ఆర్టీసీ నిల్.. ప్రైవేట్ ఫుల్.. దసరాకు స్పెషల్ బాదుడు

155

దిశ, తెలంగాణ బ్యూరో: దసరా సందర్భంగా 4035 బస్సులను ప్రత్యేకంగా తిప్పుతామని ఆర్టీసీ ప్రకటించినా.. ప్రధాన రూట్లల్లో మాత్రం చతికిలబడిపోయింది. ప్రయాణీకులను తమవైపు తిప్పుకోవడంలో ఆర్టీసీ ఫెయిల్యూర్ మూటగట్టుకుంటోంది. మరోవైపు ప్రైవేట్‌ ట్రావెల్స్‌ మరోసారి దారి దోపీడీ మొదలుపెట్టారు. రద్దీని తమకు అనుకూలంగా మార్చుకుంటూ ప్రయాణీకులను దోచేస్తున్నారు. బస్సు ధరలను విమాన ఛార్జీలతో సమానంగా పెంచేశారు. పండుగకు ఊరెళ్దామనుకున్న వారికి ప్రయాణానికి ముందుగానే జేబులు గుల్లవుతున్నాయ్‌. కారణాలేమైనా.. ఆర్టీసీ బస్సుల్లో రిజర్వేషన్ల కోసం ప్రయాణీకులు ఆసక్తి చూపించడం లేదు. ధర ఎక్కువైనా ప్రైవేట్‌కే వెళ్తున్నారు. అంతేకాకుండా ఈ నెల 11 తర్వాత ధరలు మూడింతలు పెరుగుతాయని ట్రావెల్స్ యజమానులు బహిరంగంగానే చెబుతున్నారు. దీనికి తోడుగా చాలా ప్రాంతాలు.. రద్దీ ఉండే రూట్లలో ఆర్టీసీ బస్సులు నడపడం లేదు. దీంతో చాలా మంది ప్రైవేట్‌ ట్రావెల్స్‌ను ఆశ్రయిస్తున్నారు. దీంతో ట్రావెల్స్‌ పెద్ద ఎత్తున దోచుకుంటున్నాయి.

సెలవులు కదా..

దసరా, బతుకమ్మ పండుగకు సెలవులు వస్తుండటంతో హైదరాబాద్ నుంచి ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాలకు ఎక్కువ సంఖ్యలో వెళ్తున్నారు. అయితే ఇప్పుడు ప్రైవేట్ ట్రావెల్స్ మాత్రం పండగ ఏదైనా దోపీడీయే తమ అభిమతమన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి. పండుగ సందర్భంగా ట్రావెల్స్ ఛార్జీలు మూడింతలవుతున్నాయి. దాదాపుగా విమాన ఛార్జీలను మించిపోతున్నాయి బస్ టికెట్ ధరలు. ఆర్టీసీ సైతం పండుగ రద్దీ పేరుతో టికెట్‌ పై 50 శాతం అదనపు ఛార్జీలను వసూలు చేస్తోంది. ఇదే అదునుగా తామేం తక్కువ తిన్నామా అన్నట్లుగా ప్రైవేట్ ట్రావెల్స్ చెలరేగిపోతున్నాయి. హైదరాబాద్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు వెళ్లేవారికి ఈ ఛార్జీలు చుక్కలు చూపిస్తున్నాయి. ఎక్కువ డిమాండ్‌ ఉన్న రూట్లు.. విజయవాడ, గుంటూరు, ఏలూరు, విశాఖపట్నం, శ్రీకాకుళం, తిరుపతికి సాధారణ రోజులలో ఏసీ బస్‌ టికెట్‌ 500 వరకూ ఉంటే.. దసరా పేరు చెప్పి రూ. 1500 చేశారు. ఈ నెల 11 తర్వాత ప్రయాణించాలనుకుంటే మాత్రం టికెట్‌ రేటు రూ. 2 నుంచి రూ. 3వేల పైమాటే. దీంతో నలుగురు ఉన్న కుటుంబం టికెట్లకే రూ. 5 నుంచి రూ. 8 వేలు ఖర్చుచేయాల్సి వస్తోంది. హైదరాబాద్‌ నుంచి విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, ఏలూరు, కాకినాడ, అమలాపురం, రాజమండ్రి, చిత్తూరు, కర్నూలు, కడప, తిరుపతి, బెంగళూరు ప్రాంతాలకు రోజూ 650 నుంచి 700 ప్రైవేట్‌ బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. పండగ వేళ వీటి సంఖ్య పెరుగుతుంది. ఆ మేరకు బాదుడూ ఉంటుంది. అంతేకాకుండా హైదరాబాద్ నుంచి విశాఖకు నాన్ ఏసీ బస్సులో టికెట్ ధర రూ. 900 ఉండగా.. కానీ ప్రస్తుతం రూ. 2400కు పెరిగింది.

