ఫ్రీ బస్సు సర్వీస్‌ను వాడే తరీఖ ఇదేనా.?

by Daayi Srishailam |   (  Updated:2025-08-25 14:09:52  IST  )

మన అమ్మలక్కలేమో కాళీమాతలెక్క విజృంభిస్తుండ్రు

ఫ్రీ బస్సు సర్వీస్‌ను వాడే తరీఖ ఇదేనా.?
X

పైసలు పెట్టేదైతే..

పక్కన కూడా నిలబడం.

అదే ఉత్తగిస్తమంటే..

ఊరంతా నాదే అంటం.

ఫ్రీగా వచ్చిందే కదా..

ఇష్టమొచ్చినట్లు వాడేస్తం.

అవసరం లేకున్నా కావాలంటం.

పంతానికి పోయి..

నీదా నాదా జుట్లు పట్టుకుంటం..

ఆర్టీసీ బస్సులో అమ్మలక్కల పంచాయతీ లెక్క.

నిజంగా దేనికి పనికొచ్చే పంచాయతీలవీ.?

అసలెందుకు కొట్లాడుతుండ్రట్లా.?

ఫ్రీ బస్సులేసింది శిగలు పట్టి కొట్టుకుంటందుకా.?

సౌకర్యంగా ప్రయాణం చేస్తందుకా.?

- దాయి శ్రీశైలం

సర్కారు ఫ్రీ బస్సు పెట్టింది. అదిగూడ ఆడొళ్ల కోసం. మనొళ్లు మంచిగనే వాడుతుండ్రు. అక్కెరకొస్తుంది కాబట్టీ వాడకం పెంచడం మంచిదే. కానీ ఏంది దినాం లొల్లి పంచాదులు.? ఆ పథకం పేరేమో మహాలక్ష్మీ. ఇక్కడ మన అమ్మలక్కలేమో కాళీమాతలెక్క విజృంభిస్తుండ్రు. ఒకరినొకరు తన్నుకుంటుండ్రు. ఫ్రీ బస్సు సర్వీస్‌ను వాడే తరీఖ ఇదేనా.?

ఫ్రీ బస్సుకు జై

ఆర్టీసీ బస్సులల్ల ఒకప్పుడు "లేడీస్ సీట్లు ఖాళీగనే ఉన్నయి కూసుందాం పదా. ఎవరన్నొస్తే లేద్దాంలే. ఐనా ఈ టైంలో ఎవరొస్తరు" అనుకునేది జనాలు. కానీ ఇప్పుడు రాత్రి పదిగంటలకు కూడా ఆర్టీసీ బస్సులో లేడీస్ ఆరామ్‌గా తిరుగుతుండ్రు. నిజంగా గ్రేట్. ఎందుకంటే సిటీలో ఇదంతా కామన్. రాత్రి పదింటికి బస్సులో పోవుడనేది పెద్ద మ్యాటర్ కాదు. కానీ పల్లె వెలుగు బస్సులల్ల కూడా ఎవరి తోడూ లేకుండా జర్నీచేసి, వాళ్ల పనులు వాళ్లు చేసుకుంటున్రు. పది, పదిహేను కిలోమీటర్లే కాదు. పాలమూరు, నిజామాబాద్, ఖమ్మం నుంచి కూడా హైద్రాబాద్ వచ్చి పోతుండ్రు. ఇట్లా పనిమీద వచ్చిపోయెటొళ్లకు మహాలక్ష్మి పథకం మంచిగా అక్కెరకొస్తుంది. ఇంకొకరి మీద ఆధారపడకుండా ఒంటరిగా ప్రయాణాలు చేసే అవకాశం వచ్చింది.

టైంపాస్ కోసమా.?

