- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏజెంట్ రియల్ ఎస్టేట్.. గడియ రికాం లేదు.. గవ్వ రాలింది లేదు.!
అప్పుడందరి తిరుగుడు భూమి చుట్టే

దిశ, ఫీచర్స్: భూమి తన చుట్టూ తాను తిరుగుతూ.. సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. దీనిని భ్రమణం అంటారు. ఇలా తిరగడానికి 365 రోజులు పడుతుంది. అంటే ఒక సంవత్సరం. ఈ 365 రోజులూ మనిషి భూమి చుట్టే తిరుగుతాడు. ఎందుకో తెలుసా.?? అమ్మడానికి. మనిషి సంపాదన కోసం తన చుట్టూ తాను తిరగడం ఎప్పుడో మానేశాడు. అప్పుడంతా భూమి చుట్టే. అందరిదీ అదే భ్రమణం.
అతడే మిస్టర్ ఏజెంట్
"దిస్ లాండ్ బిలాంగ్స్ టు పుల్లారావ్" లాంటి బోర్డులు అడుగడుగునా కనిపిస్తుంటాయి. అంటే ఆ భూమి పుల్లారావ్ సొంతమన్నమాట. పుల్లారావ్ ఆ భూమిని లక్షల రూపాయలు ఖర్చుపెట్టి కొనుక్కున్నాడు. ఇంతకుముందు భూములను ఊరువాళ్లో, పక్కూరు వాళ్లో కొనేది కాబట్టీ నేరుగా కొనేవాళ్లు అమ్మేవాళ్లు ప్రత్యక్షంగా కలిసి మాట్లాడుకొని బేరమాడుకునేది. కానీ ఇప్పటి కస్టమర్లు దాదాపు అపరిచిత వ్యక్తులు. వాళ్లు ఆ ప్రాంతానికి వేరే పనిమీద వచ్చినప్పుడో లేక ల్యాండ్ సెర్చింగ్ కోసం తిరిగినప్పుడో ఫలానా "బిట్" బాగుంది అనిపిస్తే కనుక్కొని కొనుక్కోవాలనుకుంటారు. అప్పుడు టైటిల్ క్లియర్ ఉందా.? ఏవైనా తిరకాసులున్నాయా.? అనేవి క్లారిటీగా చెక్ చేసి పెట్టడానికో లోకల్ వ్యక్తి కావాల్సి వస్తుంది. అతడే రియల్ ఎస్టేట్ ఏజెంట్.
వైట్ కాలర్ రియల్ ఎస్టేట్
మామూలుగా పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీల వెంచర్స్ అయితే ఈ లోకల్ ఏజెంట్లతో పనేం ఉండదు. ఎందుకంటే వాళ్లకో పెద్ద మార్కెటింగ్ వ్యవస్థ ఉంటుంది. పార్టీ తీసుకురావడానికి కొందరు, పబ్లిసిటీకి కొందరు, బ్రౌచర్లు పంచడానికి కొందరు, క్లయింట్‌ను సైట్ విజిటింగ్ చేయించడానికి కొందరు ఇలా జట్లుగా పనిచేస్తుంటారు. వీళ్లకు శాలరీ ఉంటుంది. తదుపరి ప్రక్రియ ఏదున్నా కంపెనీ రెస్పాన్సిబిలిటీగా ఇలాంటి జట్లను రంగంలోకి దిగుతుంది. దీనినే "వైట్ కాలర్ రియల్ ఎస్టేట్" అంటారు. దీంట్లో పనిచేసేవాళ్లకు ప్రత్యేకమైన డ్రెస్ కోడ్, ఆఫీసు పని వేళలు, టార్గె్ట్లు ఉంటాయి. టార్గెట్ రీచ్ అయితే స్పెషల్ ఇన్సెంటివ్స్ ఉంటాయి. ఫైనల్‌గా మేనేజర్ నుంచి సేల్స్ రిప్రెజెంటేటివ్ వరకు అందరూ ఉద్యోగులే అన్నమాట.
