- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఒక్క క్లిక్‌తో మోసం.. కానీ ఈ జాగ్రత్తలే మీకు రక్షణ!
21వ శతాబ్దంలో టెక్నాలజీ విప్లవాత్మకంగా మారుతోంది. ఈ డిజిటల్ యుగంలో ఇంటర్నెట్, మొబైల్ ఫోన్‌లు, ఆన్‌లైన్ లావాదేవీలు, యాప్ ఆధారిత సేవలు.. ఇవన్నీ మన నిత్య జీవితంలో భాగంగా మారాయి.

దిశ, వెబ్ డెస్క్: 21వ శతాబ్దంలో టెక్నాలజీ విప్లవాత్మకంగా మారుతోంది. ఈ డిజిటల్ యుగంలో ఇంటర్నెట్, మొబైల్ ఫోన్‌లు, ఆన్‌లైన్ లావాదేవీలు, యాప్ ఆధారిత సేవలు.. ఇవన్నీ మన నిత్య జీవితంలో భాగంగా మారాయి. కానీ ఈ వేగవంతమైన అభివృద్ధికి అనుబంధంగా ఒక భయంకరమైన దుష్పరిణామం కూడా పుట్టుకొస్తోంది. అదే.. సైబర్ నేరాలు. గత దశాబ్దంతో పోలిస్తే ప్రస్తుతం ప్రతి రోజూ ఏదో ఒక రూపంలో సైబర్ మోసాలు వెలుగులోకి వస్తున్నాయి.
ఒక్క క్లిక్‌తో లక్షలు నష్టపోతున్న ప్రజలు
ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు అత్యంత చురుకుగా, అధునాతన పద్ధతుల్లో మోసాలు చేస్తున్నారు. 'మీ బిల్లు చెల్లించలేదు', 'మీ బ్యాంక్ ఖాతా బ్లాక్ అవుతుంది', 'పీఎం కిసాన్ డబ్బులు వస్తాయ్', 'ఖరీదైన వస్తువులు ఆఫర్లో అతి తక్కువ ధరలకు వస్తున్నాయి' అంటూ నకిలీ మెసేజ్‌లు పంపిస్తున్నారు. వెంటనే ప్రయోజనం పొందాలంటే ఆ మెసేజ్‌ల్లో లింక్ పై క్లిక్ చేయాలని చెబుతుంటారు. వారు పంపిన ఒక మాయలింక్‌ను అమాయకంగా నొక్కితే.. ఇక అంతే సంగతి ఒక్క క్షణంలో మన ఫోన్, బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బంతా వారి చేతుల్లోకి వెళ్లిపోతోంది. ముఖ్యంగా పెద్దవాళ్లు, టెక్నాలజీకి అంతగా పరిచయం లేని ప్రజలు ఈ మోసాలకు అధికంగా బలవుతున్నారు.
ఉదాహరణకు: హైదరాబాద్‌కు చెందిన పద్మావతి అనే ఓ మహిళకు ఇటీవల 'మీ ఖాతా బ్లాక్ అవుతోంది.. వెంటనే KYC అప్డేట్ చేయండి' అనే పేరుతో ఓ మెసేజ్ వచ్చింది. ఆమె అందులోని లింక్‌ను నొక్కగానే మొబైల్ ఫోన్ స్లో అయిపోయింది. కొన్ని గంటల వ్యవధిలో ఆమె బ్యాంకు ఖాతాలోని రూ.2.3 లక్షలు ఖాళీ అయిపోయాయి.
సైబర్ మోసాల్లో ప్రముఖమైనవి:
నేటి సైబర్ నేరగాళ్లు మానసికంగా ప్రజలను మాయ చేసేందుకు సైకాలజీ, డిజిటల్ డిజైన్, ఫోన్ స్పూఫింగ్ వంటి ఆధునిక సాంకేతికతలను ఉపయోగిస్తున్నారు. అందులో కొన్ని ప్రాముఖ్యమైన మోసపు పద్ధతులు ఇవే:
ఫిషింగ్ లింకులు (Phishing Links):
బ్యాంకు, ఆధార్, పాన్ కార్డు, లేదా ఉద్యోగ అవకాశాల పేరుతో ఫ్రాడ్, ఫేక్ లింకులు పంపుతారు. వాటిని నొక్కగానే ఫోన్‌లో స్పైవేర్ ఇన్‌స్టాల్ అవుతుంది లేదా ఖాతా వివరాలు చోరీకి గురవుతాయి.
