానికి అధికారం ఇచ్చింది. ఈ నిర్ణయంతో అమెరికా పూర్తిస్థాయిలో సైన్యాన్ని మోహరించడానికి, జరిగిన నష్టానికి పూడ్చుకోవడానికి అవకాశం ఏర్పడింది. అయితే, అబద్ధాల పునాదులపైనే యుద్ధం జరిగిందన్న విషయం ఆ తర్వాత డీక్లాసిఫైడ్ డాక్యుమెంట్లు, పెంటగాన్ పేపర్స్ ద్వారా సామాన్య ప్రజలకు తెలిసింది. యుద్ధానికి ముందు అమెరికా పాలకులు చేసిన ఆరోపణల్లో అసలు విషయానికి అనేకరెట్లు అతిశయోక్తులు జోడించి చెప్పారన్న సంగతి బయటపడింది. ఈ యుద్ధంలోనూ మరో కోణం ఉన్నది. అదే ప్రచ్ఛన్నయుద్ధంలో భాగంగా వియత్నాంకు రష్యా సాయం చేసింది. రష్యా తయారీ ఏకే 47 ఆయుధం.. వియత్నామీలకు తిరుగులేని శక్తిని ఇచ్చింది. అమెరికన్లకు గెరిల్లాయుద్ధంతో చుక్కలు చూపించింది.
ఇరాక్ యుద్ధం (2003)
- సామూహిక విధ్వంసక ఆయుధాలు
ఇరాక్‌లో సద్దాం హుస్సేన్ కెమికల్, సామూహిక విధ్వంసక ఆయుధాలను కలిగి ఉన్నాడని.. అవి అమెరికాకు ముప్పుగా ఉన్నాయని అమెరికా, బ్రిటన్ ప్రచారం చేశాయి. ఈ ప్రచారం కారణంగా అమెరికా చర్యలకు అంతర్జాతీయ మద్దతు కూడా లభించింది. 2003లో అమెరికా నేతృత్వంలో ఇరాక్‌పై దాడి జరిగింది. ఈ యుద్ధం సద్దాం పాలనను ముగించినప్పటికీ.. అమెరికా చెప్పిన సామూహిక విధ్వంసక ఆయుధాలేవీ దొరకలేదు. అయితే, చివరికి ఐక్యరాజ్య సమితి తనిఖీలు, పాత్రికేయుల స్వతంత్ర దర్యాప్తులు, లీక్ అయిన నిఘా రిపోర్టుల ఆధారంగా అమెరికా చేసిన ప్రచారం అంతా ఉత్తదేనని నిర్ధారణ అయింది. కానీ, అప్పటికే ఎంత నష్టం జరగాలో అంతా జరిగిపోయింది. సద్దాం హుస్సేన్ పాలన తర్వాత ఇరాక్ లో జరిగిన అరాచకాలు ఆ దేశాన్ని పూర్తిగా సర్వనాశనం చేశాయి. సద్దాం ఉండి ఉంటే.. ఇంతగా ఇరాక్ భ్రష్టుపట్టిపోయేది కాదన్న వాదనలు ప్రపంచవ్యాప్తంగా వినిపించాయి.
భారత్-పాకిస్తాన్ యుద్ధం (1965)
- ఆపరేషన్ జిబ్రాల్టర్
కశ్మీర్ లోయలో ఉగ్రవాదాన్ని ఉసిగొల్పిన పాక్ ఆ తర్వాత దానిని భారత ప్రభుత్వంపై స్థానిక ప్రజలు చేస్తున్న తిరుగుబాటుగా అంతర్జాతీయంగా ప్రచారం చేసింది. ఇందుకు కనీవిని ఎరుగని రీతిలో మారణకాండకు పాల్పడింది. పాక్ సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడుతూ సరిహద్దులవెంబడి వందలాది ఉగ్రవాద శిబిరాలు ఏర్పాటుచేసింది. ప్రతిరోజూ కశ్మీర్‌లోకి దొంగతనంగా పదుల సంఖ్యలో ఉగ్రవాదులను పంపి.. హింసాత్మక చర్యలకు పాల్పడింది. ఇలా చేస్తూనే కశ్మీర్‌లో భారత ప్రభుత్వంపై స్థానికులు తిరుగుబాటు చేస్తున్నారని ప్రచారం