కస్టమర్ ప్రసన్నం..
కార్పొరేట్ లెవల్లో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే కంపెనీలు కూడా ఉంటాయి. ఇలాంటి సంస్థల్లో ప్లాట్లు, స్థలాలు అమ్మడానికి, కస్టమర్లను అట్రాక్ట్ చేయానకి ఆరేంజ్ టీమ్, యాపిల్ టీమ్ అనీ లేదా డైమండ్ టీమ్, గోల్డ్ టీమ్, సిల్వర్ టీమ్ అని తీరొక్క టీమ్‌లు ఉంటాయి. వీళ్లది కూడా సాలరీ బేస్డ్ సర్వీసే. క్లయింట్‌ను మాట్లాడినప్పటి నుంచి రిజిస్ట్రేషన్ ఓకే అయ్యేదాక వీరిదే బాధ్యత. వీళ్లు కష్టపడి పార్టీని తీసుకొస్తారు. కానీ ఆ క్రెడిటంతా మేనేజర్లు తీసుకుంటారు. సంస్థ మేనేజర్లకు ఇన్సెంటివ్స్ ఇస్తుంది. అంతేకాదు.. వాళ్లకో ప్రమోషన్ కూడా ఉంటుంది. కార్పొరేట్ లెవల్లో జరిగే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇలాంటి అంచెలు ఉంటాయి. వీళ్లు కస్టమర్లను ప్రసన్నం చేసుకోవడానికి ట్రాన్స్‌పోర్ట్, ఫుడ్ సౌకర్యాలు ఏర్పాటు చేస్తుంటుంది.
దేశీ రియల్టర్స్..
హెడ్ ఆఫీస్, బ్రాంచ్ ఆఫీస్‌లు ఉంటూ రోజూ కార్యకలాపాలు జరిగే రియల్ ఎస్టేట్ ఇలా ఉంటే.. ఇలాంటి వర్కింగ్ ఆఫీసులనేవి ప్రత్యేకంగా ఏవీ లేకుండా.. ఏ బాసూ లేకుండా చేసే దేశీ రియల్ ఎస్టేట్ ఒకటుంటుంది. వీళ్లకు వీళ్లే బాస్. వీళ్లకు వీళ్లే మేనేజర్. స్పెషల్ డ్రెస్ కోడ్ ఉండదు. కానీ స్పెషల్లీ వేసుకునే వైట్ అండ్ వైట్ డ్రెస్‌లోనే ఉంటారు మాగ్జిమమ్ దేశీ రియల్ ఎస్టేట్ చేసేవాళ్లు. మార్కెట్లో ఎక్కువగా కనిపించేది వీళ్లే. పొలిటికల్ పార్టీస్‌కి అటాచ్ అయి ఉంటారు వీళ్లు. అంటే సర్పంచ్‌కి పోటీ చేసేవాళ్లో, ఉప సర్పంచ్‌గా పనిచేసిన వాళ్లో, వార్డ్ మెంబరో, మాజీ గ్రామశాఖ అధ్యక్షుడో, బూత్ లెవల్ ఇన్చార్జో ఆఫీసులు పెట్టుకొని సిండికేట్‌గా మారి ప్లాట్స్, భూములు కొంటారు. లేదా అగ్రిమెంట్ చేసుకొని మార్కెట్లో సేల్‌కి పెడతారు.
ప్రాపర్టీ గైడ్ వాళ్లు..