ఫోన్ స్పూఫింగ్ (Phone spoofing):
నేరగాళ్లు అసలు బ్యాంక్ కస్టమర్ కేర్ నెంబర్‌నే స్పూఫ్ చేసి కాల్ చేస్తారు. 'మీ ఖాతా బ్లాక్ అవుతోంది.. వెంటనే OTP చెప్పండి' అంటూ బ్యాంకు అధికారులుగా ఫోన్ చేసి మాట్లాడుతారు. ప్రజలు నమ్మి OTP ఇచ్చేసిన తర్వాత వారి ఖాతా ఖాళీ అయిపోతుంది.
సెలబ్రిటీ నకిలీ అకౌంట్లు & గిఫ్ట్ స్కాములు:
ప్రముఖుల పేరుతో సోషల్ మీడియాలో నకిలీ అకౌంట్లు సృష్టించి డబ్బులు అడుగుతారు. లేదా 'మీరు రూ.లక్షల విలువ చేసే వస్తువులు గెలుచుకున్నారు' అంటూ మెసేజ్‌లు పంపుతారు. అది పంపించాలంటే ముందు సెక్యూరిటీ, ప్రాసెసింగ్ ఫీజు కట్టాలంటూ పలు దఫాలుగా డబ్బులు కట్టించుకుని, తిరిగి ఎలాంటి వస్తువులు పంపించరు.
ఆన్‌లైన్ జాబ్ స్కాములు:
నిరుద్యోలుగు ఎక్కువగా ఇలాంటి మోసాలకు బలవుతున్నారు. 'ఇంట్లో నుంచే పని చేసి రోజుకు రూ.3000 సంపాదించండి' అంటూ టెలిగ్రామ్, వాట్సాప్ ద్వారా ప్రచారం చేస్తారు. మొదటి విడతలో కొంత డబ్బు పంపించి నమ్మకం కలిగిస్తారు. ఆపై పెద్ద మొత్తాల పెట్టుబడులు అడిగి చివరికి మొహం చాటేస్తారు.
రిమోట్ యాక్సెస్ టూల్స్ (RATs):
నిజానికి ఇది ఓ సాఫ్ట్‌వేర్. దీని ద్వారా మొబైల్ ఫోన్ లేదా కంప్యూటర్‌ను ఎక్కడో దూరం నుంచే నియంత్రించగలరు. ఇది అసలుగా ఐటీ టెక్నికల్ సపోర్ట్, డెస్క్‌టాప్ షేరింగ్ కోసం రూపొందించబడింది. కానీ అదే టెక్నాలజీని సైబర్ నేరగాళ్లు ఇప్పుడు మోసపూరిత ప్రయోజనాలకు వాడుతున్నారు. మొబైల్‌ను పూర్తిగా హ్యాక్ చేస్తారు. దీంతో మీరు టైప్ చేస్తున్నదీ, మీకు వచ్చే మేసేజ్‌లు, OTPలు, పాస్‌వర్డ్‌లు.. అన్నీ వారికి కనిపిస్తాయి.