చేసింది. దీనికి కొనసాగింపుగా ఆపరేషన్ జిబ్రాల్టర్ పేరిట కశ్మీర్ విముక్తి ప్రసాదిస్తామని భారత్ పై దాడులకు దిగింది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరగడంతో 1965లో రెండు దేశాల నడుమ యుద్ధం జరిగింది. భారత్ పై చేయి సాధించడంతో పాక్ తోకముడిచింది. పాక్ కుయుక్తులు ఆ తర్వాతి రోజుల్లో వెలుగు చూశాయి. భారత గుడాచార సంస్థ (ఆర్ అండ్ ఏడబ్ల్యూ) పాక్ రహస్య కార్యకలాపాలపై ఇచ్చిన నివేదికలు, యుద్ధం తర్వాత రెండు దేశాల నడుమ జరిగిన చర్చలతోపాటు డీ క్లాసిఫైడ్ నివేదికలతో పాక్ గుట్టు రట్టు అయ్యింది. అయితే, రెండో ప్రపంచయుద్ధం తర్వాత జరిగిన అతి పెద్ద యుద్ధట్యాంకులు పాల్గొన్న యుద్ధంగా కూడా రికార్డుల్లో నిలిచింది. భారతదేశం తరఫున దాదాపు 1400 యుద్ధ ట్యాంకులు పోరాటం చేస్తే.. పాక్ నుంచి 1100వరకు యుద్ధట్యాంకులు పోరాటంలోకి దిగాయి. భారత్ కు చెందిన 30 ట్యాంకులు పూర్తిగా నష్టపోతే.. పాక్ కు చెందిన ఒక ప్లటూన్ పైనే అంటే 100కుపైనే ట్యాంకులు నాశనం కావడంతోపాటు పట్టుబడ్డాయి. ఈ యుద్ధంలో పాక్ నుంచి పంజాబ్ నుంచి భారత్ లోకి అడుగుపెట్టేందుకు ప్రయత్నించింది. సెప్టెంబర్ నెల కావడంతో వర్షాలకు నేల చిత్తడిగా ఉన్నది. పాక్ బలగాలను సరిహద్దుల్లోనే అడ్డుకోవడం కంటే కొంత లోపలికి వచ్చాక దాడి చేస్తే ఎక్కువ నష్టం వాటిల్లుతుందని ఆ ప్రాంతానికి సైనిక కమాండర్ అయిన గురుభక్ష్ సింగ్ ప్రణాళిక వేశారు. దీంతో పాక్ ట్యాంకులు ముందుకు కదులుతున్న కొద్దీ భారత సైనికులు తమ పోస్టులను ఖాళీ చేస్తూ వెనక్కి వెళ్లారు. అయితే, పాక్ సైన్యం సులువుగా లోనికి వచ్చేలా చేయడంతోపాటు ఒక గుర్రపు నాడా ఆకారంలాంటి ఉచ్చులోకి వాళ్లు వచ్చేలా చేశారు. ఉత్తరంనుంచి వస్తున్న పాక్ బలగాలను తూర్పు పడమర లో ఉన్న పోస్టులనుంచి భారీగా ప్రతిఘటన ఇస్తూ దక్షిణంవైపు వాళ్లను వెళ్లేలా చేశారు. తీరా గుర్రపునాడా మధ్యలోకి వచ్చాక.. అక్కడ ఖేంఖరణ్ అనే పట్టణంశివారుకు పాక్ ట్యాంకులు చేరాయి. అక్కడ వర్షం కారణంగా నేలంతా చిత్తడిగా ఉంది.. ట్యాంకులు ముందుకు కదలలేదు. సరిగ్గా అలాంటి ప్రాంతంలోనే భారతసైన్యం గట్టిగా ప్రతిఘటించింది. జీపులో అమర్చిన ఓ మోర్టార్ లాంటి ఆయుధంతో ట్యాంకులను తుక్కు తక్కు చేయడంతో పాక్ సైన్యం బెదిరిపోయి.. దాదాపు 100కుపైగా అమెరికా తయారీ పాటన్ ట్యాంకులు వదిలిపారిపోయారు. దీంతో ఆ ప్రాంతాన్ని పాటన్ నగరం అని, ట్యాంకులగోరీ అని నేటికీ పిలుచుకుంటారు.
