Tree Man of India: చెమ్మగిల్లిన అడవి.. వనజీవి రామయ్య ఇక లేడని మూగ రోదన

by Bhoopathi Nagaiah |

రామయ్య ప్రస్థానం ఒంటరిగా మొదలైంది. చేతిలో సంచి, మాసిన పంచె, తలచుట్టూ చెట్లే ప్రాధాన్యం చెప్పే కవచం..

Tree Man of India: చెమ్మగిల్లిన అడవి.. వనజీవి రామయ్య ఇక లేడని మూగ రోదన
X

నజీవిగా, ప్రకృతి ప్రేమికుడిగా, చెట్ల మనిషిగా, కోటి మొక్కలు నాటిక వ్యక్తిగా, పద్మశ్రీ అవార్డు దక్కించుకున్న వనజీవి రామయ్య (87) ఇక లేరు. ఈ తెల్లవారుజామున ఆయన నిద్రలోనే కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రామయ్య ఈ ఉదయం నిద్ర లేవకపోవడంతో కుటుంబసభ్యులు ప్రభుత్వాసుత్రికి తరలించగా.. డాక్టర్లు పరీక్షించి మరణించారని ధ్రువీకరించారు. అయితే. తన జీవితాన్ని మొత్తం తన భార్యతో కలిసి విత్తనాలు నాటడం, మొక్కలు పెంచడం, కుటుంబసభ్యులను, ఇతర చుట్టుపక్కల వారిని భాగస్వాములను చేసి వృక్ష ప్రపంచాన్ని తయారుచేయడమే లక్షంగా పనిచేశారు. 2017లో భారత ప్రభుత్వం ఆయన సేవలను గుర్తించి పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. పచ్చదనం కోసం మాత్రమే కాదు, సామాజిక చైతన్యం కోసం కూడా రామయ్య నిరంతర కృషి చేశారు. ఆయన సైకిల్‌పైనే ‘వృక్ష రక్ష అభియాన్’ అనే పేరుతో పల్లె పల్లెకి తిరిగి, చెట్లను నాటి, మొక్కల ప్రేమను విశ్వానికి తెలిజేశారు. -దిశ బ్యూరో, ఖమ్మం/ ఖమ్మం రూరల్

ఒంటరిగా మొదలై..

రామయ్య ప్రస్థానం ఒంటరిగా మొదలైంది. చేతిలో సంచి, మాసిన పంచె, తలచుట్టూ చెట్లే ప్రాధాన్యం చెప్పే కవచం.. ఎవరెంత హేళన చేసినా వనంతోనే జనం అని గట్టిగా నమ్మారు. తనకు నచ్చిన దారిలోనే వెళ్లారు. తాను నడిచిన, దారెంటా లెక్కలేనన్ని మొక్కలు నాటారు. ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే అక్కడ మొక్కలు నాటడం, నాటిన వాటికి నీళ్లు పోయటం ఇదే ఆయన దినచర్య. వన పోషణ కోసం చివరకు కుటుంబం, పిలల పోషణనూ పక్కనబెటారు. పొలంలో పైరు ఎదిగేందుకు ఎరువులు తెమ్మని డబ్బులిస్తే మొక్కల కోసం ఖర్చు చేశారు. చివరకు జీవనయానంలో సొంత భూమిని అమ్నుకున్నారు. స్వచ్ఛమైన గాలి, కాయ గింజలు, చివరకు నెలకొరిగాక వంటచెరుకు అందించే చెట్టును బతికేట్టు చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నారు. మొక్కల ప్రేమికుడు, నిత్యకృషీవలుడైన డాక్టర్ రామయ్య దశాబ్దాల వన దీక్షను గుర్తించిన ప్రభుత్వం ‘పద్మశ్రీ’ తో గౌరవించింది. ఖమ్మం జిల్లా చరిత్రలో పద్మశ్రీ పురస్కారం దక్కించుకున్న మొదటి వ్యక్తిగా చరిత్రలో అరుదైన గౌరవం దక్కించుకున్నారాయన.

