సొంత వైద్యం.. మనలో పైత్యం

by Sujitha Rachapalli |   (  Updated:2026-07-27 03:30:47  IST  )

ఆరోగ్యం గురించి చాలా శ్రద్ధ తీసుకుంటాం. ఏ చిన్న సమస్యొచ్చినా హాస్పిటల్‌కి పరుగులు తీస్తాం. పొద్దున ఐదారు గంటల నుంచే మెడికల్ షాపు చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటాం.

సొంత వైద్యం.. మనలో పైత్యం
X

దిశ, ఫీచర్స్: ఆరోగ్యం గురించి చాలా శ్రద్ధ తీసుకుంటాం. ఏ చిన్న సమస్యొచ్చినా హాస్పిటల్‌కి పరుగులు తీస్తాం. పొద్దున ఐదారు గంటల నుంచే మెడికల్ షాపు చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటాం. డాక్టర్ కనిపిస్తే అనుమానాలన్నీ ఆపకుండా చెప్తాం. భయాలన్నీ పోగొట్టుకునే ప్రయత్నం చేస్తాం. అంత బాగానే ఉంటుంది కానీ డాక్టర్ సిఫారసు చేసిన మందుల్నే వాడాలని తెలియదా? ప్రిస్కిప్షన్ ప్రకారం మందులు తీసుకోవాలనే ఆలోచన ఉండదా?

ప్రిస్క్రిప్షన్ లేకుండానేనా?

చదువుకున్న వాళ్లు.. అన్నీ తెలిసినవాళ్లు కూడా డాక్టర్ సిఫార్సు లేని మందులనే వాడుతుంటారు. ప్రిస్క్రిప్షన్ లేకుండానే తీసుకుంటారు. డబ్బులు ఎంతైనా ఖర్చుచేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అనుకుంటారు గానీ.. ప్రిస్కిప్షన్ ప్రకారం మందులు తీసుకోవాలి అనుకోరు. ల్యాన్సెట్ పబ్లిక్ హెల్త్‌లో ప్రచురితమైన తాజా అధ్యయనం ప్రకారం.. ఇండియాలో రోజుకు అవసరమైన 14.7 మోతాదుకు బదులు 18.3 మోతాదు యాంటీబయాటిక్స్ వాడుతున్నారు. చాలామంది జలుబు, వైరల్ జ్వరాల వంటి సాధారణ సమస్యలకు ప్రిస్క్రిప్షన్ లేకుండానే యాంటీబయాటిక్స్ తీసుకుంటున్నారు.

సంప్రదించకపోతే నష్టం ఎవరికి?

డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు తీసుకోవడం చాలామందికి అలవాటుగా మారింది. తలనొప్పి, జ్వరం, కడుపు నొప్పి వంటి సమస్యలు వచ్చినప్పుడు.. ‘ఇంత చిన్న సమస్యకు డాక్టర్‌నెందుకు అడగడం.. ఉత్త పుణ్యానికి పైసలు బొక్కా’ అనుకుంటారు. దీంతో డాక్టర్‌ను సంప్రదించకుండా నేరుగా మెడికల్ స్టోర్‌కు వెళ్లి మందులు కొనుక్కుంటారు. దీనివల్ల తాత్కాలిక ఉపశమనం దొరకొచ్చు. కానీ లాంగ్‌ టైంలో తీవ్రమైన సమస్యలు తలెత్తే ప్రమాదముంది. సొంతంగా మందులు తీసుకోవడానికి మనం డాక్టర్లం కాదు. మెడికల్ షాపు నడిపే వ్యక్తి స్పెషలిస్టూ కాదు. దానివల్ల రకరకాల సమస్యలు వస్తుంటాయి.

అవేమైనా నిత్యావసర సరుకులా?

మెడిసిన్ ఏమి కూరగాయలు, పప్పులు, ఉప్పులు కాదు. మార్కెట్‌కు వెళ్లి మనకు ఇష్టమొచ్చినవి తెచ్చుకొని వాడుకోవడానికి. ఏది పడితే అది వేసుకోవడం వల్ల కొన్ని మందులు శరీరానికి సరిపోకపోతే తీవ్రమైన అలెర్జీ వచ్చే అవకాశం ఉంది. చర్మంపై దద్దుర్లు, దురద, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. కొన్ని సందర్భాల్లో ప్రాణాపాయ స్థితికి కూడా దారితీయవచ్చు. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే డాక్టర్ సలహా లేకుండా.. ప్రిస్కిప్షన్ లేకుండా.. మెడిసిన్ తీసుకుంటే ఏ మందు వల్ల అలెర్జీ వచ్చిందో తెలుసుకోవడం చాలా కష్టమవుతుంది.