కార్గిల్ యుద్ధం (1999)
పాకిస్తాన్ రహస్య చొరబాటు
భారత్, పాక్ మధ్య హిమాలయాలు ప్రకృతిసిద్ధ సరిహద్దులుగా ఉన్నాయి. అయితే, ఈ మంచుకొండలపై చలికాలంలో విపరీతంగా మంచు కురవడంతోపాటు మైనస్ 20 నుంచి మైనస్ 50వరకు ఉష్ణోగ్రతలు పడిపోతాయి. ఇలాంటి సమయంలో సైనికులు కాపలా కాయడం ప్రాణాపాయం కావడంతో.. రెండు దేశాలు మౌఖిక ఒప్పందం చేసుకున్నాయి. అంటే ఎక్కడా సంతకం పెట్టకుండా.. కేవలం చర్చలతోనే ఒప్పందం చేసుకున్నాయి. చలికాలంలో మంచు శిఖరాల్లోని రెండు దేశాలకు చెందిన సైనిక పోస్టులు ఖాళీ చేయాలని.. తిరిగి వేసవి రాగానే ఎవరి సైనిక పోస్టుల్లో వారు విధులు నిర్వహించుకోవలని నిర్ణయించుకున్నారు. అంటే ప్రతి ఏడాది అక్టోబర్ చివరివారంనుంచి నవంబర్ మొదటివారంలో పోస్టులు వదిలేస్తే.. తిరిగి మే చివరివారం నుంచి జూన్ మొదటివారంలో తిరిగి పోస్టులను చేరుకునేవారు. అయితే, మే 3వ తేదీన కార్గిల్ లోని కొండ ప్రాంతాల్లోకి కొందరు తుపాకులతో వెళ్తుండటాన్ని మాజీ సైనికుడు, గొర్రెల కాపరి యూసుఫ్ చూసి అనుమానించారు. ఎందుకంటే అప్పటికి భారత సైనికులు మంచుకొండలకు వెళ్లే సమయం రాలేదు. దీంతో ఆయన సైన్యానికి సమాచారం ఇవ్వడంతో వారు రెండు, మూడు దళాల సైనికులను పంపగా.. వారిలో చాలామంది చనిపోయారు. దీంతో పాక్ భారత పోస్టులను ఆక్రమించి దాడులు చేస్తున్నదని సైన్యం ధృవీకరించింది. అప్పటికే పాక్ సైన్యం ఆపరేషన్ బదర్ పేరిట భారత్‌లోని ముష్కో వ్యాలీ, ద్రాస్, కక్సర్, బటాలిక్, తుర్తుక్ సెక్టార్లలో 130–200 చ.కి.మీ. విస్తీర్ణంలో 132 వ్యూహాత్మక స్థానాలను ఆక్రమించారు. దీంతో భారత్ ఆపరేషన్ విజయ్ పేరిట కార్గిల్ యుద్ధం చేసింది. పాక్ మాత్రం చొరబాటుదారులు ముజాహిదీన్లని.. వారు కశ్మీర్ స్వంతంత్రం కోసం పోరాటం చేస్తున్నారని ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేసింది. కానీ, మృతుల్లో చాలామంది నార్తర్న్ లైట్ ఇన్‌ఫ్రాంట్రీ, స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ కమెండోల ఐడీ కార్డులు వారి యూనిఫాంలు కూడా లభించడంతో పాక్ ను ఇరకాటంలో పడేసింది. ఆ తర్వాత కొద్దికాలానికే పాక్ ప్రభుత్వాన్ని కూలదోసిన సైనిక నియంత పర్వేజ్ ముషారఫ్ చైనాలో పర్యటిస్తూ.. తన సైనిక కమాండర్లతో టెలిఫోన్ సంభాషణలు చేశారు. ఇందులో కార్గిల్ వెనక ఉన్నది తానేనని చెప్పడం.. అది భారత నిఘా సంస్థ (ఆర్ అండ్ ఏడబ్ల్యూ) రికార్డు చేయడంతో ప్రపంచం మొత్తం నివ్వెరపోయింది. అప్పటికే పాక్ సైనికాధికారుల ద్వారా, మీడియా స్వతంత్ర దర్యాప్తులోనూ ఈ విషయం వెల్లడైంది. కొంతకాలానికి డీక్లాసిఫైడ్ డాక్యుమెంట్లు కూడా అదే విషయం చెప్పాయి.
