ప్రాణంపోయినా సరే ప్లాస్టిక్ కవర్లనైతే వదులుకోం.!

by Daayi Srishailam |

"కవర్ సంచి" మీద పానం గుంజుడేందో అర్థమే కాదు.!

ప్రాణంపోయినా సరే ప్లాస్టిక్ కవర్లనైతే వదులుకోం.!
X

మనకో అలవాటుంది.

బయటకెళ్తే చాలు..

అది ఏ పనైనా సరే..

చేతిలో "కవర్ సంచి" ఉండాలి.

"కవర్" లేకపోతే "షవరింగ్" ఐపోతం.

సామానేదైనా..

సరుకు ఎలాంటిదైనా..

"అన్నా.. కవరియ్యవా.?" అని అడుగుతాం.

అది సరిపోదన్నట్టు..

"భయ్యా ఔరేక్ కవర్ దో" అని ఎక్స్‌ట్రా కవర్ కూడా తీసుకుంటాం.

అదేందో ఛాయ్ మీద పానం గుంజినట్టు..

ఈ "కవర్ సంచి" మీద పానం గుంజుడేందో అర్థమే కాదు.!

- దాయి శ్రీశైలం

బాలనాగమ్మ కథలో మాయల ఫకీరు ప్రాణం మర్రిచెట్టు తొర్రలో ఉన్నట్టు.. మనుషుల ప్రాణం కవర్ సంచిలో ఉందేమో అనిపిస్తుంది. పుట్టినప్పటి నుంచి బారసాల.. పుట్టినరోజు.. పెండ్లి.. ఆఖరికి సచ్చిపోయిన్నాడు కూడ కవర్ సంచిలేనిదే పని జరగదు. "ఇందుగలదందు లేదని సందేహం వలదు ఎందెందు వెదికి చూసినా అందందే గలదు" ఈ ప్లాస్టిక్ కవర్ సంచి.

కవర్ లేనిదే నడవదు

"మానవా.. ఏమంటివేమంటివి. నేను లేకుండా నీ మనుగడ సాధ్యమంటివా.? నన్ను తాకకుండా బతికి బట్టకట్టగలుగుదువా.? ఎంతమాట ఎంతమాట.. ఎంత ధైర్యమెంత తెగింపు.. హిహ్హిహ్హీ.. నాతో పెట్టుకుంటివేమయ్యా" అని ప్లా్స్టిక్ తొడగొట్టి మీసం తిప్పి సవాలు చేస్తే మనిషి బతుకు మటాషే. ఔను మరీ. కవర్ సంచి లేకుండా మనిషి మనుగడ సాధ్యమేనా.? కూరగాయలకు ప్లాస్టిక్ సంచే కావాలి. బట్టలకదే కావాలి. పైసలకు ప్లాస్టిక్ సంచే కావాలి. ఫలానా పనికి కవర్ సంచి లేకుండా నడుస్తుందని ఒక్కటి చెప్పండి చూద్దాం. అసలు మనం ఇంట్లో నుంచి బయటకు వెళ్తే చాలు.. చేతికొక కవర్ సంచి తగిలించుకొని కనిపిస్తాం.

భయ్యా ఏక్ కవర్ దో

షాప్‌కు వెళ్తాం. పప్పులకు.. ఉప్పులకు అంటే ఎక్కువుంటాయి కదా అని మనం అడగకున్నా షాపతను కవర్ ఇస్తాడు. అయినా సరే "సేటూ ఇంకో కవరియ్యి" అని అడుగుతాం. బట్టల షాపింగ్‌కు వెళ్లినప్పుడైతే ఇంకా గమ్మతుంటది. ఒకటి కంటే ఎక్కువ ఐటమ్స్ తీసుకుంటే వాళ్లు బ్యాగు ఇస్తారు. అంతమంచి బ్యాగిచ్చినా మన ధ్యాస మాత్రం కవర్ మీదనే. "అబ్బా కవర్ ఇయ్యకపాయె" అనిపిస్తుంటది. మనసులో రపరప ఉంటే ఊకునే మనుషులమేనా మనం. కచ్చితంగా సాధించుకుంటాం. "భయ్యా ఏక్ కవర్ దో" అని అడుగుతాం. షాపతను పైనుంచి కిందిదాక చూసినా లైట్ తీసుకొని కవర్ సంచి సాధిస్తాం.

ఏం చేస్కుంటరబ్బా.?