ఇన్వెస్ట్ చేయకుండా.. ఖర్చు పెట్టకుండా రియల్ ఎస్టేట్ చేసేవాళ్లు కూడా ఉన్నారు. ఇప్పడంతా వీళ్లదే నడుస్తోంది. వీళ్లేంటంటే.. భూమిని లేదా ప్లాట్లుగా చేసిన స్థలాలను అమ్మేవారికి, కొనేవారికి మధ్య వారధిగా ఉంటారు. ఊర్లలో వీళ్లను రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ అంటారు. ఫలానా జాగా సేలింగ్ ఉంది అని తెలిస్తే చాలు క్షణాలల్లో వాళ్ల దగ్గర వాలిపోతారు. ఏదో కన్విన్స్ చేసి.. అదట్లా ఇదిట్లా అని చెప్పేసి మొత్తానికి "సరే" అనిపిస్తారు. సరే అనకపోతే ఊరుకోరు కదా.? వీళ్ల దగ్గర మస్తు టాలెంట్ ఉంటుంది. పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ నిర్వహకులకు కూడా తెలియని సమాచారం ఉంటుంది వీళ్ల దగ్గర. ఏ భూమి కిరికిరీది, ఏది ప్లాట్ క్లియర్‌ది అనేవి వీళ్లకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియవు. ప్లాట్ నెంబర్ లేదా సర్వేనంబర్ చేస్తే తహశీల్దార్ కన్నా ఎక్కువ సమాచారం చెప్తారు.
ఆత్రం ఎక్కువ ఆదాయం తక్కువ
అంత బాగనే ఉంటుంది కానీ అసలు విషయానికి వచ్చే సరికి ఏమీ ఉండదు. పొద్దునెప్పుడో ఏడెనిమిది గంటలకు ఇంట్లో నుంచి బయటికెళ్తారు. రాత్రెప్పుడో వస్తారు. ఒక్క గంటలో పది ఇరవై ఫోన్ కాల్స్ అటెంప్ట్ చేస్తారు. అన్నీ రియల్ ఎస్టేట్ ముచ్చట్లే. "కొత్త ప్లాట్ సేల్‌కొచ్చింది.. ల్యాండ్ విజిటింగ్ ఉంది" ఇవే చర్చలు అస్తమానం. ఐదారుగురు కలిసి ఒక బ్యాచ్ ఉంటారు. పొద్దున టిఫిన్ చేసినప్పుడు కలిస్తే రాత్రి బార్లో సిట్టింగ్ వేసేదాక కలిసే ఉంటారు. బయట చూసేవాళ్లకేమో "వీళ్లెంత సంపాదిస్తున్నారో" అనిపిస్తుంది. ఫోన్ కాల్స్, సైట్ విజిటింగ్స్, క్లయింట్ డిస్కషన్స్ కూడ ఆ రేంజ్‌లో ఉంటాయి. కానీ గిట్టుబాటయ్యేంత కథ ఉండదు. "గడియ రికాం లేదు.. గవ్వ రాలింది లేదు" అన్నట్లే ఉంటుంది వీళ్ల ముచ్చట.
2 శాతం కమీషన్‌కే..
రియల్ ఎస్టేట్ బ్రోకర్లంతా స్వతహాగా ఏదో ఒక పని వచ్చినవాళ్లే. కానీ అవేవీ ఇప్పుడు చెయ్యరు. నెల రోజులు పనిచెయ్యాలి, అదికూడ ఎక్కడో 30 కిలోమీటర్ల దూరం వెళ్లాలి. జీతం కోసం 30 రోజులు ఎదురుచూస్తూ ఉండాలి. ఇలా కాదు అనీ ప్లాట్లు, జాగాలు అమ్మిపించడం, కొనిపించడాన్నే వృత్తిగా ఫీలై ఏదో తిప్పలు పడుతుంటారు. అమ్మేవాళ్లకన్నా.. కొనేవాళ్లకన్నా వీళ్ల హడావిడే ఎక్కువ ఉంటుంది. అంత తిప్పల పడితే ఆర్నెళ్లో పార్టీ వస్తుంది. ఏమిస్తారు వాళ్లు 2 పర్సెంట్ కమిషన్. అంటే ఇరవై లక్షల ప్లాట్ అమ్మిపిస్తే రూ.40,000 కమీషన్ ఇస్తుంది. అమ్మినవాళ్లు, కొన్నవాళ్లు ఇద్దరూ ఇస్తే రూ.80,000 వస్తుంది. కానీ దాంట్లో ఒక్కరే ఉంటారు. తక్కువలో తక్కువ నలుగురు టీం ఉంటారు వాళ్లు. అంటే ఒక్కొ్క్కరికి రూ.20,000 వస్తాయి.
