- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రాణమున్న మనిషికన్నా.. ప్రాణంలేని వస్తువే ముఖ్యం.!
ఇది టెక్నాలజీ తెచ్చిన మార్పా.? మన స్వయం కృతాపరాధమా.?

దిశ, ఫీచర్స్: వాహనం కొనుక్కొని శ్రద్ధగా ఇన్సూరెన్స్ చేయిస్తారు. ఆ వాహనాన్ని నడిపేవాళ్లకు ఎందుకులే అనుకుంటారు. నాన్న ఐసీయూలో ప్రాణాపాయ స్థితిలో ఉంటాడు. కొడుకు మాత్రం బయట ఫోన్లో చాటింగ్‌లో మునిగిపోయి ముసిముసి నవ్వులు నవ్వుతుంటాడు. రిమోట్ కంట్రోలర్ పగలగొట్టాడని కొడుకు చెంప పలగ్గొడతాడొక నాన్న. సిమ్‌కార్డ్ తీశాడన్న కోపంతో తండ్రిని చితకబాదుతాడొక కొడుకు. ఇలా..ప్రాణంలేని వస్తువుకిస్తున్న ప్రాధాన్యత.. ప్రాణమున్న మనిషికివ్వడం లేదు మనం. ఇది టెక్నాలజీ తెచ్చిన మార్పా.? మన స్వయం కృతాపరాధమా.?
దున్నపోతు మీద వానపడ్డట్టే..
10 లక్షలు పెట్టి కారు కొంటం. అదనంగా 20వేలు పెట్టి ఇన్సూరెన్స్ చేపిస్తం. నెలకో.. రెండు నెల్లకోసారి యాది మర్వకుండా సర్వీసింగ్ చేపిస్తం. అప్పుడప్పుడు కండీషన్ చెక్ చేస్తం. వెహికిల్ ఇన్సూరెన్స్.. కండీషన్ గురించి అంత కేర్ తీసుకుంటున్న మనం.. దానిని నడిపే.. లేదా ప్రయాణించే మన భద్రత గురించి అంత సీరియస్‌గా ఆలోచిస్తమా.? మన బాడీ కండీషన్ గురించి.. ప్రాణాల గురించి అంత శ్రద్ధ చూపిస్తమా.? బండి కొనేటప్పుడే థర్డ్ పార్టీ.. ఆపార్టీ.. ఈపార్టీ ఇన్సూరెన్స్ అని పట్టిపట్టి తెలుసుకుంటం. గుచ్చిగుచ్చి అడిగి డౌట్ క్లియర్ చేసుకుంటం. యేడాది ప్రీమియం చెల్లింపులను ఆటో డెబిట్ పెట్టి క్లియర్ చేసుకుంటం. అదే లైఫ్ ఇన్సూరెన్స్ గానీ.. హెల్త్ ఇన్సూరెన్స్ గానీ.. డ్యూడేట్ సమీపిస్తుందని ఎన్ని రిమైండర్లు వచ్చినా దున్నపోతు మీద వానపడ్డట్టు పట్టించుకోం.
వేరేవాళ్లు అడిగి అలసిపోవాల్నా.?
మన పాలసీ రెన్యువల్ టైం అవుతుందని వేరేవాళ్లే గుర్తుచేయాలె. మన గడువు ముగుస్తుందని వేరేవాళ్లే వెంటపడాలె. పాలసీ మనదైనప్పుడు.. చెల్లించేది మనదైనప్పుడు గుర్తుండాల్సింది మనకు కదా.? మనకు మన ప్రాణమ్మీద సోయి లేనప్పుడు ఇక జీవితానికి అర్థమేముంది.? అంతా బయటివాళ్లే గుర్తుచేసి.. బతిమిలాడే పరిస్థితి వచ్చినప్పుడు ఇక మనమెందుకు.? ఏజెంట్ ఎంత మొత్తుకున్నా వినిపించుకోనంత.. బిజీగా ఉండేవాళ్లకు వాస్తవానికి ఏ పాలసీలు అవసరం లేదు. ఏ ఇన్సూరెన్సులు అవసరం లేదు. మన గురించి వేరేవాళ్లు అడిగి అడిగి అలసిపోయే పరిస్థితేంది విచిత్రంగా.? మన ప్రాణమ్మీద మనగ్గాకుండా వేరొకొరికి సోయుండాల్నా.? మన భవిష్యత్‌పై మనగ్గాకుండా వేరొకరికి బాధ్యతుండాల్నా.? ఇంతకూ అవసరం మనకా..? వేరేవాళ్లకా.??
