బిజీ లైఫ్‌లో.. బిడ్డలకు టైమెక్కడిది?

by Sujitha Rachapalli |

పనుల్లో తలమునకలై పట్టించుకోకుంటే ఎలా?... అవసరాలు తీర్చడమే కాదు ఆప్యాయతతో మాట్లాడాలి.. సౌకర్యాలే కాదు.. సమయం కూడా ఇవ్వండి.. సంపాదన మీదనే కాదు.. పెంపకంపైనా శ్రద్ధముఖ్యం

బిజీ లైఫ్‌లో.. బిడ్డలకు టైమెక్కడిది?
X

దిశ, ఫీచర్స్: మనం చాలా బిజీ. తిండి తినేంత తీరికలేని.. నిద్రపోయేంత నిమ్మళం లేని బిజీ. ఈ బిజీలో పడి ఇల్లు.. పిల్లలను కూడా పట్టించుకోం. వారాంతాల్లో కూడా కలిసి కాలక్షేపం చేసేంత టైం ఉండదు. నెలకోసారైనా పిల్లలతో సరదాగా గడిపే సమయం దొరకదు. పదవి.. ఉద్యోగం.. హోదా.. టార్గెట్ అంటూ బిజీ జీవితంలో తలమునకలై ‘పిల్లలు’.. ‘పెంపకం’ మీద శ్రద్ధ పెట్టక సరైన మార్గనిర్దేశనం చేయం. పెద్దయ్యాక ఇదే సమస్యగా మారి లేనపోని తలనొప్పులు తీసుకొస్తుంది.

టైం ఇవ్వకపోతే ఇలా ఉంటుందా?

బండి భగీరథ్.. ఈ పేరు ఇప్పుడు హాట్ టాపిక్. జాతీయ స్థాయిలో చర్చించుకుంటున్న పర్సన్. మైనర్ బాలికమీద లైంగిక దాడికి పాల్పడ్డాడనే ఆరోపణలతో ఇతని మీద ఫోక్సో యాక్ట్ కింద కేసులు నమోదై అరెస్టు కూడా అయ్యాడు. ఈ నేపథ్యంలో వాళ్ల నాన్న ఎమోషన్ అయ్యాడు. తన కొడుకు ఏ తప్పూ చేయలేదని చెప్తూనే ‘తప్పంతా నాదన్నా.. నేను రాజకీయం బిజీలోపడి పిల్లల్ని పట్టించుకోలేదన్నా. నా కొడుక్కి అస్సలు టైమియ్యలేదన్నా’ అని బాధపడ్డాడు. పేరెంట్స్ పిల్లలతో గడపక.. వాళ్లకు టైమియ్యకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థమైందిగా? వారానికో.. పది రోజులకో ఇల్లూ, పిల్లలూ అని యాదికొస్తే కనీసం వాళ్లేం తింటున్నారు.. ఏం చేస్తున్నారు.. ఎటు తిరుగుతున్నారనేది తెలుస్తుంది. ఇవేవీ పట్టించుకోక బిజీలో బందీ అయితే బండి భగీరథ కథే అవుతుంది.

తీరికగా ఓ గంట గడపలేమా?

ఈ రోజుల్లో అందరి పేరెంట్స్ విషయంలో ఇదే జరుగుతోంది. నాన్నేదో పెద్ద హోదాలో ఉంటాడు. అమ్మ ఏదో ఉద్యోగంలో ఉంటుంది. ఇద్దరూ బిజీ కదా? ఇక కూతురేం చేస్తుంది? కొడుకు ఎవరి వెంట తిరుగుతుండు? అనేవేవీ చూసుకోవడం లేదు. ఉద్యోగం కావచ్చు.. వ్యాపారం కావచ్చు.. రాజకీయం కావచ్చు. తమ రంగంలో రాణించాలి అనే ర్యాట్ రన్నింగ్ రేసులో పడి కుటుంబానికి టైం ఇవ్వటం లేదు. పిల్లలతో కలిసి మాట్లాడటంలేదు. అవసరాలు.. సౌకర్యాలు సమకూరుస్తున్నారు కానీ.. సమయం ఇవ్వడం లేదు. సౌకర్యాలు సమకూరిస్తేనే అయిపోదు. పిల్లలకు గంటనో.. రెండు గంటలో సమయం ఇవ్వాలి. అలా ఇస్తేనే పిల్లలు వస్తువులను కాకుండా మనుషులతో బతకడం నేర్చుకుంటారు. మంచి మార్గంలో వెళ్లడం అలవర్చుకుంటారు.