వారే ప్రధాన టార్గెట్
సైబర్ నేరగాళ్లకు లక్ష్యంగా మారుతున్నవారిలో గ్రామీణ ప్రాంత ప్రజలు, వృద్ధులు ఎక్కువగా ఉంటున్నారు. వీరికి డిజిటల్ అవగాహన తక్కువగా ఉండటం వల్ల డిజిటల్ లావాదేవీలు, ఆన్‌లైన్ సేవలపై సరైన అవగాహన లేదు. మొబైల్ ఫోన్ వాడుతున్నా, ఫోన్‌కి వచ్చిన మెసేజ్ లేదా లింక్‌ల వాస్తవికత ఏంటో తెలుసుకునే అవకాసం తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు 'మీ పింఛన్ నిలిపివేయబడుతుంది.. వెంటనే KYC అప్డేట్ చేయండి' అనే SMS వస్తే వారు నమ్మే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితిని క్యాష్ చేయాలనే ప్రయత్నంలో నేరగాళ్లు వారి భాషలోనే (తెలుగు, హిందీ) మెసేజ్‌లు పంపించి మోసం చేస్తున్నారు. అలాగే, ఇటీవల 'సైబర్ ఫ్రాడ్' కేసుల్లో విద్యార్థులు, ఉద్యోగస్తులు కూడా మోసపోతున్నారు. ముఖ్యంగా డేటా ఎంట్రీ, ఫ్రీలాన్స్ జాబ్స్, క్రిప్టో ఇన్వెస్ట్‌మెంట్స్ పేరిట వారిని మోసం చేస్తున్నారు.
ఫోన్ హ్యాక్ అయిందని గుర్తించటం ఎలా?
ఫోన్ హ్యాక్ అయినట్లు గుర్తించడానికి కొన్ని ముఖ్యమైన సంకేతాలు ఉంటాయి. ఫోన్ సాధారణంగా పనిచేయకుండా హఠాత్తుగా నెమ్మదిగా మారితే, అనుమానం కలగవచ్చు. అటువంటి సమయంలో, బ్యాటరీ వేగంగా తగ్గుతుండటం, డేటా వినియోగం అకస్మాత్తుగా పెరగడం, లేదా ఫోన్ వేడెక్కడం మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. అదేవిధంగా, మీరు ఇన్‌స్టాల్ చేయని అనుమానాస్పద యాప్‌లు, ఫోన్‌లో అకారణంగా పాప్-అప్‌లు కనిపించడం, లేదా ఓటీపీ, మెసేజ్‌లు ఇతరులకు పంపబడినట్లు గమనిస్తే.. అవి హ్యాకింగ్‌కు సంకేతాలు కావచ్చు.
మరొక ముఖ్యమైన విషయం మీ వ్యక్తిగత అకౌంట్లలో (బ్యాంక్, మెయిల్, సోషల్ మీడియా) అనుమానాస్పద లాగిన్‌లు, అకౌంట్‌కి వచ్చిన వేరే ప్రాంతాల నుంచి యాక్సెస్ నోటిఫికేషన్లు కనిపించవచ్చు. వాటితో పాటు, ఫోన్‌కి రికవరీ మెయిల్ లేదా పాస్‌వర్డ్ మార్చడం వంటి అలర్ట్స్ వచ్చినా అప్రమత్తంగా ఉండాలి. ఫోన్ హ్యాక్ అయిందని అనిపిస్తే, వెంటనే ఇంటర్నెట్ డిసేబుల్ చేయడం, అనుమానాస్పద యాప్‌లను అన్‌ఇన్‌స్టాల్ చేయడం, అవసరమైతే ఫోన్‌ను ఫ్యాక్టరీ రీసెట్ చేయడం మంచిది.
ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు
సైబర్ మోసాలపై ప్రభుత్వం, అధికారులు నిత్యం.. పాఠశాలలు, కాలేజీల్లో, గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నారు. అలాగే, ప్రతి రాష్ట్రంలో ప్రత్యేకంగా సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ విభాగాలు ఏర్పడుతున్నాయి. ఇక ఏదైనా సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 అనే టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయొచ్చు. ఇదే కాకుండా www.cybercrime.gov.in వెబ్‌సైట్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు. తక్షణంగా ఫిర్యాదు చేస్తే పోలీసులు డబ్బు వెళ్లకుండా బ్యాంక్ లావాదేవీలను అడ్డగించేందుకు ప్రయత్నిస్తారు.
ప్రజలు తప్పనిసరిగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
* సైబర్ నేరాల్ని అరికట్టే శక్తి ప్రతి వ్యక్తి చేతుల్లోనే ఉంది. కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటిస్తే, సైబర్ మోసాల నుంచి తప్పించుకోవచ్చు.
