- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాక్ మరోసారి కవ్వింపు.. ఆపరేషన్ సింధూర్ 2.0 తప్పదా?
మరోసారి భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టనుందా?

దిశ, వెబ్ డెస్క్ : మరోసారి భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టనుందా? సరిహద్దుల్లో పాక్ కవ్వింపు చర్యలకు భారత్ మళ్ళీ గట్టి బుద్ధి చెప్పబోతోందా? మరోసారి ఇరు దేశాల మధ్య యుద్ధం తప్పదా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. దీనికి అంతటికీ గల కారణం శనివారం, ఆదివారం సాయంత్రం చీకటి పడిన తర్వాత పాక్ డ్రోన్లు భారత ఆర్మీ సెక్టార్లలో చక్కర్లు కొట్టడం. 2025 ఏప్రిల్ 22న జమ్ముకశ్మీర్లోని పర్యాటక ప్రాంతం అయిన పహాల్గమ్ లో పాక్ ఉగ్రవాదులు జరిపిన దాడికి ప్రతీకారంగా భారత్ మే 7న 'ఆపరేషన్ సింధూర్' చేపట్టి పాకిస్తాన్ లోని పలు ఉగ్రవాద శిబిరాలను, పాక్ ఆర్మీ, నేవీ శిబిరాలను నాశనం చేసింది. భారత్ వైపు కన్నెత్తి చూసినా పర్యవసానాలు దారుణంగా ఉంటాయని ఇటు పాకిస్తాన్ కు అటు ప్రపంచానికి భారత త్రివిధ దళాల సత్తాను చాటింది.
అనంతరం ఇరు దేశాలు కాల్పుల విరమణ ప్రకటించాయి. అయినప్పటికీ పాక్ అడపా దడపా కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. తాజాగా నిన్న జమ్ముకశ్మీర్లోని సాంబా సెక్టార్లో డ్రోన్ల ద్వారా పలు ఆయుధాలను జారవిడిచింది పాకిస్తాన్. వెంటనే వాటిని స్వాధీనం చేసుకొని అధికారులు విచారణ జరుపుతుండగా.. నేడు మరోసారి పాక్ డ్రోన్లు సరిహద్దుల్లో సంచరించడం తీవ్ర సంచలనం రేపుతోంది. ముందుగా జమ్ముకశ్మీర్లోని నౌషేరి సెక్టార్లో ఓ పాక్ డ్రోన్ సంచరించడంతో దానిపై భద్రతా బలగాలు కాల్పులు జరిపి నేలకూల్చాయి. కొద్దినిముషాల తేడాతో మరిన్ని డ్రోన్లు భారత్ వైపు వస్తుండటంతో సైన్యం అప్రమత్తం అయ్యి ఫైరింగ్ కు దిగింది.
అయితే సరిహద్దుల వెంట పాక్ డ్రోన్లు ఆయుధాలు లేదా డ్రగ్స్ జారవిడిచి ఉండవచ్చు అనే అనుమానంతో విస్తృతంగా తనిఖీలు చేపట్టింది ఆర్మీ. వరుసగా రెండు రోజులు సరిహద్దుల వెంట పాక్ డ్రోన్లు దూసుకు వస్తుండటంతో ఆయా గ్రామాల ప్రజల భయాందోళనకు గురవుతున్నారు. ఇదిలా ఉంటే పాక్ మరోసారి రెచ్చగొట్టే చర్యలకు దిగుతోందా? లేదా ఆకస్మిక దాడులకు పాల్పడేందుకు వ్యూహ రచన చేస్తోందా అని అనుమానిస్తున్నాయి నిఘా సంస్థలు. కాగా పాకిస్తాన్ ఇలాగే చేస్తూ పోతే భారత్ ఆపరేషన్ సింధూర్ 2.0 చేపట్టి మరోసారి పాక్ ను తిరిగి కోలుకోలేనంత సర్వనాశనం చేసే అవకాశం లేకపోలేదు అంటున్నారు నిపుణులు.






