- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పలికేవి ప్రవచనాలు.. చేసేవి పరమ నీచాలు
చెప్పేవి నీతి సూత్రాలు.. చేసేవి సిగ్గుమాలిన కథలు.. పది మందిలో పరపతి.. పరదచాటున నీచానికి అధిపతి.. పరమ దుర్మార్గుడని తెలిసినా.. సమస్య పరిష్కరిస్తాడనే ఆశ

దిశ, ఫీచర్స్ : నీతులు చెప్పేవాళ్లను తొందరగా నమ్మేస్తాం. నీతి ప్రవచనాలు పలుకుతుండంటే వాడు మహా గొప్పోడై ఉంటాడనేది మన గుడ్డి నమ్మకం. వాడు ఏది చెప్తే అదే కరెక్ట్ అనుకుంటాం. పూర్తిగా వాడి ఆధీనంలోకి వెళ్లిపోతాం. ఇక్కడే వాడి నిజ స్వరూపం బయటపడుతుంది. మన అవసరాన్ని అవకాశంగా మార్చుకొని నీతులు పలికిన నోటితోనే నీచానికి ఒడిగడతాడు. మహిళలను మభ్యపెట్టి మనిషి లక్షణం చాటుకుంటాడు. ఐనా మనం వాడినే నమ్ముతుంటాం.
సూక్తులు చెప్పి సూరత్ తక్కువ పనులా?
సూక్తులదేముంది ఎన్నయినా చెప్పొచ్చు. ముందే మన దగ్గర సుభాషితాలు పలికేవాళ్ల సంఖ్య ఎక్కువాయె. మంచి మాటలకు ఆటోమేటిక్‌గా ఎవరైనా కనెక్టవుతారు కదా? అలా మనలో చాలామంది ప్రవచనాలకు ఫిదా అయి.. వారి పిలుపునందుకొని వెళ్తుంటారు. పూర్తిగా వాళ్ల ఆధీనంలోకి వెళ్లిపోయి చెప్పిందల్లా చేస్తుంటారు. ఎన్ని సూక్తులు పలికినా దుర్మార్గుని ఆలోచనలు ఎక్కడికి పోతాయి? మనసంతా దురాలోచనలను నింపుకొని దుర్మార్గాన్ని వెతుక్కుంటారు. పాపం.. ఈ పన్నాగాలేవీ పసిగట్టలేని అమాయక గొర్రె జనాలు అయ్యగారికి పాదసేవ చేసే పనిలో మునిగిపోతారు. ఆశీర్వదించిన చేతితోనే అసభ్యానికి ఒడిగట్టి.. రక్షించమని వచ్చిన వారి పట్లనే రాక్షసంగా ప్రవర్తించి రాక్షసానందం పొందుతున్నారు.
అసభ్య ప్రవర్తనతో అశుద్ధ చేష్టలా?
నీతులు చాలా చెప్తుంటారు. కానీ వాళ్లు చెప్పిన నీతులను వాళ్లే పాటించరు. పైగా నీచపు బుద్ధి, కీచక బుద్ధి చాటుతారు. పలికేవి సుద్దపూస పలుకులు చేసేవేమో చెడు పనులు అన్నట్లుగా ప్రవర్తిస్తుంటారు. జనాల అవసరాల్ని అవకాశంగా భావిస్తారు. ప్రజల సమస్యలనే వారి సుఖాలకు సోపానాలుగా.. ప్రజల కష్టాలనే వారి కామక్రీడలకు వారధిగా మల్చుకుంటున్నారు. సామాన్యుల భాధలను తమ భావప్రాప్తికి మార్గంగా మార్చుకుంటున్నారు. ఇలా శరణుగోరి వచ్చినవారిని చెరబట్టిస్తూ.. ఆశ్రయం వెతుక్కుంటూ వచ్చినవారిని ఆగంజేస్తూ భక్తి ముసుగులో, ముక్తి ముసుగులో బరి తెగించి సభ్యసమాజం తలదించుకునేలా అసభ్య ప్రవర్తనతో అసహ్యం వరదలా ప్రవహింపజేస్తున్నారు. మనసులోని మురికిని మూడు పువ్వుల్లా వికసింపజేస్తున్నారు.
