మైనర్లు @ ప్రొఫెషనల్ కిల్లర్స్

by Yella Dhawani Reddy |   (  Updated:2025-06-25 06:50:50  IST  )

నేటి సమాజంలో క్రైమ్ రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతుంది.

మైనర్లు  @ ప్రొఫెషనల్ కిల్లర్స్
X

దిశ, వెబ్ డెస్క్: నేటి సమాజంలో క్రైమ్ రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతుంది.విశ్వాసాలు, బంధాలు, రక్తసంబంధాలు.. అన్నీ తుంచిపారేసే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా మైనర్లలో ఈ మార్పు మరింత తీవ్రంగా కనిపిస్తోంది. నిన్నటి వరకూ ఆటల్లో మునిగిపోయిన చిన్నారులు, ఈరోజు ఎటు అర్థంకానీ ప్రేమలో పడుతూ హత్యలు చేస్తున్న దృశ్యాలు మన కళ్ల ముందు కదులుతున్నాయి. 14, 15, 16 ఏళ్ల బాలబాలికలు ప్రేమ పేరుతో తల్లిదండ్రులనే శత్రువుల్లా భావిస్తూ దారుణాలకు ఒడిగడుతున్నారు. తెలిసి తెలియని వయసులో ఆకర్షణ, ప్రేమ అనే మాయాజాలంలో చిక్కుకుని, చిన్న నిరాకరణను పెద్ద అవమానంగా తీసుకుని, ప్రతీకారాలు తీర్చుకుంటున్నారు. 'నా ప్రేమను అడ్డుకుంటున్నావా?' అనే భావోద్వేగంతో కన్నవారినే కాటికి పంపుతున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి సంఘటనలు సునామిలా వస్తుండటం ప్రస్తుత సమాజపు మానవీయ, మానసిక స్థితిపై అనేక అనుమానాలను కలిగిస్తోంది. ప్రేమ, మొబైల్, స్వేచ్ఛ, డబ్బు, స్వార్థం.. ఇవన్నీ కలిసిపోయి సమాజాన్ని ఊహించని రీతిలో కలిచివేస్తున్నాయి.

* చిన్న వయసులో పెద్ద నేరాలు

* తనకు అడ్డొస్తే అడ్డంగా నరికేయడమే..

* తల్లిదండ్రులనూ హత్య చేస్తున్న బాలలు

* 12ఏళ్ల వయసులోనే ప్రేమ, శృంగారం

* పని హృదయంలో పాతుకుపోతున్న పగలు, కక్షలు

* మొబైల్‌తో స్నేహంతోనే అనార్థాలు

యేళ్ల.ధవణి

* అక్టోబర్ 19, 2019

ప్రియుడితో జల్సాలు చేయనీయడం లేదని ఓ యువతి కన్నతల్లినే దారుణంగా హత్య చేసింది. ఆపై తల్లి శవాన్ని ఇంట్లోనే ఉంచి మూడురోజుల పాటు ప్రియుడితో గడిపింది. రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన ఈ దారుణ ఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది. కూతురు ప్రేమించిన యువకుడితో పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు సిద్ధం కాగా.. మరో యువకుడితో ప్రేమాయణం సాగించిన ఆ యువతి.. తన రెండో ప్రియుడికి అడ్డుగా ఉందని కన్నతల్లిని అంతం చేసింది. మూడు రోజులు తల్లి శవాన్ని ఇంట్లోనే పెట్టుకుని ప్రియుడితో గడిపింది. అనంతరం తల్లి శవాన్ని కారులో తీసుకెళ్లి యాదాద్రి భువనగిరి జిల్లాలోని రామన్నపేట మండలంలోని రైల్వే ట్రాక్‌పై పడేసింది. ఆపై తన తండ్రి వేధింపులతోనే మా అమ్మ కనిపించకుండా పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి పొంతన లేని మాటలతో పోలీసులు తనదైన శైలిలో విచారించడంతో తానే ప్రియుడితో కలిసి తల్లిని చంపి రైలు పట్టాలపై పడేసినట్టు ఒప్పుకుంది. ఈ దారుణ ఘటన ఆరేళ్ల క్రితం యాదాద్రి భువనగిరి జిల్లా నిర్నేముల గ్రామంలో జరిగింది.