సౌకర్యాలా.? సక్రమ ఆరోగ్యమా.?
ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మించిందేముంది.? ఏ వాతావరణ మార్పువల్లనో చిన్నపాటి సర్ది అయితే హాస్పిటల్స్ ఏంచేస్తాయో మనకు తెలిసిందే. ఒకటికి పది చెప్పి జేబుకు చిల్లు పెట్టి పంపిస్తరు. ఏమో చెప్పలేం.. మన ఆరోగ్యానికే ఏమైనా కావచ్చు. లేదా పిల్లలకు ఇంకేదైనా సమస్య రావచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కార్పొరేట్ హాస్పిటల్స్‌లో ట్రీట్మెంట్ ఇప్పించే పరిస్థితి ఉందా.? "హెల్త్ ఇన్సూరెన్స్" వంటివి ఉన్నయే వీటికోసం. కానీ మనం అవన్నీ పట్టించుకోం. పనికిరాని వస్తువులను కొనడానికి మాత్రం వేలకు వేలు ఖర్చు చేస్తం. వస్తువు ఈఎంఐ.. హెల్త్ ఇన్సూరెన్స్ రెన్యువల్ రెండూ ఒకేసారి డ్యూడేట్ ఉంటే.. మనం కండ్ల మూసుకొని వస్తువు ఈఎంఐనే చెల్లిస్తం. సౌకర్యాలు కావాల్నా.. సక్రమమైన ఆరోగ్యం కావాల్నా దీన్నిబట్టే ఉంటుంది.
గుడిసె కూలినా పట్టింపులేదా.?
మనిషి వస్తువు వెంట పరుగులు తీస్తుండు. ఆరోగ్యాన్ని.. ప్రాణాన్ని అస్సలు లెక్కనే చేస్తలేం. వస్తువును చూసుకొని మురిసిపోతున్నం. మంచి కారుంది. పెద్ద ఇల్లుంది అని మాత్రమే ఆలోచిస్తుంటం. కానీ.. ప్రాణమనే గుడిసెకు ఆరోగ్యమనే కప్పు సరిగాలేక కూలిపోతుందని అర్థమైనా లైట్ తీసుకుంటం. వస్తువుకేదైనా డ్యామేజీ అయితే.. "అయ్యో" అని మొత్తుకుంటం. "లచ్చలు పెట్టి కొన్నయ్యా" అని లబోదిబోమంటాం. "పిల్లల్ని చూసుకున్నట్లు చూసుకున్నా" అని అల్లాడిపోతం. అసలు ఎవరు చూసుకోమన్నరు పిల్లలతో సమానంగా వస్తువులను.? మనం పిల్లల్ని కన్నామా.? వస్తువుల్నా.? కొడుక్కి ఒళ్లంతా గాయాలైనా ఏంకాదుగానీ.. కారుకు గీతపడితే మాత్రం కంటికి నిద్రుండదు. కడుపుకు తిండి ఉండదు. కడిగిందే కడిగి.. రుద్దిందే రుద్దీ వస్తువుతో సహజీవనం చేస్తుంటాం.
ప్రాణం ఉత్తగనే వచ్చిందా.?
మనిషికి.. వస్తువుకు తేడాలేని రోజు మనిషి ఆ వస్తువు కింద పడి సచ్చిపోతడు. ప్రేమించాల్సిన మనుషుల్ని వాడుకొని.. వాడుకోవాల్సిన వస్తువుల్ని ప్రేమిస్తే ఇదేకదా జరిగేది.? ఏంద.. ప్రాణమేమన్నా ఉత్తగనే వచ్చిందా.? రెండువేల రూపాయలు ఖర్చుచేసి కొనుకున్న జత బట్టలను ఎంత ప్రేమగా.. భద్రంగా చూసుకుంటున్నమో.. అంతే ప్రేమ.. భద్రత ప్రాణమ్మీద ఎందుకు చూపిస్తలేం. అంటే.. బట్టలు పైసలు పెడితే వచ్చినయి కాబట్టీ దానికి విలువెక్కువన్నట్లా.? వస్తువును వస్తువుగా కాకుండా.. అతిగా ప్రేమిస్తే రాన్రాను చెప్పులకిచ్చే వాల్యూ కూడా ప్రాణాలకు ఇవ్వరు ఈ జనాలు. మనిషికి విలువ ఎట్లొస్తుంది.? మనం వేసుకునే బట్టల్ని చూసా..? లేక మనం లక్ష రూపాయలు ఖర్చుచేసి కొనుక్కున్న ఐఫోన్‌ను చూసా.?
