- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వచ్చేదంతా వాయిదాల జనరేషనే.. ఎందుకో తెలుసా.?
వాయిదా.. ఏముంది ఫాయిదా.?

ఇప్పుడు చేసే పని ఇప్పుడే చేస్తే ఫాయిదా ఏముంది.?
వాయిదా వేస్తేనే పానం నిమ్మళముంటది.
ఇదేం రోగమో మనకు..?
ప్రతీ దానికి వాయిదా.. వాయిదా.. వాయిదా.!
కోర్టులో వాయిదా తీర్మాణాల కంటే ఎక్కువుంటయి మన కథలు.
ఏది చేయాల్సి ఉన్నా.. రేపు చూస్కుందాం.. ఎల్లుండి చూస్కుందాం అని వాయిదా వేస్తుంటాం.
అది ఎంత ముఖ్యమైన పనైనా.. వాయిదా అనేది ఉండాల్సిందే.
ఇదిట్లనే కొనసాగితే..
ఆఖరికి తినడం.. పండుకోవడం కూడా వాయిదాలేసుకునే పరిస్థితి వస్తుంది.
ఇదేగనుక జరిగితే..
ఇక వచ్చే జనరేషనంతా వాయిదాల జనరేషనే..!!
- దిశ, ఫీచర్స్
"రేపు రా రేగ్గాయిస్తా.. మాపురా మారెడు కాయిస్తా".. అని ప్రతీరోజూ జరుపుతుంటారు కొందరు. రేపు అయినా అదే కథ.. ఎల్లుండి అయినా అదే కథ అని తెలసి కూడా రేపూ మాపూ అని వాయిదాలేస్తుంటారు. "వాయిదా" అనే పదానికి మనమెంత దూరంగా ఉంటే జీవితం అంత త్వరగా సక్సెస్ అవుతుంది. అంటే.. "వాయిదా"లతో జీవితానికే కాదు.. మనిషి మనుగడకే ముప్పుందనేది నిజ్జంగా నిజం.
జీవితమేమైనా వస్తువా.?
"వాయిదా" పద్దులకు అలవాటుపడి మనిషి ప్రతీదాన్ని వాయిదాలతో ముడిపెడుతున్నాడు. ఏదో వస్తువు వాయిదాలో కొన్నామంటే.. మన దగ్గర పైసల్లేవు కాబట్టీ అప్పుడు కొంత ఇప్పుడు కొంత కట్టుకునే వెసులుబాటు ఉందని వాయిదా పద్ధతిని ఎంచుకుంటాం. అదే ఫార్ములా ప్రతీదానికి వర్తింపజేస్తామంటే ఎట్లా.? వస్తువులను వాయిదా పద్ధతిలో తీసుకోడం అనేది జీవితానికి అంత ఇంపార్టెంట్ విషయమేం కాదు. కానీ కొందరికి కొన్ని అవసరాల రీత్యా ఉపయోగపడుతుంది. వస్తువులే మన ప్రపంచం కాదు కదా.? అలాంటప్పుడు మరీ.. జీవితాన్ని వస్తువుల్లాగా వాయిదా పద్ధతికి పరిమితం చేస్తే ఎలా.? ఇక్కడ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. వస్తువు లేదా వాయిదా అనేది జీవితంలో ఒక చిన్న అవసరం మాత్రమే.
ఎటూ కాకుండా పోతది..
"బైటున్న చెంబు ఇంట్ల పెట్ట చాతకాదు" కొందరికి. కుర్చీలో కూసున్న మనిషి అట్లనే పొద్దూకెదాక ఉండమన్నా ఉంటడు. కానీ చెప్పిన పనిని మాత్రం జర్రాగు జర్రాగు అని గంటలు గంటలు వాయిదా వేస్తాడు. ఎందుకంటే కుర్చీలకెల్లి లేస్తే ఇంకేమైనా చెయ్యవల్సి వస్తదేమోననే భయం. కూసున్న జాగలకే తిండి రావాలె.. నీళ్లు రావాలె.. బస్ గంతే. అప్పటిదప్పుడే చేయడానికి ఈ వాయిదాల కథేందో అర్థమే కాదు. ఏదైనా జరిమానా పడతదా అన్నంత భయం పెట్టుకుంటారు లోపల. ఎప్పటి పనులు అప్పుడు చెయ్యకపోతే జరిమానా పడుతుందిగానీ.. చేస్తే ఎందుకు పడుతుందనే చిన్న లాజిక్ మిస్సయి బతుకుతుంటారు. ఈ వాయిదాల పద్ధతితో జీవితానికి ఎప్పటికైనా సమస్యే. పోస్ట్‌పోన్ అలవాటైతే బండిని ముందుకు పోనీయదు.. వెనక్కి రానీయదు.
