ఆకాశంలో అగ్గి పిడుగు..

by Ajay Maddhiboyina |   (  Updated:2025-03-10 14:32:21  IST  )

ఆసియాలోని పలు దేశాలు తమ సైనిక బలగాలను ఆధునికీకరించడానికి, ప్రాంతీయ భద్రతను పెంపొందించడానికి శ్రమిస్తున్నాయి. ఇండియా, పాకిస్తాన్, చైనా, జపాన్, కొరియాలు తమ గగనతల భద్రతను పెంచుకునేందుకు అధునాతన ఫైటర్ జెట్లను తమ సైన్యంలో భాగంగా చేసుకుంటున్నాయి.

ఆకాశంలో అగ్గి పిడుగు..
X

- గగనతలం మరింత భద్రం..

- ఎఫ్ 35 వస్తే దక్షిణాసియాలో మనమే బలవంతులం

- పాకిస్తాన్ వద్ద చైనా తయారీ జే-35

- దాదాపు ఎఫ్ 35కి ఉన్న ఫీచర్లే కలిగి ఉన్న జే-35

జాన్ కోరా

ఇండియా ఎవరితో కయ్యానికి కాలు దువ్వదు. కానీ శత్రువుకు సరైన సమాధానం చెప్పడంలో మాత్రం ముందుంటుంది. చుట్టుపక్కల ఉన్న శత్రు దేశాల నుంచి వచ్చే ముప్పును ముందుగానే అంచనా వేసి.. అందుకు తగిన బలాన్ని ఇటీవల కాలంలో ముందుగానే పెంచుకుంటోంది. నెహ్రూ కాలంలో ఉన్న దౌత్య సంబంధాలను పక్కన పెట్టి.. మోడీ హయాంలో సరికొత్త మిత్రులతో ముందుకు నడుస్తోంది. గతంలో రష్యాతో మెరుగైన సంబంధాలు ఉండేవి. యుద్ద సంబంధిత విమానాలు, సబ్‌మెరైన్లు, షిప్పులను రష్యా నుంచి కొనుగోలు చేసేది. అయితే మన దాయాది దేశమైన పాకిస్తాన్ ఇప్పుడు చైనాతో జతకట్టి.. అధునాతన యుద్ద విమానాలు, క్షిపణులను సమకూర్చుకుంటుండటంతో.. ఇండియా కూడా రూటు మార్చక తప్పలేదు. ఫ్రాన్స్‌కు చెందిన డస్సో కంపెనీ నుంచి కొనుగోలు చేసిన రఫేల్ యుద్ద విమానాలే మన దగ్గర ఉన్న అత్యాధునిక ఫైటర్ జెట్లు. అయితే ఇటీవల చైనాతో కూడా ఘర్షణ వాతావరణం నెలకొంటుండటం.. పాకిస్తాన్ కూడా సరికొత్త ఫైటర్ జెట్లను చైనా నుంచి కొనుగోలు చేస్తుండటంతో.. ఇండియా ముందుగానే మేల్కొంది.

ఆసియాలోని పలు దేశాలు తమ సైనిక బలగాలను ఆధునికీకరించడానికి, ప్రాంతీయ భద్రతను పెంపొందించడానికి శ్రమిస్తున్నాయి. ఇండియా, పాకిస్తాన్, చైనా, జపాన్, కొరియాలు తమ గగనతల భద్రతను పెంచుకునేందుకు అధునాతన ఫైటర్ జెట్లను తమ సైన్యంలో భాగంగా చేసుకుంటున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద సైనిక బలగాల్లో ఇండియా కూడా ఒకటి. ఇండియా అనేక అత్యాధునిక ఆయుధాలతో పాటు సైనిక సామాగ్రిని కలిగి ఉంది. ఇక భారత వాయుసేనలో రఫేల్, సుఖోయ్-30, మిగ్-29 వంటి అత్యాధునిక విమానాలు ఉన్నాయి. ప్రధాని మోడీ తాజా అమెరికా పర్యటనలో అత్యాధునిక ఎఫ్-35 యుద్ద విమానాలను అందిస్తామని ట్రంప్ ప్రకటన చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. వాస్తవానికి అమెరికాకు ఎంతో సన్నిహితంగా ఉన్న దేశాలకు కూడా ఎఫ్-35లను ఇవ్వడం లేదు. రష్యా నుంచి ఎస్-400 అనే వాయు రక్షణ వ్యవస్థను టర్కీ కొనుగోలు చేసింది. దీంతో ఎఫ్-35లను అమ్మడానికి అమెరికా నిరాకరించింది. అయితే 2018లో ఇండియా కూడా రష్యా నుంచి ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను కొనుగోలు చేసింది. అయినా సరే అమెరికా మనకు ఎఫ్-35లును అందించడానికి సుముఖత వ్యక్తం చేసింది. ఇండియా దగ్గర కనుక ఎఫ్-35లు చేరితే.. దక్షిణాసియాలోనే అత్యంత బలమైన వాయుసేనగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మారుతుంది.