క్షమాపణలు చెప్తే ఏం ఫాయిదా?

ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఉంది. కొందరికి ఆఫీసే ఇల్లు. వ్యాపారమే ప్రపంచం. ‘నా పనే నా బిడ్డలు’ అని చెప్పుకుంటారు కూడా చాలామంది. పుసుక్కున పిల్లల వల్ల ఏదైనా ఇష్యూ జరిగితే అప్పుడు బాధపడతారు. ‘పనే నా కుటుంబం అనుకున్నా. ప్రాజెక్టే నా బిడ్డలు అనుకున్నా.. ఇట్లయితది అనుకోలే’ అని తెగ ఫీలైపోతుంటారు. జరిగిందానికి పశ్చాత్తాప పడుతుంటారు. క్షమాపణలు కూడా చెప్తుంటారు. అంత అవసరమేమొచ్చింది? ముందు ఇంట గెలవాలి కదా? పనే కుటుంబం కావచ్చు. కానీ సొంత కుటుంబాన్ని కూడా పట్టించుకోవాలి కదా? ఆఫీసే సర్వస్వం అని భావించొచ్చు.. తప్పులేదు. కానీ సొంత పిల్లలకూ కొంత సమయం ఇవ్వాలి కదా? అంతా అయిపోయాక పశ్చాత్తాప పడితే.. క్షమాపణలు చెప్తే ఏం ఫాయిదా?

సౌకర్యాలొక్కటే పేరెంటింగా?

సొసైటీలో చాలామంది చేసే పొరపాటే ఇది. తీరిక లేకుండా కష్టపడుతున్నామంటారు. తిండి తినే టైం కూడా ఉండదు. ఎప్పుడు చూసినా బిజీ బిజీ. ఏమన్నంటే కుటుంబం కోసం.. పిల్లల కోసమే కష్టపడుతున్నా అని చెప్తారు. పిల్లలతో గడపని.. వాళ్లకు విలువైన సమయం కేటాయించని ఆ బిజీ ఎందుకు? ఆ కోట్ల సంపాదన ఎందుకు? ప్రేమ, అనురాగం అనేవి కోట్లు పెడితే మార్కెట్లో దొరికే బంగారు బిళ్లలు కావు కదా? ఎంత డబ్బుంటే ఏం లాభం? పిల్లలకు గోరు ముద్దలు ఆయాతో తినిపించి.. స్నానం ఆయాతో చేపించి.. ఆటలు ఆయాతో ఆడిపించి మనల్ని ‘అమ్మా’ అనాలని ఆశపడితే ఎలా? కనడం.. సౌకర్యాలు సమకూర్చడమే పేరెంటింగ్ అనిపించుకోదు. వాటికంటే విలువైన సమయం ఇస్తేనే పిల్లలు ఆనందంగా ఉంటారు.

ప్రోగ్రెస్ గురించి ఆరా తీయొద్దా?

మనమంతా చేసే పొరపాటేందంటే.. పిల్లలకు అస్సలు టైమివ్వం. వాళ్లతో టైం స్పెండ్ చెయ్యం. మంచి స్కూళ్లో.. మంచి కాలేజీలో వేశాం కదా.. ఇక వాళ్లే చదువుకుంటారు అని చేతులెత్తేస్తాం. వాళ్ల ప్రోగ్రెస్ ఎలా ఉంది అని ఏ ఒక్కరోజు కూడా ఆరా తీయం. స్కూల్ నుంచో.. కాలేజీ నుంచో ఫోనొస్తే ఏదో నామమాత్రంగా మాట్లాడి చేతులు దులుపుకుంటాం. ఏమన్నంటే ‘అస్తమానం పిల్లలతోనే తిరగాలా? వాళ్లతోనే ఉంటే ఇల్లు సంసారం ఎట్లెళ్తుంది?’ అని కామెంట్ చేస్తాం. ఇక్కడ పాయింట్ పిల్లలను అంటిపెట్టుకునే ఉండాలని కాదు. వాళ్ల నుంచి క్రమశిక్షణ ఎక్స్‌పెక్ట్ చేసినప్పుడు.. ఆ క్రమశిక్షణ అలవడే విధంగా వారితో వ్యవహరించాలి. దానికి తగ్గట్టుగా విలువైన సమయం కేటాయించాలి. అప్పుడు క్రమశిక్షణ ఎక్స్‌పెక్ట్ చేస్తే దానికో అర్థం ఉంటుంది.

తిట్టడమే పరిష్కారమా?