ఇదంతా బాగనే ఉంది. కానీ కొంతమంది ఫ్రీ బస్సు సౌకర్యం ఉందని అనవసర ప్రయాణాలు చేస్తుండ్రు. ఇంట్లో బోర్ కొట్టిందని కొందరు, ఫ్రీయే కదా అలా ఓ రౌండేసొద్దామని కొందరు బస్సును బరాబర్ వాడుతుండ్రు. సీన్మలకు, షాపింగ్‌లకు ఆర్టీసీ బస్సుల్నే పోతుండ్రు. మహాలక్ష్మి పథకం స్టార్టయిన కొత్తలో చూసినం.. ఒకామె ఆధార్ కార్డు, అల్లమెల్లిగడ్డ చేతిల పట్టుకొని బస్సెక్కి పొట్టుదీస్తుంది. "అరే ఏందమ్మా ఇదీ" అని అడిగితే "కనవడ్తలేదా అల్లమెల్లిగడ్డ పొట్టుదీస్తున్నా" అని ఆన్సరిచ్చె. ఇంకొకామైతే నోట్లో బ్రష్‌తోనే బస్సెక్కింది. "ఇదేందక్కా" అని అడిగితే.. "ఇంటి పనైపోయింది. ఖాళీగా ఉండి ఏంజేస్తమని ఇట్లొచ్చినా" అని అనవట్టె. పిండి గిర్నీ కోసం ఒకామె, పక్కనే రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న అక్కకు కారంపొడి ఇస్తందుకు ఇంకొకామె.. ఇట్లా మహాలక్ష్మిని మస్తుగ వాడేస్తుండ్రు.

ఇందుకేనా మహాలక్ష్మి.?

పొద్దువోతలేదని బస్సెక్కుడు, పని లేకున్నా పల్లెవెలుగులో తిరుగుడు కాదు. జెన్యూన్‌గా వాడుకుంటే మంచిది. అవసరం లేకున్నా బస్సు ప్రయాణం చేస్తే నిజంగా అవసరమున్నొళ్లకు ఇబ్బందైతుంది. అత్యవసరంగా పోవాల్సినొళ్లు ఈ రష్‌ను జూశి ఎన్కముందైతుండ్రు. ఇందుకోసమేనా మహాలక్ష్మి పథకం. అసలు మహాలక్ష్మి ఉద్దేశమేంది.? మహిళల సాధికారత, ఆర్థిక స్వాతంత్య్రాన్ని పోత్సహించడమే కదా.? ఆధార్ కార్డు ద్వారా ఆర్టీసీ బస్సులల్ల ట్రావెల్ చేసే మహిళల తొవ్వ కిరాయిలు తగ్గించడమే కదా.? ఊర్లళ్లుండే అమ్మలక్కలు, తక్కువ సంపాదన ఉన్నొళ్లు, పని కోసం, సదువు కోసం, ఇంకా వేరే ముఖ్యమైన పనుల మీద ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి, పట్నానికి పోయెటొళ్ల ట్రావెల్ చార్జెస్‌ను తగ్గించి పైసలు ఆదా చేయించి, ఆర్థిక పరిస్థిని మెరుగు పరుచుడే కదా ఆ స్కీమ్ ఉద్దేశం.?

ఈ కొట్లాటలేంది.?

ఒకప్పుడు బోరింగుల కాడ, నల్లాల కాడ ఆడొళ్లు జుట్లు పట్టుకొని కొట్టుకునేది. చిన్న చిన్న కారణాలే అయుంటయి. కానీ, ఎవరూ తగ్గకుండా అది పెద్దగైతది. సేమ్ ఇప్పుడు అసొంటి కొట్లాటలే ఆర్టీసీ బస్సులల్ల జరుగుతున్నయి. ఎందుకు తల్లీ ఆ విజృంభనలు.? సీటు కోసమే కదా.? ఎక్కడ పోతుంది సీటు.? ఎవరి సొంతం ఆ సీటు.? ఎవరికి దొరికితే వాళ్లు కూసుంటే ఐపోతది. అయినా ఆ సీట్లో కూసున్నొళ్లు ఆఖరి వరకు ఉండరు కదా.? మధ్యలెక్కడో దిగిపోతరు. అప్పుడు సీటు దొరుకుతుంది కదా.? ఇంత చిన్న విషయం కోసం శిగలు పట్టుకొని కొట్టుకునుడు అవసరమా.? ఏదో ఒకరోజంటే ఏమో అనుకోవచ్చు. తెలుగు సీరియల్స్‌ను మించి ట్విస్టులిస్తూ దినాం ఈ పంచాయతీలు పెట్టుకుంటున్నారు. అడ్డంబొయ్యినొళ్లను కూడా అర్సుకుంటుండ్రు.

ఎందుకు అవుతున్నయి.?

