కరోనా విషయంలో మనమెక్కడ విఫలమయ్యాం?

by  |

దిశ డెస్క్: కరోనా వైరస్‌ వ్యాప్తి భయం ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశాన్ని ఊపిరాడకుండా చేసింది. 21 రోజుల లాక్‌డౌన్‌తో వసుదైక కుటుంబ స్పూర్తితో నడిచే భారత దేశం కొద్ది రోజుల్లో ఆకలి చావుల్లోకి జారిపోనుందని ఆర్ధిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కరోనాను భారత్ కట్టడి చేయగలదా? అన్న అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఈ భయానికి కారణమేంటి? ఎక్కడ లోపం జరిగింది? భారత్‌లో కరోనా ఎలా చొరబడింది? అన్న ప్రశ్నలు దేశ ప్రజలను వేధిస్తున్నాయి.

చైనాలో కరోనా బయటపడగానే ఆదేశం నుంచి భారీ సంఖ్యలో భారతీయులు వచ్చేందుకు ప్రయత్నించారు. చైనా కట్టడి చేసేంతవరకు ఎవరూ కరోనా ప్రమాదాన్ని పసిగట్టలేకపోయారు. కరోనా 14 రోజుల తరువాతే బయట్టబయలవుతుందని తెలుసుకునే సరికే చేతులు కాలిపోయాయి. ఆకులు పట్టుకుని లాభమేంటని భారత ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. విదేశాల నుంచి వచ్చిన వారందర్నీ సాధారణంగా వదిలేసింది. చైనా నుంచి వచ్చిన వారిని మాత్రమే క్వారంటైన్‌లో ఉంచింది. ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి బాడీ టెంపరేచర్ మాత్రమే చూసింది. అనుమానం వస్తేనే క్వారంటైన్‌లో ఉంచింది. దీంతో కరోనా భారత్‌లోకి చొరబడింది.

విదేశాల నుంచి వచ్చిన కరోనా బాధితులు వాహకాలైపోయారు. దీంతో కరోనా ఇప్పుడెంతమందికి చేరింది? అన్నది చెప్పడం కష్టంగా మారింది. బయటపడ్డ కేసుల్లో ఆసుపత్రులకు చేరిన కేసులు మాత్రమే మనం అధికారికంగా చెప్పుకుంటున్నాం. వివిధ దేశాల్లో కరోనా బాధితుల పేరిట వ్యాప్తమవుతున్న వీడియోలు అందర్లోనూ భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌పై కరోనా దాడిని ఇప్పుడే అంచనా వేయలేమని శాస్త్ర వేత్తలు పేర్కొంటున్నారు.

కరోనాను కట్టడి చేసేందుకు ఇండియా చేస్తున్న కృషి, తీసుకుంటున్న నిర్ణయాలు ప్రశంసనీయమని కోవ్‌-ఇండ్‌-19 భారత మేధావులు, డేటా సైంటిస్టుల సముదాయం కితాబునిచ్చింది. అయితే, కేసుల వ్యాప్తిని ఈ దశలోనే అరికట్టాల్సి వుందని స్పష్టం చేసింది. కరోనా వ్యాప్తి నివారణకు భారత్ పటిష్ఠమైన చర్యలు తీసుకుంటున్నా, కరోనా పరీక్షలు తరచూ నిర్వర్తించే విషయంలో మాత్రం విఫలమవుతోందని ఈ సముదాయం అభిప్రాయపడింది. ఈ నెల 18 నాటికి భారత్‌లో కేవలం 11,500 కరోనా పరీక్షలు మాత్రమే జరిగాయని నిపుణుల బృందం గుర్తు చేసింది. అందువల్లే భారత్‌లో కరోనా వ్యాప్తిపై ఆందోళన వ్యక్తం చేస్తోంది.