* జూన్ 23, 2025

ఏడాది క్రితమే భర్తను కోల్పోయిన ఇల్లాలు తన ఇద్దరు ఆడపిల్లలకు ఏ లోటు లేకుండా కంటికి రెప్పలా చూసుకుంటూ సాదుకుంటుంది. కానీ పదో తరగతి చదువుతున్న ఆమె పెద్ద కూతురికి మూడు నెలల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో నల్లగొండ జిల్లాకు చెందిన యువకుడు పరిచయమై ప్రేమలోకి దింపాడు. అతడి మైకంలో పడిన ఆ బాలిక తన ప్రియుడు, అతడి తమ్ముడితో కలిసి తల్లిని దారుణంగా హత్య చేసింది. తన చెల్లెలి ముందే సుత్తితో బాది హతమర్చింది. ముక్కుపచ్చలారని వయసులో ముక్కూమొఖం తెలియని జులాయిగాడి కోసం జన్మనిచ్చి కంటికి రెప్పలా చూసుకుంటున్న తల్లినే చంపేసింది.

కొట్టినా చనిపోలేదని రెండోసారి..

సోమవారం రాత్రి 7 గంటల సమయంలో తల్లి అంజలి ఇంట్లో పూజ చేసుకుంటుండగా.. బాలిక ప్రియుడు శివ, అతని తమ్ముడు యశ్వంత్ సుత్తి తీసుకుని ఆమె తలపై గట్టిగా మొదారు. కింద పడిపోయిన అంజలి మెడకు చున్నీ బిగించి ఊపిరాడకుండా చేసి బయటకు వెళ్లిపోయారు. కాగా తల్లి ఇంకా కదులుతుందని గమనించిన కూతురు మరోసారి ప్రియుడిని పిలిపించి మళ్లీ ముఖంపై సుత్తితో దాడి చేసి, గొంతును కోశారు. దీంతో అంజలి విలవిలలాడుతూ అక్కడికక్కడే చనిపోయింది. తన అక్క అమ్మని చంపించిందని మృతురాలి చిన్న కూతురు స్పష్టంగా చెబుతుంది. కింద పడిపోయిన అమ్మను ఆసుపత్రికి తీసుకెళ్దామని చెప్పినప్పటికీ అక్క పట్టించుకోలేదని ఆ పసి హృదయం తల్లడిల్లుతూ తెలిసింది.

బాల కామాంధుడు

ఓ మైనర్ బాలికతో సెల్ ఫోన్‌లో చాటింగ్ చేసి, ఆమెని బెదిరించి నగ్న వీడియో కాల్ చేయించి, వాటిని తన మిత్రులకు పంపించి రాక్షస ఆనందం పొందాడు ఓ మైనర్ బాలుడు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రానికి చెందిన ఓ మైనర్ బాలుడు, మైనర్ బాలికతో స్నేహం పెంచుకుని ఆమెతో సెల్ ఫోన్‌లో చాటింగ్ చేశాడు. మైనర్ బాలికతో చేసిన చాటింగ్‌ను ఆమె తల్లిదండ్రులకు, బయటి ప్రజలకు తెలుపుతానని బెదిరించి అమ్మాయితో నగ్న వీడియో కాల్ చేయించాడు. అంతటితో ఆగకుండా దాన్ని రికార్డ్ చేసి తన ఎనిమిది మంది మిత్రులకు పంపించాడు. అది చూసిన వారు ఆ అమ్మాయిని లైంగికంగా, మానసికంగా వేధించడంతో మైనర్ బాలిక ఆదిలాబాద్ షీ టీంను ఆశ్రయించింది. దీంతో విషయం వెలుగు చూసింది.

ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ ప్రాంతంలో 16 ఏళ్ల బాలుడు, తల్లిదండ్రులు తన గర్ల్‌ఫ్రెండ్‌తో మాట్లాడకుండా నిషేధించారని కోపంతో వారిని నిద్రలోనే గొంతు కోసి చంపాడు. మహారాష్ట్రలో కూడా ఇలాంటి ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. సిగరేట్ తాగొద్దన్నందుకు కన్నతల్లిని కర్కశంగా హతమార్చాడు. ఒడిశాలో 15 ఏళ్ల బాలుడు, తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి తల్లికి విషం ఇచ్చి ప్రాణం తీశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే దేశవ్యాప్తంగా ఎన్నో దారుణాలు నిత్యం మనం టీవీల్లో, పేపర్లలో చూస్తూనే ఉన్నాం. మరీ నేటి బాలల్లో ఇంతటి నేర ప్రవృత్తికి కారణాలేంటి? ఈ సంఘటనలు రేపటి సమాజంపై ఎలాంటి ప్రభావం చూపనున్నాయి.