వ్యాధిని దాచిపెడుతున్నట్లే కదా?

ప్రతి ఔషధానికి దుష్ప్రభావాలు ఉంటాయి. అధిక మోతాదులో లేదా అనవసరంగా తీసుకుంటే కిడ్నీలు, కాలేయం, గుండె వంటి అవయవాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. యాంటీబయాటిక్స్‌ను అతిగా వాడితే శరీరంలోని మంచి బ్యాక్టీరియా కూడా చనిపోతుంది. పెయిన్‌ కిల్లర్స్‌ను ఎక్కువగా తీసుకుంటే పొట్ట, కిడ్నీ సమస్యలు రావచ్చు. ఛాతీ నొప్పి గ్యాస్ వల్ల కావచ్చు లేదా గుండె సమస్య వల్ల కూడా కావచ్చు. అలాంటి పరిస్థితుల్లో మనం ప్రిస్కిప్షన్‌తో పని లేకుండా మెడిసిన్ తీసుకుంటే లక్షణాలు తగ్గిపోవచ్చు. కానీ నిజమైన వ్యాధిని దాచిపెడుతున్నట్లే కదా? ఆ తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం ప్రయోజనం?

సొంత వైద్యం వికటిస్తే?

వచ్చిన ప్రతీ హెల్త్ ఇష్యూ కోసం డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదనేది సగటు ఇండియన్ మెంటాలిటీ. ఈ చిన్న దాని కోసం డాక్టర్ అవసరమా అని దగ్గరెక్కడైనా మెడికల్ షాపు కనిపిస్తే ఏదో మెడిసిన్ తీసుకుంటాం. ఏ మందు వాడాలి? రోజుకు ఎన్ని వేసుకోవాలి? ఇలా మొత్తం ఎన్ని రోజులు వాడాలి? అనే వివరాలు కూడా మెడికల్ షాపు వాళ్లే చెప్తుంటారు. మనకేంటి డాక్టర్ ఫీజు మిగిలిపోయింది కదా అనుకుంటాం. దీని వల్ల డోస్ ఎంత పడుతుంది.. మనకొచ్చిన సమస్య తీవ్రతెంత.. అనేవి సరిపోలవు. దీంతో సొంత వైద్యం వికటించి సమస్య మరింత తీవ్రం అయ్యే అవకాశం ఉంది.

నష్టపోయేది ప్రజలే కదా?

డాక్టర్ సిఫారసు లేకుండా మెడిసిన్ తీసుకోవడం ఎంతయితే తప్పో అంతే తప్పు మెడికల్ షాప్ వాళ్లది కూడా. ఏదో అప్పుడప్పుడు అధికారులు తూతూమంత్రంగా తనిఖీలు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం చూస్తే ప్రిస్క్రిప్షన్ ఉంటేనే మెడిసిన్ ఇవ్వాలి. మెడికల్ షాపుల వాళ్లు ఈ నిబంధనలకు విరుద్ధంగా ఎన్నో మందులను ఇష్టానుసారంగా అమ్ముతుంటారు. ఆర్‌ఎంపీ క్లినిక్‌లలోనూ ఇవి దొరుకుతాయి. జనరిక్ మందులు వాడాలని.. వైద్యులు కూడా వాటినే రాయాలని ఎంత మొత్తుకున్నా జరిగేది మాత్రం అలాగే జరుగుతూనే ఉంది. వీటితో అంతిమంగా నష్టపోయేది మాత్రం ప్రజలే.

కొత్త రూల్ ఎందుకంటే?

మందుల దుర్వినియోగాన్ని అరికట్టాలని సెంట్రల్ సర్కారు కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది. ఇకపై 12 శాతానికి పైగా ఇథైల్ ఆల్కహాల్ ఉన్న కొన్ని మందులను డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వొద్దనేది ఆ రూల్. ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారంటే కొన్ని దగ్గు సిరప్‌లు, టానిక్స్‌లో ఆల్కహాల్ శాతం ఎక్కువగా ఉంటుందట. దీంతో దగ్గు మందును కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఔషధాల విక్రయంపై కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. కొత్త మార్గదర్శకాల ప్రకారం చెల్లుబాటయ్యే ప్రిస్క్రిప్షన్ ఉంటేనే మెడికల్ షాపులు విక్రయించాలి. ప్రిస్క్రిప్షన్ కాపీలు మూడేళ్లు భద్రపరచాలి.