ఫోనే కాబట్టి మళ్లీ కొనుక్కోవచ్చు..
తెగిపోయేటప్పుడే దారం బలం తెలుస్తుంది. వెళ్లిపోయేటప్పుడే బంధం విలువ తెలుస్తుంది. ఇరవై వేల రూపాయలు పెట్టిన ఫోన్ చంటోడి చేతిలో ముక్కలైతే వాడిని లాగి లెంపకాయ ఇస్తే పగిలిన మీ ఫోన్ అతుక్కుంటుందా? అది ఆఫ్టరాల్ ఫోనే కాబట్టి మళ్లీ కొనుక్కోవచ్చు. అనుకుంటే అప్పటికప్పుడు బుక్ చేసుకోవచ్చు. కానీ ఎమోషన్‌ను అట్ల ఆన్‌లైన్లో బుక్ చేసుకోగలుగుతమా.? "మా నాన్న మళ్లీ పుట్టాడు" అని పదేపదే చెప్తుంటే అది విన్న ఆ చిన్నోడు ఫోన్‌లో ఉన్న తన తాత ఫొటోను చూసే క్రమంలో అది జారి కిందపడిందనే విషయం ఆలస్యంగా తెలుసుకున్నప్పటికీ వాడిని కొట్టిన దెబ్బను వెనక్కి తీసుకోవడానికి కూడా అవకాశం లేదు. మరి.. ఇలా ఎంతమంది ఆలోచిస్తున్నారు.? "పోతే పోనీలేరా.. జాగ్రత్తగా పట్టుకోవాలి కదా.?" అని ఎంతమంది ట్రీట్ చేస్తున్నారు.?
డబ్బు కాదు.. పలకరింపు..
చిన్నారి పాపాయి పాలకోసం ఏడుస్తుంటది. అమ్మ వస్తుందేమో అనే ఆశ తనది. అందుకే ఏడుపు తీవ్రతను పెంచుతుంది. అమ్మ నిజంగానే ఆదరాబాదరగా వస్తుంది. అమ్మొస్తుందని పాప మురిసిపోతుంది. కానీ అమ్మేం చేస్తుంది లాలిపాటకు బదులు ఆన్‌లైన్లో జోలపాట పెట్టేసి వెళ్లిపోతుంది. ఇక్కడ విలువ దేనికి ఇస్తున్నాం.? వస్తువుకే కదా.? అది గ్రహించక ఎన్ని బుజ్జగింపులు చేసినా ఫాయిదా ఏమీ ఉండదు. అది తెలియకపోతే ఐసీయూలో కొన ఊపిరితో ఉన్న నాన్నకు ట్రీట్‌మెంట్ కోసం లక్ష రూపాయలు పంపినా ప్రయోజనం ఉండదు. ఆయనకు కావాల్సింది డబ్బులు కాదు.. నాన్నా అనే ఓ పలకరింపు. కాసేపట్లో నిర్జీవమయ్యే ఆయన దేహానికి కన్నకొడుకు స్పర్శ చివరి కోరికగా కావాలి.
ఇంటర్నెట్‌లో దొరికే వస్తువా అది.?
అక్క తన తమ్ముడి కోసం వాకిట్లో కూర్చుని రాఖీలు కట్టేందుకు ఎదురు చూసేది తమ్ముడిచ్చే కానుక కోసం కాదు. అతడు ఇచ్చే ఖరీదైన వస్తువు కోసం కాదు. యేడాదికోసారి అయినా "అక్కా బాగున్నావే" అంటూ ప్రేమగా పిలిచే ఆ పిలుపు కోసం. ఇది తెలుసుకోనంత కాలం వస్తువులపై వల్లమాలిన ప్రేమ కనబరుస్తూ మానవ సంబంధాలను నిర్లక్ష్యం చేస్తూనే ఉంటాం. నేర్చుకోవడానికి అది చదువు కాదు. కంప్యూటర్‌లోనో.. స్మార్ట్‌ఫోన్‌లోనో.. లక్షలు పెట్టి కొన్న కారులోనో ఉండేది అస్సలు కాదు. నిజమైన ఎమోషన్.. విలువ మనుషుల మధ్యనే ఉంటది. అది ఇంటర్నెట్‌లో దొరకదు. అంగట్లో అమ్ముడుపోదు. మన గురించీ కాకుండా.. మనవాళ్ల గురించీ కాకుండా.. ఆరోగ్యం గురించీ కాకుండా వస్తువులపై ఉండే ప్రేమ అసలు ప్రేమే కాదు.
