‘హలో ఐస్ క్రీమ్ లవర్స్’.. ఈ విషయం గురించి ఎప్పుడైనా ఆలోచించారా?

by Gantepaka Srikanth |

మీరు తింటున్న ఐస్ క్రీమ్‌లో అసలు ఒరిజినల్ క్రీమ్ ఉందా? వెనీలా ఫ్లేవర్ కు వాడుతున్నది నేచురలా? కెమికల్సా? ఎప్పుడైనా ఆలోచించారా? ఏంది బ్రో కన్ఫ్యూజ్ చేస్తున్నావు అని టెన్షన్ పడుతున్నారా? నేతి బీరకాయలో నెయ్యి ఉండటం ఎంత సత్యమో.. ప్రతి ఐస్ క్రీమ్ లోనూ క్రీమ్ ఉండదన్నది కూడా అంతే నిజం.

‘హలో ఐస్ క్రీమ్ లవర్స్’.. ఈ విషయం గురించి ఎప్పుడైనా ఆలోచించారా?
X

మీరు తింటున్న ఐస్ క్రీమ్‌లో అసలు ఒరిజినల్ క్రీమ్ ఉందా? వెనీలా ఫ్లేవర్ కు వాడుతున్నది నేచురలా? కెమికల్సా? ఎప్పుడైనా ఆలోచించారా? ఏంది బ్రో కన్ఫ్యూజ్ చేస్తున్నావు అని టెన్షన్ పడుతున్నారా? నేతి బీరకాయలో నెయ్యి ఉండటం ఎంత సత్యమో.. ప్రతి ఐస్ క్రీమ్ లోనూ క్రీమ్ ఉండదన్నది కూడా అంతే నిజం. అయితే, దేశంలో ఈ మార్కెట్ వేల కోట్లకు చేరుకుంటున్నది. కానీ, ప్రమాణాలు మాత్రం ఆశాజనకంగా లేవు. దేశంలో 60శాతం మార్కెట్ బ్రాండెడ్ కంపెనీల చేతిలో ఉంటే.. 40శాతం పూర్తిగా లోకల్ మాన్యుఫ్యాక్చర్ల చేతిలో ఉన్నది. ఈ పరిస్థితుల్లో లోకల్ బ్రాండ్ తయారీదారులను తట్టుకుంటూ బ్రాండెడ్ కంపెనీలు కూడా తక్కువ ధరకే ప్రొడక్టులను అందించాల్సి ఉంటుంది. తయారీదారుల మధ్య పోటీ పెరిగి ధరలు తగ్గించడం సాధారణంగా సామాన్యుడు సంతోషపడే విషయమే. కానీ, నాణ్యత విషయంలో రాజీ పడితే.. నష్టపోయేది వినియోగదారుడే కదా. అందుకే మనం తినే ఆహార పదార్థాలపై పూర్తి అవగాహన ఉండాలి. తయారీలో వాడుతున్న పదార్థాల గురించి ప్రతి ఒక్కరూ క్షుణ్నంగా తెలుసుకోవాలి. మొత్తానికి ఐస్ క్రీమ్ తినొచ్చా..? తినకూడదా? ‘దిశ’ ప్రత్యేక కథనం. - ఎస్పీ హరీశ్

దేశంలో ఐస్ క్రీమ్ మార్కెట్ విస్తృతంగా పెరుగుతున్నది. గతంతో పోల్చుకుంటే ఐస్ క్రీమ్ వినియోగం కూడా భారీగా పెరిగింది. అప్ స్టాక్స్ వెబ్ సైట్ వివరాల ప్రకారం దేశంలో 2011లో దాదాపుగా ప్రతి ఒక్కరూ 0.4లీటర్ల ఐస్ క్రీమ్ తింటే 2024లో అది 1.6లీటర్లకు పెరిగింది. అంతర్జాతీయంగా అత్యంత ఎక్కువగా ఐస్ క్రీమ్ తినే దేశాల్లో న్యూజీల్యాండ్ మొదటిస్థానంలో ఉన్నది. ఈ దేశంలో ప్రతి ఒక్కరూ సరాసరి 28.4లీటర్ల ఐస్ క్రీమ్ లాగించేస్తారు. అమెరికా 20.8, ఆస్ట్రేలియా 18 లీటర్లతో ముందువరుసలో ఉంటే.. చైనా 4.3, ఇంగ్లండ్ 7లీటర్లతో చివరి వరుసలో నిలిచాయి. భారతదేశం విషయానికి వస్తే 2012 ఈ మార్కెట్ విలువ రూ.2,840కోట్లు ఉంటే 2023నాటికి రూ.30వేల కోట్లకు చేరింది. ఈ లెక్కన్ 2028నాటికి ఈ మార్కెట్ రూ.50వేల కోట్లు దాటుతుందని అంచనా. దేశంలో ఐస్ క్రీమ్ వినియోగంలో గుజరాత్, ఢిల్లీ, ముంబై, గోవా, రాజస్థాన్, బెంగళూరు, హైదరాబాద్ ముందువరుసలో ఉన్నాయి. గియానీస్ ఫుడ్స్ ఎండీ గుర్ ప్రీత్ సింగ్ అందించిన వివరాల ప్రకారం దేశంలో మూడింట ఒకవంతు ఐస్ క్రీమ్ లను గుజరాత్, రాజస్థాన్, గోవా, మహారాష్ట్ర ప్రజలే తినేస్తున్నారట. ఉక్కపోత అధికంగా ఉండే దక్షిణాది రాష్ట్రాలు తక్కువ చక్కెర, సహజసిద్ధమైన రుచి ఉండేవి ఇష్టపడితే.. ఉత్తరాదివారు మాత్రం అధికమొత్తం తీపితోపాటు ఘాటైన రుచి ఉండేవి ఇష్టంగా తింటారని చెప్తున్నారు.