ప్రాణాపాయ స్థితికి దారితీస్తే?

ప్రస్తుత టెక్నాలజీ యుగంలో మనుషులు ఇంటర్నెట్‌పైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత పరిస్థితి మరింత మారిపోయింది. ఢిల్లీకి చెందిన 45 ఏళ్ల ఒక వ్యక్తి ఏఐ చాట్‌బాట్ మెడికల్ సలహా మేరకు హెచ్ఐవీ నిరోధక మందులు వాడి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఆయన ఎలాంటి క్లినికల్ టెస్ట్‌లు చేయించుకోకుండా.. డాక్టర్‌ను సంప్రదించకుండానే మెడికల్ షాపులో ఆ మందులు కొన్నాడు. వారం రోజుల్లోనే స్టీవెన్స్- జాన్సన్ సిండ్రోమ్ అనే తీవ్రమైన వ్యాధి సోకింది. ఇది చర్మం, శ్లేష్మ పొరలపై తీవ్ర ప్రభావం చూపి ప్రాణాపాయ స్థితికి దారితీసే ప్రతికూల ప్రతిచర్య.

మిగిలిపోయిన మెడిసిన్ వాడతారా?

డాక్టర్ సలహా లేకుండా ఇంటర్నెట్‌లో వెతికి.. దేశంలో సుమారు 50 శాతం మంది డయాగ్నోసిస్ చేసుకుంటున్నారని నివేదికలు చెప్తున్నాయి. సుమారు 24.6 శాతం మంది సొంత నిర్ణయంతో యాంటీబయాటిక్స్‌‌ను తీసుకుంటున్నట్లు ఒక అధ్యయనంలో తెలిసింది. వీటిలో అమాక్సిసిలిన్, అజిత్రోమైసిన్, సిప్రోఫ్లాక్సాసిన్ లాంటివి ఎక్కువ వాడుతున్నారట. ఇంకా కొందరైతే తమ స్నేహితులో లేదా ఫ్యామిలీ మెంబర్సో అలాంటి లక్షణాలకు వాడి మిగిల్చిన మందులను వేసుకుంటున్నారట. దీనినే యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అనే ప్రమాదకర పరిస్థితిగా పరిగణిస్తున్నారు వైద్య నిపుణులు.

గూగుల్‌లో వెతికి కొంటారా?

చాలా మంది ఆరోగ్యం గురించి అతిగా ఆలోచించి గూగుల్‌లో లక్షణాలు వెతికి మరింత భయపడతారు. దీన్ని సైబర్‌కాండ్రియా అంటారు. చిన్న లక్షణాన్ని క్యాన్సర్ లేదా గుండె జబ్బుగా భావించి అనవసర పరీక్షలు చేయించుకుంటారు. కొందరు డాక్టర్‌ను మారుస్తూ ఉంటారు. ఇది మానసిక ఒత్తిడిని పెంచి నిద్రలేమి, గ్యాస్, రక్తపోటు వంటి సమస్యలను తెచ్చి పెడుతుంది. భయం ఉండటం సహజమే. కానీ ఆ భయం సొంత ప్రయోగాలు చేసి అనవసర మందులకు, పరీక్షలకు దారితీస్తే ప్రమాదం. డాక్టర్ సిఫారసు చేసిన మందులను పూర్తి కోర్స్‌లో తీసుకోకపోతే లక్షణాలు దాగి ఉండి తర్వాత తీవ్రమవుతాయి.

అలా గుడ్డిగా నమ్మితే ఎలా?

డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ రూల్స్ ప్రకారం యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్, నార్కోటిక్ మందులు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మకూడదు. అయినా అమ్ముతున్నారు. జనాలు వీటిని కొనుగోలు చేస్తున్నారు. 70 ఏళ్ల వ్యక్తి ఒకతను దాదాపు పదేళ్లుగా డెక్సామెథాసోన్ అనే మెడిసిన్‌ను తీసుకుంటున్నాడు. తనకు ఏ డాక్టర్ దానిని తీసుకొమ్మని రాసివ్వలేదు. గుడ్డిగా అలా ఏళ్లకు ఏళ్లు తీసుకోవడం వల్ల కషింగ్ సిండ్రోమ్‌తో హాస్పిటల్ పాలయ్యాడు. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ ప్రధాన లక్ష్యం ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన మందులు అందించాలి.

విదేశాల్లో ఎలా ఉంటాయంటే?

అమెరికా, చైనా, జపాన్, జర్మనీ వంటి దేశాల్లో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు తీసుకోవడం భారతదేశంతో పోలిస్తే నియంత్రణలో ఉంది. ఈ దేశాల్లో ప్రజల ఆలోచన విధానం, చట్టాలు, అమలు భిన్నంగా ఉంటాయి. అమెరికాలో ఏ మెడిసిన్ అయినా ప్రిస్క్రిప్షన్‌‌తోనే లభిస్తాయి. ప్రజలు కూడా డాక్టర్ సలహా లేకుండా ఎలాంటి మందులు తీసుకోరు. జర్మనీలో ఫార్మసీలు ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మితే లైసెన్స్ రద్దు చేస్తారు. జపాన్‌లో ప్రిస్క్రిప్షన్ మందులు డాక్టర్ సలహా లేకుండా అమ్మరు. ప్రజల్లో అవగాహన, సామాజిక క్రమశిక్షణ ఎక్కువ. చైనాలో నియమాలు ఉన్నా కొన్ని ప్రాంతాల్లో ఓటీసీ అమ్మకాలు జరుగుతున్నాయి.

తీవ్రమయ్యాక వస్తారు: డాక్టర్ శ్రీనివాస్ గౌడ్, జనరల్ ఫిజిషియన్

రోజూ ఓపీడీలో ఎంతో మందిని చూస్తుంటాం. చాలా మంది సొంతంగా యాంటీబయాటిక్స్, పెయిన్‌ కిల్లర్స్ తెచ్చుకొని పరిస్థితి తీవ్రమయ్యాక మా దగ్గరికి వస్తున్నారు. ఇలా చేయడం వల్ల వ్యాధి లక్షణాలు దాగిపోతాయి. తర్వాత చికిత్స కష్టమవుతుంది. యాంటీబయాటిక్స్ రెసిస్టెన్స్ పెరుగుతోంది. సాధారణ జ్వరం కూడా ఇప్పుడు కొన్ని మందులకు పనిచేయడం లేదు. జనాలు డబ్బు ఆదా చేయాలనుకుంటారు. కానీ చివరికి అంతకంటే ఎక్కువ బాధ తప్పడం లేదు.

జాగ్రత్త పడాలి: మహేందర్, పోచారం

పని ఒత్తిడి, సమయం లేకపోవడం వల్ల ప్రతి సారి డాక్టర్ దగ్గరికి వెళ్లడం కష్టం. చిన్న జ్వరం, తలనొప్పి వచ్చినప్పుడు మెడికల్ షాపుకు వెళ్లి పోయిన సారి వేసుకున్న మెడిసిన్ చెప్పి తీసుకుంటారు. ఫార్మసిస్టు కూడా ఇచ్చేస్తారు. ఇప్పటి వరకు సమస్యేం లేదు కాబట్టి అలాగే కొనసాగిస్తున్నాం. కానీ ఇప్పుడు కొంచెం జాగ్రత్త పడాలి. చాలామంది కూడా ఇలానే ఉన్నారు. సమయం, డబ్బు, అనుకూలత కాదు మన ప్రాణమూ ముఖ్యమే.

ప్రాణాంతకం కావొచ్చు : డాక్టర్ ఆర్. అనూష, జనరల్ ఫిజిషియన్

బీపీ, ఫిట్స్, మధుమేహంతో బాధపడుతున్న వారు డాక్టర్ సూచించని మందులు వాడితే డ్రగ్ - డ్రగ్ ఇంటరాక్షన్స్ వచ్చే అవకాశాలుంటాయి. కొన్ని రకాల మందులతో ప్రాణాంతక పరిస్థితులు ఏర్పడే చాన్స్ ఉంటుంది. కాబట్టి డాక్టర్ సూచించిన విధంగా మందులు తీసుకోవడం ఉత్తమం.

Next Story