జాక్‌పాట్ కోసం వెయిటింగ్..
ఐదారు నెలలు ఫ్యామిలీని పట్టించుకోకుండా, చుట్టాలను కలవకుండా క్షణం తీరికలేకుండా తిరిగితే వచ్చేది ఇరవై వేల రూపాయల కమీషనా.? దాంట్లో నుంచి పిల్లల స్కూల్ ఫీజులేం కట్టాలి.? చిట్టీలకేం ఇవ్వాలి.? ఇంట్లో సరుకులకెట్లా.? ప్లాట్ అమ్మేది ఉంది.. పొలం అమ్మిపించిన కమీషన్ వచ్చేది ఉంది అని వాళ్ల దగ్గరా వీళ్ల దగ్గరా అప్పుగా, చేతి బదులుగా తీసుకొచ్చినవి కుప్ప అవుతాయి. వాళ్లు అడిగితే రేపే ప్లాట్ అమ్మేదుంది.. ఎల్లుండే ఇచ్చేస్తా అని చెప్తారు. రేపు లేదు.. ఎల్లుండి లేదు.. రోజూ ఇదే పరిస్థితి. మార్కెట్ లేదని తెలుసు. ఒకవేళ ఉన్నా.. ఒక ప్లాట్ అమ్మితే ఇరవై ముప్పయ్ వేల రూపాయల కమీషనే వస్తుందనీ తెలుసు. అయినా కానీ.. ఏదో ఒక ఆశతో టైం వేస్ట్ చేసుకొని పొద్దున లేస్తే రియల్ ఎస్టేట్ అని తిరుగుతుంటారు.
ఊపర్ షేర్వానీ కహానీయే..
ఊర్లలో రియల్ ఎస్టేట్ ఏజెంట్లుగా చేసేవాళ్లలో చదువుకున్న వాళ్లు, పోటీ పరీక్షలకు ప్రిపేరైతున్నవాళ్లు, డ్రైవర్లు, ఎలక్ట్రిషియన్లు, ప్రైవేట్ టీచర్లు ఇట్లా చాలామంది ఉంటారు. ఆయా పనుల్లో వారు మంచి నేర్పరులే. కానీ నెల జీతం ఒక్కరోజే సంపాదించవచ్చు అనే ఆశతో ఈ పని చేస్తుంటారు. కమీషన్ వచ్చేది దేవుడెరుగు.. ఉల్టా వీళ్ల జేబుకే చిల్లు పడుతుంది. పార్టీని కన్విన్స్ చేయాలనే ఉద్దేశంతో బార్లో సిట్టింగ్ ఏర్పాటు చేస్తారు. కార్లలో తీసుకెళ్తారు. వీళ్లూ రోజూ తిరుగుతారు. టైటిల్ క్లియర్ ఉందా తెలుసుకునేందుకు ఈసీలు తీస్తారు. పొద్దున టిఫిన్, మధ్యాహ్నం లంచ్, రాత్రికి డిన్నర్. ఇంకా డ్రెస్సింగ్ సెన్స్ చాలా ముఖ్యం. ఖద్దరు లేకపోతే మార్కెట్లో ఎవరూ నమ్మరు అని టిక్ టాక్ వెళ్తారు. వీటన్నింటికీ లెక్కేస్తే తక్కువ ఖర్చు అవుతుందా.? ఎక్కడ్నుంచి వస్తాయి ఇవన్నీ భరించేందుకు.?
ఉన్నది అమ్మేయడానికా.?
