బోరులేని రోజుల్లో.. బొక్కెన నీళ్లు.!

by Daayi Srishailam |

వరి ప్రధానంగా పండే ప్రాంతాల్లో ఈ ఇనుపబొక్కెన ప్రతీ ఇంటికి.. ప్రతీ బాయికీ ఉండేది

బోరులేని రోజుల్లో.. బొక్కెన నీళ్లు.!
X

దిశ, ఫీచర్స్: చిటికేస్తే నీళ్లు.. కట్కేస్తే లైట్లు వస్తాయిప్పుడు. కానీ ఈ కట్కలు సెన్సార్లు లేని రోజుల్లో అసలు నీళ్లు బాయిలో నుంచి బయటకెళా వచ్చేవి.? రైతు వ్యవసాయమెట్ల చేసేది.? అనేవి ఈ జనరేషన్ పిల్లలకు తెలియవు. కానీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తెలుసుకోకపోతే కరెంటు స్విచ్ బోర్డులోనే ఉత్పత్తవుతుందనీ.. నీళ్లు నల్లాలోనే ఊరుతాయనుకుంటారు.

గ్రామీణ జీవనంలో భాగం..

మోటకొట్టడం లాంటి రోజుల గుర్తుకు వచ్చినప్పుడల్లా గ్రామీణ జీవితం ఎంత సహజంగా సాగేదో అనిపిస్తుంది. కరెంటు వాడకం లేకుండా ఎడ్ల సాయంతో మోటగొట్టి బాయి నుంచి నీళ్లు తోడేసి పొలాలకు పారవెట్టేది. ఆ నీళ్లను తోడటానికి ఉపయోగించే పరికరమే ఇనుప బొక్కెన. బోరులేని రోజుల్లో ఆ బొక్కెన నీళ్లే పారడానికి.. తాగడానికి ఆదెరువు. బొక్కెన ఒక ఇనుముతో చేసిన పరికరం మాత్రమేకాదు.. గ్రామీణ జీవనానికి అదొక రక్షణ కవచం. ఒక స్నేహితుడు అనుకోవాలి. వరి ప్రధానంగా పండే ప్రాంతాల్లో ఈ ఇనుపబొక్కెన ప్రతీ ఇంటికి.. ప్రతీ బాయికీ ఉండేది.

బొక్కెన సప్పుడే అలారం..

ఎవరి శక్తికి తగ్గట్టు వాళ్లు బొక్కెన్లు చేయించుకునేది. అంటే కండబలం ఎక్కువగా ఉండి.. భారీ ఎడ్లు ఉన్నవాళ్లేమో కొంచెం పెద్ద బొక్కెన చేయిస్తే.. బక్కగున్నొళ్లు మామూలు బొక్కెన చేపించేది. ఒక్కో బొక్కెనలో వంద లీటర్లకు పైనే నీళ్లు పట్టేవి. తెల్లవారుజామునే మోటకొట్టుడు స్టా్ర్టయ్యేది. ఎలాంటి అలారాలు.. మేల్కొలుపుల సాధనాలు లేని సమయంలో మోట కొడుతున్నప్పుడు ఈ బొక్కెన శబ్దానికే టక్కటక్క సౌండ్ నడి ఊర్లకు వినిపిస్తుండేది. ఆ శబ్దానికి మోట్లుగొట్టే యాళ్లయిందని అందరూ మేల్కొని తమ తమ పనుల్లో బిజీ అయ్యేవాళ్లు. అంటే బొక్కెన సప్పుడే ఆరోజుల్లో అలారమన్నమాట.

సేద్యానికి రెడీ..

ఇనుప బొక్కెనతో నీళ్లు తోడటమే కాదు.. విత్తనాలు మొలకెత్తించే ప్రక్రియలో కూడా దాన్ని వాడేవాళ్లు. వరి పండించాలంటే ముందు మొలక అలికేదికదా.? ఆ మొలక అలుకుడు కంటే ముందుగా.. మండె పెట్టేది. మండె అంటే.. విత్తనం వడ్లను ఈ బొక్కెన నిండా నింపి.. గాలి సోకకుండా కప్పి పెట్టేవాళ్లు. ఇప్పుడంటే రైతులు గోనె సంచుల్లో మండె పెడుతున్నారు కానీ.. ఒకప్పుడు దీనికి ఇనుప బొక్కెననే వాడేవాళ్లు. మండె పెట్టిన పది పదిహేను రోజులకు మొలకొచ్చేవి విత్తనాలు. ఆ మొలకొచ్చిన విత్తనాలను పొలంలో చల్లి అలుకుడు చేసి సేద్యానికి రెడీ అయ్యేవాళ్లు.

రైతు సోపతి..

చిల్లు పడిన బొక్కెనలు ఇటు మోటకు ఉపయోగపడవు.. అటు విత్తనాలు మొలకెత్తించేందుకు పనికిరావు. కాబట్టీ అలాంటి వాటిని ధాన్యం భద్రపరుచుకునేందుకు లేదా వ్యవసాయ పనిముట్లు దాచిపెట్టేందుకు వాడేవాళ్లు. ఏదైనా వస్తువుపోతే ఇప్పుడు ఇల్లు పీకి పందిరేస్తాం. అయినా కూడా అది దొరకదు. కానీ పాతరోజుల్లో ఏ వస్తువైనా సరే ఈ బొక్కెన్లో చేతి పెడితే అమాంతం దొరికేది. అంటే.. ఈ ఇనుప బొక్కెన మనతో ఎలాంటి అనుబంధాన్ని కలిగి ఉండేదో అర్థం చేసుకోవచ్చు. రైతులతో బొక్కెనకు ఎలాంటి సోపతి ఉండేదో తెలుసుకోవచ్చు.

Next Story