పూజారంటే దేవుడి ప్రతినిధి కదరా?
సామాన్యుల బలహీనతలను బలంగా భావించి రకరకాల కథలు పడుతుంటారు ఈ ప్రవచనాలు పలికే మేధావులు కొందరు. ఈ మధ్య చూశాం కదా? వారణాసిలో ఒక పూజారి తనతో పాటు పడవలో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించి వాళ్లను అవమానపరిచాడు. వారి ఒంటిపై ఉన్న బట్టలు చించేసాడు. పూజారి అంటే మనం దేవుడి ప్రతినిధిగా భావిస్తాం. కానీ కొందరు ఇలాంటి పూజారులు రాక్షసులుగా మారిపోయి మహిళల పట్ల అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. వారణాసి సాక్షిగా గంగా ఘాట్‌లో ఈ ఘటన జరగడం అత్యంత బాధాకరం. అంత పవిత్రమైన, ప్రతిష్టాత్మకమైన, అత్యంత నిఘా కలిగిన వారణాసిలోనే ఇలాంటివి ఇంత ఓపెన్‌గా జరుగుతుంటే ఇక మిగతా చోట్ల ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
నగ్న పూజలను భగ్నం చేసేదెలా?
ఇక్కడ తప్పెవరిది? వాళ్లేదో దోషం ఉందని.. ఆ దోష నివారణకు వారణాసి వెళ్లి పూజలు చేయించుకోవాలనుకుంటారు. అతడితో నష్ట నివారణ పూజలకు ఓకే అంటారు. అతడూ అందరిలాగే పూజారీయే కదా అనుకోవడమే వాళ్లు చేసిన తప్పు. అంత రహస్యమైన కార్యక్రమాలు ఎవడితో పడితే వాడితో చేయించుకుంటామా? ముందే ఈ మధ్య నాభి పూజలని ఒకడు.. నగ్న పూజలని ఒకడు.. ఏవేవో కథలు పడి కంగాళీ లెక్కలు చేస్తున్నారు. అసభ్యంగా ప్రవర్తించి అసహ్యం తెప్పిస్తున్నారు. నీచపుబుద్ధితో నికృష్ట చేష్టలు చేస్తున్నారు. ధర్మాన్ని విస్మరించి దగా చేస్తున్నారు. కాబట్టీ మనం కూడా గుడ్డిగా పోవద్దు. సర్వం వాళ్లముందు సమర్పించి తర్వాత లబోదిబోమంటే ఎలా? ముందే గుర్తించి బడితెపూజ చేస్తే బట్టలు కాదు కదా.. మన బార్డర్ కూడా టచ్ చేయలేడు.
దేవుని సాక్షిగా వక్రబుద్ధేలా?
దరిద్రులు కొందరు స్త్రీని దేవత అని పొగుడుతారు. పొగిడిన ఆ నోటితోనే ఆడవాళ్ల గురించి నీచంగా మాట్లాడతారు. ఆడది కనిపిస్తే చాలు కింది నుంచి పైదాక కామంతో కళ్లార్పకుండా చూస్తారు. సమస్యతో వచ్చిన వాళ్లను చేరదీసి వారికి సాంత్వన చేకూర్చే విధంగా ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని చూపించాల్సింది పోయి.. సదరు పూజారి కామాంధుడుగా మారి గంగా నది జలాల్లో పడవపైనే లైంగిక వేధింపులకు పాల్పడటం ఎంత ఘోరం? ఇదేం వక్రబుద్ధి? మామూలుగా మనం పూజారులను ఈ విధంగా చూడమే. నిజంగా తప్పు చేయని వాడైతే పడవలో నుంచి ఎందుకు దూకి పారిపోతాడు? వారి నుంచి ఎందుకు తప్పించుకోవాలి అనుకుంటాడు? శాస్త్రం తెలిసిన శాస్ర్తివారు ఇలా అశాస్త్రీయంగా ప్రవర్తిస్తే ఏ శాస్ర్తం ప్రకారం శిక్షించాలి?