ఎవరో ఒకరికి లక్కు ఉంటేనే లక్షలకు లక్షల రూపాయల కమీషన్ వస్తుంది. నక్కను చూసి కుక్క వాత పెట్టుకున్నట్లు వాళ్లు సంపాదిస్తున్నారు.. వీళ్లు సంపాదిస్తున్నారు అనీ ఆశపడి ఒక్కటే తిరుగుతుంటారు. తిరిగి తిరిగి సరిపడా ఆదాయం లేక.. అప్పుడోసారి ఇప్పుడోసారి తగిలిన జాక్‌పాట్ ఖర్చులకు సరిపోక బంగారం తాకట్టు పెడుతుంటారు. ఇంకా కొందరి పరిస్థితి అయితే ఘోరంగా ఉంటుంది. పాపం.. వాళ్లు ఎవరిదో ప్లాట్ అమ్ముదామని.. ఇంకెవరిదో పొలం అమ్మి కమీషన్‌తో సంపాదిద్దామని ఆశపడి ఆఖరికి వాళ్ల ప్లాట్ మార్కెట్లో అమ్మకానికి పెట్టే పరిస్థితి తీసుకొస్తుంటారు. ఒకటి పోతే రెండు సంపాదించుకోవచ్చు.. ప్రతీ ఒక్కరికీ ఓ టైమొస్తుందనే ఊహాలోకంలో బతుకుతుంటాడు. అది వచ్చేదెన్నడో.. అసలు వస్తుందో రాదు తెలియదు.
కమీషన్ కోసం కక్కుర్తి పడీ..
అసలే ఏజెంట్ల పరిస్థితి ఇలా ఉంది అంటే.. ఇంకా వాళ్లదాంట్ల వాళ్లకే పంచాయతీలు. అప్పటిదాక కలిసే చేస్తుంటారు. ఏదైనా పెద్ద పార్టీ లేదా వర్కవుట్ అయ్యే పార్టీ వస్తే మాత్రం రెండో వ్యక్తికి తెలియకుండా డీల్ చేస్తారు. వాళ్లు అలా చేశారని.. ఇంకొకరు అలానే చేయబోతే ఆ పార్టీ అడ్రసేంటో.. కాంటాక్ట్ నంబర్ ఏంటో తెలుసుకొని వాళ్లకంటే ముందుగానే సంప్రదించి అతనికేం తెల్వదు సార్.. మాకే మొత్తం తెలుసు.. అది మేమే పెట్టించాం.. ఇదే మేమే అమ్మిపించామని సొంతవాళ్లకే డోకా చేసి పోటీ పడుతుంటారు. నోటికాడికొచ్చిన దాన్ని లాక్కపోతవా అని వాళ్లదాంట్లో వాళ్లకే కొట్లాటలు, మనస్పర్థలు వస్తాయి. ఎంత జాగ్రత్తగా డీల్ చేద్దామన్నా ఆ ప్లాట్ కిరికిరీలో ఉంది.. డబుల్ రిజిస్ట్రేషన్ ఉంది అని క్లయింట్‌ను బెదిరించి కమీషన్ కోసం కక్కుర్తి పడతారు.
ఏజెంట్ ఎకరం భాయ్..
రియల్ ఎస్టేట్ ఏజెంట్ల అవసరం అందరికీ అవసరం. వెంచర్ డెవలపర్స్‌కి.. రియల్ ఎస్టేట్ కంపెనీలకు వీళ్ల ద్వారానే క్లయింట్స్ వెళ్తారు. ఏవైనా లిటిగేషన్ ఉన్నా వీళ్లకు తెలుస్తాయి కాబట్టీ కంపెనీలు కూడా వీళ్లకు ఆఫర్ చేస్తాయి. కానీ.. వీళ్లు వాటిమీద అంత ఆసక్తి చూపించరు. ఎంతసేపూ సొంతూర్లో, పక్కూర్లో లేదా సమీపంలో ఉన్న వాటిమీదనే కాన్‌సెంట్రేషన్ చేసి.. వాటిచుట్టే తిరుగుతుంటారు. ఫ్యామిలీ పరిస్థితి ఎలా ఉన్నా వీళ్లయితే ఖరీదైన ఫోన్లు, డ్రెస్సులు తీసుకుంటారు. ఇంట్లో కంటే బయటే తింటారు. బయట ఎన్ని ఇజాలు మాట్లాడినా గజాల దగ్గరికి వచ్చేసరికి "ఏజెంట్ ఎకరమ్ భాయ్"గా వ్యవహరిస్తారు. తమకున్న తెలివిని సొంతంగా బిజినెస్ చేయడానికైనా ఉపయోగిస్తారా అంటే అదీ ఉండదు. ఎంతసేపూ అదే ప్లాట్లు అంటూ తిరిగి పాట్లు పడుతుంటారు.