బస్సులెక్కడికీ పారిపోవు. ప్రయాణికులను గమ్యం చేర్చుడే దాని పని. ఆ రూట్లో ఒక్క బస్సే ఉండదు. ఈ బస్సులో జనాలు ఎక్కువుంటే వేరే బస్సులో ఎక్కొచ్చు. ఇంకో పది నిమిషాలకు పోవచ్చు. అంతేగానీ ఒకరిమీద ఒకరు పడి, ఫుట్‌బోర్డు మీద వేలాడుకుంట పోవడం అవసరమా.? ఒక బస్సు కెపాసిటీ 100 మంది అనుకుంటే అండ్ల 80 మంది ఆడొళ్లే ఉంటున్రు. మొగొళ్లకు సీట్లే దొరుకుతలేవని వాళ్లు మొత్తుకుంటుండ్రు. చిన్న పిల్లల్ని బస్సులల్ల తీస్కపోవాలంటే కూడా భయపడేటట్లు చెప్పులు విసురుకునుడు, చెయ్యి చేసుకునుడు అవసరమా.? సరే ఒకరంటే ఏదో ఎమోషనై అన్నరనుకుందాం. ఇంకొరికేమైంది.? కొంచెం ఓపికతో ఉండొచ్చు కదా.? శాంతంగా మాట్లాడొచ్చు కదా.? ఇద్దరికిద్దరూ అట్లనే ఉండి జుట్లు పట్టుకుంటే కొట్లాటలు కాకుండా ఏమైతయి.?

జీరో టికెట్ ఎవరి కోసం.?

ఏ బస్సు చూసినా ఫుల్‌గా నిండిపోతుంది. జీరో టికెట్ వల్ల ఆడొళ్ల తాకిడి పెరిగి జెంట్స్ సీట్లు కూడా వాళ్లతోనే నిండిపోతున్నయి. పెట్టే పైసలు పెట్టి నిలబడి, ఒకరిమీద ఒకరు పడి ప్రయాణంజేసుడెందుకు.? అని మొగొళ్లు కొందరు ప్రైవేట్ వెహికిల్స్ మీద పోతుండ్రు. ఇంత టైట్ ఎందుకైతుంది.? అందరికీ అత్యవసర పనులున్నయా.? సీన్మలకు, షాపింగ్‌ల కోసం సొంత ట్రాన్స్‌పోర్ట్ ఫెసిలిటీ లేకుండనే ఉన్నరా.? ఇది నిజమైన అవసరాలున్న మహిళల సాధికారత కోసం తీస్కొచ్చిన పథకం. జీరో టికెట్ వల్ల ఆర్టీసీ మీద రోజూ దాదాపు రూ.5 కోట్ల భారం పడుతుంది. తక్కువలో తక్కువ తీసుకున్నా నెలకు రూ.150 కోట్లు పడుతుందని ఒక అంచనా. దానిని ప్రభుత్వం ఆర్టీసీకి రీయెంబర్స్ చేస్తుంది. అంటే అది వేరే రూపంలో మల్లా మనమీదనే వేస్తుంది.

ఎవరు భరించేది ఇది.?

ఫ్రీ బస్సు అనంగనే ఆర్టీసీ బస్సులకు ఆడొళ్ల తాకిడి త్రిబుల్ పెరిగింది. ఇండ్ల సీరియస్ ప్రయాణికులున్నరు. చీటికిమాటికి పోతున్నొళ్లు కూడా ఉన్నరు. ఇట్లా క్రమశిక్షణ లేకుండా కాలయాపన కోసం కూడా బస్సెక్కి ప్రయాణం చేయడం వల్ల మనకు తెల్వకుండనే మన మీద భారం పడుతుంది. డిసెంబర్ 2023 నుంచి నవంబర్ 2024 వరకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 6 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సులల్ల జీరో టికెట్ తీస్కొని ప్రయాణంజేశిండ్రు. రూ.223.59 కోట్ల ఖర్చు అది. అట్లనే వరంగల్ రీజియన్ల 7 కోట్లమంది ప్రయాణం జేస్తే రూ.334 కోట్ల ఖర్చయింది. అందరూ అట్లనే ఉండ్రని కాదు. కానీ కొందరైతే కార్లున్నా, ఖరీదైన వాహనాలున్నా బస్సు ఫ్రీ అనంగనే ట్రావెల్ జేస్తుండ్రు. ఈ భారాన్నంతా భరించేది మనమే కదా.?

ఉత్తగనే పోతే ఏమైతది.?

