- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అది వాటర్ ఫాల్ కాదు బ్లడ్ ఫాల్
వర్షాకాలం వచ్చిందంటే చాలు చిన్నా పెద్దా జలపాతాల వద్దకు చేరి కేరింతలు కొడుతుంటారు.

దిశ, వెబ్ డెస్క్ : వర్షాకాలం వచ్చిందంటే చాలు చిన్నా పెద్దా జలపాతాల వద్దకు చేరి కేరింతలు కొడుతుంటారు. వర్షాలు కురువకపోయినా జీవనదులపై ఉన్న జలపాతాలు ఏడాది పొడవునా సందర్శకులను ఆకర్షిస్తాయి. కొన్ని చోట్ల ఋతువులను బట్టి జలపాతం తీవ్రత తగ్గొచ్చు లేదా పెరగవచ్చు. కొన్ని దేశాల్లో శీతాకాలాల్లో మంచుతో గడ్డ కట్టిన వాటర్ ఫాల్స్ కూడా అద్భుతంగానే కనిపిస్తూ కనువిందు చేస్తాయి. అయితే మీరు ఎన్నడూ చూడని, వినని ఒక వాటర్ ఫాల్ గురించి వింటే వావ్ అనకుండా ఉండలేరు. కొంతమంది సెన్సిటివ్ వ్యక్తులు భయంతో వణికిపోతారు కూడా. భయపడటం అంటే అంత భీకరంగా ఉంటుంది అనుకునేరు కాదు.. అసలు ఆ జలపాతంలో నీరు ప్రవహించదు. అక్కడ ప్రవహించేది మొత్తం రక్తం. అవును మీరు విన్నది నిజం. ఆ జలపాతంలో అచ్ఛంగా రక్తమే ప్రవహిస్తుంది. ఈ బ్లడ్ వాటర్ ఫాల్స్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం రండి.
ఈ బ్లడ్ ఫాల్స్ అంటార్కిటికా ఖండంలో ఉంది. అక్కడి మెక్‌ముర్డో డ్రై వ్యాలీస్‌లో టేలర్ గ్లేసియర్ చివరిలో ఈ జలపాతం ఉంటుంది. తెల్లని మంచు పొరల మీది నుంచి రక్తం కిందికి దూకడం అద్భుతంగాను, కాస్త భీతి కలిగించేలా ఉంటుంది. కాని అందులో పారేది నిజమైన రక్తం కాదు. ఎరుపు రంగు నీరు రక్తంలా తెల్లని మంచు మీద ప్రవహించడం వల్ల రక్తంలా కనిపిస్తుంది. ఈ బ్లడ్ వాటర్ ఫాల్ ను మొదటగా 1911లో థామస్ గ్రిఫిత్ టేలర్ అనే శాస్త్రవేత్త కనుగొన్నారు. మొదట చూసి ఎరుపు ఆల్గీల వల్ల ఈ రెడ్ ఫాల్ ఏర్పడింది అనుకున్నారు. కానీ ఇది గ్లేసియర్ కింద మిలియన్ల సంవత్సరాల క్రితం చిక్కుకున్న ఉప్పు సరస్సు నుండి వచ్చే ఇనుము అధికంగా ఉన్న నీరు, గాలిలోని ఆక్సిజన్‌తో తాకినప్పుడు తుప్పు పట్టి ఎరుపు రంగులో కనిపిస్తుందని తరువాత తేల్చారు.
ఈ నీరు చాలా ఉప్పగా ఉండి, -10°C వద్ద కూడా గడ్డకట్టకుండా ద్రవంగా ఉంటుంది. 2009లో శాస్త్రవేత్తలు ఈ నీటిలో సూర్యరశ్మి లేకపోయినా ఇనుము, సల్ఫేట్‌తో జీవించే సూక్ష్మజీవులను కనుగొన్నారు. ఈ ఆవిష్కరణ ఇతర గ్రహాలలో జీవం ఉండవచ్చననే ఆశ రేకెత్తిస్తోంది. అయితే ఈ బ్లడ్ వాటర్ ఫాల్ ఎప్పుడూ ఉండదు. గ్లేసియర్‌లోని ఒత్తిడి వల్ల అప్పుడప్పుడు ఐరన్ అధికంగా కలిసిన నీరు బయటకు వచ్చినపుడే ఈ బ్లడ్ జలపాతం కనిపిస్తుంది. ఎరుపు నీరు తెల్ల మంచుపై దూకుతూ ప్రవహించడం అద్భుతంగా కనిపిస్తుంది. అయితే ఈ మిస్టీరియస్ ప్లేస్ ను చేరుకోవడం చాలా కష్టమట.
ఈ బ్లడ్ జలపాతాన్ని శాస్త్రవేత్తలు రాడార్ వంటి సాధనాలతో అధ్యయనం చేయడమే కాకుండా, అంటార్కిటిక్ ఒప్పందం కింద సంరక్షిస్తూ ఉంటారు. గతకొంతకాలంగా కొద్దిమంది ఔత్సాహికులు అనేక కష్టాలకు ఓర్చి, మిస్టీరియస్ బ్లడ్ వాటర్ ఫాల్ పై డాక్యుమెంటరీలు చేస్తూ.. ప్రపంచం ముందుకు తీసుకువస్తున్నారు. మనం ఈ రక్తపు జలపాతం దగ్గరికి వెళ్లలేక పోయినా.. ఇలా డాక్యుమెంటరీల్లో చూస్తూ వావ్ అనుకుందాం.






