విద్యార్థులు ఊహలకు రెక్కలు తొడుగుతున్న "ఆస్ట్రోల్యాబ్స్"

by Muthe.Rajitha |

విద్యార్థులకు కేవలం పాఠాలు చెప్పడమే కాదు, వాటిలోని జ్ఞానాన్ని కళ్ళకి కట్టినట్టు చూపడం, నిజజీవితంలో ప్రత్యక్షంగా వాటిని చూపడం వంటి చర్యల ద్వారా వారిలో చదువు పట్ల, సాంకేతిక పట్ల, విశ్వం పట్ల ఆసక్తిని రేపుతున్నారు ఓ పాఠశాల ఉపాధ్యాయులు.

విద్యార్థులు ఊహలకు రెక్కలు తొడుగుతున్న ఆస్ట్రోల్యాబ్స్
X

దిశ, వెబ్ డెస్క్ : విద్యార్థులకు కేవలం పాఠాలు చెప్పడమే కాదు, వాటిలోని జ్ఞానాన్ని కళ్ళకి కట్టినట్టు చూపడం, నిజజీవితంలో ప్రత్యక్షంగా వాటిని చూపడం వంటి చర్యల ద్వారా వారిలో చదువు పట్ల, సాంకేతిక పట్ల, విశ్వం పట్ల ఆసక్తిని రేపుతున్నారు ఓ పాఠశాల ఉపాధ్యాయులు. తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో మామడ మండలం పొన్కల్ జిల్లా పరిషత్ పాఠశాలలో 'ఆస్ట్రోల్యాబ్' పేరుతో ఖగోళ విజ్ఞాన ప్రయోగశాల నెలకొల్పారు. పుస్తకాల్లోని భౌతిక, ఖగోళ శాస్త్ర పాఠాలను ప్రయాగశాలలో స్వయంగా చూసి వాటిలోని నియమాలు, సూత్రాలను, జ్ఞానాన్ని నేర్చుకునేలా ఈ ల్యాబ్ ను ఏర్పాటు చేసారు. మారుమూల జిల్లాల గ్రామాల్లో విద్యార్థులకు విశ్వం, గ్రహాలు, నక్షత్రాలు, గ్రహణాలు, గురుత్వాకర్షణ శక్తి వంటివి తెలుసుకోవడానికి ఈ ఆస్ట్రోల్యాబ్ ను ఏర్పాటు చేసినట్టు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పేర్కొన్నారు.

సమాజంలో విద్యార్థులందరికీ శాస్త్ర, సాంకేతిక గురించి తెలుసుకోవడానికి సమాన హక్కులు ఉన్నాయని అన్నారు. ప్రభుత్వ స్కూళ్లు అయినంత మాత్రాన ఎందులోనూ తక్కువ కాదని, వారు కూడా భవిష్యతుల్లో శాస్త్రవేత్తలుగా, ఆస్ట్రోనాట్స్ గా ఎదగడానికి ఇప్పటి నుంచే వారిలో చైతన్యం కలిగించాలని జిల్లాలోని 4 పాఠశాలల్లో వీటిని నెలకొల్పినట్టు వివరించారు. ఈ ల్యాబ్స్ లో ఆకాశంలోని నక్షత్రాలు, గ్రహాలను మరింత దగ్గరగా చూడటానికి టెలిస్కోప్ ఏర్పాటు చేసారు. అలాగే గ్రహణాలు గురించి వివరించే పరికరాలు, గురుత్వాకర్షను వివరించే పరికరాలు, కాంతిని, ఇంద్రధనుస్సును వివరించే పరికరాలు, ప్రయోగాలతోపాటు అంతరిక్షంలో అడుగుపెట్టిన కల్పనా చావ్లా, సునీత విలియమ్స్ వంటి వారి జీవిత చరిత్రలను వివరించే ఛార్ట్స్, అంతరిక్ష రాకెట్లు మోడల్స్ ను ల్యాబ్ గోడలపై వేలాడ దీశారు.

అయితే ఈ ఆస్ట్రోల్యాబ్స్ ను పరిశీలించిన విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా తాము కూడా భవిష్యత్తులో ఆస్ట్రోనాట్స్ అవుతామని చెబుతున్నారు. అలాగే తమ పిల్లలకు అంతర్జాతీయస్థాయి స్కూళ్ల మాదిరిగా విజ్ఞానాన్ని పంచే ల్యాబ్ ఏర్పాటు చేయడం పట్ల తల్లిదండ్రులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పొన్కల్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మైస అరవింద్ మాట్లాడుతూ.. తమ స్కూల్ స్ట్రెంత్, హాజరు బాగా పెరగడానికి ఈ ల్యాబ్ ఎంతో ఉపయోగపడుతోందని, విద్యార్థులు కూడా ఎంతో ఆసక్తితో పాఠాలు నేర్చుకుంటున్నారని పేర్కొన్నారు.

Next Story