చర్చికి వస్తే చరబడతార్రా?
దౌర్భాగ్యం ఏంటంటే ఇలాంటివెన్నో జరుగుతున్నా మనోళ్లు మాత్రం అలాంటి వాళ్ల దగ్గరికి ఇంకా పోటీపడి వెళ్తుంటారు. ఎక్కడా చెప్పుకోలేని.. ఎవరూ తీర్చలేని ఏ బాధనో, భయాన్నో పోగొట్టుకోవడమే వాళ్ల పరుగుకు కారణం. ఆ పరుగును పరిహసిస్తూ దరిద్రులు కొందరు ఇంకింత భయభ్రాంతులకు గురిచేస్తూ తమపై ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకుంటున్నారు. ఒక మతం.. ఒక వర్గం.. ఒక గ్రూపు అని కాదు.. అన్నిచోట్ల ఇలాంటి మూర్ఖులు ఉండే ఉంటారు. ఎక్కడా దొరకట్లే ఈ జనాలు వాళ్ల దగ్గరికెళ్లి వాళ్లను ఊకూకెనే నమ్మేస్తుంటారు. కన్యా కుమారిలో ఒక చర్చి ఉంటుంది. దాంట్లో బెనిడిక్ట్ ఆంటోనీ అనే వ్యక్తి పాస్టర్. మినీ అనే మహిళ.. ఇంకా ఆమెతో పాటు మరో 19 ఏళ్ల యువతి కూడా ఈ చర్చికి వెళ్లేది. ఆంటోనీ చెప్పే మాటలకు వీరిద్దరూ బాగా కనెక్టయి అతనికి చాలా దగ్గరయ్యారు.
పరలోక ప్రవచనాలతో పాపపు లోకానికా?
మినీ.. ఆ అమ్మాయి ఆంటోని పలుకులకు పడిపోయి రెగ్యులర్‌గా చర్చికి వెళ్తుండేవాళ్లు. వేటగాడికి దొరికిందే ఛాన్స్ కదా? ప్రార్థనలన్నీ అయిపోయాక తన మనసు పరదా విప్పేవాడట. ప్రార్థనల పేరుతో పచ్చిగా ప్రవర్తించేవాడట. పరలోక ప్రవచనాలు చెప్పి పాపపు లోకాన్ని చూపించేవాడట. దీంతో మినీకి చిర్రెత్తిపోయింది. 19 ఏళ్ల యువతి పరిస్థితి అయితే మరీ ఘోరం. ఆంటోని తన మర్మాంగాల ఫోటోలతో పాటు అనుచితమైన వాట్సాప్ సందేశాలు పంపి టార్చర్ పెట్టేవాడట. అదృష్టమని చెప్పి.. అంగాంగం ప్రదర్శించేవాడట. ఎంత నీచుడు వీడు? ఇలాంటి వాళ్లను ఏమనాలి? వాడు చెప్పేవి ధర్మ బోధనలు. ఉండేది దైవ సన్నిధిలో. చేసేవేమో ఇలాంటి చండాలమైన పనులా? ఏమిరా ఆంటోనీ.. ఏమిరా నీ వల్ల దేశానికి ఉపయోగమూ?
నమ్మబలికి నాభి పూజలేల?
ఇంకో కథ చూద్దాం. రాజస్థాన్‌కు చెందిన రామ కిశోర్ జోషి ఒక ఆలయంలో పురోహితుడు. దోష నివారణ కోసం ఒక మహిళ.. తన కూతురుని తీసుకొని అతడి దగ్గరికి వెళ్లింది. అయితే దోష నివారణకు పూజ చేసేటప్పుడు మూడోవ్యక్తి చూడొద్దనీ.. అమ్మాయిని ఒక్కదాన్ని మాత్రమే గదిలోకి రావాలనీ.. ఇదంతా రహస్య ప్రదేశమని నమ్మించాడు. అనుకున్నట్లే అమ్మాయిని లోపలికి తీసుకువెళ్లాడు. తల్లిదండ్రులు బయటే ఉన్నారు. గదిలోపల రామ కిశోర్ అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించాడు. తన కోరిక తీర్చాల్సిందేననీ.. అదే తనకు దోష నివారణ పూజ అనీ.. తనలా వచ్చిన వాళ్లందరికీ ఇలాగే చేస్తానని చెప్పడంతో అమ్మాయి భయపడిపోయింది. ఏం చెయ్యాలో తోచక కేకలు వేసింది. పేరెంట్స్ రూమ్ డోర్లను బద్దలుగొట్టి కూతుర్ని విడిపించుకున్నారు.
