ఎగబడి కొనుడెందుకు.. ఎదురు కొరత తెచ్చుడెందుకు..

by Sujitha Rachapalli |

‘జాగ్రత్త’ అంటే జడుసుకునే బాపతి మనం.. పెట్రోల్, డీజిల్ కొరత లేదని చెప్పినా ఆత్రం ఆగదు.. గ్యాస్ నిల్వలకు కొదవ లేదన్నా ఎగబడి కొనుడే.. కొరతను సృష్టించి సమాజంతో ఆడుకుంటున్న బ్రోకర్స్.. ఆ మాటలకు తానా తందానా అంటూ జనాల డ్యాన్సులు

ఎగబడి కొనుడెందుకు.. ఎదురు కొరత తెచ్చుడెందుకు..
X

దిశ, ఫీచర్స్ : ప్రపంచంలో ఏ మూలన చిన్న అలజడి జరిగినా.. మన అభద్రత అంగీ విప్పేసుకుంటుంది. దేశాలేవో ద్వేషంతో తన్నుకుంటుంటే ఇక్కడ మన భయం బజార్లకొచ్చి లబలబ మొత్తుకుంటుంది. ప్రకటనలేవీ రాకున్నా ‘ఎమర్జెన్సీ’ వాతావరణం సృష్టిస్తాం మనం. అంతా సవ్యంగానే ఉన్నా ‘ఎహే.. బంకుల్లో పెట్రోల్ దొరకదంటా.. గోదాముల్లో గ్యాస్ నిల్వలు అస్సలు లేవంటా’ అని పుకార్లు పుట్టించి ఎగబడి కొంటాం. తెగబడి లేని కొరతను సృష్టిస్తాం.

మన భయం అందరికీ రుద్దాలా?

యుద్ధం జరుగుతున్నది ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దేశాలకు. కానీ ఇబ్బందులు మాత్రం మనం ఎదుర్కుంటున్నామని పిల్లలకు, పెద్దలకు అందరికీ తెలిసిపోయింది. ఈ పరిస్థితికి హార్మూజ్ జలసంధిని మూసేయడం అనే ముచ్చట కూడా తెలుసు మనకు. ప్రపంచ చమురు రవాణాలో దాదాపు 20శాతం హార్మూజ్ జలసంధి మీదుగానే జరుగుతుంది. ఇంధనాన్ని ఆదా చేయడానికి ప్రభుత్వాలు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఈ ముచ్చట్లన్నీ ఎప్పటికప్పుడు వార్తల ద్వారా తెలుసుకుంటూనే ఉన్నాం. ఇన్ని తెలిసినా మనలో ఏదో తెలియని భయం, ఆత్రం. ఇక ఏం చేస్తాం? మనం ధైర్యంగా ఉండాలంటే అందరికీ ఈ భయాన్ని పుట్టించాలి కదా? అందుకే ‘పులీ.. పులీ’ అని భయపెట్టించి గబ్బు లేపుతున్నారు కొందరు మహానుభావులు.

బంకుల్లో బిస్తరేసే పరిస్థితెందుకు?

మనోళ్లకు కొంచెం ఆత్రం ఎక్కువ. ‘దున్నపోతు ఈనింది’ అంటే ‘దూడనెక్కడ కట్టెయ్యాలె’ అనేంత ఆత్రం ఉంటుంది. చూస్తున్నాం కదా.. పెట్రోల్ బంకుల వద్ద నాలుగైదు రోజులుగా ఏం జరుగుతుందో.. నిజంగానే పెట్రోల్, డీజిల్ దొరకడం లేదా? కావాలనే సీన్ క్రియేట్ చేస్తున్నారా? అనేది స్పష్టంగా అర్థమవుతోంది. వాహనాల్లో పెట్రోల్, డీజిల్ ఉన్నా కూడా ఒక్కసారిగా ‘నాకంటే నాకూ’ అని ఎగబడుతున్నారు. ఒకొక్కరైతే ఫ్యామిలీలు ఫ్యామిలీలే బంకుల్లో బిస్తరేసి లైన్లు కడుతున్నారు. వాహనాల్లో పోయించుకున్నది చాలదన్నట్లు క్యాన్లు, డబ్బాలు, బాటిల్స్ తీసుకొని వస్తున్నారు. కొందరైతే మరీ ఘోరంగా బిందెలు, సింటెక్స్ ట్యాంకులేసుకొని వచ్చి పెట్రోల్, డీజిల్ కోసం పోరుబాట పడుతున్నారు. వీళ్లను సముదాయించే ఓపిక లేక పెట్రోల్ బంకువాళ్లు నెత్తిబాదుకుంటున్నారు.

