- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సెన్స్‌లేని హారన్.. ఫాయిదా తక్కువ.. పరేషాన్ ఎక్కువ.!
హారన్ సంప్రదాయాన్నే మార్చేసి హారన్ అంటే చిల్లర్ అనేటట్లు చేశారు

దిశ, ఫీచర్స్: న్యూసెన్స్ అంటే ఏంటి.? ఉత్తగనే హారన్ కొట్టడం.. ఊకూకెనే సౌండ్ చేయడం. ప్రశాంతమైన వాతావరణాన్ని పాడు చేయడం. అంతే కదా.?? ఈ సెన్స్‌లేని పనులు.. మనలో చాలామంది చేస్తుంటారు. దానివల్ల ఏమొస్తుందంటే.. ఏమీ రాదు.. రోడ్డుపై ఉత్త పంచాయతీ తప్ప. సొసైటీలో భిన్న వ్యక్తులు.. విభిన్న వ్యక్తిత్వాలు ఉంటాయి. ఒకరికి సౌండంటే పడదు.. ఇంకొకరికి పొల్యూషనంటే చిరాకు. అలాంటి వారిని ఇంకింత అసౌకర్యానికి గురిచేసే రైట్ ఎవరికుంది.?
హారన్ ఎందుకు కొట్టాలి.?
ఎదురుగా వస్తున్న వాహనాలు లేదా వెనకాల వస్తున్న వాహనాలను అలర్ట్ చేసి రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి. ఓవర్ టేక్ చేసేవాళ్లకు చిన్నపాటి సిగ్నల్ ఇవ్వడానికి. అంతేకదా.? హారన్ కొట్టి అవతలి వాళ్లను అలర్ట్ చేయడమనేది మంచి పద్ధతే. కానీ.. మనొళ్లు దానిని మిస్ యూజ్ చేస్తుంటారు. అసలు హారన్ సంప్రదాయాన్నే మార్చేసి హారన్ అంటే చిల్లర్ అనేటట్లు చేశారు.
మీ హారన్.. మీ ఇష్టమా.?
రోడ్డుమీద వెళ్తున్న ప్రతీ ఒక్కరూ.. ఏదో ఒక సందర్భంలో వెనక నుంచి వచ్చే పెద్ద హారన్ సౌండ్ విని భయపడుతుంటారు. ముఖ్యంగా ఎంత చిరాకు వేసినా ఓసారి అలా వెనక్కి చూసి మళ్లీ ఇటువైపు తిరిగి లోలోపలే తిట్టుకుంటారు. కానీ వాళ్లు మాత్రం ఆ హారన్లను మాత్రం ఆపకుండా అలాగే శబ్దాలు చేస్తూ రచ్చ చేస్తుంటారు. ఇది ఎంత న్యూసెన్సో వాళ్లకు తెలియక కాదు. అన్నీ తెలిసే అలా చేస్తుంటారు. ఇంకా కొందరైతే "హారన్ అలా ఎందుకు కొడుతున్నారు" అని అడిగితే.. "మా హారన్ మా ఇష్టం. మీకేంటి సమస్య" అని పొగరుగా మాట్లాడుతుంటారు. చేసిందే తప్పురా నాయనా అంటే మీదికెల్లి ఇలాంటి చిల్లర పంచాయతీలు. రోడ్లపై చూస్తున్నాం కదా.? ప్రతీరోజూ.. ప్రతీగంటకు ఇలాంటి హారన్ పంచాయతీలు జరుగుతుంటాయి.
బండి మీద చెయ్యేస్తే..?
