ఈ సముద్రంలో మునిగిపోరు

by Muthe.Rajitha |

సాధారణంగా బీచ్ లో సముద్ర స్నానానికి వెళ్లిన వారికి అనేక జాగ్రత్తలు చెబుతుంటారు.

ఈ సముద్రంలో మునిగిపోరు
X

దిశ, వెబ్ డెస్క్ : సాధారణంగా బీచ్ లో సముద్ర స్నానానికి వెళ్లిన వారికి అనేక జాగ్రత్తలు చెబుతుంటారు. అలలు ఒక్కసారిగా లోపలికి లాక్కెల్లి పోతాయని హెచ్చరిస్తుంటారు. ఇక అమావాస్య, పౌర్ణమి రోజుల్లో వచ్చే భారీ సముద్ర అలలు చూస్తేనే బెంబేలెత్తి పోతారు. అందుకే సముద్ర తీర ప్రాంతాల్లో పోలీసులు నిరంతరం గస్తీ కాస్తూ ఉంటారు. కాని ప్రపంచంలో ఉన్న ఒక సముద్రంలో మాత్రం అస్సలు మునిగిపోరు. మనం కావాలని ఆ సముద్రంలో మునగాలని మునక వేసినా మునిగిపోరట. అదేం సముద్రమని ఆశ్చర్యపోతున్నారా? అదే "మృత్యు సముద్రం". దీన్నే "డెడ్ సీ" అంటారు. నిజానికి ఇది సముద్రం కాదు ఒక సరస్సు. భూమి మీద అత్యంత ఎక్కువ లవణాలు కలిగిన ఉప్పు నీటి సరస్సులలో ఒకటి. ఎక్కువ ఉప్పు సాంద్రత ఉన్నందున వలన దీనిని సముద్రం అని పిలుస్తారు.

ఇది ఇజ్రాయెల్, జోర్డాన్ సరిహద్దులో ఉంది. డెడ్ సీ సముద్ర మట్టానికి సుమారు 435 మీటర్ల లోతులో ఉంది. ఈ సరస్సు ఏ సముద్రంలోనూ కలవకపోవడం వల్ల, నదుల నుండి వచ్చే ఉప్పు, ఖనిజాలు సరస్సులోని ఉండిపోయి, నీరు మాత్రమే ఆవిరి కావడం వల్ల లవణాల సాంద్రత భారీగా పెరుగుతుంది. డెడ్ సీలో ఉప్పు సాంద్రత సుమారు 30-34% గా ఉంటుంది. ఇది సాధారణ సముద్ర జలాల కంటే దాదాపు పది రెట్లు ఎక్కువ. ఈ గాఢమైన నీటి వల్ల ఈ నీటిలో మనుషులే కాదు, వస్తువులు కూడా నీటిపై తేలుతాయి. ఈ సముద్రాన్ని చూడటానికి వచ్చే సందర్శకులు నీటి మీద తేలుతూ పుస్తకం చదవడం, విశ్రాంతి తీసుకోవడం చేస్తూ ఆనందిస్తారట.

అసలు డెడ్ సీ అనే పేరెలా వచ్చింది?

ఈ సముద్రంలో అధిక ఉప్పు సాంద్రత ఉండటం వల్ల ఏ ఒక్క జీవి కూడా ఈ నీటిలో జీవించలేదట. డెడ్ సీలో దాదాపుగా జీవం అనేదే ఉండదట. ఇక్కడ చేపలు, నీటి మొక్కలు, ఇతరత్రా సముద్ర జీవులు ఏవీ ఉండవు. అయితే, హాలోఫైల్స్ అనే ఉప్పును ఇష్టపడే కొన్ని సూక్ష్మజీవులు ఈ కఠినమైన పరిస్థితుల్లో కూడా జీవిస్తాయట. అయితే ఈ నీటిని శతాబ్దాలుగా చర్మ సమస్యల చికిత్సకు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఉపయోగిస్తున్నారట. అన్ని సముద్రాల లాగే డెడ్ సీ కూడా ఇప్పుడు పర్యావరణ సవాళ్లను ఎదుర్కొంటోంది. నదుల నీటిని మళ్లించడం వల్ల సరస్సు నీటి మట్టం వేగంగా తగ్గుతోందని పర్యావరణ ప్రేమికులు, జీవశాస్త్ర పరిశోధకులు ఆందోళన చెందుతున్నారు.

Next Story