జాగ్రత్త.. అంటే జడుసుకుంటారా?

జనాల్లో ఇంత భయమెందుకు అంటే.. ‘జాగ్రత్తగా ఉండండీ’ అని చెప్తే మనోళ్లు జడుసుకునే రకం కాబట్టి. జనాలకు ‘జాగ్రత్తగా ఉండండి’ అని చెప్పొద్దన్నమాట. ‘జాగ్రత్త’ అని హెచ్చరిస్తే ‘ప్రమాదమేదో పొంచి ఉంది’ అని అర్థం చేసుకుంటారు. ‘జాగ్రత్త’ అని చెప్తే పొదుపుగా ఉండమని చెప్పినట్లు కదా? కానీ కొందరికి అది అలా అర్థం కాదు. ‘కొంపలు మునిగిపోతున్నాయ్’ అని అపార్థం చేసుకొని ఆగమాగం అవుతారు. ‘లాక్‌డౌన్ పరిస్థితులు రావచ్చు.. అప్రమత్తంగా ఉండండి’ అని మోడీ చెప్తే.. ‘అయిపాయె ఇగ.. ప్రధానే పైలం అని చెప్తున్నాడు’ అని బెంబేలెత్తి పోతుంటారు. పెట్రోల్, డీజిల్ టైంకు దొరుకుతాయో లేవో.. ఒకవేళ దొరికినా రేటు ఎక్కువుంటుందో ఏమో’ అని బంకుల వద్దకు బారులు తీస్తున్నారు. భయపడి పరుగులు పెడుతున్నారు.

కరువుకు కారణమెవరో?

పెట్రోల్ గురించి టెన్షనొద్దని సర్కారు చెప్తూనే ఉంది. అయినా కూడా సోషల్ మీడియాలో ‘పెట్రోల్ కరువొచ్చింది’ అని ప్రచారం చేస్తూ పబ్లిక్‌ను పరుగులు పెట్టిస్తున్నారు. మామూలుగా బంకులో ఐదారుగురు కనిపిస్తేనే ‘ఎహే.. తర్వాత కొట్టిద్దాంలే’ అనుకునే జనాలు ఇప్పుడు గంటలకొద్ది క్యూలైన్లో నిలబడుతున్నారు. ఒక మోతెవరి అయితే బైక్‌‌ను తీసుకొచ్చే ఓపికలేక ఏకంగా ట్యాంకర్‌నే ఎత్తుకొచ్చాడు. ఇంకొకాయనైతే ఇంట్లో మంచినీళ్లు పట్టుకునే నల్లాడబ్బా తీసుకొని వచ్చి పెట్రోల్ పోసుకొని వెళ్లాడు. వాస్తవానికి వాహనాల ట్యాంకుల్లో కాకుండా బాటిల్స్, డబ్బాల్లాంటి ఏ పాత్రల్లో అయినా పెట్రోల్, డీజిల్ పోయడానికి వీల్లేదు. కానీ.. ఇప్పుడు వాహనాల కంటే డబ్బాలు, క్యాన్లలోనే పెట్రోల్, డీజిల్ పోసుకొని ‘సాధించాం’ అనే విజయగర్వంతో బయటకు వెళ్తున్నారు.

ట్యాంకులు నింపేసి తందాన ఆటలా?

పొద్దున్నుంచే పెట్రోల్ బంకులు కిక్కిరిసి ఉంటున్నాయి. అవసరం ఉన్నవాళ్లూ, లేనివాళ్లూ అందరూ ఎగబడి కొరతకు ఎదురు వెళ్తున్నారు. ఒక చిన్న లాజిక్. ఇప్పుడు మనకు అవసరం లేకున్నా ఇష్టమొచ్చినంత పెట్రోల్ కొట్టిస్తున్నాం కదా? మరి బంకుల్లో నిల్వ ఉన్న ఇంధనం అయిపోతే మిగతా జనాల అవసరాలు తీరేదెలా? అంతా ఒక్కరే తీసేసుకుంటే మిగిలినవాళ్ల పరిస్థితేంటి? ఏం ఆగమైందని ‘ఎమర్జెన్సీ’ పుకార్లు సృష్టించి కోరికోరి కొరతను తీసుకొస్తున్నాం. అన్నీ ఉన్నా దేనికోసం అత్యవసర పరిస్థితిని కల్పిస్తున్నాం. నిజంగానే పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడితే వ్యవస్థంతా స్తంభిస్తుంది కదా? వ్యవస్థలో అన్ని రకాల పనులు జరిగితేనే కదా మన పనీ సాగేది? మరి దేనికోసం ఉరికురికి ఉన్నపలంగా ట్యాంకులు నింపుకొని తందాన ఆడుతున్నారు.

