- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
32 వేల ఏళ్ల తర్వాత పూసిన మంచుయుగం కాలంనాటి మొక్క
సైబీరియాలో ఓ అద్భుత దృశ్యం ఆవిష్కృతం అయ్యింది. 32 వేల ఏళ్ల కిందటి విత్తనాలు... ఇప్పుడు మళ్ళీ మొలకెత్తి, పుష్పించాయి.

దిశ, వెబ్ డెస్క్ : సైబీరియాలో ఓ అద్భుత దృశ్యం ఆవిష్కృతం అయ్యింది. 32 వేల ఏళ్ల కిందటి విత్తనాలు... ఇప్పుడు మళ్ళీ మొలకెత్తి, పుష్పించాయి. సైబీరియాలోని మంచుకింద దొరికిన 'సైలీన్ స్టెనోఫిల్లా' అనే మొక్క విత్తనాలను శాస్త్రవేత్తలు అనేక ప్రయోగాల అనంతరం మళ్ళీ మొలకెత్తేలా చేశారు. తాజాగా కొద్దిరోజుల క్రితం సైలీన్ మొక్క పువ్వులు కూడా పూసింది. జీవం, మొక్కల పుట్టుక, పరిణామంపై ఇదో గొప్ప ముందడుగుగా పరిశోధకులు, శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
2007లో రష్యా, హంగరీ, యునైటెడ్ స్టేట్స్‌కు చెందిన శాస్త్రవేత్తల బృందం ఈశాన్య సైబీరియాలోని కొలిమా నది ఒడ్డున ఉన్న దువన్నీయార్ ప్రాంతంలో 66–131 అడుగుల మంచుకింద పురాతన భూచర ఉడతల హైబర్నేషన్ బొరియలను కనుగొన్నారు. ఈ బొరియలు సుమారు -7°C (19°F) స్థిర ఉష్ణోగ్రత వద్ద గడ్డకట్టి పర్మాఫ్రాస్ట్ స్థితిలో 600,000 కంటే ఎక్కువ విత్తనాలు, పండ్లు లభించాయి. వీటిలో 'సైలీన్ స్టెనోఫిల్లా' అనే పుష్పించే మొక్క యొక్క విత్తనాలు కూడా ఉన్నాయి. ఈ మొక్క కారియోఫిల్లేసీ కుటుంబానికి చెందినది. రేడియోకార్బన్ డేటింగ్ ద్వారా ఈ విత్తనాలు, పండ్లు సుమారు 31,800 సంవత్సరాల నాటివని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. అంటే ఇది నవీన మంచుయుగానికి చెందినది కాలం.
ఆ సమయంలో భూమిపై వూలీ మామత్‌లు, బైసన్‌లు, ఇతర మెగాఫానా జంతువులు ఈ ప్రాంతంలో సంచరించాయి. మామత్‌లు, వూలీ రైనోసెరస్‌లు, బైసన్‌ల ఎముకలతో కూడిన పొరలలోనే ఈ బొరియలు కనుగొనబడ్డాయి. అయితే, ఒక ఆకస్మిక ప్రమాదం లేదా మంచుకొండలు విరిగిపడటం వల్ల ఈ బొరియలు మంచుకింద శాశ్వతంగా కప్పివేయబడ్డాయి. దీనివల్ల బొరియల్లోని విత్తనాలు, పండ్లు "సస్పెండెడ్ యానిమేషన్" స్థితిలో సంరక్షించబడ్డాయి. అంటే ప్రతికూల పరిస్థితుల్లో జీవక్రియలు అన్నీ నిద్రాణస్థితిలో ఉండి, అనుకూల పరిస్థితుల్లో మళ్ళీ తిరిగి యధాస్థితికి వస్తాయి.
ఆ తరువాత 2012లో రష్యన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సెల్ బయోఫిజిక్స్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజికోకెమికల్ అండ్ బయోలాజికల్ ప్రాబ్లెమ్స్ ఇన్ సాయిల్ సైన్స్‌లోని స్వెట్లానా యషినా, డేవిడ్ గిలిచిన్‌స్కీ నేతృత్వంలోని బృందం ఇప్పుడు మనం చెప్పుకుంటున్న అద్భుతాన్ని చేసి చూపించింది. ఈ పురాతన విత్తనాల నుండి 36 సంపూర్ణ, సంతానోత్పత్తి సామర్థ్యం కలిగిన మొక్కలను ప్రత్యేక పద్ధతుల్లో విజయవంతంగా పునరుజ్జివనం చేసింది.
కానీ సైలీనా విత్తనాలు మాత్రం ఆ బొరియలో లభించిన ఉడత కడుపులో నుంచి తీశారు. శాస్త్రవేత్తలు చెప్పిన దాని ప్రకారం.. ఆ ఉడత సైలీనా మొక్కలోని పుష్పాలను తిని, బొరియలోకి వచ్చిన వెంటనే ఏదోక భారీ ప్రమాదం జరిగి అది బొరియలోనే సమాధి కావడం వల్ల, దాని జీర్ణాశయంలో ఆ మొక్క, పుష్ప భాగాలు అలాగే మిగిలి ఉన్నాయి. బొరియలో దొరికిన విత్తనాలపై మాత్రమే ఫోకస్ చేసిన పరిశోధకులు... 30 వరకు విత్తనాలు ఫలితాలను ఇవ్వకపోవడంతో, ఉడత కడుపులో లభించిన విత్తనాలపై చేసిన పరిశోధనలు సక్సెస్ అయ్యాయి.
ఇన్ విట్రో కల్చర్: అపరిపక్వ పండ్లలోని ప్లాసెంటల్ టిష్యూను నియంత్రిత ప్రయోగశాలలో పోషకాలు, గ్రోత్ హార్మోన్లతో ద్వారా కణ విభజన, వేర్ల ఏర్పాటును ప్రేరేపించారు.
మొక్కల పెరుగుదల: వేర్లు ఏర్పడిన తర్వాత, మొక్కలను గ్రీన్‌హౌస్‌లో కుండీలలోకి మార్చారు. అక్కడ అవి పెరిగి, పుష్పించి, ఫలవంతమైన విత్తనాలను ఉత్పత్తి చేశాయి.
సంతానోత్పత్తి పరీక్ష: ల్యాబులో మొలకెత్తిన సైలీన్ స్టెనోఫిల్లా మొక్క నుంచి ఉత్పత్తి చేయబడిన విత్తనాలు 100% మొలకెత్తే రేటును కలిగి ఉన్నాయి.
అయితే గతంలోకూడా పురాతన విత్తనాలను మొలకెత్తించిన ఘటనలు కూడా ఉన్నాయి. ఇజ్రాయెల్‌లోని మసాదాలో 2,000 సంవత్సరాల నాటి జూడియన్ డేట్ పామ్ (ఫీనిక్స్ డాక్టిలిఫెరా) మొక్క విత్తనాలను కూడా ఇదేవిధముగా మొలకెత్తించినప్పటికీ.. సైలీనా మాత్రం 32 వేల ఏళ్ల కిందటి మొక్క అవడంతో పాత రికార్డులన్నీ బద్దలయ్యాయి. అయితే ఈ పరిశోధనలకు ఆద్యుడైన డేవిడ్ గిలిచిన్‌స్కీ మాత్రం ఈ విజయాన్ని చూడకుండానే కన్నుమూయడం కొద్దిగా విషాదం. ఆయన శిష్యులు డేవిడ్ గిలిచిన్‌స్కీ కు ఇచ్చే గ్రేట్ ట్రిబ్యూట్ ఇదేనేమో బహుశా.






