నేతన్నకు తక్షణమే నగదు వచ్చేలా చేయూత: కేటీఆర్

by  |
నేతన్నకు తక్షణమే నగదు వచ్చేలా చేయూత: కేటీఆర్
X

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో నేతన్నలను ఆదుకునేందుకు ప్రభుత్వం మరో ప్రత్యేకమైన చర్య తీసుకుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. నేతన్నల వద్ద నగదును పెంచే ఉద్దేశంతో గతంలో ప్రభుత్వం ప్రారంభించిన ’నేతన్నకు చేయూత‘ పథకంలో భాగంగా గడువు పూర్తి కాకముందే నగదు సాయం అందించాలన్న నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. శనివారం టీఎస్ఐఐసీ భవనంలో బతుకమ్మ చీరల ఉత్పత్తి, చేనేత కార్మికులకు చేయూత, వరంగల్ కాకతీయ మెగా టెక్స్ టైల్ ప్రాజెక్టు, హైదరాబాద్ ఫార్మా సిటీపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పథకంలో చేరిన నాటి నుంచి లాకిన్ పీరియడ్ ఉంటుందని, అయితే ప్రస్తుతం ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో తక్షణమే నగదు అందుకునే సౌలభ్యాన్ని కల్పించనున్నట్లు ప్రకటించారు. ఈ సౌకర్యం ద్వారా సుమారు రూ.93 కోట్లు అందుబాటులోకి వస్తాయన్నారు.

గతంలో ఈ పథకంలో భాగంగా చేనేత కార్మికులు 8శాతం తమ వాటా జమ చేస్తే దానికి రెట్టింపు 16శాతం ప్రభుత్వ వాటా నేతన్నకు చేయూత కార్యక్రమంలో భాగంగా జమ చేసేదన్నారు. దీంతోపాటు పవర్లూమ్ కార్మికుల 8శాతం నేతన్నల వాటాకు సమానంగా మరో 8 శాతం ప్రభుత్వం జమ చేసేది. మూడేళ్ల పాటు ఈ పథకానికి లాకిన్ పీరియడ్ ఉన్నది. ఇప్పటిదాకా కార్మికులు సుమారు రూ.31 కోట్లు జమ చేస్తే ప్రభుత్వ వాటాగా రూ.62 కోట్లు అదనంగా జమ చేసిందన్నారు. ఈ మినహాయింపు ద్వారా 26,500 మంది కార్మికులకు ఉపశమనం లభిస్తుందని మంత్రి కేటీఆర్ వివరించారు. మినహాయింపుతో రూ.50వేల నుంచి సుమారు రూ.1.25 లక్షల వరకు నగదు వస్తుందన్నారు. సొసైటీల పరిధిలో ఉన్న కార్మికులకు గతంలో ముగిసిన పొదుపు పథకం యొక్క డబ్బులను చెల్లించడం ద్వారా మరో రూ.1.18 కోట్లు అందుతుందన్నారు. సమావేశంలో టీఎస్ఐఐసీ చైర్మన్ బాలమల్లు, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, చేనేత, జౌళి శాఖ డైరెక్టర్ శైలజారామయ్యార్, వివిధ విభాగాల డైరెక్టర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed