Medaram Special: వన దేవత.. సమ్మక్క తల్లి

by Bhoopathi Nagaiah |   (  Updated:2026-01-26 12:24:53  IST  )

సమ్మక్క-సారలమ్మల జీవిత చరిత్ర కేవలం ఒక కథ కాదు. అది అన్యాయానికి వ్యతిరేకంగా సాగిన ఒక గొప్ప విప్లవం.

Medaram Special: వన దేవత.. సమ్మక్క తల్లి
X

మ్మక్క-సారలమ్మల జీవిత చరిత్ర కేవలం ఒక కథ కాదు. అది అన్యాయానికి వ్యతిరేకంగా సాగిన ఒక గొప్ప విప్లవం. సుమారు 13వ శతాబ్దంలో కాకతీయ చక్రవర్తుల కాలంలో జరిగిన ఈ వాస్తవ గాథ నేటికీ ఎంతోమందికి స్ఫూర్తిదాయం. చివరికి ఆ చక్రవర్తే వీరి పోరాటానికి చలించి.. సమ్మక్కను దేవతగా ప్రకటించి.. జాతర చేయడం కూడా అరుదైన విషయమే. అంతటి పోరాటపటిమ, తెగువ చూపినందునే సమ్మక్క తల్లిని గిరిజన సమాజం మొత్తం దేవతగా కొలుస్తున్నది. సమ్మక్క మరణం ఎంత మిస్టరీగా ఉంటుందో జననం గురించి కథలు కూడా అంతే ఆశ్చర్యం కలిగిస్తాయి. ఒక్కొక్కరూ ఒక్కో రకంగా సమ్మక్క తల్లి గురించి చెప్పుకున్నా.. వందల ఏళ్లుగా సమ్మక్కసారలమ్మ తమ తల్లిగా నమ్మేవారిలో గిరిజనులు మాత్రమే కాకుండా గిరిజనేతర భక్తులు కోట్లలో ఉండటం విశేషం. సమ్మక్క చరిత్ర ఒకసారి క్లుప్తంగా తెలుసుకుందాం.

సమ్మక్క జననం

గిరిజన దొరలు వేటకు వెళ్లినప్పుడు ఒక పులి గుహ దగ్గర పసిపాప దొరికింది. ఆ పాప చుట్టూ పులులు కాపలా కాస్తూ ఉండటం చూసి వారు ఆశ్చర్యపోయారు. ఆ పాపకు సమ్మక్క (శక్తిమంతురాలు) అని పేరు పెట్టి, గిరిజన పద్ధతుల్లో పెంచారు. చిన్నప్పటి నుంచే సమ్మక్కకు అద్భుతమైన శక్తులు ఉండేవని, ఆమె స్పర్శతో రోగాలు నయమయ్యేవని నమ్మకం.

వైవాహిక జీవితం

సమ్మక్కను మేడారం పాలకుడైన పగిడిద్ద రాజుకి ఇచ్చి వివాహం చేశారు. వీరికి ముగ్గురు సంతానం సారలమ్మ, నాగులమ్మ, జంపన్న. వీరి కుటుంబం మేడారం అడవుల్లో ప్రజల యోగక్షేమాలను చూసుకుంటూ అత్యంత గౌరవప్రదంగా జీవించేవారు.

యుద్ధానికి దారితీసిన పరిస్థితులు

ఆ సమయంలో కాకతీయ సామ్రాజ్యాన్ని రెండవ ప్రతాపరుద్రుడు చక్రవర్తిగా పరిపాలిస్తుండేవారు. మేడారం కాకతీయుల కింద ఒక చిన్న సామంతు రాజ్యంగా ఉండేది. ఒకసారి మేడారం ప్రాంతంలో ఘోరమైన కరువు వచ్చింది. వర్షాలు లేక పంటలు పండలేదు. గిరిజనులు ఆకలితో అలమటించారు. కరువు వల్ల గిరిజనులు కాకతీయులకు కట్టాల్సిన ‘కప్పం’ (పన్ను) కట్టలేకపోయారు. కానీ కాకతీయ మంత్రులు, సైన్యం పన్ను చెల్లించాల్సిందేనని ఒత్తిడి తెచ్చారు. ప్రజల ఆకలిని చూసి చలించిన పగిడిద్ద రాజు, ‘ప్రజలే తిండి లేక చస్తుంటే పన్నులు ఎలా కడతాం?’ అని ఎదిరించారు. దీనిని రాజద్రోహంగా భావించిన ప్రతాపరుద్రుడు, తన సేనాని యుగంధరుడి నాయకత్వంలో పెద్ద సైన్యాన్ని మేడారంపైకి పంపాడు.

మేడారం యుద్ధం - వీరమరణాలు

లక్నవరం వద్ద దట్టమైన అటవీ ప్రాంతంలో ఆ తర్వాత జంపన్న వాగు ఒడ్డున కాకతీయ సైన్యానికి, గిరిజనులకు మధ్య భీకర యుద్ధం జరిగింది. ఆధునిక ఆయుధాలు కలిగిన కాకతీయ సైన్యాన్ని గిరిజనులు విల్లులు, బాణాలు, గొడ్డళ్లతో ఢీకొన్నారు. ఈ యుద్ధంలో సమ్మక్క భర్త పగిడిద్ద రాజు, అల్లుడు గోవిందరాజు, కుమార్తె సారలమ్మ వీరమరణం పొందారు. తన కుటుంబం అంతా నేలకూలడం చూసి, తీవ్రంగా గాయపడిన జంపన్న ఆవేదనతో పక్కనే ఉన్న వాగులోకి దూకి ప్రాణాలు విడిచాడు. అందుకే ఆ వాగుకు జంపన్న వాగు అని పేరు వచ్చింది.

సమ్మక్క వీరవిహారం - చిలుకలగుట్ట రహస్యం

కుటుంబం అంతా పోయినా, సమ్మక్క ధైర్యం కోల్పోలేదు. స్వయంగా రణరంగంలోకి దూకి వీరనారిలా పోరాడింది. ఆమె ధాటికి కాకతీయ సైన్యం చెల్లాచెదురైంది. అయితే, యుద్ధ నీతిని విస్మరించి ఒక సైనికుడు సమ్మక్కను వెనుక నుండి వెన్నుపోటు పొడిచాడు. తీవ్ర రక్తస్రావంతో గాయపడిన సమ్మక్క, యుద్ధం చేస్తూనే ఈశాన్య దిశగా చిలుకలగుట్టవైపు వెళ్లిపోయింది. ఆమెను అనుసరిస్తూ వెళ్లిన అనుచరులకు అక్కడ సమ్మక్క కనిపించలేదు. ఆమె వెళ్లిన చోట ఒక నాగవృక్షం కింద ఒక కుంకుమ భరిణె, పులి అడుగుజాడలు కనిపించాయి. సమ్మక్క ఆ తల్లి రూపంలోనే అక్కడ కొలువై ఉందని గిరిజనులు నమ్ముతారు. ఆ కుంకుమ భరిణెనే నేటికీ జాతరలో దేవతగా పూజిస్తారు.

READ MORE ....

అత్యంత కీలకమైన ఘట్టం.. పగిడిద్దరాజు రాక

Next Story