ఎగబడటం వల్లే నో స్టాక్ కదా?

వాస్తవానికి బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు పెట్టడానికి కారణం క్రెడిట్ పాలసీ. గతంలో పెట్రోల్ బంకులకు చమురు సంస్థలు ముందుగా అడ్వాన్సులు చెల్లించకపోయినా ఇండెంట్ ఆధారంగా మరుసటిరోజు పెట్రోల్, డీజిల్ సరఫరా చేసేవట. యుద్ధం మొదలయ్యాక క్రెడిట్ పాలసీ నిబంధనల్లో మార్పులు చేశారట. అంటే ఇప్పుడు పాత బాకీలు కట్టాలి. అదే సమయంలో మరుసటి రోజుకు అవసరమైన ఇండెంటుకు తగ్గట్టుగా అడ్వాన్సులు ఇవ్వాలి. అది కూడా ముందురోజు మధ్యాహ్నం కల్లా కట్టాలి. అంటే పాత బకాయిలు ఉన్నా.. బంకు యజమానులు ముందస్తు అడ్వాన్సులు కట్టకపోవడం వల్లనే పెట్రోల్, డీజిల్ సప్లయ్ చేయడం లేదు. అంటే దీనర్థం మన దగ్గర పెట్రోల్, డీజిల్ కొరత ఉందని కాదు. కానీ మనోళ్లు ఎగబడటం వల్ల ‘నో స్టాక్’ పెట్టాల్సి వస్తుందట.

అంతా మనకొక్కరికే దక్కాలా?

పెట్రోల్, డీజిల్ అనే కాదు. ఏదైనా మనోళ్లు ఇలాగే చేస్తుంటారు. గ్యాస్ షార్టేజ్ ఉందని తెలిస్తే చాలు.. పనులన్నీ మానుకొని గ్యాస్ డిస్ట్రిబ్యూటర్‌ను గాలించి మరీ పట్టుకుంటారు. ఆల్రెడీ డబుల్ సిలిండర్ వాడుతున్నా.. ఇంకో సిలిండర్ నిండుగానే ఉన్నా ఏజెన్సీ డీలర్ ఎక్కడ దొరుకుతాడా అని వేటాడుతుంటారు. ఒక సిలిండర్ ఎంతలేదన్నా రెండు నెలలైతే వస్తుంది కదా? రెండు నెలలకు సరిపడా ఉన్నా ఆ సందడేంటో అర్థం కాదు. పక్కోడి గురించి అస్సలు ఆలోచించకుండా ఇప్పటికిప్పుడు గ్యాస్ నిల్వలే అయిపోయినట్లూ.. యుగాంతం ముంచుకొచ్చి గ్యాసున్నోడే బతుకుతాడు అన్నట్లు ఎగబడతారు. కొరత ఏర్పడుతుందని తెలిసినప్పుడు జాగ్రత్త పడాలి. కానీ అంతా మనకొక్కరికే దక్కాలి.. అన్నీ మన ఇంట్లోనే ఉండాలనుకోవడం మాత్రం మూర్ఖత్వమే అవుతుంది.

ఉత్తదానికి ఉలికిపాటెందుకు?

పుకార్లతోనే పూట గడుస్తుంటుంది కొందరికి. సమాజాన్ని భయంతో పరుగులు పెట్టించి మార్కెట్‌ను గబ్బు పట్టించడమే వాళ్లకు తెలిసిన పని. కొన్నిరోజులు బంగారం అంటారు. ‘పాయె.. పెరిగిపాయె. భూముల కంటే ఎక్కువ పిరమాయె’ అని ఒక అలజడి సృష్టిస్తారు. ఈ జనాలకు ఆలోచించే ఓపిక ఉండదు కదా? ఇరుగింటివాళ్లు ఈసం కొంటున్నారనీ.. మనింటివాళ్లు మాసం కొంటున్నారని ఆలోచనంతా బంగారమ్మీద పెడతారు. ఎవడో చెప్పిండని వెండిని దండిగా కొనేస్తాడు. ‘లేదు లేదు.. బంగారమంతా అమ్మేసి స్టాక్ మార్కెట్లో పెట్టాలి’ అని చెప్తే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా దాంట్లోనూ వేలు పెడతారు. అక్కడా బెడిసికొడితే మళ్లీ భూములు, జాగాలు అంటూ తిరిగి ఎప్పుడూ నిలకడలేకుండా ఏవేవో చేస్తుంటారు. ఉత్తదానికే ఉలిక్కి పడుతుంటారు.