నాన్చితే నష్టమే బ్రో..
"పోస్ట్‌పోనింగ్" అనేది లైఫ్‌లోకి ఎంటరైతే అది మనతో జీవితకాలపు జర్నీ చేస్తుంది. నాన్చుడు ధోరణి అలవాటు పడితే "నమ్మి నానవోస్తే పుచ్చి బుర్రలైనట్లు" అవుతుంది పరిస్థితి. రేపు మాపు అని జరిపితే రేపు అనేదే లేకుండ పోతుంది. కొందరుంటారు.. చిన్న పనికీ.. పెద్ద పనికీ వాయిదా వేస్తుంటారు. చేతిలో పైసలుంటాయి. ఏదైనా వస్తువు తీసుకోబుద్ది అవుతుంది. కానీ ఉన్న పైసలు ఖర్చుచేస్తే జేబు ఖాళీ అవుతుందేమో అని "రెండ్రోజులైనంక ఇస్తా" అని అంటారు. పాపం.. ఎవరి అవసరం ఎట్లుంటుందో అని షాపతను "సరేలే" అంటాడు. వారం గడుస్తుంది. పప్పు బెల్లాలకు పంచినట్లు అనవసర ఖర్చులు చేసేస్తారు. ఇంకేముంది బ్యాలెన్స్ నిల్. వాయిదా పెట్టకుండా చేతిలో పైసలున్నప్పుడే ఇచ్చేస్తే అయిపోయేది కదా.?
చేసే ఉద్దేశమే ఉంటే..
"అమాసకు చెప్పితే పున్నానికి" చేసేవాళ్లను ఎంతోమందిని చూస్తుంటాం మనం. వాళ్లకేంటంటే "అదెంత బ్రో చేసేద్దాంలే" అనే లాపర్వ ఆవహిస్తుంది వాళ్లను. ఆ పనే కాదు.. మనం ఏ పని చెప్పినా.. ఎప్పుడు చెప్పినా "చేసేద్దాంలే" అనే సమాధానమే వస్తుంది. ఇంకొకటేంటే అలాంటివాళ్లెప్పుడు కూడా "కాదు" అని మాత్రం అనరు. "కాదు" అనేవాళ్లతో అయినా "ఇది ఇలా కాదు.. అలా" అని ఏదో ఒకటి చెప్పి చేయించుకోవచ్చుగానీ.. ఈ "చేసేద్దాంలే" అనే బ్యాచితో మనం ఎలాంటి పని కూడా చేయించుకోలేం. ఎందుకంటే వాళ్లు వాయిదాల్లో మునిగి ముదిరిపోయిన వాళ్లు. "ఇలాంటివెన్ని చూడలేదు.. ఇదో లెక్కనా" అంటే అయిపాయె ఇగ. వాళ్లతో ఏంకాదూ.. చేసే ఉద్దేశం వాళ్లకు లేదూ అనీ. చేసే ఉద్దేశమే ఉంటే ఇంకా పోస్ట్‌పోన్ చేసే ముచ్చటెందుకొస్తుంది.?
ప్రాథమిక దశలోనే..
"వాయిదా" కోటాలో వాళ్లూ వీళ్లూ అనే తేడాలేదు.. అందరూ అట్లనే ఉన్నారు. హోం వర్క్ చేసుకో అని స్కూల్ పిల్లలకు చెప్పితే "ఆఫన్నవర్ అయినంక చేసుకుంటా" అంటరు. ఆఫన్నవర్ అయిపోయినంక "జస్ట్ టెన్ మినిట్స్" అంటరు. అదీ అయిపోయాక "రేప్పొద్దున్నే చేస్తా" అంటారు. పొద్దున్నే అడిగితే "బస్సులో వెళ్లేటప్పుడు చేస్కుంటా" అంటారు. బస్సులో చేసుకోడు.. స్కూల్లో చేసుకోడు.. మళ్లీ వచ్చి చూస్తే ఎక్కడి హోంవర్క్ అక్కడే ఉంటుంది. అంటే.. ప్రాథమిక స్థాయి నుంచే ఈ వాయిదాల సంప్రదాయం కొనసాగుతోంది. ఇది చిన్నప్పుడే ఎలా అలవాటవుతుందో.. ఎవర్ని చూసి నేర్చుకుంటున్నారో అని పేరెంట్స్ ఆలోచించాలి. మొగ్గ దశలోనే దానిని తుంచేస్తే బాగుంటుంది. లేకపోతే ఇప్పుడున్న కాంపిటీషన్‌కు వాయిదా పెద్ద సమస్యే అవుతుంది.
