40 ఏళ్ళు దాటినా మానని గాయం భోపాల్ గ్యాస్ దుర్ఘటన

by Muthe.Rajitha |

చరిత్రలో మాటలకందని విషాదం భోపాల్ గ్యాస్ దుర్ఘటన. అంతేగాదు మానవ జాతికి మాయని మచ్చ అని కూడా చెప్పుకోవచ్చు.

40 ఏళ్ళు దాటినా మానని గాయం భోపాల్ గ్యాస్ దుర్ఘటన
X

దిశ, వెబ్ డెస్క్ : చరిత్రలో మాటలకందని విషాదం భోపాల్ గ్యాస్ దుర్ఘటన. అంతేగాదు మానవ జాతికి మాయని మచ్చ అని కూడా చెప్పుకోవచ్చు. వేల మంది నిద్రలోనే అసువులు బాయగా.. పాతిక వేల మంది కంటే ఎక్కువ జనాలు ఆ వాయువులు పీల్చి జీవచ్ఛవాళ్ళ మిగిలిపోయారు. లక్షల మంది విషవాయువుల ప్రభావానికి గురయ్యారు. అంతేకాదు అక్కడి నేల, గాలి ఇప్పటికీ కలుషితమే.. ఇప్పటికీ ఆ ప్రమాదం మృత్యుకోరలు చాపుతూనే ఉంది. 1984లో మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో అమెరికన్ మల్టీనేషనల్ కంపెనీ యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ (UCIL) పురుగుమందులు తయారు చేసే ఫ్యాక్టరీ నడుపుతోంది.

ఇందులో సెవిన్ అనే పురుగుమందు తయారీలో మిథైల్ ఐసోసయనేట్ (MIC) అనే అత్యంత విషరసాయనం వినియోగించేవారు. 1984 డిసెంబరు 2 రాత్రి 12:15 గంటలకు ట్యాంక్ E-610లో ఉన్న 42 టన్నుల MICలోకి నీరు చేరి, ఉష్ణోగ్రత 200°C దాటి, సేఫ్టీ వాల్వులు పేలి 30-40 టన్నుల విషవాయువు గాల్లోకి వ్యాపించి 8 కిలోమీటర్ల వరకు వ్యాపించింది. మూడు ప్రధాన సేఫ్టీ సిస్టమ్‌లు ఆఫ్‌లో ఉండటం, రిఫ్రిజిరేషన్ సిస్టమ్ ఆరు నెలల నుంచి ఆఫ్ చేయడం, అలారాలను కూడా ఆఫ్ లో ఉంచడం వంటి నిర్లక్ష్యం వల్ల ఈ భయంకర ప్రమాదం జరిగింది. ఈ ఒక్క రాత్రిలోనే సుమారు 5 లక్షల మంది విషవాయువు ప్రభావానికి గురయ్యారు. అధికారిక లెక్కల ప్రకారం 2,259 నుంచి 5,000 మంది అక్కడికక్కడే మరణించారని అధికారులు చెబుతున్నప్పటికీ.. ఆ మరణాలు సంఖ్య 20 వేల వరకు ఉండవచ్చని పత్రికలు రాశాయి.

ప్రమాదం జరిగినపుడు వేలాది మంది ఊపిరి ఆడక, కళ్లు మండుతూ రోడ్ల మీద పరుగులు తీశారు. ఆస్పత్రులన్నీ రోగులతో నిండిపోయాయి. భోపాల్ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులు ఎక్కడివాళ్ళు అక్కడే చనిపోయారు. మనుషులే కాదు జంతువులు, పక్షులు, చెట్లు చేమలు కూడా చనిపోయాయి. ప్రమాదం జరిగిన రోజు నుంచి ఇప్పటి వరకు దాదాపు 5-6 లక్షల మంది క్యాన్సర్, శ్వాసకోశ వ్యాధులు, పుట్టుకతో వచ్చే వైకల్యాల బారిన పడ్డారు. భూగర్భ జలాలు ఇప్పటికీ కలుషితంగా ఉన్నాయి. యూనియన్ కార్బైడ్ CEO వారెన్ ఆండర్సన్ భారత్‌కు రాగానే అరెస్టు కాబడినప్పటికీ.. కొన్ని గంటల్లోనే విడుదలై అమెరికాకు పారిపోయి 2014లో మరణించాడు.

2010లో భారతీయ కోర్టు ఏడుగురు భారతీయ అధికారులకు కేవలం రెండేళ్ల జైలు శిక్ష విధించింది. డౌ కెమికల్స్ (2001లో UCCను కొనుగోలు చేసింది) ఇప్పటిదాకా ఎలాంటి బాధ్యత తీసుకోలేదు. బాధితులకు ఇచ్చిన నష్టపరిహారం సగటున ₹25,000 మాత్రమే. సుప్రీం కోర్టు 1989లో ₹470 మిలియన్ డాలర్ల సెటిల్‌మెంట్ ఆమోదించినా ఒక్కొక్క మరణానికి సుమారు ₹7-10 లక్షలు మాత్రమే లభించాయి. భోపాల్‌లోని ఆ ఫ్యాక్టరీ శిథిలాల సాక్షిగా వేలాది మంది బాధితులు ఇంకా న్యాయం కోసం ఎదురుచూస్తున్నారు.

ఒక చిన్న నిర్లక్ష్యం, కంపెనీ అత్యాశ, అధికారుల అలసత్వానికి లక్షలాది ప్రాణాలు బలి కావాల్సివచ్చిన ఘోర ఉదంతానికి నేటితో 41 ఏళ్ళు. ఇప్పటికైనా పరిశ్రమల్లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా కట్టుదిట్టమైన రక్షణ వ్యవస్థలు యాజమాన్యాలు ఏర్పాటు చేసుకోవాలి, వారు తీసుకునే చర్యలకు ప్రభుత్వం బాధ్యత వహించాలి అని ప్రజలు కోరుకుంటున్నారు.

Next Story