దేశంలో ఐస్ క్రీమ్ తయారీదారులు ఎక్కువమందే ఉన్నా.. ప్రధాన బ్రాండ్లు అమూల్, వాడిలాల్, మదర్స్ డైరీ, క్వాలిటీవాల్స్. మార్కెట్లో వీరి వాటా 60శాతం. మిగితా 40శాతం మార్కెట్ మొత్తం లోకల్ బ్రాండ్లదే. అంటే లోకల్ మంచి పేరు ఉన్నా.. వాటిని దేశమంతా విస్తరించని వ్యాపారులదే. కే రుస్తుం ముంబైలో ఫేమస్ ఐస్ క్రీమ్ పార్లర్. వీటికి ఫ్రాంచైజీలు ఉన్నా అవి ముంబై నగరానికే పరిమతమయ్యాయి. అలాగే బెంగళూరులో పబ్బాస్ పార్లర్ తయారు చేసే ‘గడ్‌బడ్’ ఐస్ క్రీమ్ చాలామందికి అత్యంత ఇష్టమైనది. స్థానికంగా ఫేమస్ అయిన పార్లర్లలో లోకల్ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ విక్రయాలు భారీగానే ఉన్నా.. వాటి మార్కెట్ ఆ నగరం, పట్టణం వరకే పరిమితమవుతున్నది. దూర ప్రాంతాలకు ట్రాన్స్ పోర్ట్ చేయాలన్న ఆ ఐస్ క్రీమ్ నిల్వ చేయడానికి తగిన జాగ్రత్తలు, ప్రమాణాలు తీసుకోవాలి. లోకల్ బ్రాండ్స్ ఆ దిశగా పరిశోధన చేయకపోవడంతో స్థానికంగానే అవి మిగిలిపోతున్నాయి.

ఐస్ క్రీములతో లాభాలు

ఎనర్జీ బూస్టర్: కార్బొహైడ్రేడ్లు, ఫ్యాట్స్, ప్రొటీన్లు ఐస్ క్రీముల్లో పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఎనర్జీ బూస్ట్ అవుతుంది. బరువు పెరిగేందుకు తోడ్పడుతుంది.

మూడ్ చేంజ్: ఇటీవలి కాలంలో ఆడ, మగ అన్న తేడాలు లేకుండా అందరికీ మూడ్ స్వింగ్స్ అవుతున్నాయి. వీటినుంచి బయటపడేందుకు ఐస్ క్రీమ్ తినాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో ఉండే సెరొటోనిన్ హార్మోన్ మనిషిలో స్ట్రెస్ తగ్గించి.. ఉత్సాహాన్ని పెంచుతుంది. దీనిని గుడ్ హార్మోన్ అని కూడా అంటారు.

అయితే, ఇది ఒక ఐస్ క్రీమ్ కప్ తిన్నాక మరొకటి తినేలా మెదడుకు సంకేతాలు ఇస్తుంది.. దాని మాట విన్నారో జీర్ణవ్యవస్థకు ఇబ్బంది తప్పదు.

విటమిన్ ఫుడ్: ఐస్ క్రీముల్లో విటమిన్ ఏ, బీ6, బీ12, సీ, డీ తోపాటు ఈ, కే విటమిన్లు కూడా ఉంటాయి. కే విటమిన్ మనిషిలో బ్లడ్ క్లాట్ కాకుండా నివారిస్తుంది. ఇందులో యాంటీయాక్సిడెంట్లు, నియాసిన్, థయామిన్ తోపాటు రిబోఫ్లేవిన్ పోషకాలు కూడా ఉంటాయి. కాల్షియం, ఫాస్ఫరస్ లాంటి ఖనిజాలు కూడా ఉండటంతో ఎముకలను దృఢంగా చేయడంతోపాటు కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా చేస్తుంది.