ఈ కానుకలు ఎవరిస్తున్నారు.?
ప్రశాంతమైన జీవితం కోసం హ్యూమన్ రిలేషన్‌షిప్‌ని వదిలేసి మెటీరియలైజ్డ్ రిలేషన్‌షిప్‌కి అలవాటు పడటంతో వస్తు మోజు జనాల్లో ఎక్కువైతుంది. వస్తువులు కొనడంలో వాటిని ఉపయోగించడంలో ఉండే హడావిడి తల్లిదండ్రులపై.. కుటుంబ సభ్యులపై.. ఆరోగ్యంపై.. జీవిత భద్రతపై కనబర్చడంలో మనం ఆసక్తి చూపిస్తలేం. పేరెంట్స్ కూడా చిన్నప్పట్నుంచే మీకు ఇదిచ్చాం.. అదిచ్చాం అని పిల్లల్ని ట్రీట్ చేయడంతో వాళ్లు వస్తువుకే ప్రయారిటీ ఇస్తు్న్నారు. లక్షలు ఖర్చుపెట్టి ఫోన్లు ఇప్పించడం. బర్త్ డే కానుకగా కార్లు ఇవ్వడం వంటివి నేర్పిస్తున్నాం కానీ.. "మంచి జీవనశైలి ఏర్పరచుకోండ్రి.. ఆరోగ్యా్న్ని కాపాడుకోండ్రి.. ఆహార భద్రత.. ఆరోగ్య భద్రతే మీ పుట్టినరోజు కానుక" అని ఎంతమంది చెప్తు్న్నారు.?
సేఫ్టీగార్డ్ సరే.. లైఫ్ సేఫ్టీ ఏది.?
డబ్బు.. వస్తువుల గురించి అస్సలు ఆలోచించకుండా విలువలే ఆస్తిగా బతికే రోజులున్నయా? వస్తువు కొనడం కోసం డే అండ్ నైట్ కష్టపడి వ్యక్తుల్ని పట్టించుకోకుండా.. విలువలు పోగొట్టుకుని ఎంత సంపాదిస్తే అది ఎందుకు.? జీవితంలో అవసరాలు ఒక భాగం మాత్రమే. అవసరాలు తీర్చడానికో లేదా తీర్చుకోవడానికో మనం మనుషులం అనే విషయమే మర్చిపోతే అసలీ జీవితానికి అర్థమేముంటది.? మనం ఏది చేసినా మూలాల్లోంచి ఆలోచించాలె. పిల్లలకు చిన్నప్పుడే డిసిప్లేన్.. వాల్యూ బేస్డ్ స్టడీస్ అలవరిస్తే విలువల గురించి తెలుస్తుంది. లేకపోతే వాళ్లుకూడా మనలాగే "నాకు ఖరీదైన కారుంది.. అందమైన ఇల్లుంది.. ఐఫోనుంది.. దానికి సేఫ్టీగార్డ్ ఉంది.. ఇన్సూరెన్స్ ఉంది" అని మాత్రమే చెప్తరు.. లైఫ్ సేఫ్టీ గురించి ఆలోచనే ఉండదు.
మోడల్ మారిపాయె.. మోజు తగ్గిపాయె..
వాస్తవానికి.. వస్తువులపై కూడా పూర్తి ప్రేమల్లేవు ఎవరికీ. ఒక కారు కొన్నాక.. కొద్దిరోజుల తర్వాత మార్కెట్లోకి మరో కొత్త కారు వస్తుంది. ఒక మొబైల్ తీసుకున్నంక కొద్దిరోజులకు ఇంకో మోడల్ మార్కెట్లోకి వస్తుంది. మోడల్ మారిన ప్రతీసారి.. కొత్తది కొనుక్కున్న ప్రతీసారి మనం దానికి సమయం.. డబ్బు పెడతాం. మునుపటి వస్తువుకంటే తాజా వస్తువు మీద మోజు కనబరుస్తం. అందుకే రోజురోజుకూ మన బతుకుల గురించి కాకుండా.. మన భద్రత గురించి కాకుండా వస్తు భద్రత గురించి ఎక్కువ ఆలోచిస్తున్నం. కృత్రిమ అవసరాల వెంట పయనించకుండా సహజమైన జీవితం వెంట పయనిస్తూ మానవ సంబంధాల్ని బలపరిస్తే మన బతుక్కి విలువ.. అర్థం ఉంటది.