1937, జూలై 1న దరిపెల్లి లాలయ్య, పుల్లమ్మ దంపతులకు రామయ్య జన్మించారు. ఆయన ఇంటిపేరు దరిపల్లి రామయ్య అయినప్పటికీ వనజీవిగా మార్చుకున్నారు. ఆయనను చెట్ల రామయ్య అని కూడా పిలుస్తారు. 50 ఏండ్లుగా అలుపెరగకుండా విత్తనాలు చల్లుతూ మొక్కలు పెంచేందుకు ప్రయత్నించారు. వేసవిలో విత్తనాలు సేకరించి తొలకరి రాగానే వాటిని ఆయా ప్రాంతాల్లో చల్లుతుండేవారు. ఇలా 120 రకాల మొక్కల చరిత్రను అలవోకగా చెప్పగలరు వనజీవి. మూడు కోట్ల మొక్కలు నాటాలన్నదే తన లక్ష్యమని వనజీవి రామయ్య చెప్తుండేవారు. తెలంగాణ ప్రభుత్వం ఆరో తరగతి సాంఘీకశాస్త్రంలో వనజీవి గురించి పాఠ్యాంశంగా చేర్చింది. అదేవిధంగా మహారాష్ట్ర ప్రభుత్వం అక్కడి తెలుగు విద్యార్థుల కోసం 9వ తరగతి తెలుగు పుస్తకంలో రామయ్య జీవితం పాఠ్యాంశంగా బోధిస్తున్నది.

టీచర్ పాఠంతో అంకురార్పణ

ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లికి చెందిన దరిపెల్లి రామయ్య చెట్లను ప్రాణ ప్రదంగా చూసుకునేవారు. మొక్కలు పెంచడానికి 50 ఏళ్లుగా అలుపెరగని శ్రమించారు. ఐదవ తరగతి చదువుకున్న రామయ్య.. తన టీచర్ జి.మల్లేశం ప్రభోదించిన మొక్కల పెంపకంతో లాభాలు పాఠం అతనిలో ఒక మహోత్తర కార్యానికి అంకురార్పణ చేసింది. అతడి ఆలోచనలను తన ఇంటి నుంచే ప్రారంభించారు. తన ఇంటిలోని 40 గుంటల స్థలంలో జీవనానికి ఒక చిన్న ఇంటిని నిర్మించుకొని మిగతా స్థలమంతా మొక్కలతో నింపి వాటి పెంపకానికి నడుం బిగించారు. తన నలుగురు పిల్లలతో సమానంగా ప్రతి మొక్కకు ప్రాణ ప్రదంగా చూస్తుంటూ పెద్దచేశారు. ఇంటిని చెట్లతో నింపి ఇంట గెలిచిన రామయ్య తన లక్ష్యాన్ని ఖమ్మం జిల్లాపై గురిపెట్టారు. రోడ్ల పక్కన పొదలలో కంపల మధ్య, గుట్టల మధ్య, ప్రభుత్వ కార్యాలయాలలో చర్చిలలో, మసీదులలో సాగర్ కాలవల పక్కన రైల్వే ట్రాక్ పక్కన ఒకటేమిటి కనిపించిన ప్రతి ఖాళీ స్థలంలోనూ విత్తనాలు చల్లి మొక్కలు పెంచడానికి అహర్నిశలు రామయ్య కృషి చేశారు.

వృత్తిరీత్యా కుండలు చేస్తూ, పాలు అమ్ముతూ ప్రకృతి రీత్యా వనపెంపకానికి కృషి చేసిన రామయ్య మొక్కలపై ప్రచారం చేస్తూ తనకు కనిపించిన ప్రతి ఒక్కరికి మొక్కలనే బహుమతిగా ఇస్తూ ఉండేవారు. ముందు తరాల ప్రాణవాయువు కోసం మొక్కల పెంపకమే అవసరమని ఊరూరా ప్రచారం చేశారు. వన రక్షణపై వెయ్యి వరకు వనసూక్తులు, 315 శిల్పాలపై మొక్కల చిత్రాలను చెక్కి చరిత్రకెక్కారు. ఏ మొక్కను చూపించిన ఆ మొక్క ఉపయోగాన్ని రామయ్య అవలీలగా చెప్పేవారు. సిరిమల్లె భావంత నిరారంబర జీవి రామయ్య కృషి మల్లెపూల సువాసనలా అతని ఖ్యాతి ప్రపంచానికి వెదజల్లింది.