జీరో టికెట్ల వల్ల రోజు రోజుకూ పెరుగుతున్న భారాన్ని తగ్గించుకుంటందుకు ఆర్టీసీ ఏదో ప్లాన్ చేస్తది. మోఖాజూశి టికెట్ రేట్లు పెంచుతది. బస్‌పాస్‌ల రేట్లను కూడా పెంచుతది. జీరో టికెట్ అమల్లోకి వచ్చినంకనే ఆర్డినరీ బస్‌పాస్ ధర రూ.1,150 నుంచి రూ. 1,400కి, మెట్రో ఎక్స్‌ప్రెస్ రూ. 1,300 నుంచి రూ. 1,600కి పెంచింది. స్టూడెంట్లకు 5-35 కిలోమీటర్ల దూరానికి రూ.150 నుంచి రూ. 275 వరకు పెంచింది. అందరూ కట్టగట్టుకొని ఆర్టీసీ బస్సులల్లనే పోతం. మా కార్లను, బైక్లను ఇంట్ల దాచిపెట్టుకుంటం అనంటే ఇగో.. ఇట్లా ఆ రేటూ ఈ రేటూ పెరిగి తిరిగి తిరిగి కామన్‌మ్యాన్ జేబుకే చిల్లు పెడుతది. మేం ఒక్కరమే కదా.? మా ఒక్కరివల్లనే ఐతదా అనేవాళ్లూ ఉన్నారు. ఒక్కరు ఒక్కరు అనుకుంటెనే ఇక్కడిదాక వస్తుంది కథ.

ఎంత పెరుగుతున్నారు.?

మహాలక్ష్మి పథకం అమలైనంక ప్రయాణికుల సంఖ్య రోజుకు 45 లక్షల నుంచి 60 లక్షలకు పెరిగింది. వీరిలో మహిళలు ఎంతశాతం ఉంటరో అర్థం చేసుకోవచ్చు. అంత గణనీయంగా పెరిగిండ్రు అంటే ఆర్థిక భారం కూడా ఏ రేంజిలో ఉంటుందో అంచనా వేయొచ్చు. సరే, ఆడొళ్ల కోసం మంచి స్కీమే నడుస్తుంది అనుకుంటే.. బస్సుల సంఖ్య మాత్రం పెరుగుతలేదు. దీంతో రద్దీ సమస్యలు ఎక్కువైతున్నయి. 2024 మార్చిలో పల్లె వెలుగు బస్సుల సంఖ్య 3339 ఉండగా, అక్టోబర్ నాటికి 3224కి తగ్గింది. మంది పెరిగితే బస్సులు పెరగాలెగానీ, తగ్గితే ఎట్లా.? ఇగో.. పంచాయతీ అంతా ఇక్కడ్నే వస్తుంది. రద్దీ ఎక్కువై బస్సులో సీట్ల కోసం కొట్లాటలు ఎక్కువైతున్నయి. బస్సులు ఫుల్ అయి కొన్నిచోట్ల చెయ్యి పెట్టినా ఆపకుండ వెళ్తున్నయి.

వినోదం కోసమొద్దు

మంచి ఉద్దేశంతో ప్రారంభించిన మహాలక్ష్మి పథకాన్ని నీరుగార్చే ప్రయత్నం చేయొద్దంటే ముందు అనవసర ప్రయాణాలు ఆపేయాలె. ఫ్రీ బస్సు అనేది వినోద ప్రయాణాల కోసం కాదని తెలుసుకోవాలి. ఈ రెండు కారణాలు చాలు ఆర్టీసీ బస్సులల్ల విపరీతమైన రద్దీ పెరగనీకె. కొట్లాటలయ్యి, బస్సుల సంఖ్య తగ్గి మన మీద భారం పెరిగెటందుకు. ఎప్పుడైతే ఆర్టీసీ బస్సులో ఓవర్ క్రౌడింగైతుందో ఆటోమేటిగ్గా భద్రతా సమస్యలు కూడా పెరిగి జుట్లు, శిగలు పట్టుకునేలా చేస్తాయి. ఈ పథకం, ఈ జీరో టికెట్.. మీ ఆర్థిక ఆదా, ఉపాధి, విద్య అవకాశాలను పెంచేందుకు. సమాజంలో మీ ఉనికిని తెలిపేందుకు. కాబట్టీ అమ్మలక్కలకు ఎవరైనా ఆర్టీసీ బస్సులో పంచాయతీలు పెట్టుకోవడం కోసమే ఎక్కెటొళ్లుంటే జర దిగిపోండమ్మా.