ఫాంటసీ ప్రపంచంలో పిల్లలు

చాలా వరకు నేటితరం పిల్లలకు కరోనా సమయంలో ఆన్‌లైన్ క్లాసుల రూపంలో మొబైల్ ఫోన్లు అలవాటు అయ్యాయి. కానీ ఆ తర్వాత పిల్లలు ఫోన్‌నే తమ అసలైన స్నేహితుడిగా మార్చుకున్నారు. చదువుకే ఉపయోగించాల్సిన ఈ ఫోన్లు ఇప్పుడు వారికి ప్రధాన వినోద మాధ్యమాలుగా మారాయి. ఇన్‌స్టాగ్రామ్, రీల్స్, యూట్యూబ్ షార్ట్ వీడియోలు, స్నాప్‌చాట్ స్ట్రీక్స్‌, వెబ్‌సిరీస్‌ల ప్రేమ కథలు.. ఇవన్నీ వారిని ఒక ఫాంటసీ ప్రపంచంలోకి ఆకర్షితులను చేస్తున్నాయి. తమదైన ఒక కలల లోకంలోకి లాగుతున్నాయి. ముఖ్యంగా ప్రేమ కథలు, రిలేషన్‌షిప్.. వంటి వీడియోలు చూసి తాము కూడా అలాంటి అనుభూతులను ఆశ్వదించాలనే కోరికలను పెంచుకుంటున్నారు. సోషల్ మీడియాకి తోడు సినిమాల్లో సైతం చిన్న వయసుల్లోనే ప్రేమ చిగురించటం, ప్రేమ కోసం పోరాటం, ప్రేమించిన వారి కోసం తల్లిదండ్రులను ఎదిరించటం, ప్రేమికులు మాత్రమే ఒకరికొకరే.. అనే సీన్లు చూపిస్తుండటం బాల్యంలోనే తిరుగుబాటు గుణాన్ని నాటుతున్నాయి. దీంతో నిజ జీవితంతో సంబంధం లేకుండా 'నేను ఎవరిని ప్రేమిస్తానో వాళ్లే నా ప్రపంచం' అనే భావన దృఢంగా పేరుకుపోతుంది. నేటితరం పిల్లలపై వయసుకి ముందే సైకలాజికల్‌గా ఇవన్నీ ప్రభావితం చేస్తోన్నాయి. ఫలితంగా వారిలో త్వరితగతి భావోద్వేగాలు, తప్పుడు నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు ఎక్కవవుతున్నాయి.

అడ్డుకుంటే.. అడ్డు తొలగించటమే

ముందు తరం బాల్యంలో ఆట పాటలు, అమాయకత్వాలు, చదువులు, స్నేహితులతో సరదాలు ఉండేవి. జీవితంలోని ప్రతి విషయాన్ని వయసుతో పాటే తెలుసుకునే వారు. కానీ ఇప్పటి తరం బాల్యంలో అమాయకత్వం లేదు. ప్రస్తుత బాల్యానికీ వయోపరిపక్వతకి మధ్య ఉన్న కాలం అంతర్లీనంగా మాయమైపోయింది. అంతేకాదు, ఒకప్పుడు బాల్యంలో మానసికంగా పరిణతి సాధించేందుకు కుటుంబాలు, ఉపాధ్యాయులు, స్నేహితులు తోడయ్యేవారు. కానీ ఇప్పుడు ఈ స్థానాన్ని సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఆక్రమించాయి. చిన్న వయసులోనే పిల్లలు రిలేషన్‌షిప్స్, బ్రేకప్‌లు, హ్యాకింగ్, బ్లాక్‌మెయిలింగ్ వంటి విషయాల గురించి చర్చించడం నిత్యమైపోయింది. డార్క్ వెబ్, ఫేక్ ఐడెంటిటీలు, అజ్ఞాత చాట్‌లు వారి మానసిక స్థిరత్వంపై గట్టి ప్రభావం చూపుతున్నాయి. వారు అనుసరిస్తున్న వీడియోలు, పాత్రలు, డైలాగ్స్ వారిలో ఓ విపరీతమైన కోరికను నాటుతున్నాయి. ఈ తరహా మార్పులు అనుభవాల ద్వారా ఎదురయ్యే మార్గాన్ని, మార్గదర్శకతను పూర్తిగా తొలగిస్తున్నాయి. దీంతో సహజమైన దశలను దాటేసి, ఒకేసారి అభిప్రాయపూర్వక నిర్ణయాలు తీసుకునే స్థితికి వచ్చేస్తున్నారు. ఆ నిర్ణయాలు వారిలో నేరాలను ప్రేరేపిస్తున్నాయి. దాని ఫలితమే.. తల్లిదండ్రులే అడ్డుగా కనిపించడం, చిన్న మాటే అవమానంగా అనిపించడం, ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలనుకునే పరిస్థితులు నెలకొంటున్నాయి.

