రోమ్ నగరాన్ని కమ్మేసిన కారు చీకట్ల రహస్యం

by Muthe.Rajitha |   (  Updated:2025-08-25 17:12:11  IST  )

ప్రతి శీతాకాలంలో ఇటలీ రాజధాని రోమ్ నగరాన్ని కమ్మేసే కారు చీకట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

రోమ్ నగరాన్ని కమ్మేసిన కారు చీకట్ల రహస్యం
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రతి శీతాకాలంలో ఇటలీ రాజధాని రోమ్ నగరాన్ని కమ్మేసే కారు చీకట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతీ ఏడాది శీతాకాలంలో అంటే నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు రోమ్ నగరంలో ఓ వైపు సూర్యుడు వెలుగుతుండగానే, మరోవైపు తుఫాను మేఘంలాంటి కారు చీకట్లు కమ్ముతాయి. అయితే దీని వెనుక ఉన్నది స్టార్లింగ్ పక్షుల ముర్మురేషన్. అంటే వేలాది స్టార్లింగ్ పక్షులు ఒకే లయలో ఎగురుతూ, ఆకాశంలో అద్భుతమైన ఆకారాలను సృష్టిస్తాయి. అప్పుడు అదొక అద్భుతమైన దృశ్యంగా మారుతుంది. దూరం నుంచి చూస్తే అది భీకర తుఫాను మేఘంలా కనిపిస్తుంది. సూర్యుణ్ణి వెలుగును అడ్డుకుంటూ నగరాన్ని లక్షలాది పక్షులు కమ్మేస్తాయి.

ఎందుకలా రోమ్ నగరానికి వస్తాయి?

స్టార్లింగ్ పక్షులు ఐరోపాలోని రష్యా, జర్మనీ, హంగరీ వంటి చల్లని ప్రాంతాల నుంచి శీతాకాలంలో రోమ్‌కు వలస వస్తాయి. అపుడు రోమ్‌లో వాతావరణం వెచ్చగా, అనుకూలంగా ఉంటుంది. శీతాకాలం ముగిసే వరకు అంటే నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు సాయంత్రం సమయంలో ఈ పక్షులు రోమ్ నగరంపై ఆకాశంలో గుండ్రాలుగా చేరి ఎగురుతాయి. ఇలా అందమైన ఆకారాలను సృష్టిస్తూ ఎగరడాన్ని "ముర్మురేషన్" అంటారు. ఇది లక్షల పక్షుల సమన్వయ కదలికల సమాహారం.

ఆకాశం ఎందుకు చీకటిగా మారుతుంది?

సాయంత్రం సూర్యుడు అస్తమించే సమయంలో, లక్షల స్టార్లింగ్ పక్షులు ఒకే సమూహంగా చేరి ఎగురుతాయి. ఈ భారీ సమూహాలు ఆకాశంలో సూర్య కాంతిని అడ్డుకునేలా చేస్తాయి. దీనివల్ల ఆకాశం చీకటిగా కనిపిస్తుంది. ఈ పక్షులు ఒకే లయలో, ఒకే దిశలో ఎగురుతూ, ఆకాశంలో వివిధ ఆకారాలను రూపొందిస్తాయి. కొన్నిసార్లు అలలలా, కొన్నిసార్లు సర్పిలాకారంలా. ఈ దృశ్యం చూసేందుకు అద్భుతంగా ఉంటుంది. స్థానికులు, పర్యాటకులు ఈ దృశ్యాలను చూస్తూ మైమరచి పోతారు. రోమ్‌లోని పలాటైన్ హిల్, టెర్మిని స్టేషన్, టైబర్ నది వంటి ప్రాంతాల్లో ఈ ముర్మురేషన్ స్పష్టంగా కనిపిస్తుంది.

ముర్మురేషన్ వెనుక కారణం ఏమిటీ?

స్టార్లింగ్ పక్షులు పెద్ద సమూహంగా ఎగరడం వెనుక ఒక కారణం ఉంది. ఇది వాటి రక్షణ వ్యూహం. ఈ పక్షులు సమూహాలుగా ఎగిరితే, గద్దల వంటి శత్రువులు వాటిని సులభంగా దాడి చేయలేవు. ఒక పక్షి కదిలినప్పుడు, దాని పక్కన ఉన్న పక్షులు కూడా వెంటనే అదే దిశలో కదులుతాయి. దీనివల్ల ఒక సమన్వయ కదలిక ఏర్పడుతుంది. ఈ ముర్మురేషన్ శాస్త్రవేత్తలకు కూడా అంతు చిక్కని మిస్టరీనే.

నగరానికి కొత్త చిక్కులు

అయితే ముర్మురేషన్ దృశ్యం చాలా అందంగా ఉన్నప్పటికీ, రోమ్ నగరవాసులకు కొన్ని సమస్యలను తెచ్చ్చిపెడుతోంది. రోడ్లు, సైడ్‌వాక్‌లు, కార్లు, భవనాలపై ఎక్కడపడితే అక్కడ రెట్టలు వేస్తుండటంతో క్లీనింగ్ పెద్ద తలనొప్పిగా మారుతోంది. అంతేకాదు వింటర్లో ఈ క్లీనింగ్ కోసం మరింత ఖర్చు చేయాల్సి వస్తోందని అధికారులు వాపోతున్నారు. పెద్ద శబ్దాలు, లౌడ్ స్పీకర్లు పెట్టి వాటిని చెదరగొట్టాలని చూసినా.. లక్షలాది పక్షుల ముందు అది ఎందుకూ పనికి రాకుండా పోతోందట.

Next Story