బ్లాక్‌లో బాజాప్తా అమ్మడానికేనా?

లాక్‌డౌన్ లాంటి పరిస్థితి నిజంగనే వచ్చింది అనుకుందాం. మార్కెట్లో ఉన్న పప్పులు, ఉప్పులు అన్నీ మనమే టన్నులకు టన్నులు తెచ్చి పెట్టుకుంటే మిగతావాళ్ల పరిస్థితేంటి? అంటే మనమేమో పంచభక్ష పరమాన్నాలు తినాలి.. అవతలోడేమో ఉప్పిడి ఉపాసం ఉండాల్నా? ఒకడు ఆకలితో అంగలారుస్తుంటే మనం సంతోషంగా ఉండాలా? జనాల ఆగం ఇలా ఉందంటే ఇక బ్రోకర్ గాల్లదైతే మరీ ఘోరం. జనాల ఆగం గురించి వాళ్లకు బాగా తెలుసు కాబట్టి ‘కొరత’ అనేది వింత వింతగా ప్రచారం చేస్తుంటారు. జనాల్లో లేనిపోని భయాన్ని, అభద్రతను క్రియేట్ చేసి సొమ్ము చేసుకుంటారు. తమ కక్కుర్తి కోసం మిగతా వాళ్లను తప్పుదోవ పట్టిస్తూ మార్కెట్‌ను స్తంభింప చేస్తుంటారు. అవసరమైతే వాళ్లకు వాళ్లే షార్టేజ్ క్రియేట్ చేసి బ్లాక్‌లో బాజాప్తా అమ్ముకుంటుంటారు.

మన ఆత్రానికి మందిని ఆగం చేద్దామా?

సంక్షోభం లేకున్నా తీసుకొచ్చే ఘనులు మనవాళ్లు. కొరతకు ఎదురెళ్లి ఊర్లోకి పట్టుకొచ్చే మొనగాళ్లున్నారు. లాక్‌డౌన్ అనగానే లడీలకు లడీల సమాన్లు తెచ్చి ఇంట్లో పేరుస్తారు. అప్రమత్తంగా ఉండాలని అలర్ట్ చేస్తే గోదాముల్లో ఉన్న గ్యాస్ సిలిండర్లన్నీ తమ ఇంటికే చేరాలనుకుంటారు. ధరలు పెరుగుతాయని తెలిస్తే చాలు.. బంగారాన్నంతా సింగారిచ్చుకోవాలని కలగంటారు. ఇంధనం పొదుపుగా వాడండని చెప్తే.. ఫుల్ ట్యాంక్ చేయించుకుంటారు. ఇంకా అవసరమైతే బాటిళ్లలో నింపుకొని దాచిపెట్టుకుంటారు. గతంతో పోలిస్తే ఇప్పుడు ఫుల్‌ ట్యాంక్ చేయించుకుంటున్న వాళ్లే ఎక్కువ కనిపిస్తున్నారు. మామూలుగా రెండు లీటర్లతో సరిపెట్టుకునేవాళ్లు ఇప్పుడు ఫుల్ కొట్టించి లేని కొరతను తెచ్చిపెట్టి సంక్షోభం వైపు నెట్టేస్తున్నారు. తమ ఆత్రానికి సమాజాన్ని ఉరికిస్తున్నారు.

లైన్లుకట్టి లడాయి పెట్టుడెందుకు?

ఎక్సయిజ్ సుంకం లీటరుకు పది రూపాయలు తగ్గిస్తున్నాం అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినా మన ఆత్రం తగ్గదు. అంతర్జాతీయ మార్కెట్ నిపుణుల మాదిరి విశ్లేషణలు చేస్తుంటారు. ఏవేవో ఆలోచనలు చేస్తుంటారు. ఎవరికిరాని అనుమానాలు లేవనెత్తుతారు. బంగారం ధర ఎందుకు తగ్గింది? వెండి ధర ఎందుకు వెనక్కి పోయింది? గ్యాస్ కొరత లేనిది హోటళ్లు, రెస్టారెంట్లు ఎందుకు బంద్ పెడుతున్నారు? ఎక్కువ టైం పట్టే వంటకాలు మెనూలో ఎందుకు కనబడటం లేదు? లాంటి అనుమానాలను అందరికీ పాకించి ఉరుకులు పెట్టిస్తుంటారు. పెట్రోల్, డీజిల్ సరఫరా కొరతపై భయాలు తగ్గించేందుకు ప్రభుత్వాలు ఎంత ప్రయత్నిస్తున్నప్పటికీ అందరూ ఒక్కసారే ఎగబడి సిలిండర్ల కోసం కిలోమీటర్ల మేర లైన్లుకట్టి లడాయి పెడుతుంటారు.