అనైతిక కంటెంట్ కారణం..

ప్రేమ అనేది ఒక అద్భుతమైన భావన. కానీ వయసు తెలియని సమయంలో దాని పట్ల చూపే ఆకర్షణ వల్ల తీసుకునే నిర్ణయాలు తీవ్ర ఆందోళనకరంగా మారుతున్నాయి. ప్రేమను అర్థం చేసుకునే వయసుకు ముందే దానిలోకి జారిపోవడం, నిజం-అబద్ధాన్ని వేరు చేయలేని స్థితిలో గట్టి నిర్ణయాలు తీసుకోవడం.. ప్రస్తుత బాలల్లో సాధారణ స్థితిగా మారిపోయింది. విపరీతమైన సోషల్ మీడియా వాడకంతో చిన్న పిల్లలే హింసాత్మక, అనైతిక అంశాలు గల కంటెంట్‌ను చూడగలుగుతున్నారు. హింస, ప్రేమ, పోర్నోగ్రఫీ, తప్పుడు రోల్ మోడల్స్.. వీటి ప్రభావం వారి అభిప్రాయాలను వక్రీకరిస్తోంది. నైతిక బలహీనత వల్ల చిన్న విషయాన్ని పెద్ద సమస్యగా భావించి హింసకు పాల్పడే అవకాశం పెరుగుతోంది. ఉద్యోగాల కారణంగా తల్లిదండ్రులు పిల్లలకు సరైన సమయం కేటాయించలేకపోతున్నారు. వారితో సంబంధం, అనురాగం తగ్గిపోతుండటంతో పిల్లలు ఒంటరితనంలోకి జారిపోతున్నారు. పాఠశాలలు కేవలం పరీక్షలకే పరిమితమైపోయాయి. మానసిక ఎదుగుదల, నైతిక విలువలు నేర్పడంలో విఫలమవుతున్నాయి. సమాజం పిల్లల నడవడిని గమనించి తగిన మార్గనిర్దేశం చేయడంలో నిర్లక్ష్యం వహిస్తోంది.

పేరెంట్స్, టీచర్లదే ప్రధాన బాధ్యత

ఇలాంటి పరిస్థితులలో, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పెద్ద భూమిక పోషించాలి. వారితో మమేకమై సంభాషిస్తూ తామున్నామనే భరోసా కల్పించాలి. పిల్లల మొబైల్ వాడకాన్ని పూర్తిగా నిషేధించడంకంటే, దానిని ప్రయోజనవంతంగా ఎలా మార్చుకోవాలనే మార్గనిర్దేశనం చేయాలి. వారు ఎలాంటి కంటెంట్ చూస్తున్నారు, ఎందుకు చూస్తున్నారు.. అనే విషయాల్లో అవగాహన కలిగించాలి. వారిలో జరిగే భావోద్వేగ మార్పులను గమనిస్తూ, సహనంగా మార్గనిర్దేశనం చేయాలి. సమాజ భద్రత కోసం నేటి పిల్లలను ప్రేరేపించాలి. ఫాంటసీ ప్రపంచానికి బదులుగా, వారు నిజమైన అనుభూతులను ఆస్వాదించేలా దారితీయాలి. మరలా బాల్యంలో పాటలు వినాలి, ఆటలు ఆడాలి. అదే నిజమైన విద్య, అదే భవిష్యత్తు. అప్పుడే మనం రేపటి సమాజాన్ని కాపాడగలుగుతాం. అప్పుడే మానవత్వం మిగులుతుంది. అప్పుడే పిల్లలు ప్రేమను నేర మార్గంలో కాకుండా, ప్రేమగా మానవతా విలువలతో జీవించే దిశగా అడుగులు వేస్తారు.

Next Story