మన తప్పును టెక్నాలజీపై రుద్దుతారా.?
కమ్యూనికేషన్ రోజురోజుకూ డెవలప్ అవుతోంది. అమెరికాలో ఉన్నొళ్లు సైతం రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటున్నారు. కానీ పక్కింటొళ్లతో పలుకు మాత్రం కష్టమవుతోంది. ట్యాబ్‌లతో.. ఫోన్‌లతోనే సహజీవనం చేస్తున్నారు. టెక్నాలజీయే మనుషుల మధ్య బంధాన్ని డిస్టర్బ్ చేస్తుందా అంటే ఎంత టెక్నాలజీ అడ్డొచ్చినా దానిని అదుపులో పెట్టుకునే బాధ్యత.. సోయి మనకు ఉండాలి. తప్పు మనది పెట్టుకుని టెక్నాలజీని అంటే ఏం ఫాయిదా.? కాకపోతే రోజురోజుకూ విస్తరిస్తున్న టెక్నాలజీ కారణంగా వస్తుప్రేమికులైన ఈ జనాలను ఎంతో కొంత అయితే అది డిస్టర్బ్ చేస్తుంది. ఈ డిస్టర్బెన్స్ వల్ల మనుషులు మనుషులతో కాకుండా వస్తువులతో ఎక్కువ స్పెండ్ చేస్తు్న్నారు. హ్యుమన్ లైఫ్‌ను కాస్త మెటీరియలైజ్డ్ చేస్తూ ఒరిజినాలిటీ లేకుండా బతుకుతున్నారు.
ఎక్కడికీ ఈ పరుగు: ప్రవీణ్ రెడ్డి, నల్లగొండ
మనిషి నేడు ఎలా మారిపోయాడు అంటే ఖరిదైనా వస్తువు తన దగ్గర ఉంటేనే విలువ అన్నట్టుగా బతికేస్తున్నాడు. శరీరం మీద పెట్టాల్సిన దృష్టి అంత వస్తువు మీద పెట్టి ప్రాణాలనే తీసుకుంటున్నాడు. ప్రాణం ఖరీదు కన్నా వస్తువే ఖరీదు అన్నట్టుగా నేటి మనిషి వస్తువుల వెంట పరుగులు పెడుతున్నాడు. అసలు ఈ పరుగు ఎక్కడికి.? అంతమేంటి అనేదికూడా తనకు తెలియని వస్తు వ్యామోహంలో కొట్టుమిట్టాడుతున్నాడు.
యంత్రాల మధ్య మిగిలిపోతుంది: అంజిబాబు, రంగారెడ్డి
సమాజం మనుషుల కంటే మంచి సౌకర్యవంతమైన వస్తువులను కోరుకుంటోంది. మొబైల్ ఫోన్లు, గాడ్జెట్ల కోసం వెంపర్లాడుతోంది. మానవీయ విలువలు తెలియకపోతే ఇలానే ఉంటుంది పరిస్థితి. అది తెలుసుకోకపోతే భవిష్యత్తు తరం యంత్రాల మధ్య ఒంటరిగా మిగిలిపోతుంది. కొన్నిసార్లు ఆరోగ్యం కంటే కారు.. బంగారం కోసం ప్రాణాలను పణంగా పెడుతుంటారు.
ఏ వస్తువు భర్తీ చేస్తుంది?: నిశిత, హైదరాబాద్
ప్రాణం లేని వస్తువులు సౌకర్యం ఇస్తాయి. కానీ ప్రాణమున్న మనిషి లేకుండా ఏమొస్తుంది.? మనం ముందు మన ఆరోగ్యం.. కుటుంబం మీద దృష్టి పెట్టాలి. చాలామంది తరుచూ ఉద్యోగాలు మారుతుంటారు. వస్తువులు హోదా ఇస్తాయి. కానీ అవి మనిషిని.. మనుషుల మధ్య ఎమోషన్‌ను భర్తీ చేయలేవు. సమాజం ఈ పోకడను మారిస్తేనే భవిష్యత్ తరాలు బాగుంటాయి. సంపాదన మంచిదే. కానీ కుటుంబం లేకుండా దాన్ని ఏం చేసుకుంటాం.?