ఎఫ్ 35 ప్రత్యేకతలు ఏంటి?

ఎఫ్-35 స్టెల్త్‌జెట్ 5వ తరం ఫైటర్ జెట్.. ప్రపంచంలో వాడకంలో ఉన్న అత్యాధునిక యుద్ద విమానం. గగనతలంలో ఆధిపత్యం, స్ట్రైక్ మిషన్లు, నిఘా కోసం ఈ విమానాన్ని వాడతారు. ఈ విమానంలో ఉన్న స్టెల్త్ టెక్నాలజీ వల్ల ప్రత్యర్థి రాడార్లు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌ను కళ్లుగప్పి శత్రు స్థావరాలను ధ్వంసం చేయగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఎఫ్-35లో ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్, నిఘా, పర్యవేక్షణ సామర్థ్యాలు ఉన్నాయి. ఇందులో ఉండే అడ్వాన్స్‌డ్ సెన్సార్లు అనేక సోర్సెస్ నుంచి సమాచారాన్ని సేకరించి సందర్భోచితంగా వ్యహరిస్తుంది. మాక్ 1.6ను మించి సూపర్ సోనిక్ వేగంతో ప్రయాణించే సామర్థ్యాన్ని ఎఫ్-35 కలిగి ఉంది. ఇక ఎఫ్-35లో ఉండే హెల్మెట్ మౌంటెడ్ డిస్‌ప్లే పైలెట్‌కు రియల్ టైం సమాచారాన్ని అందిస్తుంది.

ఎఫ్-35 ద్వారా గాల్లో నుంచి గాల్లోకి మిస్సైల్స్‌ను ప్రయోగించవచ్చు. ఇందులో ఎఫ్-35బీ అనే వేరియంట్ విమానం రన్ వే లేకపోయినా నిట్టనిలువుగా ల్యాండింగ్, టేకాఫ్ చేయగలదు. ఈ విమానం 6 నుంచి 8.1 టన్నుల బరువైన ఆయుధాలను మోసుకెళ్తుంది. దీన్ని కేవలం ఫైటర్ జెట్‌గానే కాకుండా సైనికులు, ఆయుధాల రవాణాకు కూడా ఉపయోగించుకోవచ్చు. ఇందులో ప్రాథమిక వేరియంట్ ధర దాదాపు రూ.695 కోట్లు కాగా.. ఎఫ్-35బీ ధర సుమారు రూ.990 కోట్ల వరకు ఉంటుంది. ఇక నౌకల కోసం తయారు చేసిన ఎఫ్-35సీ ధర రూ.955 కోట్లు ఉంటుంది. ఎఫ్-35లను అమెరికాకు చెందిన లాక్‌హీడ్ మార్టిన్ అనే కంపెనీ తయారు చేస్తోంది. ఇప్పటికే ఈ సంస్థ ఇండియాలో ఏరో స్పేస్, డిఫెన్స్ వ్యవస్థ ఏర్పాటులో కీలక పాత్ర పోషించింది.

ప్రస్తుతం మన దగ్గర ఏం ఉన్నాయి?