నష్టాలు

ఫ్యాట్ ఎక్కువ: ఐస్ క్రీముల్లో మంచి కొవ్వులతోపాటు అదేస్థాయిలో చెడుకొవ్వు కంటెంట్ కూడా ఉంటుంది. చెడు కొవ్వు కారణంగా మానవుల్లో గుండె సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. గుండెపోటుకు కారణమయ్యే అంశాల్లో చెడు కొవ్వు ప్రధానమైనది. దీంతోపాటు చెడు కొవ్వు కారణంగా బరువు అధికంగా పెరుగుతారు.. రకరకాల వ్యాధులు వచ్చే ప్రమాదం లేకపోలేదు.

కొలెస్ట్రాల్ ముప్పు: ఐస్ క్రీములు అధికంగా తినడం వల్ల బాడీ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇది గుండెజబ్బులకు కారణం అవుతుంది.

మధుమేహం: ఇందులో అధికమోతాదుల్లో చక్కెర ఉండటంతో మధుమేహ వ్యాధిగ్రస్తులు ఐస్ క్రీములు తినడం వల్ల షుగర్ లెవల్స్ భారీగా పెరిగే ప్రమాదం ఉన్నది. ఇది అంతిమంగా వ్యాధి తీవ్రతను పెంచి.. ప్రాణానికే ముప్పులా మారే ప్రమాదం ఉన్నది. చక్కెర రోజువారీ ఆహారంలో మగవారికి 36గ్రాములు, ఆడవారికి 24 గ్రాములకు మించి ఉండకూడదు. కానీ, ఒక చిన్నపాటి (100గ్రాముల)ఐస్ క్రీమ్ లో 23గ్రాములు షుగర్ ఉంటుంది. ప్రధానంగా ఇందులో షుగర్ తోపాటు అదనపు తీపి కోసం షుగర్ కలిసి ఉండే ఇతర పదార్థాలను వాడుతారు. దీనివల్ల శరీరంలో చక్కెర పెరిగి.. కడుపు అజీర్తికి కారణం అవుతుంది. ఐస్ క్రీములు తినడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తింటే వచ్చే నష్టాలు కూడా అదేస్థాయిలో ఉన్నాయి. కానీ, తినేముందు అసలు అందులో ఏయే పదార్థాలు ఉన్నాయి.. షుగర్ కంటెంట్ ఎంత? ఎలాంటి ఫ్లేవర్లు వాడుతున్నారు? సహా ప్రతి ఇంగ్రీడియెంట్ వివరాలు తెలుసుకోవాలి. లేదంటే ఆర్టిఫిషియల్ కలర్స్, ల్యాబ్ లో తయారు చేసిన కెమికల్స్ తో చేసినవి తింటే ఆరోగ్యానికి ప్రమాదంలా మారుతుంది. మొత్తానికి అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్టు.. వారానికి ఓ సారి అన్నట్టు తీసుకుంటే ఏమి కాదు కానీ.. రోజుకు అరలీటర్ పైనే లాగిస్తే మాత్రం కచ్చితంగా ప్రమాదమే.

మార్కెట్లోకి కొత్త రకాలు

ఫ్రూట్ పాప్స్: ఈ రకం ఐస్ క్రీముల్లో ఎటువంటి పాలు, చక్కెర సహా ఏ ఇతర కెమికల్స్ వాడరు. కేవలం సీజన్ లో లభించే పళ్లను జ్యూస్ చేసి.. మార్కెట్ లో దొరికే ప్లాస్టిక్‌, అల్యూమినియంతో తయారు చేసే ఐస్ క్రీమ్ కోన్ లాంటి పాప్స్ లో వేసి కొన్ని గంటలపాటు డీప్ ఫ్రీజ్ చేయాలి. ఆ తర్వాత నోరూరించే పుల్ల ఐస్ క్రీమ్ రెడీ. ఇందులో ఎటువంటి కెమికల్స్, చక్కెర కలుపలేదు కాబట్టి ఇది వందశాతం ప్యూర్ అండ్ హెల్దీ. దీనితోపాటు ఫ్రూటీ గ్రీక్ యోగర్ట్ బార్క్, బనానా ఐస్ క్రీమ్ లాంటివి కూడా అందుబాటులో ఉన్నాయి.

ఐస్ క్రీమ్ తయారీ ఇలా..