95 డెసిబుల్స్ కంటే ఎక్కువ శబ్దం ఉన్న హారన్లు చట్ట విరుద్ధం. ఇలాంటి హారన్లను అమరిస్తే రూ.10000 వరకు జరిమానా వేస్తారు. ట్రాఫిక్ సమయంలో లేదా రెడ్ లైట్ల వద్ద అనవసరంగా హారన్ మోగిస్తే తాట తీస్తరు. ఇవన్నీ జనాలకు తెలియక కాదు. అన్నీ తెలిసి కూడా కావాలనే అడ్డదిడ్డంగా హారన్లు మోగిస్తుంటారు. "మనల్నెవడ్రా ఆపేది" అన్న రేంజిలో కటింగ్ ఇస్తుంటారు. ట్రాఫిక్ వాళ్లు కూడా అలాంటి న్యూసెన్స్ చేసేవాళ్లను పెద్దగా పట్టించుకోరు. కానీ.. లేకలేక ఎవడైనా అమాయకుడు బండి తీసుకొని బయటకు వెళ్తే మాత్రం వాడిని పట్టుకొని ముక్కు పిండుతారు. రూల్స్‌ను మెయింటెన్ చేయించడంపై పెట్టాల్సిన ధ్యాసంతా చలాన్ల మీద పెట్టడంతో.. "ఔ సార్.. ఏమంటున్నవిప్పుడు.? కొడ్తవా ఫోటో కొట్టు. అంతేగానీ బండిమీద చెయ్యెయ్యకు" అని జబర్దస్తీ చేస్తున్నారు జనాలు.
అదేమైనా సర్కసా.?
హారన్ మర్యాదకు గుర్తు. రోడ్డు భద్రత నియమావళికి చిహ్నం. అందర్నీ అలర్ట్‌గా ఉంచే సాధనం. కానీ.. మనొళ్లు హారన్‌ని న్యూసెన్స్ థింగ్‌గా మార్చేశారు. ఎవరు ఎలాంటి హారన్ మోగిస్తారో.. దాని సౌండ్ ఎలా ఉంటుందో అనేదాన్నిబట్టి వారి వ్యక్తిత్వాన్ని అంచనా వేయొచ్చు. ఒకడు బుల్లెట్ బండి వేసుకొని రోడ్డుమీదికొస్తాడు. ఏదో బాంబుల శబ్దంలెక్క ఉంటుంది మనోడి బైక్ హారన్. ఇంకా కొందరి హారన్ గాడిద సౌండ్ చేస్తుంది. కోడి పుంజు సౌండ్ చేస్తుంది. అదేమైనా సర్కసా గాడిదలు, పులుల సౌండ్లు హారన్లుగా వినిపించడానికి.? అంటే హారన్ అనేది నా భద్రత కోసం కాదు.. ఇతరులను భయపెట్టించడానికే అనే భ్రమలో ఉంటున్నారు నేటి యువత. వీళ్లిట్లా ఉన్నారు కాబట్టే హారన్‌కున్న మర్యాద పోయి.. చిరాకు తెప్పిస్తోంది.
ఏం చిల్లర్ హారన్.?
హారన్ గొడవలకు ఎలా దారితీస్తుందో ఒక వాస్తవ ఘటనను చూద్దాం. హర్యానాలోని ఫరీదాబాద్ బల్లభ్‌ఘర్ సెక్టార్-9లో నీల్ నయన్ అనే వ్యక్తి తన ఇంటి ముందు ఒక టెంపో ఆపాడు. అందులోని సరుకుల్ని ఇంట్లోకి తీసుకెళ్తున్నాడు. ఇంతలోనే భార్గవ్ అనే యువకుడు అటువైపు వచ్చాడు. టెంపో అడ్డంగా ఉండటంతో హారన్ కొట్టాడు. "సరుకులు దించుతున్నా.. రెండు నిమిషాలు ఆగన్నా" అని నీల్ రెక్వెస్ట్ చేశాడు. సహనం కోల్పోయిన భార్గవ్.. హారన్ కొడుతూనే ఉన్నాడు. దీంతో గొడవ స్టార్ట్ అయింది. ఇద్దరూ తిట్టుకున్నారు. "ఏం చిల్లర్ హారన్ కొడుతున్నవ్రా భయ్" అంటూ నీల్ భార్గవ్‌పై చేయి చేసుకున్నాడు. కొద్దిసేపటికి గొడవ ఆగిపోయింది. ఎక్కడొళ్లు అక్కడ వెళ్లిపోయారు. తర్వాత భార్గవ్ ముగ్గురు వ్యక్తుల్ని తీసుకొచ్చి నీల్‌పై దాడిచేసి చితకబాదాడు.