నమ్మకమొక్కటే కాపాడుతుంది..
ఏజెంట్లకు ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే.. ఈ రంగంలో ఎక్కువగా ఇన్వెస్ట్ చేసేది ఐటీ వాళ్లు.. గవర్నమెంట్ ఉద్యోగాలు చేసేవాళ్లు. రియల్ ఎస్టేట్ బిజినెస్‌లో మోసాల గురించి అవగాహనతో పెద్ద కంపెనీల ద్వారా ప్రాపర్టీస్ కొనాలనుకోరు. అందుకే దేశీ ఏజెంట్లను పట్టుకుంటారు. వీళ్లయితే ఏ మోసాలు చేయకుండా, నిజాయితీగా ఉంటారు, తామిచ్చే 2శాతం పర్సెంటేజీతోనే సాటిస్‌ఫై అవుతారనేది వాళ్ల ఉద్దేశం. ఒక ఫ్రెండ్‌లా ట్రీట్ చేస్తారు. అందుకే ఏ మాత్రం ఫ్రీ టైం ఉన్నా.. "సార్.. ఏం చేస్తుండ్రూ.. ఇంకో కొత్త ప్లాటొచ్చింది తీసుకుంటరా" అని కన్విన్స్ చేస్తుంటారు. సారు సైట్ విజిటింగ్‌కు వచ్చినప్పుడు చూడాలి ఈ ఏంజెట్ల సంతోషం.. హడావిడీ. ఎవరు కాల్ చేసినా "మా సారొచ్చిండు.. ఇంకో ప్లాట్ ఓకే ఐతుందీ" అని చెప్పుకొని మురిసిపోతుంటారు.
ఐనా.. అతడి ఆశ చావలేదూ..
ఇప్పుడైతే రియల్ ఎస్టేట్ మార్కెటే లేదు. పెద్ద కంపెనీలు సైతం ఏడాదిన్నర నుంచి దివాళా తీసి కూర్చుకున్నాయి. కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు అయితే బిచానా ఎత్తేస్తున్నాయి. ఇక మోసాలు, వేషాలు ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్‌లో ఎన్ని ఉంటాయో మనకు తెలిసిందే. ఇంత టఫ్పెస్ట్ సిచువేషన్లో కూడా దేశీ రియల్ ఎస్టేట్ ఏజెంట్లు బిజీగా ఉన్నారు అంటే అసలు వాళ్లేం దందా చేస్తున్నారో వాళ్లకే తెలియాలి. రిజిస్ట్రేషన్లే లేక డాక్యుమెంట్ రైటర్లు ఈగలు కొడుతున్నారు. అయినా ఈ ఏజెంట్ మహాశయులు ఏం చేస్తున్నవ్ అని అడిగితే.. ఒక ప్లాట్ అమ్ముడు పోయింది.. రిజిస్ట్రేషన్ ఉంది అని అంటారు. వాళ్లను చూసి జాలిపడాలో.. బాధపడాలో కూడా తెలియని పరిస్థితి. ఐనా వాళ్ల కష్టంచూసి.. అంతా మంచి జరగాలని కోరుకుందాం.