భార్య బిజీ.. భర్త బిజీ. దీంతో పిల్లలు పక్కదారి. పిల్లలతో ఇంటరాక్షన్ ఉండదు.. మన్నుండదు. అమ్మ ఫోన్లో అమ్మ బిజీ. నాన్న ఫోన్లో నాన్న బిజీ. ఫోనైపోయాక అమ్మ వంటింట్లో బిజీ. నాన్న బయట పనుల్లో బిజీ. బయటకు వెళ్లి ఆడుకుందామంటే బయటకు పోనీయరు. ఇంట్లోనే కూర్చొని కూర్చొని పిచ్చెక్కి ఒకనికొకడు కొట్లాడుకుంటారు. జుట్లు పట్టుకుంటారు. ఇగ అప్పుడొస్తారు పేరెంట్స్. ‘ఏం మన్షుల్రా మీరూ. దునియాలో మీరొక్కరే ఉన్నరా? ఎవరికీ పిల్లలు లేరా? మంది పిల్లల్ని చూస్తే ఎంతో సక్కదనం. మీకైతే తిండి దండగ. లక్షల రూపాయలు పెట్టి సదివిస్తే.. ఇదేనా మీ రీతి’ అని పొట్టు పొట్టు తిడతారు. ఆ తిట్టడానికి కారణమేంటో ఆలోచించరు. తిట్టడానికి కేటాయించిన సమయాన్ని లాలించడానికి కేటాయిస్తే ఏ సమస్యా ఉండదు కదా?

లక్షలు కాదు.. లక్షణం కావాలేమో?

పిల్లల మనసులో ఏముందో.. వాళ్లేం చెప్పదలుచుకున్నారో తెలుసుకోవడానికి అవకాశం ఎంతమంది ఇస్తున్నారు? ఇక్కడ లక్షలు పెట్టి చదివించడమొక్కటే పేరెంటింగ్ కాదు. లక్షణమైన వ్యక్తిత్వం అలవర్చేలా చేయడం కావాలి. సౌకర్యాలు సమకూర్చడమే మన బాధ్యత కాదు. ఆ సౌకర్యాలను పిల్లలు ఏ విధంగా వినియోగించుకుంటున్నారు అనేది చెక్ చేయాలి. ‘వాళ్లు ఏం అడుగుతున్నారుః? మనమేం ఇస్తున్నాం?’ అనేవి చాలా ముఖ్యం. మార్కెట్లో పైసలు పెడితే దొరికేది కాదు క్రమశిక్షణ. పిల్లోడు ఒక్కసారి గాడితప్పితే మల్లా పట్టాలెక్కించడం అంత ఈజీ కాదు. అందుకే మన చేతుల్లోంచి చేజారక ముందే సరైనదారి చూపించాలి. సరైన మార్గనిర్దేశనం చేయాలి. ఇలా చేయాలంటే మల్లా వాళ్లతో విలువైన సమయాన్ని కేటాయించాల్సిందే. వాళ్లతో స్పెండ్ చేయాల్సిందే.

పట్టాలు తప్పేది ఇక్కడే కదా?

సకల సమస్యలకు ఇప్పుడు మొబైల్ ఫోన్ కారణమవుతోంది. దానికి ఎంతదూరంగా పిల్లలను ఉంచితే అంత మంచిది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మొబైల్ కంట్రోలింగ్ సాధ్యపడటం లేదు. మొబైలే సర్వస్వంగా భావిస్తున్నారు. దానినే లాలించే పేరెంట్‌గా ఫీలవుతున్నారు. సోషల్ మీడియాతో కొత్త దోస్తాన్ ఏర్పడుతోంది. ఏందో స్నాప్ చాటంటా.. ఇన్‌స్టా‌గ్రామంటా. కొత్త కొత్త దోస్తులు. కోరినవిచ్చే సోపతి. రంగుల ఫొటోలు. రంగుల ప్రపంచం మాయ. ఇక ఎవడాగుతాడు? పేరెంట్స్ బిజీలో వాళ్లుంటారు. పిల్లల బిజీలో పిల్లలుంటున్నారు. ఎన్నడూ చూడని.. ఎప్పుడూ కనపడని ప్రపంచం కనిపించేసరికి పట్టేపగ్గాల్లేకుండా విచ్చలవిడిగి విశృంఖల విహారం చేస్తూ గాల్లో తేలుతుంటారు. అసలైన బొక్క పడేది.. బండి పట్టాలు తప్పేది ఇక్కడే.

అవలక్షణాలకు కారణమేంటి?

స్వేచ్ఛ ఎక్కువవుతుంది. పోకడ మారుతుంది. వేగం పెరుగుతుంది. ఎవ్వరూ కంటికి కనిపించని వేగం అది. చెడు వ్యసనాలకు అలవాటు పడతారు. ‘మా పిలగాడు మందు వాసన చూస్తెనే వాంతి చేసుకుంటాడు’ అనే భ్రమలో పేరెంట్స్ ఉంటారు. కానీ ఆ పిలగాడు బయట చేసేదేంటి..? డ్రంకన్ డ్రైవ్‌లో దొరికితే 200 పాయింట్లు చూపించే స్థాయికి ఎదుగుతాడు. ‘మావోడు ఆడోళ్ల మొఖం చూస్తే సిగ్గుపడతాడు’ అని పేరెంట్స్ అనుకుంటారు. సారువాడేమో అమ్మాయితో ఓయో రూంలో దూరేంత సాహసం చేసే రేంజికి చేరుకుంటాడు. ‘మా పిల్లలు పంచాయితీలంటే పది కిలోమీటర్ల దూరం పోతరు’ అని మనమనుకుంటాం. కానీ ఆ పిల్లలు కాలేజీలో తోటి విద్యార్థులను కొట్టడం.. ర్యాగింగ్ చేయడం.. అమ్మాయిలను టీజ్ చేయడం వంటి అవలక్షణాలను అలవర్చుకుంటారు.

ఇప్పుడు బాధపడితే ఏం లాభం?

ఏదైనా విషయం బైటికి పొక్కితే అప్పుడు లబోదిబోమంటాం. ‘ఇదెక్కడి గోసరా’ అని నెత్తి పట్టుకుంటాం. ‘నీకేం తక్కువ చేశాంరా’ అని మొత్తుకుంటాం. ‘నా ఇజ్జత్ తీశావుగా’ అని తిడతాం. ‘ఏలోటూ లేకుండా చూసుకుంటే ఇదేనా నాకిచ్చిన గిఫ్ట్’ అని బాధపడతాం. కానీ ఇప్పుడు బాధపడితే ఏం లాభం? ‘నాన్నా’ అని ప్రేమగా దగ్గరికొచ్చినప్పుడు ‘ఫోన్ మాట్లాడుతున్నరా పక్కకుపో’ అని కసురుకున్నప్పుడు..‘అమ్మా’ అని పిలిస్తే ‘వంట చేస్తున్న నడువ్’ అని ఆప్యాయత చూపించనప్పుడు ఆలోచించాల్సిన విషయం కదా ఇదీ. ‘పిల్లలు ఏదో బుద్ధికొద్దీ పిలుస్తున్నారు.. వాళ్లకేం కావాలో’ అని ఐదు నిమిషాలో.. పది నిమిషాలో సమయం కేటాయించి.. వాళ్లు చెప్పేది వింటే వాళ్లు ఫోన్‌ని కాకుండా మనల్ని అభిమానించేవాళ్లు. మన లైన్లో నడిచేవాళ్లు.

మర మనుషుల్లా ట్రీట్ చేస్తారా?

పేరెంట్స్ పిల్లల పట్ల ప్రేమగా ఉండటం లేదని చెప్పట్లేదు. ఈ కాలం పేరెంట్స్ చాలా ప్రేమ చూపిస్తున్నారు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఎంతసేపూ పిల్లలకు ఖరీదైన వస్తువులు ఇప్పించి.. మంచి బట్టలిప్పించి.. మంచి తిండి పెట్టడంలోనే తమ ప్రేమ ఉంది అనుకుంటున్నారు. ఇవ్వాల్సిన సమయం ఇవ్వకుండా.. ఇంటరాక్షన్‌కు అవకాశమివ్వకుండా.. మంచీ చెడు చెప్పకుండా.. మాటామంతీ లేకుండా.. అమ్మ స్పర్శ లేకుండా.. నాన్న కౌగిలి లేకుండా ఎన్ని వస్తువులు సమకూర్చినా.. ఎంత లగ్జరీగా పెంచినా ప్రయోజనం ఉండదు. కొన్ని సందర్భాల్లో పిల్లలకు కావాల్సింది సౌకర్యాలు కాదు.. నాన్నతో సాంత్వన. అవసరాలు కాదు అమ్మ ఒళ్లో చోటు. ఇవి తప్ప మనం మిగతావన్నీ ఇచ్చేసి మర మనుషుల్లా పిల్లలను ట్రీట్ చేస్తున్నాం. అందువల్లే వాళ్లు దారితప్పుతున్నారు.

వెనకేసుకొచ్చి ఇంకో తప్పా?

మంచి హాస్టల్‌లో వేస్తెనో.. మంచి ఇనిస్టిట్యూట్లో చేరిస్తెనో పిల్లలు మంచిగా ఉంటున్నట్లు కాదు. వాటివల్ల మంచి మార్కులు వస్తుండొచ్చేమోగానీ.. మంచి నడవడిక మాత్రం పేరెంట్స్ చేతుల్లోనే ఉంది. పేరెంటింగ్ లోపం వల్లే పిల్లల భవిష్యత్ తప్పుదోవ పడుతోంది. మన పెంపకం సక్రమంగా లేక వేరేవాళ్లను నిందిస్తే.. పశ్చాత్తాప పడితే ఏం లాభం? పిల్లలు సరైన మార్గంలో వెళ్లక.. లేనిపోని సమస్యలను తీసుకొచ్చినప్పుడే తల్లిదండ్రులకు బాధ్యత గుర్తుకొస్తే అది పక్కా పేరెంటింగ్ లోపమే. పైగా ‘మావోడేం తప్పు చేయలేదు.. మావోడు నిప్పు.. ఉప్పు’ అని వెనకేసుకురావడం ఇంకో తప్పు. పొరపాట్లను సరిదిద్దుకునే అవకాశం వచ్చినప్పుడైనా బాధ్యతగా వ్యవహరిస్తే అప్పట్నుంచైనా పిల్లలను దారిలో పెట్టొచ్చు. సమాజానికి భద్రతనివ్వొచ్చు.

సమయం ఏది: రమేష్ జైనోజు

ఆధునిక జీవితం వేగంతో నడుస్తోంది. కెరీర్, టార్గెట్లు, ఆర్థిక ఒత్తిడి ఇవన్నీ తల్లిదండ్రులను బిజీగా ఉంచుతున్నాయి. ఫలితంగా పిల్లల పెంపకం.. వారి మానసిక అవసరాలు, భావోద్వేగాలు, నైతిక విలువలు పూర్తిగా నిర్లక్ష్యం చేయబడుతున్నాయి. పిల్లలు డిజిటల్ పరికరాలు.. స్నేహితులు.. బయటి ప్రభావాలకు బలవుతున్నారు. తల్లిదండ్రులు డబ్బు, సౌకర్యాలు ఇస్తున్నారు కానీ సమయం, శ్రద్ధ, మార్గదర్శకత్వం ఇవ్వడం లేదు.

ప్రత్యామ్నాయ మార్గాలు: శేఖర్ మల్యాల

మా చిన్నప్పుడు డబ్బు తక్కువ. కానీ సమయం ఎక్కువ. పిల్లలతో కూర్చొని కథలు చెప్పేవాళ్లు. మా సందేహాలు తీర్చేవాళ్లు. ఇప్పుడు జనాలు చాలా బిజీ. నెలకోసారి కూడా పిల్లలతో సరదాగా కూర్చోలేరు. పిల్లలేమో ఫోన్లలో మునిగిపోయి ఉంటారు. ‘ఫీజు చెల్లిస్తున్నాం కదా.. కోచింగ్ ఇప్పిస్తున్నాం కదా’ అనే ఆలోచనతో ఉంటున్నారు పేరెంట్స్. దీంతో పిల్లలు సాంత్వన కోసం ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకుంటున్నారు. దారి తప్పుతున్నారు.

బిజీని ఆసరగా చేసుకొని: బజారు భిక్షపతి

వారాంతంలో కూడా తల్లిదండ్రులు ఆఫీస్ వర్క్, మీటింగ్స్, టూర్లతో బిజీగా ఉంటున్నారు. ఇక పిల్లలు యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫ్రెండ్స్ సర్కిల్‌లో కాలం వెచ్చిస్తున్నారు. వారికి కావాల్సింది ఐఫోన్ కాదు.. రోజుకి 20 నిమిషాలైనా ప్రేమగా మాట్లాడడం. ఏం చేస్తున్నారో తెలుసుకోవడం. కానీ జనాలు బిజీ బిజీ అంటూ పరుగులు తీస్తున్నారు. వాళ్ల బిజీని ఆసరగా చేసుకొని పిల్లలు డ్రగ్స్, లవ్ అఫైర్స్ వంటి సమస్యల్లో చిక్కుకుంటున్నారు.

Next Story