ఏం మార్చుకోవాలి.?

ఆర్టీసీ బస్సును కూడా సామాజిక బాధ్యత కోణంలో చూడాలె. ఓవర్ క్రౌడింగ్ వల్ల అందరికీ అసౌకర్యం జరుగుతుంది కాబట్టీ అమ్మలక్కలు జర క్యూ మేనేజ్‌మెంట్ నేర్చుకోవాలి. సీట్ షేరింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. కొట్లాటలు అయ్యేది దీనివల్లనే కాబట్టీ బస్ ఎథికెట్‌ను అనుసరించాలె. ఫ్రీ బస్సే అయినా ముసలొళ్లకు, దివ్యాంగులకు సీట్లియ్యాలె. రష్ హవర్ల కాకుండా ఫ్రీ హవర్లో ట్రావెల్ చేయాలె. ఆనందం కోసం బస్సెక్కడు బంద్‌జేశి చదువు, ఉపాధి, ఉద్యోగం వంటి అవసరాలుంటెనే ఎక్కాలె. ఎకాయెకిన వెళ్లడం కాకుండా ప్రయాణాలను ముందుగాల్నే ప్లాన్ చేసుకుంటే బెటర్. స్థానిక కమ్యూనిటీ గ్రూపుల్లో బస్సుల రద్దీ గురించి చర్చించాలె. రద్దీ బస్సులల్లో స్వీయ భద్రత కోసం జాగ్రత్తలు తీసుకోవాలె.

సిబ్బంది ఏం చెయ్యాలె.?

అయ్యా.. ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్లూ. ఫ్రీ టికెటొళ్లు ఎక్కువెక్కుతుండ్రని గుస్సా ఐతున్రంటా.? ప్యాసింజర్ ఎక్కకున్నా జీరో టికెట్ తెంపి జేబులో వేసుకుంటున్రంటా.? ఇదేం నీతి.?. ఆ పథకమేమైనా మీరు తీసుకొచ్చిందా లేక మీ సొంత పైసలు పెట్టి నడిపిస్తున్నదా.? పబ్లిక్ సొమ్ముతో పబ్లిక్ కోసం నడుస్తున్న ట్రాన్స్‌పోర్ట్ వ్యవస్థ ఆర్టీసీ. చీటికీమాటికీ ప్రయాణికుల మీద చిరాకు పడొద్దు. ఆర్టీసీకి ప్రయాణికులే నిధి. మీది గవర్నమెంట్ ఉద్యోగం కాబట్టీ మిమ్మల్ని ప్రశ్నిస్తే కేసైతది. మరి, మీరు బాధ్యతగల పొజిషన్లో ఉన్నరు కదా.? మీరెట్లా ప్యాసింజర్ మీద చెయ్యి చేసుకుంటరు. అంటే కామన్‌మ్యాన్‌కు ఏ యూనియన్ లేదనే కదా మీ ఉద్దేశం. పబ్లిక్ పైసలతోని జీతాలు తీస్కొని పబ్లిక్‌నే కొట్టడం పద్ధతి కాదు. కొట్లాటలైతుంటే వీడియోలు తీసుడు బంద్‌జేశి వాళ్లను సముదాయించండి.

ఢిల్లీలో ఆడొళ్ల కోసం "పింక్ టికెట్ పాస్" పథకం తీస్కొచ్చిండ్రు. "ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్", "క్లస్టర్ బస్"లలో ఉచిత రవాణా అందిస్తోంది. ఈ పథకం వల్ల మహిళల బస్సు రైడర్‌షిప్ 33% నుంచి 44%కి పెరిగింది. 2024 నాటికి 100 కోట్ల పింక్ టికెట్లు జారీ అయినయి. మహిళలకు ఉచిత రవాణా వల్ల రద్దీ ఎక్కువగా పెరిగింది.

తమిళనాడులో 2021 నుంచి స్టేట్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ నిర్వహించే సాధారణ ఫేర్ సిటీ బస్సుల్లో మహిళలు, ట్రాన్స్ జెండర్ల, బాలికల కోసం ఉచిత రవాణా స్టార్ట్ చేసిండ్రు. ఈ పథకం వల్ల మహిళల బస్సు వినియోగం 40% నుంచి 61%కి పెరిగింది. ఇతర ప్రయాణీకులకు అసౌకర్యం కలుగుతోంది. కొన్నిసార్లు భద్రతా సమస్యలు కూడా వస్తు్న్నయి.