ఇండియా దగ్గర ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన రఫేల్ యుద్ద విమానాలు ఉన్నాయి. ప్రస్తుతం ఇవే అత్యంత ఆధునికమైనవి. అయితే ఎఫ్-35 కంటే వీటి టెక్నాలజీ తక్కువే. ప్రస్తుతం భారత్ దగ్గర 36 రఫెల్ యుద్ద విమానాలు ఉన్నాయి. ఇక హెచ్ఏఎల్ తయారు చేసిన తేజస్ యుద్ద విమానాలు కూడా భారత్ వద్ద ఉన్నాయి. తేజస్ ఎంకే1 యుద్దవిమానాలు 31 ఉన్నాయి. వీటిని బహుళ కార్యక్రమాలకు ఉపయోగించవచ్చు. అలాగే 73 తేజస్ ఎంకే ఏ1 విమానాలను ఆర్డర్ ఇచ్చారు. మరో 97 విమానాల కొనుగోలుకు ఆమోదం లభించింది.

రష్యాకు చెందిన సుఖోయ్ ఎస్‌యూ-30ఎంకేఐ విమానాలు 259 ఉన్నాయి. మరో 12 విమానాలకు ఆర్డర్ ఇచ్చారు. వీటితోపాటు గతంలో మిగ్-29 విమానాలను కూడా కొనుగోలు చేశారు. ఫ్రాన్స్ నుంచి మిరేజ్-200, యూకే నుంచి సెపెకాట్ జాగ్వర్, మిగ్-21 ఇంటర్‌సెప్టార్ విమనాలు కూడా భారత్ కొనుగోలు చేసింది. గతంలో బ్రెజిల్ నుంచి ఎంబ్రార్ ఆర్-99 విమానాలు మూడు కొనుగోలు చేశాము. అయితే ప్రస్తుతం మన దగ్గర ఉన్న రఫేల్, తేజస్ విమానాలే నేటి తరం యుద్దాలకు పనికి వచ్చే విమానాలుగా నిపుణులు చెబుతున్నారు.

మనం ఏమీ తయారు చేయలేదా?

బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) సంస్థ అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఏఎంసీఏ) విమానాన్ని తయారు చేస్తోంది. ఇది రెండు ఇంజన్లు కలిగిన సింగిల్ సీట్ ఫైటర్ జెట్. ఇందులో కూడా దాదాపు ఎఫ్-35లో ఉండే ఫీచర్లు అన్నీ ఉన్నాయి. ఐదో తరం స్టెల్త్ , మల్టీరోల్ విమానంగా దీన్ని రూపొందిస్తున్నారు. ఏఎంసీఏ ప్రోగ్రామ్‌ను 2010లో 20 టన్నుల ఫైటర్ జెట్‌గా ప్రారంభించగా.. ప్రస్తుతం దీన్ని 25 టన్నుల ఫైటర్ జెట్‌గా రూపొందించడానికి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. 2023లో దీనికి సంబంధించిన డిజైన్ వర్క్ పూర్తవగా.. ప్రోటో టైప్ తయారు చేయడానికి రూ.15,000 కోట్లను 2024 మార్చిలో అందించారు. ఇటీవలే ముగిసిన ఏరో ఇండియా-2025లో ఏఎంసీఏ ఫుల్ స్కేల్ ఇంజనీరింగ్ మోడల్‌ను ప్రదర్శనకు ఉంచారు. కాగా మొట్టమొదటి ఏఎంసీఏ విమానం 2028లో అందుతుందని హెచ్ఏఎల్ చెబుతోంది. 2032 కల్లా సర్టిఫికేషన్ పూర్తి చేసుకొని.. 2034లో పూర్తి స్థాయి విమానాన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు అందించనున్నారు.

ఎఫ్-35కు పోటీ విమానాలు ఎవరి దగ్గర ఉన్నాయి?

ఎఫ్-35కు దాదాపు దగ్గరగా ఉండే విమానాలను చైనా, రష్యా, టర్కీ తయారు చేశాయి. చైనా జే-35ఏ అనే విమానాన్ని తయారు చేసింది. ఇందులో దాదాపు ఎఫ్-35తో పోటీపడగల సామర్థ్యం ఉన్న ఫీచర్లు ఉన్నాయి. చైనాకు చెందిన షెన్యాంగ్ ఎయిర్‌క్రాఫ్ట్ కార్పొరేషన్ వీటిని అభివృద్ధి చేసింది. వాస్తవానికి వీటిని ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి తయారు చేసినా.. ప్రస్తుతానికి చైనీస్ నావీ క్యారియర్ బోర్న్ ఫైటర్‌గా ఉపయోగిస్తోంది. ఝుహై ఎయిర్ షోలో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ తొలిసారిగా జే-35ఏ విమానాన్ని ప్రదర్శనకు ఉంచింది. ఈ విమానాలు దాదాపు అమెరికాకు చెందిన ఎఫ్-35ను పోలి ఉన్నాయి. కానీ జే-35 గురించిన పూర్తి వివరాలు బయటి ప్రపంచానికి తెలియకుండా చైనా జాగ్రత్త పడింది.

పాకిస్తాన్ ఇటీవల అమెరికాకు దూరం జరిగి చైనాకు దగ్గరయ్యింది. పాకిస్తాన్, చైనాలు కలిసి ఇండియాను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాయి. ఈ క్రమంలో పాకిస్తాన్‌కు జే-35 ఫైటర్ జెట్లను అందించాలని చైనా భావిస్తోంది. రాబోయే రెండేళ్లలో 40 జే-35 యుద్ద విమానాలు పాకిస్తాన్ ఎయిర్‌ఫోర్స్‌లో భాగం కానున్నాయి. పాకిస్తాన్ వద్ద ప్రస్తుతం ఉన్న ఎఫ్-16 (అమెరికా), మిరేజ్ (ఫ్రాన్స్) యుద్ద విమానాలను జే-35లు భర్తీ చేయబోతున్నాయి. ఇండియా రఫేల్ యుద్ద విమానాలు కొన్న తర్వాత పాకిస్తాన్ కూడా తమ ఎయిర్ డిఫెన్స్‌ను దుర్భేద్యంగా మార్చాలని నిర్ణయించింది. దీనిలో భాగంగానే అత్యంత ఆధునికమైన జే-35లను చైనా నుంచి కొనడానికి నిర్ణయించింది. జే-35లను ఇప్పటి వరకు చైనా ఏ దేశానికి కూడా అమ్మలేదు. ఆ విమానాలు కలిగి ఉండే తొలి దేశంగా పాకిస్తాన్ నిలవనుంది.

ఒక వైపు చైనా అత్యంత ఆధునిక విమానాలను తయారు చేయడమే కాకుండా.. పాకిస్తాన్‌కు కూడా అమ్ముతోంది. దీంతో ఇది భారత్‌కు పెద్ద సవాలుగా మారనుంది. అందుకే మోడీ ప్రభుత్వం చాకచక్యంగా రఫేల్ విమానాల కంటే అత్యంత ఆధునికమైన ఎఫ్-35లను కొనుగోలు చేయడానికి సిద్ధపడింది. ఇప్పటి వరకు ఇతర దేశాలకు అమ్మడానికి సంశయించిన అమెరికా.. భారత్‌కు అమ్మడానికి సుముఖంగా ఉన్నట్లు తెలిపింది. అయితే ఎఫ్-35ల కొనుగోళ్లు, నిర్వహణ భారత్‌కు కొంచెం భారమైన విషయమే. ఈ యుద్ద విమానాలను నిర్వహించడం ఖరీదైన వ్యవహారం. గంట సేపు ఈ విమానం గాల్లో ఉంటే దాదాపు రూ.32 లక్షలు ఖర్చవుతుంది. దీనికి తోడు వీటి శిక్షణకు. మన దగ్గర ఉన్న ఆయుధాలతో అనుసంధానం చేయడానికి మరింత ఖర్చు చేయాలి. మరి వీటన్నింటినీ బేరీజు వేసుకునే భారత్ వీటి కొనుగోలుకు అడుగే వేయవచ్చు.

Next Story