పేరుకే కాంట్రాక్ట్ క్యారేజీలు

వాస్తవానికి ప్రైవేటు బస్సులన్నీ కాంట్రాక్టు క్యారేజీలుగా పర్మిట్లు తీసుకొని స్టేజీ క్యారియర్లగా నడుస్తున్నట్లు అధికారులే చెప్పుతున్నారు. దీనిపై రవాణా శాఖ కూడా చూసీచూడనట్లే వ్యవహరిస్తోంది. కనీసం చార్జీల నియంత్రణకైనా చొరవ తీసుకోవడం లేదు. అసలు తమ పరిధి కాదంటూ చేతులెత్తేస్తోంది. ఇదే సమయంలో పండుగకు ముందు నాలుగైదు రోజులకు ప్రైవేట్ ట్రావెల్స్ టికెట్లను బ్లాక్ చేశాయి. ఇప్పటి వరకు నెలంతా రిజర్వేషన్లు ఉంచే ట్రావెల్స్.. ఇప్పుడు ఏ రోజు కారోజే కేటాయిస్తోంది. దీంతో డేట్‌ను బట్టి టికెట్ రేట్ నిర్ధారిస్తున్నారు.

సిటీ బస్సులే స్పెషల్ బస్సులు

మరోవైపు రాష్ట్ర ఆర్టీసీ దసరాకు ప్రత్యేక బస్సులను సైతం నడుపుతున్నట్లు ప్రకటించింది. ధరలను కూడా 50 శాతం అదనంగా పెంచింది.  ప్రత్యేక హెల్ప్ లైన్, రిజర్వేషన్లు అంటూ ప్రకటించింది. కానీ సిటీలో తిప్పే బస్సులను ప్రత్యేక బస్సులుగా చేసింది. ఈ సిటీ బస్సులే ఇప్పుడు దసరా స్పెషల్ బస్సులు. దీనికి తోడుగా ప్రధాన రూట్లలో ఆర్టీసీ బస్సులు కనిపించడం లేదు. ఈ కారణాలతో ఆర్టీసీకి ప్రయాణీకులు దూరమవుతున్నారు. మరోవైపు ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సుల వెలుగుల ముందు ఆర్టీసీ బస్సులు వెలవెలబోతున్నాయి. సేఫ్టీ కూడా లేదనే కారణంగా ప్రయాణీకులు ధరలు ఎక్కువైనా ప్రైవేట్ బస్సుల వెనక పరుగులు తీస్తున్నారు.

ఇదే సమయంలో రద్దీని బట్టి ప్రైవేటు ట్రావెల్స్ టికెట్‌ ధరను 125 శాతం పెంచాయి. పండగ దగ్గర పడే కొద్దీ అవి మరింత పెరుగుతాయని బహిరంగంగానే చెప్పుతున్నారు. ఆర్టీసీ నుంచి ఏపీ‌, కర్ణాటక రాష్ట్రాలకు 950, తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు 3 వేల 85 సర్వీసులు నడపనుంది. 8వ తేదీ నుంచి వీటిని కేటాయించింది. అత్యధికంగా 14వ తేదీన 889 సర్వీసులను, అతి తక్కువగా 15వ తేదీన 84 సర్వీసులను నడపనుంది. వీటిలో రిజర్వేషన్‌ సదుపాయం ఉన్న బస్సుల టికెట్‌ ధరను 50 శాతం పెంచింది. కానీ ఆర్టీసీ బస్సుల్లో రిజర్వేషన్లు ఇంకా ఖాళీలే దర్శనమిస్తున్నాయి. ప్రైవేట్ బస్సుల్లో పండుగ దగ్గరపడే కొద్దీ ఛార్జీలు పెంచుతూ తత్కాల్ పెడుతున్నా.. ఆ సంఖ్య గణనీయంగా పెరుగుతూ వెయిటింగ్ లిస్ట్ ఉంటున్నాయి.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..