హారన్ కొట్టినా పలకవా.?
హారన్ ఎటువైపు నుంచి వచ్చినా సమస్యే అనడానికొక ఎగ్జాంపుల్ తాజా ఇన్సిడెంట్. హైదరాబాద్‌లో పోకిరీలు రూల్స్ పాటించరు. సైలెన్సర్లకు హోల్ చేసి పెద్ద పెద్ద సౌండ్స్, హారన్స్‌తో కట్ కొడుతూ చిరాకు తెప్పిస్తుంటారు. "ఇదేందిరా సామీ.. తమామ్ ఇట్ల తయారైండ్రు" అని ప్రశ్నిస్తే పంచాయితీలు.. కొట్లాటలు. ఉప్పల్ చౌరస్తాలో ఇలాంటి ఘటనే జరిగిందొకటి. ట్రాఫిక్ జామ్ వల్ల రోడ్ బ్లాక్ అయింది. ఓ క్యాబ్ డ్రైవర్ హారన్ కొట్టాడు. దానికి ప్రతిగా స్కూటీపై వెళ్తున్న పోకిరీలు కూడా రెట్టించిన హారన్ కొట్టారు. "ఎందుకొచ్చిన లొల్లిలే" అని క్యాబ్ డ్రైవర్ పట్టించుకోలేదు. "అరే అంతగనం హారన్ కొట్టినా సప్పుడుజెయ్యవేంది" అని రెచ్చిపోయిన పోకిరీలు క్యాబ్ డ్రైవర్ మీద.. కార్లో ఉన్న సాఫ్ట్‌వేర్ ఎంప్లాయిస్ మీద దాడిచేసి.. చంపేస్తామంటూ వెంబడించారు.
ఇగో ఇరువురికీ సమస్యే
రోడ్డుమీదికొచ్చినంక మనొళ్లకున్నంత "ఇగో" ఎవరికీ ఉండదు. సైడ్ ఇవ్వలేదని కొందరికీ, హారన్ కొట్టాడని కొందరికి "ఇగో" హర్ట్ అయ్యి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. అలాంటి సంఘటన ఖమ్మంలో జరిగింది. మధిర నియోజకవర్గం కల్లూరు మండలం ఎర్రబోయినపల్లికి చెందిన సోమయ్య బైక్ మీద రాపల్లి గ్రామానికి వెళ్తున్నాడు. కృష్ణాపురం దగ్గరకు రాగానే వెనకవైపు నుంచి వస్తున్న లారీ సైడ్ కోసం రెండు మూడుసార్లు హారన్ కొట్టాడు. దీనిని అవమానంగా ఫీలైన సోమయ్య లారీని ఆపి డ్రైవర్‌తో వాదనకు దిగాడు. తప్పయిపోయిందంటూ లారీ డ్రైవర్ చెప్పి.. అలానే ముందుకు వెళ్లాడు. సోమయ్యకు కోపం వచ్చింది. బైక్‌ను అడ్డంపెట్టి లారీని ఆపే ప్రయత్నం చేయగా లారీ ఢీకొట్టి సోమయ్య చనిపోయాడు.
పోలీస్ సైరన్లు ఎవరైనా వాడొచ్చా.?