వదంతులకు వంత పాడాలా?

ప్రస్తుత యుద్ధ పరిస్థితి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తున్న మాట వాస్తవమే. ఐతే అది మనకు పెను సంక్షోభం తెస్తుందని చెప్పలేదు కదా? లాక్‌ డౌన్ సమయంలో మాదిరి అప్రమత్తంగా ఉండాలంటే.. లాక్‌డౌన్ లాంటి పరిస్థితి రావొచ్చని కాదు.. అప్పటిలా జాగ్రత్తగా ఉండమని అర్థం. ఎలాంటి గడ్డు పరిస్థితి వచ్చినా సిద్ధంగా ఉండాలని చెప్తే భయపడుతూ బంకుల వెంట పరుగులు పెట్టమని కాదు.. భద్రంగా జీవించమన్నట్టు. ఏదో జరిగిపోతుందని కాదు. ఇక మన దగ్గర ఇంధన నిల్వలకు ఢోకా లేదని మంత్రి ఉత్తమ్ చెప్పనే చెప్పిండు. మూడు నెలల వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఉందని.. అసలు కొరతే రాదని క్లారిటీ ఇచ్చాక కూడా అవేవీ పట్టించుకోకుండా వదంతులకు వంత పాడుతూ కొరతకు కోరస్ అందుకుంటున్నారు జనాలు.

ఎందుకీ గందరగోళం: కసరమోని శివ, క్యాబ్ డ్రైవర్

నాకు సొంత క్యాబ్ ఉంది. సాఫ్ట్‌వేర్ కంపెనీలో నడుస్తోంది. నా కారు సీఎన్జీ, పెట్రోల్ రెండు ఆప్షన్లు ఉన్నాయి. అయితే చాలామటుకు సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో నడిచే క్యాబ్‌లు సీఎన్జీ మీదనే తిప్పుతుంటారు. పెట్రోల్ కొరత అనే ప్రచారం జరుగుతోంది కదా? రెగ్యులర్ సీఎన్జీ క్యాబ్‌ వాళ్లు కూడా భయంతో పెట్రోల్ ఫుల్‌‌ ట్యాంక్ చేస్తున్నారు. పెట్రోల్ మొత్తానికే దొరకదని ప్రచారం చేస్తూ గందరగోళం సృష్టిస్తున్నారు.

జాగ్రత్త అని చెప్పొద్దా?: రామ్ జె, బిల్డింగ్ కాంట్రాక్టర్

మోడీ సార్ ఏం చెప్పిండు? ఏ టైమ్ ఎలా వస్తుందో జాగ్రత్తగా ఉండమనే చెప్పిండు కదా? కానీ జనాలు దాన్ని అపార్థం చేసుకున్నారు. ప్రధానే చెప్పాడు అని బెంబేలెత్తిపోతున్నారు. జాగ్రత్తగా ఉండండని చెప్తే కూడా జడుసుకునే మనుషులుంటే ఏం చేయాలి ఇగ? కాబట్టి ముందు సమస్యను అర్థం చేసుకొని దాంట్లో ఇరుక్కపోకుండా ఏం చేయాలని ఆలోచించాలి గానీ.. ఆగమాగం చేసి జనాలను తప్పుదోవ పట్టించొద్దు.

లేటైతే అదీ దొరకదేమో: కేశగౌని వీరస్వామి గౌడ్, కండక్టర్

నా బైక్‌ను ప్రతీరోజూ పది పన్నెండు కిలోమీటర్లు తిప్పుతా. ఎంత లేదన్నా వారానికి ఒక్క లీటర్ కంటే ఎక్కువ పోయించను. కానీ పెట్రోల్ దొరకదని ప్రచారమైంది. కొన్ని చోట్ల బంకులు మూతపడ్డాయి. ఇంకా కొన్ని చోట్లనేమో గిన్నెలు, బిందెలు, నల్లా డబ్బాలతో ఇంటిల్లిపాది బారులు తీరుతున్నారు. ఈ గోస ఎందుకని అర్ధ గంట పాటు లైన్లో నిల్చొని ట్యాంక్ ఫుల్ కొట్టించాను. లేటు చేస్తే అదీ దొరక్కుండా చేసేలా ఉన్నారు ఈ జనాలు.

Next Story