కుటుంబ సభ్యులకు చెట్ల పేర్లు కూడా..

వనజీవి రామయ్య చెట్లను ఎంతగా ప్రేమించేవారంటే అతని కుటుంబ సభ్యులకు పెట్టిన పేర్లే నిదర్శనం. మనవరాళ్లకు హరిత లావణ్య, చందన పుష్ప, కబంధ పుష్ప, వనశ్రీ అంటూ మొక్కల పేర్లు పెట్టారు. అలాగే తన కుమారుడు సైదయ్య, సత్యనారాయణ, కనకయ్య కూతురు సైదమ్మ వివాహాల శుభలేఖలపై వృక్షాల గురించి సమాచారం కూడా ముద్రించారు. తన ధర్మ సహచరణి జానకమ్మతో సహా ఎవరికి ఏ రోగమొచ్చినా మొక్కల ఆకులతోనే వైద్యం చేస్తుండేవారు.

ఎన్నో అవార్డులు..

వనజీవి రామయ్య చేసిన విశేష కృషికి ఎన్నో సంస్థలు పురస్కారాలు అందించాయి. 1995లో కేంద్రం వనసేవా అవార్డును అందజేసింది. 2005లో సెంటర్ ఫర్ మీడియా సర్వీస్ సంస్థ ఢిల్లీలో వనమిత్ర అవార్డును మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు చేతుల మీదుగా అందుకున్నారు. జిల్లా కలెక్టర్ లక్ష్మీపార్థసారథి భాస్కర్, అజయ్ ప్రకాశ్ సాహ్ని, నర్సింహారావు, గిరిధర్, రాజేంద్ర నరేంద్ర నిమ్టే, శశిభూషణ్ కుమార్ చేతుల మీదుగా పలు అవార్డులు అందుకున్నారు. కోటికిపైగా మొక్కలను నాటి ట్రీ మ్యాన్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు పొందిన రామయ్యకు యూనివర్సల్ గ్లోబల్ పీస్ అనే అంతర్జాతీయ సంస్థ ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఈ క్రమంలో రామయ్య కృషి పట్టుదలకు ఆకర్షితులైన జిల్లా యంత్రాంగం.. ఒక ద్విచక్ర వాహనాన్ని పెట్రోలు ఖర్చులకు రూ. 1,500 ఇస్తున్నారు. ఆయనైతే ప్రస్తుతం ఆ మోటార్ సైకిల్ పని చేయకపోవడంతో తిరిగి తన పాతసైకిల్ పైనే వన ప్రచారం నిర్వహిస్తున్నారు.

పచ్చని పుడమి కోసం తపన

కోరుకున్నది చేయాలంటే అందుకు తగిన ఖర్చు కూడా చేయాల్సి వస్తుందని రామయ్య ఆవేదన వ్యక్తం చేసేవారు. తనకు ప్రభుత్వం నుంచి అందుతున్న సాయం నామమాత్రంగా ఉందని, ప్రచారానికి, తన జీవనానికి నెలకు కనీసం రూ.6 వేలు చెల్లిస్తే బాగుండేదని అవేవారు. 20 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయిస్తే జిల్లాలోని అందరికీ ఉచితంగా మొక్కలు ఇచ్చేందుకు నర్సరీని ఏర్పాటు చేసే అవకాశముందనేవారు. అలాగే రెడ్డిపల్లిలోని తన ఇంటిని వనమ్యూజియంగా మార్చి ప్రజలకు చెట్ల పెంపకంపై అవగాహన పెంచవచ్చని కృషి చేస్తానని చెప్పేవారు.

Read More: పద్మశ్రీ వనజీవి రామయ్య బయోగ్రఫీ ఇదే..

Next Story