మనొళ్లు ఏందంటే "కొత్తిమీర కట్ట"కు పోయినా.. "ఏం అక్కా కవరియ్యకపోతివి" అని అడుగుతారు. "గా ఒక్క కట్టకు కవరెందుకయ్యా" అని అడిగినా "నువ్వయితే ఇయ్యరాదక్కా" అని తీసుకుంటారు. దాంతో ఏమైనా చేస్తరా అంటే అదీ ఉండదు. పైసలుగూడ పోపు డబ్బాల్లో.. మెత్తలల్లో.. బొంతలల్లో దాచుకున్నట్లు ఈ కవర్లనుగూడ దాస్తరు. బెడ్రూం.. బాత్రూం.. సెల్ఫులు.. అల్మారాలు.. ఇట్లా ఎక్కడ వెతికినా కవర్లే కనిపిస్తాయి. అవసరం లేకున్నా తీసుకొచ్చుకొని ఇట్లా ఇల్లంతా జమజేస్తారన్నమాట. కుప్పలు తెప్పలు జమ చేసుకున్న ఈ కవర్లతో ఏం చేస్తారో వాళ్లకే క్లారిటీ ఉండదు.

పారేస్తే ప్రాణం పోతది

బయట "చెత్త బండి మీ ఇంటి ముందుకు వచ్చింది రండమ్మా రండీ" అనే సౌండ్ వినిపిస్తుంది. ఈ కవర్లతోని చిరాకొచ్చి "వీటిని ఆ చెత్త బండ్లో వేసేస్తా" అని పుసుక్కున ఎవరైనా అంటే ఇగ ఖతం. శివసత్తులు గూడ పూనకమొచ్చి ఊగినట్లే ఊగుతరు. "ఏం కవర్లివి పారేస్తా" అని అంటే ప్రాణం పోయినట్లు ఫీలైతరు. పుట్టింటి ఆస్తిలెక్క ఒకదానిపై ఒకటి పేర్చి భవిష్యత్ తరాలకు సంపదగా అందించేటట్లు దాచిపెడతారు. ఏదో చదువుకోనివాళ్లు.. గ్రామీణ ప్రాంత ప్రజలంటే ఏమో అనుకోవచ్చు. చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నవారు కూడా ఈ ప్లాస్టిక్ కవర్లను చూడగానే టెంప్ట్ అయిపోతారెందుకో.?

వాడొద్దంటే వినరు

ప్లాస్టిక్ కవర్లు వాడొద్దంటే ఎవరూ వినరు. "నీకేందయ్యా మస్తుగ చెప్తవు.. కవర్లు లేకుండా ఎట్ల నడుస్తది. ఇప్పటికిప్పుడు వాననే వచ్చిందనుకో నీ ఫోన్.. పర్సు తడవకుండా కవర్లనే పెడ్తవు కదా" అని రూల్స్ మాట్లాడుతారు. ప్లాస్టిక్ కవర్లు వాడితే పర్యావరణం పాడవుతుంది.. ఆరోగ్యాలు దెబ్బతింటాయి అని తెలిసినా.. వాటిని వాడటం మాత్రం వదలరు. కవర్ సంచులతో వీళ్లకు ఏ జన్మల బంధమోగానీ.. అవి లేకుండా ఏ పనీ కాదు. అదేమైనా బంగారమా.? రేపటి భవిష్యత్‌కు అక్కెరకొచ్చే ఆస్తి పత్రమా.? అర్థమే కాదు. ఫ్రిజ్జులు ఓపెన్ చేసి చూస్తే వాటిలో సమాన్లకంటే ఎక్కువ కవర్లే కనిపిస్తాయి.

కవర్ల చాటున నష్టం

ప్లాస్టిక్ కవర్లు బయోడిగ్రేడబుల్ కాదు. అంటే ఇవి సహజంగా కుళ్లిపోవు. భూమిలో.. నీళ్లలో కలిసిపోయి కాలుష్యం చేస్తాయి. మనం రోడ్లమీద చూస్తుంటాం. పక్షులు.. ఆవులు.. బర్రెలు కవర్లను తింటుంటాయి. అవి అలా తినడం వల్ల జీర్ణ సమస్యలు వచ్చి ఎక్కువకాలం బతకవు. కాలువలు.. డ్రైనేజీలల్లో చేరి నీళ్లకు అడ్డం తలుగుతాయి. కవర్లలో ఫుడ్ ప్యాక్ చేయడం వల్ల బిస్పెనాల్ వంటి రసాయనాలు ఆహారంలో కలసి అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. కవర్లు వాడొద్దు.. వాటికి బదులుగా కాగితం.. బయోడిగ్రేడబుల్ పదార్థాలను వాడటం మంచిదని తెలుసుకుంటే మంచిది.