కార్లకు పోలీస్ సైరన్ హారన్ పెట్టించుకోవడం ట్రెండ్ అయింది. థార్ వంటి వాహనాలకు వీటిని అమర్చి న్యూసెన్స్ చేస్తున్నారు కొందరు. వాళ్లేదో ఎమ్మెల్యే, మంత్రి, పోలీస్ అయినట్టు.. సైరన్ హారన్లు మోగిస్తున్నారు. ఎవరైనా వీఐపీలు వస్తున్నారేమో అని జనాలు టెన్షన్ పడిపోతున్నారు. తీరా చూస్తే పోకిరీలు. అలాంటిదే మహారాష్ట్రలో జరిగింది. జల్గావ్ జిల్లాలో కొందరు ఏవో సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. వెనకాల నుంచి కారు సైరన్ హారన్ మోగుతోంది. "ఎవడో పోకిరోడు" అనుకొని ఒక్కరు కూడా జరగలేదు. "అరే సామీ.. మంత్రి కారు ఇదీ. లోపల మంత్రి ఉన్నాడు" అని డ్రైవర్ చెప్పాడు. "ఇలాంటివి మస్తు చూస్తున్నం. కతలవడ్తున్నవా" అని గొడవకు దిగారు. మంత్రి కారుకే సైడివ్వరా అంటూ అతని అనుచరులు షాపులకు, వాహనాలకు నిప్పు పెట్టి చిచ్చు లేపారు.
ఎందుకు శిక్షించొద్దు.?
అనవసరమైన చోట హారన్ మోగిస్తూ రచ్చ చేస్తున్నవారిని చూస్తుంటే మనకు చాలా కోపమొస్తుంటది కదా.? శిక్ష వేస్తే సక్కగైతరు అలాంటి వాళ్లు. కర్నాటకలోని శివమొగ్గ చౌరస్తాలో ఒక కాలేజీ బస్, ఆర్టీసీ బస్సు డ్రైవర్లు పోటీ పడి హారన్ కొడుతూ విపరీతమైన శబ్ధం చేస్తున్నారు. పదే పదే హారన్లు మోగుతుండటంతో ప్రయాణికులు ట్రాఫిక్ కానిస్టేబుల్ వైపు తిరిగి చూస్తున్నారు. వెంటనే అతడు బస్సుల దగ్గరికి వెళ్లి "బాబూ.. ఏంది మీ బాధ" అని అడిగాడు. "వాడిని అడగండి సార్" అంటూ ఇద్దరు చెప్పారు. బాధ్యతారాహిత్యమైన సమాధానం ఇచ్చినందుకు ఆ ఇద్దరు డ్రైవర్లను తీసుకెళ్లి ఎక్కడైతే హారన్ మోగుతుందో.. అక్కడ చెవి పెట్టి గూబ గుయ్ మనేలా వినిపించాడు. దెబ్బకు దయ్యం వదిలినట్లు "మల్లా ఇట్ల చెయ్యం సార్ "అని కాళ్లావేళ్లా పట్టుకున్నారు ఇద్దరు డ్రైవర్లు.
తప్పు ఎవరిది.?
రోడ్డు మీద జరిగే న్యూసెన్స్‌కు కారణం యూత్ బిహేవియరే. ఎక్కడో గొడవ పడి.. సెలబ్రేషన్ చేసుకొని అక్కడి ఎమోషనంతా నో వస్తారు. రోడ్డుమీద చూపిస్తుంటారు. వాళ్ల దృష్టిలో అదొక సరదా కావచ్చు. కానీ అవతలి వాళ్లకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది. గుంటూరు జిల్లా చెరుకుపల్లిలో ఒక ఘటన జరిగింది. చెరుకుపల్లి యువకుడు శశి బైక్ మీద వెళ్తున్నాడు. అతన్ని ఓవర్ టేక్ చెయ్యాలనే ఆత్రుత వెనకాలున్న ఆటో డ్రైవర్‌ది. ఆపకుండా ఐదారుసార్లు హారన్ కొట్టాడు. "ఆగ్తలేదా.. ఎందుకట్ల నాన్‌స్టాప్‌గా హారన్ కొడ్తున్నవ్.?" అని కోపమైండు శశి. మందుకూడా తాగి ఉన్నడో ఏమో.. బండి దిగి.. ఆటో డ్రైవర్‌ను.. ఆయన పక్కన కూర్చున్న సుమంత్‌ను కత్తితో పొడిచాడు. ఇప్పుడు తప్పెవరదిది చెప్పండి.? కొడవళ్లతో పొయ్యేదాన్ని గొడ్డళ్లదాక తెచ్చుకున్నదెవరు.?