సంతోషం పేరుతో సరస ప్రార్థనలా?
చెప్పేవి గొప్ప మాటలు.. చేసేవి చిల్లర పనులు అంటే ఇవేగావచ్చు. జీవితం సంతోషంగా ఉండాలంటే మీ తరపున ప్రార్థనలు చేస్తానని నమ్మబలికాడొక పాస్టర్. పేరు మాణిక్య రాజు. అతడిది కల్యాణదుర్గం. కొన్నాళ్లుగా ఆ చర్చికి వెళ్లసాగింది. అలా మాణిక్యరాజుతో ఆ కుటుంబం దగ్గరైంది. అదెంతలా అంటే వాళ్లింటికి వెళ్లి మరీ ప్రత్యేక ప్రార్థనలు చేసేటంతగా. ఇదే చనువుతో ఆ ఇంట్లో స్కూల్ వయసు అమ్మాయిని అప్పుడప్పుడు ప్రార్థనలకు తీసుకెళ్లేవాడు. అమ్మాయి తల్లిదండ్రులు సైతం నమ్మకంగా తమ కుమార్తెను అతడి వెంట పంపేవాళ్లు. అలా ఒకసారి విజయవాడలో ప్రార్థన ఉందని చెప్పి తీసుకెళ్లాడు. ఏలూరులోని ఒక లాడ్జికి తీసుకెళ్లి అక్కడ తనను నిర్బంధించి తన కోరిక తీర్చాలంటూ అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక ఎదురు తిరగడంతో ఇది బయట పడింది.
మూర్ఖుడని తెలిసినా ముక్తి కావాలా?
నీచుడని తెలిసినా.. నీడనిస్తాడని నమ్మే జనాలున్నారు మన మధ్యలో. మూర్ఖుడని విన్నా.. ముక్తి దొరుకుతుందని దండాలు పెట్టే అమాయక గొర్రెలూ ఉన్నారు. ఇలాంటి వాళ్లుండటం వల్లనే.. కామాంధులు కండ్లు మూసుకుపోయి చెలరేగుతున్నారు. మనమేదో ఆశించి వెళ్తాం. అక్కడైనా సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఆశపడతాం. మన సమస్యను.. మన భయాన్ని ఇలా పూజారికో.. పాస్టర్‌కో.. ఇంకొకరికో చెప్పుకొని మనసు తేలిక చేసుకుందామనుకుంటాం. కానీ మూర్ఖులు కొందరు దీనిని మనసు వాంఛ క్రీడగా మారుస్తున్నారు. తాము కూడా అందరి మనుషుల్లాగే అనేది నిరూపించుకుంటున్నారు. ఇక్కడ వాళ్ల ధీమా ఏంటంటే.. బాధితులు దీనిని గుర్తించరు. ఒకవేళ గుర్తించినా బయటకు చెప్పుకోరనీ.
జ్యోతిష్యం పేరుతో జోలపాటేందిరా?