మార్కెట్లో బోలెడన్నీ ఐస్ క్రీమ్ లు ఆకర్షణీయమైన ప్యాకుల్లో కనిపిస్తుంటాయి. పైగా వన్ గెట్ వన్ ఆఫర్ అంటూ ఊరిస్తుంటాయి. వెనీలా, బటర్ స్కాచ్, బ్లాక్ కరెంట్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ ఇలా బోలెడన్ని ఫ్లేవర్లలో ఐస్ క్రీములు ఉంటాయి. ఎప్పుడైనా వాటిని కొనేముందు అందులో ఏయే ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయో చూశారా? అరలీటర్ ఐస్ క్రీమ్ లో పాలు ఎన్ని ఉంటాయి? నీళ్లు ఎన్ని ఉంటాయి? చక్కెర ఎంత ఉంటుంది? కెమికల్స్ ఏమైనా కలిపారా? అని చూశారా? చూల్లేదా? ఇప్పుడు చూడండి. మార్కెట్లో అందుబాటులో ఉన్న దాదాపు 80శాతం ఐస్ క్రీముల్లో కెమికల్స్ కలుపుతారు. కంపెనీలు మాత్రం ప్రభుత్వం ఆమోదించిన మేరకే కెమికల్స్ కలుపుతున్నామని.. చెప్తుంటాయి. మరి ఎన్ని గ్రాముల ఐస్ క్రీమ్ తింటే కెమికల్స్ కలిసిన ఆర్టిఫిషియల్ ఫ్లేవర్లు మన శరీరానికి హాని చేయవని ఎప్పుడైనా చెప్తారా? చెప్పరు. వాళ్లకు కావాల్సింది.. వాళ్ల ప్రొడక్ట్ అమ్ముడుపోవడమే. ఎవరైనా రోజుకు 100గ్రాములకు మించి ఐస్ క్రీమ్ తినడం ప్రమాదమనే చెప్పవచ్చు. ఎందుకంటే అందులో దాదాపుగా 23గ్రాముల చక్కెర ఉంటుంది. దీంతోపాటు మరింత తీపికోసం ఆర్టిఫిషియల్ స్వీట్‌నర్లు కలుపుతారు. ఇవన్నీ కలిస్తే.. దాదాపు మనం వారంపాటు రెండుసార్లు తాగే టీలో కలుపుకునే చక్కెరకు సమానం. అంత చక్కెర ఒక్క చిన్న కప్పులో ఉంటే మన గట్ స్ట్రెంథ్ పరిస్థితి ఏమిటి? మరి పిల్లల సంగతి ఎలా? బ్రాండెడ్ కంపెనీలు కాస్త ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నా.. చాలామటుకు లోకల్ బ్రాండ్లు ఎలాంటి కనీస జాగ్రత్తలు తీసుకోవడంలేదు. అందుకే పెళ్లిళ్లలో ఐస్ క్రీమ్ కోసం రెండు, మూడు సార్లు వెళ్లేముందు ఒకసారి ఈ విషయాలన్నీ గుర్తు చేసుకోండి.

సాధారణ వెనీలా ఐస్ క్రీమ్ (500గ్రా)లో కలిసే పదార్థాలు

మూడుపాళ్లు నీళ్లు

చక్కెర 21 టీస్పూన్లు

పామ్ ఆయిల్

మిల్క్ సాలిడ్స్

లిక్విడ్ గ్లూకోజ్ (ఇదీ ఒకరకంగా చక్కెరే..)

వెనీలా ఎస్సెన్స్

ఇమాల్సిఫైయర్

స్టెబిలైజర్

(ఇవన్నీ కలిపి చేసే హిమక్రీములు చూడటానికి చాలా క్రీమీగా కనిపిస్తున్నా.. ఇందులో క్రీమ్ ఉండదు.. నేచురల్ వెనీలా కూడా ఉండదు. కనీసం పాలు కూడా ఉండవు. అంతా ఆర్టిఫిషియల్సే. పైగా సిల్క్ లాంటి తెలుపుకోసం సింథటిక్ కలర్స్ కలుపుతారు. వెనీలా ఎస్సెన్స్ ల్యాబుల్లో కెమికల్స్ తో తయారు చేస్తారు. ఇవన్నీ చూశాక కూడా ఐస్ క్రీములు తినడంపై కొంత ఆలోచించాలి. బ్రాండెడ్ కంపెనీలు తాము తయారుచేస్తున్న ప్రొడక్టులపై తప్పనిసరిగా అందులో ఉండే ఇంగ్రీడియెంట్లు తప్పకుండా పేర్కొంటాయి.. అలా లేవిని మాత్రం అస్సలు ముట్టుకోకండి. పైగా ఎండాకాలం వచ్చేసింది. కొంచెం కంట్రోల్ చేసుకోండి మరి.)

Next Story