ఆగమాగం ఎందుకు.?
మనొళ్లు ఏవేవో పెద్ద పెద్ద పనులు చేస్తం అని చెప్తుంటారు. బయట అహో ఒహో అని గొప్పలు చెప్పుకొని మెప్పు పొందుతుంటారు. కానీ ఇంట్లో ఫ్యామిలీకి చేయాల్సిన చిన్న చిన్న పనులు మాత్రం చేయకుండా వాయిదా వేస్తుంటారు. ఆధార్ కార్డు అప్డేట్ చేయించడం ఎంత చిన్న పనీ.? కానీ మనొళ్లు దానిని కూడా ఏండ్లకేండ్లు వాయిదా వేస్తుంటారు. పాపం.. పిల్లలకు స్కూల్లో రోజూ చెప్తుంటారు. వాళ్లొచ్చి "డాడీ.. ఆధార్ కార్డూ" అని మొత్తుకుంటారు. "అర్రే.. ఈరోజు బిజీగా ఉన్నా నానా.. రేపు పక్కా చేయిస్తా" అని మాటిస్తాడు. రోజూ ఇదే తంతు. లాస్టుకు విసిగిపోయి.. ఇక నీ ఇష్టం అన్నప్పుడు ఆఘమేఘాల మీద పొయ్యి హరీభరీ చేస్తుంటారు. అంత హరీభరీ ఎందుకు.? వాయిదా వేయకుండా చెయ్యాల్సిన టైంలో చేస్తే ఈ టెన్షనేది ఉండదు కదా.?
ఆగి ఆగి ఆఖరికి..
కొంతమంది భలే గమ్మతుంటారు. నాన్చితే ఏం లాభమో.. వాయిదా వేస్తే ఏం ఫాయిదానో అర్థమే కాదు. జాబ్ నోటిఫికేషన్ వచ్చి మినిమం నెల రోజులైతే గడువుంటుంది. దరఖాస్తు చేయడానికి ఏమేం సర్టిఫికేట్లు కావాలీ.? ప్రక్రియ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది.? లాస్ట్ డేట్ ఎప్పుడు.? అనేవి స్పష్టంగా మెన్షన్ చేస్తారు. "అప్లయ్ చేసినవా" అని ఎవరైనా అడిగితే. "ఎహే ఇప్పటి నుంచి ఎందుకు.. ఇంకా చాలా టైముంది.. మెల్లగా చేద్దాంలే" అని అంటారు. అలా అదికాస్త మరుగునపడి ఆఖరి తేదీ దగ్గరకొస్తుంది. అప్పుడు తేరుకొని అయ్యగారు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ లేదు.. అదిలేదు ఇదిలేదు అనీ నెత్తినోరు బాదుకుంటాడు. ఏదో అదృష్టం బాగుంటే ఆఖరు తేదీని పొడగిస్తే బయటపడతారు కానీ.. వాయిదాను నమ్ముకునే వాళ్లు ఎప్పటికీ లక్ష్యాన్ని చేరుకోరు.
దాస్తే ఏమొస్తుంది.?
ఎవరైనా సాయం చేస్తే ఏదైనా గుడ్‌విల్ కింద ఇద్దామని మనసులో అనుకుంటారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తారు. వెంటనే ఇస్తే కిక్కుండదనీ.. కొద్దిరోజులు ఆపుతారు. కానీ "దొంగలు పడ్డ ఆర్నెళ్లకు కుక్కలు మొరిగితే" ప్రయోజనమేముందీ.? దొంగ దొరకడు.. పోయిన సొమ్ము రికవరీ కాదు. ఇదికూడా ఇంతే. మనం ఇచ్చే గుడ్‌విలో లేక సాయమో ఇవ్వాల్సిన టైంలో ఇవ్వకుండా "దాచి దాచి దయ్యాల పాలుజేసినట్లు" ఎప్పుడో మనకు వీలైనప్పుడు ఇస్తే.. అది ఇచ్చి ఫాయిదా కూడా ఉండదు. అదేమైనా వస్తువా "దాచి ధరొచ్చిన్నాడు అమ్ముకునేందుకు".? "ఆరంభింపరు నీచమానవులు".. పద్యంలో చెప్పినట్లు మనకు ఇవ్వాలని మనసుకు అనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇవ్వడమే బెటర్. ఇద్దునా వద్దా అని ఇటు ఇయ్యకుండా.. అటు ఆపకుండా చేస్తే ఎట్లా.?