* తెలియని నంబర్ల నుంచి వచ్చిన కాల్స్, మెసేజ్‌లను నమ్మకూడదు. ఫోన్లు హ్యాక్ అయ్యే ప్రమాదం ఉంది.
* బ్యాంక్‌లు, ప్రభుత్వ సంస్థలు OTP లేదా ఖాతా వివరాలు అడగవు. ప్రతి ఒక్కరు దీనిని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. అలాగే, మీ ఫోన్ నంబర్, ఈమెయిల్, DOB, అడ్రస్ లాంటి డీటెయిల్స్ పబ్లిక్‌గా ఉంచితే నేరగాళ్లకి అవి ఉపయోగపడతాయి.
* ఫోన్‌లోనూ, ల్యాప్‌టాప్‌లోనూ ట్రస్టెడ్ యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్ ఉండాలి. ఎప్పటికప్పుడు OS, యాప్స్ అప్‌డేట్ చేస్తుండాలి. పాత వర్షన్‌లు హ్యాకింగ్‌కి గురయ్యే ప్రమాదం ఉంది.
* సోషల్ మీడియా అకౌంట్‌లకు స్ట్రాంగ్ పాస్‌వర్డ్ & 2-ఫ్యాక్టర్ ఆటెంటికేషన్ తప్పనిసరి. ఇది అకౌంట్‌లోకి ఇతరులు ప్రవేశించకుండా కాపాడుతుంది.
* లింక్‌ను నొక్కే ముందు అది అధికారికంగా వచ్చిందా లేదా అని సరిచూసుకోవాలి. వెబ్‌సైట్ అడ్రస్ (URL)ను నిజమైనదా నకిలీదా తెలుసుకుని క్లిక్ చేయాలి.
* లింక్ నొక్కిన తర్వాత మీ ఫోన్‌లో నెమ్మదిగా పని చేస్తున్నట్లైతే, ‘Settings > Apps’లోకి వెళ్లి కొత్తగా కనిపిస్తున్న అనుమానాస్పద యాప్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేయాలి.
* పబ్లిక్ Wi-Fi లేదా ఉచిత నెట్‌వర్క్‌లలో బ్యాంకింగ్, లావాదేవీలు చేయకూడదు. ఎందుకంటే.. పబ్లిక్ నెట్‌వర్క్‌లు సురక్షితంగా ఉండవు. వీటిలో సైబర్ నేరగాళ్లు డేటాను ఎలా అయినా ట్రాక్ చేయగలరు.
* పూర్తిగా ఫోన్ హ్యాక్ అయిందనే అనుమానం ఉంటే, వెంటనే ఫోన్‌ను రీసెట్ చేయాలి. ఇలా చేస్తే సైబర్ నేరాగాళ్లు మన ఫోన్‌పై నియంత్రణ కోల్పొతారు.
* ఫోన్ స్విచ్ ఆఫ్ చేయటం లేదా ఫ్లైట్ మోడ్‌కి మార్చాలి. దీంతో ఫోన్‌లో వృద్ధిగా జరిగే మాల్వేర్ యాక్టివిటీని తాత్కాలికంగా అడ్డుకోవచ్చు.
ఇక చివరగా.. వేగంగా దూసుకెళ్తోన్న డిజిటల్ ప్రపంచంలో మనం కూడా టెక్నాలజీపై నిత్యం అవగాహన పెంచుకోవాలి. సైబర్ నేరగాళ్లు ఎంత చురుకుగా మారితే, మనం అంతకు మించిన తెలివిని చూపాలి. ఒక్క లింక్ నొక్కితే ఏమవుతుంది? అనే నిర్లక్ష్యాన్ని వీడాలి. ఇంటర్నెట్ వాడకం ఓ హక్కు అయితే, దాన్ని సురక్షితంగా వాడటం మన బాధ్యత. ప్రతి ఒక్కరూ సైబర్ భద్రత విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తేనే ఈ డిజిటల్ ప్రపంచంలో మన వ్యక్తిగత సమాచారం, మన డబ్బులు జాగ్రత్తగా ఉంచుకోగలుగుతాం.