ఏజెంట్లకు శిక్షణిస్తాం: మోకు భాస్కర్ రెడ్డి, కోర్ డైరెక్టర్, శ్రీ ఎస్ఎల్ఎన్ గ్రూప్స్
వాస్తవానికి ఇప్పుడు రియల్ ఎస్టే్ట్ బిజినెస్ అంత సానుకూలంగా లేదు. ఇప్పుడిప్పుడే సేల్స్ స్టార్ట్ అవుతున్నాయి. మా దగ్గర అంతా ట్రెయిన్డ్ ఏజెంట్స్ ఉంటారు. "ఊరూరా ఎస్ఎల్ఎన్" అనే కార్యక్రమం తీసుకొచ్చి రియల్ ఎస్టేట్ ఏజెంట్లను లక్షాధికారిగా మార్చే ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఊర్లలో ఉండే లోకల్ ఏజెంట్లు నెలల తరబడి తిరిగినా కన్విన్స్ కాని క్లయింట్స్‌ను మా వాళ్లు వారంలో కన్విన్స్ చేస్తుంటారు. అలాంటి మార్కెటింగ్ స్కిల్స్ మేం నేర్పిస్తున్నాం. ఆఫర్లు, బొనాంజాలు కంపెనీలు ఇవ్వగలవు కానీ ఇండిపెండెంట్ ఏజెంట్లు ఇవ్వలేరు కదా.?
మా స్ట్రాటజీ వేరే: కొమ్మగాని యాదగిరి గౌడ్, సధర్మ ప్రాజెక్ట్స్
బిజినెస్‌లో ఎవరి స్ట్రాటజీ వాళ్లది. కస్టమర్లను ఆకర్షించడంలో మాకంటూ ఒక వ్యూహం ఉంటుంది. అందుకే మార్కెట్ అంతగా లేని ప్రజెంట్ సిచువేషన్లో కూడా మేం ఎంతో కొంత బిజినెస్ చేయగలుగుతున్నాం. చాలామంది లోకల్ రియల్టర్లు, ఏజెంట్స్ కూడా మాతో కలిసి పనిచేస్తుంటారు. కానీ గడ్డుకాలంలో అయితే కస్టమర్లను తీసుకురాలేరు కదా.? అందుకే మా వ్యూహాలు అమలు చేసి కస్టమర్లను ఆకట్టుకుంటున్నాం. కలిసి పనిచేసి సంపాదించుకోండి అనే అవకాశం అందరికీ కల్పిస్తున్నాం. మార్కెట్ మళ్లీ పట్టాలెక్కితే ఇక మా బిజినెస్‌కు, ఏజెంట్లకు తిరుగుండదు.
మార్కెట్ లేకున్నా: ప్రభాకర్, డాక్యుమెంట్ రైటర్
ఇప్పుడైతే రియల్ ఎస్టేట్ మార్కెట్ చాలా డల్‌గా ఉంది. క్రయవిక్రయాలు తగ్గిపోయాయి. రిజిస్ట్రేషన్లు చాలా తక్కువ అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో కూడా రియల్టర్స్, ఏజెంట్స్ చాలా హడావిడిగా ఉంటున్నారు. రెగ్యులర్‌గా వస్తున్నారు. తిరిగితేనే కదా మార్కెట్ అయ్యేదనేది వాళ్ల నమ్మకం. అందుకే ఉన్న పరిచయాలు పోవద్దు.. బూమ్ వచ్చే వరకు వాళ్లను కాపాడుకోవాలని చేతి నుంచి డబ్బులు ఖర్చు చేసి కమ్యూనికేషన్ మెయింటెన్ చేస్తుంటారు. పాపం ఎంతో కష్టపడుతుంటారు. రోజూ చూస్తుంటాం కదా.? అన్నిసార్లు వర్కవుట్ కావు. అయిన్నాడు వాళ్ల సంతోషానికి అవధుల్లేవు.