కరోనా వైరస్ ఇప్పుడున్న పరిస్థితుల్లోనే విస్తరిస్తే, మే రెండోవారం దాటే సరికి 13 లక్షల కేసులు నమోదయ్యే అవకాశం ఉందని వారు అంచనా వేశారు.. ఇప్పటివరకూ వాక్సిన్ గానీ, మందుగానీ లభించని కరోనాను రెండు, మూడవ దశల్లోనే అణచివేయకుంటే, ఇండియాలో పరిస్థితి దారుణాతి దారుణంగా మారుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే యూఎస్, ఇటలీ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో కరోనా నిదానంగా విస్తరించే దశ దాటి విస్పోటనం చెందిందని, ఇండియాలోనూ ఈ పరిస్థితి రాకుండా చూడాలంటే, మరిన్ని చర్యలు తీసుకోవాలని వారు సూచిస్తున్నారు.

వృద్ధులపై తీవ్ర ప్రతాపం చూపే కరోనా విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని వారు హెచ్చరిస్తున్నారు. వైరస్‌తో వణికిపోతున్న పాశ్చాత్య దేశాలతో పోలిస్తే భారత్‌ది విభిన్నమైన పరిస్థితి. జనసాంద్రత కారణంగా భారతీయులకు సరిపడా వైద్య సౌకర్యాలు కూడా అందుబాటులో లేవన్న విషయాన్ని విస్మరించరాదని వారు గుర్తు చేస్తున్నారు. భారత్‌లో భారతీయుల వైద్య సదుపాయాల కోసం ప్రతి పదివేల మందికి 7 బెడ్లు మాత్రమే ఇప్పటి వరకు అందుబాటులో ఉన్నాయన్న విషయాన్ని వారు గుర్తు చేశారు. ఈ పరిస్థితుల్లో భారత్ కరోనాను లొంగదీసుకునేందుకు ఎలాంటి చర్యలు చేపట్టనుందన్న ఆసక్తి అందర్లోనూ నెలకొంది. కరోనాపై చేపట్టే చర్యలు ఆదేశాన్ని ఏదిశగా నడిపిస్తాయన్న ఆందోళనను కూడా వారు వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే మొక్కై వంగనిదే మానై వంగునా సామెతను గుర్తు చేస్తూ ఈ దశలో కరోనాను నియంత్రచకపోతే.. కరోనా మూడో దశకు చేరితే ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో ఊహించవచ్చని వారు చెబుతున్నారు. అయితే కరోనా నియంత్రణకు కేవలం ప్రభుత్వం తీసుకునే చర్యలు మాత్రమే సరిపోవని, ప్రజలు స్వచ్ఛందంగా చర్యలు చేపట్టాలని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అయితే ఇక్కడి ప్రజలు స్వచ్ఛందంగా నియంత్రణ పాటించే పరిస్థితులు ఉన్నాయా? అన్నదే ఆసక్తికరం.

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా నియంత్రణ సాధ్యమైనప్పటికీ అక్కడి ప్రభుత్వం కరోనాను తీవ్రమైనదిగా భావించడం లేదన్నది సీఎం మీడియా సమావేశాలను చూసినవారెవరైనా కాదనలేని సత్యం. ఏపీలో వలంటీర్ల వ్యవస్థ క్రియాశీలకంగా ఉంది. గ్రామగ్రామాల్లో వలంటీర్లతో చైతన్యం కల్పిస్తున్నారు. దీంతో అక్కడ విదేశాల నుంచి వచ్చిన వారి నుంచి ప్రజలు సామాజిక దూరం పాటిస్తున్నారు. అయితే పట్టణాల్లో పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయి. విదేశాల నుంచి వచ్చారన్న కారణంతో వారిని చాలా మంది కలిశారు. దీంతో పట్టణాల్లో వలంటీర్ల వ్యవస్థ ఉన్నప్పటికీ జరగాల్సిన నష్టం ఇప్పటికే జరిగిపోయి ఉంటుందన్న అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొంటుందా? అన్న ఆసక్తి రాష్ట్ర ప్రజల్లో నెలకొంది.

Tags: coronavirus, andhra pradesh, india, ap, scientists, people

FOLLOW US ON ► Facebook , Google News , Twitter , Koo , ShareChat , Telegram , Disha TV

Next Story