క్యాన్సర్ కారకం

ప్లాస్టిక్ కవరే కదా అని లైట్ తీసుకుంటాం. కానీ కవర్లలో ఉండే రసాయనాలు శరీరంలోకి చేరితే హార్మో్న్లు అసమతుల్యమై పునరుత్పత్తి.. థైరాయిడ్.. ఊబకాయం వంటి సమస్యలను ప్రేరేపిస్తాయి. ప్లాస్టిక్‌లో ఉండే స్టైరీన్.. వినైల్ క్లోరైడ్ వంటి రసాయనాలు క్యాన్సర్‌ను కలిగిస్తాయి. దీర్ఘకాలికంగా ఈ రసాయనాల ప్రభావం ఉంటే రొమ్ము క్యాన్సర్.. కాలేయ క్యాన్సర్ వచ్చే ప్రమాదముంది. ప్లాస్టిక్ మైక్రో పార్టికల్స్ శరీరంలోకి చేరితో అవి పేగులకు వెళ్లి జీర్ణ సమస్యలు వస్తాయి. కవర్లలోని రసాయనాలు గర్భిణీ స్త్రీల ద్వారా పిండంలోకి చేరితే పిల్లల్లో అభివృద్ధి లోపాలు.. మెదడు పనితీరు సమస్యలు వస్తాయి.

కవర్ల నిషేధం

ప్రపంచవ్యాప్తంగా 90కి పైగా దేశాలు ప్లాస్టిక్ కవర్లపై ఏదో ఒక రూపంలో ఆంక్షలు విధించాయి. కానీ పూర్తి నిషేధం అమలు చేసే దేశాల సంఖ్య చాలా తక్కువ. సాధారణంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లు.. స్ట్రాలు.. ఇతర వస్తువులపై ఆంక్షలు అమలవుతున్నాయి. రువాండాలో 2008 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లపై పూర్తి నిషేధం ఉంది. కెన్యాలో 2017 నుంచి ప్లాస్టిక్ కవర్లపై నిషేధం ఉంది. దీన్ని ఉల్లంఘిస్తే జైలు శిక్షతో పాటు జరిమాన విధిస్తారు. బంగ్లాదేశ్‌లో 2002 నుంచి.. ఫ్రాన్స్‌లో 2016 నుంచి.. కెనడాలో 2022 నుంచి.. న్యూజీలాండ్‌లో 2019 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం ఉంది.

ఇండియాలో..

👉 కేంద్ర ప్రభుత్వం 2022లో "ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్‌మెంట్ రూల్" కింద సింగిల్ యూజ ప్లాస్టిక్ నిషేధం విధించింది.

👉 2022 జూలై నుంచి 19 రకాల సింగిల్ యూజ్ కవర్లపై నిషేధం అమలవుతోంది.

👉 మహారాష్ట్ర 2018లో సింగిల్ యూజ్ కవర్లు.. డిస్పోజల్ కప్పులపై నిషేధం విధించింది.

👉 తమిళనాడు 2019 జనవరి 1 నుంచి సింగిల్ యూజ్ కవర్లు.. స్ట్రాలు.. థర్మకోల్ వస్తువులపై నిషేధం విధించింది.

👉 హిమాచల్ ప్రదేశ్ 2011లో 50 మైక్రాన్ల కంటే తక్కువ మందమున్న కవర్లను నిషేధించింది.

👉 కర్ణాటక 2016లో.. ఢిల్లీ 2022లో.. సింగిల్ యూజ్ కవర్లను బ్యాన్ చేసింది.

👉 సిక్కిం 1998లోనే వీటిని నిషేధించింది.

👉 తెలంగాణ.. ఆంధ్రప్రదేశ్‌లో 2022 సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం అమల్లో ఉంది.

ఐక్యరాజ్య సమితి నివేదిక

✋యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ప్రకారం ప్రతి సంవత్సరం సుమారు 300 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి.

✋వీటిలో కేవలం 9% మాత్రమే రీసైక్లింగ్ అవుతున్నాయి.

✋ప్రతి సంవత్సరం 8-13 టన్నుల ప్లాస్టిక్ సముద్రంలో చేరుతుంది. 2050 నాటికి చేపలకంటే ఇదే ఎక్కువగా ఉంటుంది.