నాసిక్‌కు చెందిన 67 ఏండ్ల జ్యోతిష్యుడు అశోక్ ఖారత్ కథైతే కండ్లు బైర్లు కమ్మేలా ఉంది. జ్యోతిష్యం.. పూజలు చేస్తానంటూ అందర్నీ ఆకట్టుకున్నాడు. సమస్య ఉన్నవాళ్ల మహిళలకు అదృష్టం తలుపుతట్టేలా మంత్రమేస్తాడని చెప్పడంతో చాలామంది అశోక్ ఆశ్రమానికి లైన్లు కట్టారు. ఒక్కసారి తన క్యాబిన్లోకి అడుగుపెడితే అంతే ఇక. ఏదో హిప్నటైజ్ చేసి మత్తుపదార్థాలు ఇచ్చి లోబర్చుకుంటాడు. ఒకవేళ ఎవరైనా తిరగబడితే తన భర్తను చంపేస్తాననీ.. చేతబడి చేసి కుటుంబాన్ని సర్వనాశనం చేస్తానని బెదిరిస్తాడు. అలా మొత్తం 58 మంది మహిళలు ఆ మాయగాడి వలలో చిక్కుకున్నారు. అలా 35 ఏళ్ల యువతిని లైంగికంగా వేధిస్తున్నాడు. మూడేళ్ల తర్వాత ఆమె ధైర్యం చేసి విషయాన్ని బయటకు చెప్పడంతో అశోక్ ఖారత్ గాడి కంత్రీ పూజలు అందరికీ తెలిశాయి.
పేజీల కొద్ది సూక్తులు.. ఈ పెండ బుద్ధేంది?
పూజారులు.. పాస్టర్లు.. మత గురువులు.. జ్యోతిష్యులే కాదు. కవులు.. రచయితలు.. సొసైటీలో బాగా పేరుండి ప్రభావంతమైన సందేశాలిచ్చే చాలామంది బయటికి ఒకలా.. లోపల ఇంకోలా ఉంటారు. ఇటీవల సోషల్ మీడియాలో ఒక పెద్ద చర్చ జరిగింది. ఎవరో ఒక పేరు మోసిన కవి ఒక యువతిపై లైంగిక దాడి చేశాడని సోషల్ మీడియాలో పోస్టుల మీద పోస్టులు పడ్డాయి. వాస్తవానికి ఆ కథకుడు మంచి రచనలే చేస్తాడట. పొద్దున లేస్తే స్ర్తీవాదం బోధిస్తాడట. అంత బాగానే ఉందిగానీ అయ్యగారికి అసలు ఇంగితమే లేదు. పేజీల కొద్ది సూక్తులు రాసి ఈ పెండ బుద్ధేంది మరీ? ఇలా ఉంటుందండీ దునియాలో తెరచాటు ప్రవచనాలు వల్లించేవారి వ్యవహారం. బయటకు నీతులు చెప్పి.. లోపల ఇలా లొటపెట సప్పుడేందిరా అయ్యా?
ఇలా వ్యవహరిస్తే ఎలా?: విష్ణుప్రియ, సైంటిస్ట్
వారణాసిలో జరిగిన ఘటనల్లాంటివి ఈ మధ్య ఎక్కువయ్యాయి. ఇవి మహిళల భద్రతను ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. పవిత్ర వారణాసిలో పూజకోసం వచ్చిన మహిళల పట్ల అసభ్యంగా వ్యవహరించడం అత్యంత హేయమైన నేరం. చదువుకొని.. శాస్త్రం నేర్చుకొని.. ప్రవచనాలు చెప్పి ఇలా వ్యవహరిస్తే ఎలా?
అవమానకరంగా ఉండదా?: అర్వపల్లి క్రిష్ణ శర్మ, పురోహితుడు
ఏ మతమైనా కావచ్చు.. ఏ ధర్మమైనా కావచ్చు. ప్రతీ ధర్మ బోధకుడూ దేవునికి ప్రతినిధిలాంటి వారే. అలాంటి గౌరవప్రదమైన హోదాలో ఉన్నవారు రాక్షసుల్లా వ్యవహరించడం దారుణం. ఇలాంటి వాళ్ల వల్ల మాలాంటి వారికి అవమానకరంగా ఉంది. నిజమైన పూజారులు ఇలా చేయరు.
నమ్మి మోసపోవడమేనా?: రవి, న్యాయవాది
నమ్మకంతో వచ్చిన మహిళల పట్ల అసభ్యంగా వ్యవహరించడం.. అఘాయిత్యాలకు పాల్పడటం.. లైంగికంగా వేధించడం తీవ్రమైన నేరం. ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించే చట్టాలున్నాయి. ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎవర్ని పడితే వాళ్లను నమ్మి మోసపోతే ఎలా?