2021లో పంజాబ్ రోడ్ వేస్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్, పంజాబ్ రోడ్ వేస్ బస్సులు, స్థానిక సిటీ బస్సుల్లో మహిలకు ఉచితర రవాణా అందిస్తుండ్రు. సాధారణ బస్సులకు మాత్రమే ఈ సౌకర్యం ఉంది. ఏసీ, వోల్వో బస్సులకు ఈ అవకాశం లేదు. ఖర్చులు పెరిగినయి. అనవసర ప్రయాణాల కోసం బస్సులను వాడేవారు పెరిగారు. బస్సు సామర్థ్యంపై ఒత్తిడి పెరిగింది.

2023లో శక్తి పథకం ద్వారా కర్ణాటకలోని మహిళలు, ట్రాన్స్ జెండర్లకు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని కల్పించారు. ఈ పథకం కింద శక్తి స్మార్ట్ కార్డ్, రెసిడెన్స్ కార్డు ద్వారా ప్రయాణానికి అవకాశం కల్పిస్తారు. బస్సుల సంఖ్య, సర్వీస్ ఫ్రీక్వెన్సీ పెరిగినా డిమాండ్‌ను తీర్చలేకపోతుండ్రు. బస్టాపుల్లో ఎదురుచూసేవాళ్ల సంఖ్య పెరిగింది. బస్సులు కూడా ఆలస్యంగా వస్తున్నయి.

అందర్నీ సముదాయించాలె: బి. భిక్షపతి, ఆర్టీసీ కండక్టర్

ఆర్టీసీ బస్సెక్కి వినోదాలకు పోయేవాళ్లు కూడా ఉన్నరు. దీనివల్ల బస్సులల్ల రద్దీ పెరిగి చదువు, ఉద్యోగం కోసం ఆర్టీసీ బస్సు మీదనే ఆధారపడే మహిళలకు సీట్లు దొరక్క ఇబ్బంది పడుతుండ్రు. ఫలితంగా కొట్లాటలైతున్నయి. మేం ఒకదిక్కు టికెట్లు తీస్కోవాలె, ఇంకోదిక్కు వీళ్లను సముదాయించాలె. ఇట్లా ఎంతమందిని సముదాయిస్తం చెప్పుండ్రి.? ఒకొక్కసారి ఒత్తిడి ఎక్కువైతుంది వీళ్ల పంచాయతీల వల్ల.

మంచిదేగానీ: ఎం. భాగ్యలక్ష్మి, మహిళా ప్యాసింజర్

ఫ్రీ టికెట్ మాలాంటి వాళ్లకు మంచి అవకాశం. ఇంతకుముందే ఎక్కడికైనా పోవాలంటే నెలకు రూ.500-600 దాకా ఖర్చయ్యేది. ఇప్పుడు చాలామందికి ఆ పైసలు ఆదా ఐతున్నయి. కానీ కొందరు టైంపాస్ కోసం కూడా బస్సెక్కి అటూ ఇటూ తిరుగుతుండ్రు. దీనివల్ల చాలామందికి సీట్లు దొరుకుతలేవు. ఇంకా ఈ రద్దీతోని బస్టాండ్లల్ల దొంగతనాలు కూడా జరుగుతున్నయని అంటున్రు.

నిలబడే పోతున్నం: ఆర్. భాస్కర్ రెడ్డి, ఎలక్ట్రిషియన్

నేను రోజూ సికింద్రాబాద్ వరకు బస్సుల్నే వెళ్తుంటా. ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఎక్కితే ఇంచుమించు తార్నాక వరకు సీటే దొరకదు. రోజూ నిలబడే జర్నీ చేస్తు్న్నం. మా సీట్లల్ల కూడా లేడీసే కూసుంటుండ్రు. పాపం.. ఆ సీట్ల కోసం ఏమన్న కొట్లాటలా అవీ.? ఎన్కటికి బోరింగుల కాడ జుట్లు పట్టుకున్నట్టే ఉంది కథ. ఆర్టీసీ బస్సులల్ల అనవసర ప్రయాణాలు చేసెటొళ్లు ఒకసారి ఆలోచించుండ్రి.


Read More..

కలల సౌధానికి కళాత్మక రూపం..! స్మార్ట్ రూఫింగ్ టెక్నాలజీతో వెదర్ ఫ్రెండ్లీ డిజైన్

Next Story