రష్యా-అఫ్గాన్ యుద్ధం (1979–1989)
ముజాహిదీన్ మద్దతు
1970 దశకంలో అఫ్గానిస్తాన్ సైనిక పరంగానే కాకుండా అన్నిరంగాల్లో బాగా వెనుకబడిన ప్రాంతం. అయితే, వ్యూహాత్మకంగా సున్నితమైన ప్రదేశం కావడంతో రష్యా ఈ దేశాన్ని ఆక్రమించే ప్రయత్నం చేసింది. దీనిని స్థానిక అఫ్గాన్ తెగలవారు వ్యతిరేకించారు. అప్పటికే అమెరికా, రష్యా మధ్య ప్రచ్ఛన్నయుద్ధం జరుగుతుండటంతో.. అమెరికా దీనిని ఓ అవకాశంగా తీసుకున్నది. సౌదీఅరేబియా, పాకిస్తాన్ సాయంతో అఫ్గాన్ తెగలకు సైనిక సహకారంతోపాటు భారీఎత్తున ఆయుధాలు అందించింది. అఫ్గాన్ పోరాటాన్ని స్వాతంత్ర్య సమరంగా పేర్కొన్నది. అప్పటి రష్యా యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు ధ్వంసం చేసేందుకు స్టింగ్ రాకెట్లను వేలసంఖ్యలో పాక్ లోని అఫ్గాన్ సరిహద్దుల్లో ఆయుధ డిపోల్లో నిల్వ ఉంచింది. ఇక్కడినుంచి అఫ్గాన్ ఫైటర్లకు అవసరమైన మేర రాకెట్లను అందించేది. దీనివల్ల రష్యా భారీగా దెబ్బతిన్నది. ఈ పోరాటానికి సౌదీ అరేబియాలోని అనేక మంది ధనవంతులు సాయం చేయగా.. వారిలో ముందువరుసలో ఉన్నది ఒసామా బిన్ లాడెన్ అతడి తండ్రి లాడెన్. ఆ తర్వాత అఫ్గాన్ దేశం నుంచే ఒసామా సారథ్యంలోని అల్‌ఖైదా అమెరికాలోని ట్విన్ టవర్లను విమానాలతో దాడి చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే, ప్రచ్ఛన్నయుద్ధంలో రష్యా పై చేయి సాధించేందుకు అఫ్గాన్ యుద్ధానికి అమెరికా మద్దతు ఇచ్చింది. ఈ సంగతులన్నీ వికీలీక్స్‌లో పుంఖానుపుంఖాలుగా బయటకువచ్చాయి. దీంతోపాటు అమెరికా నిఘా సంస్థ సీఐఏ కూడా తన డీక్లాసిఫైడ్స్ డాక్యుమెంట్లతో నిర్ధారణ అయ్యింది.
నాడు సామ్రాజ్యవాదం నేడు వ్యాపారవాదం
ప్రపంచయుద్ధం తర్వాత అగ్రరాజ్యాల ఆధిపత్య పోరు కారణంగా యుద్ధాలు జరుగగా.. నేడు మూడో ప్రపంచదేశాలు తమ ఆయుధాలను ప్రదర్శించేందుకు యుద్ధాలకు కాలుదువ్వుతున్నాయి. అమెరికా, రష్యా మధ్య జరిగిన ప్రచ్ఛన్నయుద్ధంలో ఎన్నో దేశాలు సమిధలుగా మారాయి. అమెరికా, రష్యాల ఆధిపత్యాల కారణంగా జరిగిన యుద్ధాలుగా కొరియా యుద్ధం (1950–1953), వియత్నాం యుద్ధం (1955–1975), సోవియట్-ఆఫ్ఘన్ యుద్ధం (1979–1989), క్యూబా విప్లవం మరియు బే ఆఫ్ పిగ్స్ దాడి (1959–1961), గ్రెనడా దాడి (1983), నికరాగ్వాలో కాంట్రా (1981–1990) యుద్ధాలు జరిగాయి. ఇక నేటికాలంలో కొన్ని యుద్ధాలు, సాయుధ సంఘర్షణలను పూర్తిగా ఆయుధాల పరీక్షల మైదానాలుగా వర్ణిస్తున్నారు. ఎందుకంటే ఈ సంఘర్షణల్లో అగ్ర దేశాలు తమ అధునాతన ఆయుధాలు, సాంకేతికతలు, సైనిక సామర్థ్యాలను ప్రదర్శించడానికి ఉపయోగిస్తున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్-హమాస్ సంఘర్షణ, సిరియా అంతర్యుద్ధం, యెమెన్ సంఘర్షణలు ఇందుకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. సైనిక నిపుణులు అనేక సందర్భాల్లో చెప్పిన వివరాల ప్రకారం.. రష్యా ఆయుధాలు సిరియాలో, ఇజ్రాయెల్ ఆయుధాలు గాజాలో, అమెరికా ఆయుధాలు ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్‌లో పరీక్షించబడ్డాయి. ఈ యుద్ధాలు ఆయుధ తయారీదారులకు తమ ఉత్పత్తులను ప్రదర్శించడానికి, ఎగుమతి చేయడానికి వేదికలుగా మారాయని పేర్కొంటున్నారు. ఇప్పుడు సైనిక ఘర్షణ జరిగినా.. అందులో వాడుతున్న ఆయుధాలు వాటి పనితీరుపై ప్రధానంగా చర్చ జరుగుతున్నది. పాక్ పై భారత్ ప్రయోగించిన ఆయుధాలను అనేక దేశాలు కొనుగోలు చేసేందుకు ముందుకువస్తు్న్నాయని ఇప్పటికే ఎన్నో వార్తలు వచ్చాయి. ఇలా ప్రతి ఉద్రిక్తతను ఆయుధ కంపెనీలు, అగ్రరాజ్యాలు మార్కెట్ చేసుకుంటున్నాయన్నది వాస్తవం.