నీది వాయిదా.. నాది వాయిదా
పనులను వాయిదా వేయడమే కాదు. లైఫే వాయిదాలకు కనెక్ట్ చేసుకుంటున్నారు జనాలు. ఎన్కటికి "ఉద్దెర అంటే ఊర్లు పల్లెలు నావే" అనేవాళ్లంటా. ఇప్పుడు వాయిదాలు అనేసరికి "పోయిన పానం లేసొచ్చినట్లు" చేస్తుండ్రు. మంచి ఇల్లుండాలె. చేతిలో పైసా ఉండదు. దానికో హోంలోన్ వాయిదా వెతుక్కుంటాం. ఇల్లుండంగనే సరిపోతుందా దానికో అందమైన ఫర్నీచరుండాలె.. ఇంటికి సూటయ్యే పెద్ద టీవీ ఉండాలె.. రంగు రంగుల వస్తువులతో ఆ ఇంటికి ఠీవీ రావాలె. వీటన్నింటికీ ఒకటే మందు వాయిదాల్లో తీసుకోవడం. నెట్ అమౌంట్ అయితే అన్నీ ఒకేసారి కట్టాలె. కానీ.. అన్నీ ఒకేసారి కట్టడం అవుతుందా .? అంటే క్వశ్చన్ మార్క్. అందుకే వాయిదాలేసుకొని తీసుకుంటారు. సింగిల్ పేమెంట్ పదితో అయిపోయేది వాయిదాల రూపంలో ఇరవై అవుతుందనేది గ్రహించరు.
అది మాత్రం వాయిదా వద్దు
వాయిదా విషయంలో గమనించాల్సిన ఇంకో విషయం పెండ్లిళ్లు. మనలో చాలామంది పెండ్లీలు చేసుకోవడాన్ని వాయిదాలు వేస్తుంటారు. ఏమన్నా అంటే.. "లైఫ్ సెటిల్ అయినంక చేసుకుందాంలే" అంటుంటారు. పెండ్లిని చేసుకోవాల్సిన టైంలో చేసుకుంటే మన పిల్లలు కరెక్ట్ టైంలో చేతికందుతారు. అలా జరగాలి అంటే చదవాల్సిన టైంలో చదివి.. జాబ్ చేయాల్సిన వయసులో జాబ్ చేయాలె. అలా కాకుండా వాయిదాలు వేసుకుంటూ నలభై ఏండ్ల తర్వాత చేసుకుంటే.. పిల్లలు ఆలస్యంగా పుట్టి మన వయసు అరవైయేండ్లకు వచ్చి రిటైర్డ్ అయ్యే టైమొచ్చినప్పుడు పిల్లలు పది పదిహేనేండ్ల వయసుకొస్తారు. ఆ టైంలో వాళ్లను ఏం చదివించాలె.. ఎలా చదివించాలె అనే దిగులు. దానికితోడు పిల్లలకేం కూడబెట్టలేదనే ఆందోళన ఉంటుంది.
డెడ్‌లైన్ లేని పనుంటదా.?
ఉద్యోగమైనా.. వ్యాపారమైనా.. చదువైనా.. వ్యవసాయమైనా.. ఏదైనా సరే సమస్య వచ్చినప్పుడే పరిష్కారం కావాలెగానీ.. ఆర్నెళ్లకు చూద్దామంటే ఎట్లా.? వాన పడ్డప్పుడు గొడుగు కావాలె. ఉడుకుమీద ఉన్నప్పుడే దెబ్బకు మందు పెట్టాలె. తెగులు సోకినప్పుడే పంటకు మందెయ్యాలె. అంతేగానీ సూద్దాంలే అన్నమే అనుకోండి. తర్వాత పదివేలు పెట్టినా మన పంటను కాపాడుకోలేం. లక్ష రూపాయలు ఖర్చు చేసైనా సరే ఆఖరి తేదీ దాటితే అంతే సంగతిగ. దునియాలో ప్రతీ పనికీ ఒక డెడ్‌లైన్ ఉంటుంది. ప్రతీ వస్తువుకు ఒక ఎక్స్‌పయిరీ డేట్ ఉంటుంది. వాటిని దాటి వెళ్లి చేసేదేం ఉండదు. ఉంటేగింటే ఉత్త ఆయాసం తప్ప వేరే ప్రయోజనమేమీ ఉండదు. కాబట్టీ దేనిని ఆలస్యం చేయకుండా.. దేనికీ వాయిదాను పరిచయం చేయకుండా ఉంటే మంచిది.