✋బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్ నినాదంతో ప్లాస్టిక్ కవర్లను అరికట్టేందుకు 2018లో ఒక ప్రచారం ప్రారంభమైంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం..

👉 2019లో ప్రపంచ ఆరోగ్య సంస్థ "మైక్రో ప్లాస్టిక్స్ ఇన్ డ్రింకింగ్ వాటర్"పై నివేదిక విడుదల చేసింది. తాగునీటిలో మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నట్లు గుర్తించింది.

👉 ప్లాస్టిక్ కవర్లలో బీపీఏ.. ఫ్తాలేట్స్.. లీడ్ వంటి రసాయనాలు హార్మోన్ వ్యవస్థను దెబ్బతీస్తాయి.

👉 ప్లాస్టిక్ కవర్లను కాల్చడం వల్ల వచ్చే డయాక్సిన్స్ వల్ల శ్వాసకోశ వ్యాధులు.. క్యాన్సర్ వస్తాయి.

👉 మైక్రో ప్లాస్టిక్స్.. రసాయనాలపై కచ్చితమైన ముగింపు రాలేదు. వీటిపై పరిశోధన ఇంకా జరగాలి.

లెక్కలేం చెప్తున్నాయి.?

👉 సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లెక్కల ప్రకారం.. ఇండియాలో సంవత్సరానికి 18-20 టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తి అవుతుంది.

👉 ఇది ప్రపంచ ప్లాస్టిక్ ఉత్పత్తిలో సుమారు 6-7% వాటాను కలిగి ఉంది.

👉 దేశంలో ఉత్పత్తి అయ్యే ప్లాస్టిక్‌లో దాదాపు 50-60% కవర్లు.. స్ట్రాలే.

👉 ఇది సుమారు 9-10 మిలియన్ టన్నులకు సమానం.

👉 ఒక వ్యక్తి సంవత్సరానికి సగటున 11-15 కిలోల ప్లాస్టిక్ వాడుతున్నాడు.

👉 ఇది అమెరికాలో 130 కిలోలు.. యూరప్‌లో 100 కిలోలుగా ఉంది.

👉 పట్టణ ప్రాంతాల్లో కవర్ల వాడకం గ్రామీణ ప్రాంతాల కంటే 3-4 రెట్లు ఎక్కువ.

మన ఆరోగ్యం కోసం: శేఖర్ మల్యాల, కాంట్రాక్టర్


ప్లాస్టిక్ కవర్లు వాడొద్దనేది నా అభిప్రాయం. రోడ్లమీద.. కాలువల్లో ఎక్కడ పడితే అక్కడ కవర్లు కనిపిస్తుంటాయి. వాటికి బదులు గుడ్డ సంచులు వాడటం మంచిది. అవి కొంచెం ఖర్చు అయినా.. మన ఆరోగ్యం.. పర్యావరణం రోసం తప్పదు. ప్రభుత్వం కూడా అందరికీ అవగాహన కల్పించి ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తొలగించాలి.


చూపిస్తే మానేస్తాం: మాయిని రమేశ్, స్టోర్ నిర్వహకుడు


కస్టమర్లు ఎందుకోగానీ కవర్లనే ఇష్టపడతారు. అవసరం లేకున్నా ఇంకొకటి అని అడిగి మరీ తీసుకుంటారు. ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి హాని జరుగుతుందని తెలుసు. కానీ జనాలు మాత్రం ఇవే ఇష్టపడుతున్నారు. మేమైతే నాణ్యమైనవే వాడుతున్నాం. శాశ్వత ప్రత్యామ్నాయాలు చూపిస్తే ఇవికూడా మానేస్తాం.


అమలు చేస్తున్నాం: రవీందర్ సాగర్, మున్సిపల్ కమిషనర్


2022లో కేంద్రం తీసుకొచ్చిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధాన్ని కచ్చితంగా అమలు చేస్తున్నాం. జనాలేమో మార్కెట్లలో ఈజీగా దొరుకుతాయని ప్లాస్టిక్ కవర్లను వాడుతున్నారు. వాటి విచ్చలవిడి వాడకం వల్ల డ్రైనేజీలు మూసుకుపోవడం వంటి సమస్యలొస్తుంటాయి. చెత్త సేకరణలో 50% ప్లాస్టిక్ వ్యర్థాలే. అయినప్పటికీ రీసైక్లింగ్.. అవగాహన కార్యక్రమాల ద్వారా మార్పు దిశగా ముందుకు వెళ్తున్నాం.

Next Story