నిశ్శబ్ద ప్రాంతాలంటే తెలుసా.?
అనవసరంగా హారన్ మోగిస్తే ఎవరికైనా చికాకు కలుగుతుంది. అదేం ఆనందమో ఏమో కొందరైతే తీరుతీరు హారన్లు అమర్చుకుంటారు. ఎవరైనా వారించినా బిగ్గరగా హారన్ కొట్టడం మాత్రం ఆపరు. అలాంటి వారిని నియంత్రించడం ఎలా అనే ప్రశ్న వస్తుంది కదా.? అందుకోసమే కొన్ని నియమాలు రూపొందించారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం నిరంతరం హారన్ మోగించడం వల్ల శబ్ద కాలుష్యం మాత్రమే కాకుండా ఒత్తిడి, బీపీ, నిదర సమస్యలు కూడా వస్తాయి. ట్రాఫిక్ పోలీసులు “no honking” అనే ప్రచారం ద్వారా కొంత అవగాహనైతే కల్పిస్తున్నారు. హాస్పిటల్స్, స్కూల్స్, ప్రార్థనా ప్రదేశాలు, కోర్టులు చుట్టుపక్కల ప్రాంతాలను "నిశ్శబ్ద ప్రాంతాలు"గా ప్రకటించారు. ఈ ప్రాంతాల్లో హారన్ కొడితే రూ.1000-2000 వరకు జరిమానా వేస్తారు.
సంగీత హారన్లు
హారన్ల రొద నుంచి బయటపడాలంటే.. హారన్ల స్థానంలో భారతీయ సంగీత వాయిద్యాల శబ్దాలు ఉండేలా ఒక చట్టం తీసుకురావడానికి కేంద్రం ప్రయత్నిస్తోంది. ఫ్లూట్, తబలా, వయోలిన్, హార్మోనియం వంటి వాయిద్యాల శబ్దాలు వీటిలో ఉంటాయట. ఈ చట్టం అమలైతే రోడ్డుమీద గాడిద హారన్లు, పంది హారన్లు, కుక్క హారన్లకు బదులు వినసొంపైన మ్యూజిక్ హారన్లు వినొచ్చన్నమాట.
హారన్ శబ్దం ఎంతంటే.?
హారన్ల కారణంగా వచ్చే శబ్ద కాలుష్యం విపరీతంగా పెరిగిపోయి చెవుడుతోపాటు మానసిక ఆందోళన, ఒత్తిళ్లు, గుండె సంబంధింత వ్యాధులు తలెత్తుతున్నాయి. సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్ 1989 ప్రకారం.. ఆమోదిత హారన్‌లను మాత్రమే ఉపయోగించాలి. ఇవి శబ్ద స్థాయిలో నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. హారన్‌ను అత్యవసర పరిస్థితుల్లో లేదా రహదారిపై భద్రత కోసం మాత్రమే ఉపయోగించాలి. హారన్ శబ్దం 120 డెసిబెల్స్ కంటే ఎక్కువ ఉండొద్దు.
జరిమానా కావాలా.?
ఎన్విరాన్‌మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ప్రకారం.. హారన్ వినియోగం వల్ల శబ్ద కాలుష్యం జరగకుండా చూడటానికి రాత్రి సమయంలో హారన్ వినియోగం కఠినంగా నియంత్రించబడుతుంది. అనవసరంగా లేదా అతిగా హారన్ కొట్టడం లేదా సైలెన్స్ జోన్‌లలో హారన్ వాడినందుకు మొదటి నేరానికి రూ1000 నుంచి రూ. 2000 వరకు జరిమానా ఉంటుంది. రెండవ లేదా ఆ తర్వాత నేరాలకు రూ.4000 లేదా అంతకంటే ఎక్కువ విధించవచ్చు.






