గణేష్ మండపాల వద్ద విద్యుత్ భద్రత చర్యలు పాటించండి: ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమా రెడ్డి

128

దిశ, తెలంగాణ బ్యూరో: వినాయకచవితి సందర్భంగా రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న మండపాల వద్ద విద్యుత్ భద్రతా చర్యలు పాటించాలని ఎస్పీడీసీఎల్ సీఎండీ జీ రఘుమా రెడ్డి పేర్కొన్నారు. చవితి సందర్భంగా ఏర్పాటు చేసే గణేశ్ మండపాలకు నిరంతరాయ విద్యుత్ సరఫరా, భద్రతాపరంగా విద్యుత్ శాఖ చేపట్టిన పనులను గురువారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 10వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలు 11 రోజుల పాటు నిర్వహిస్తారని, మండపాలకు నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించాలని సిబ్బందిని ఆదేశించారు. మండపాల వద్ద పాటించాల్సిన విద్యుత్ భద్రతా జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు. మండపాలకు విద్యుత్ సరఫరా కనెక్షన్ కోసం సామాన్యులు స్తంభాలు ఎక్కకూడదని, సంస్థ సిబ్బంది ద్వారానే విద్యుత్ కనెక్షన్ పొందాలని తెలిపారు.

ఐఎస్ఐ మార్క్ కలిగిన ప్రామాణిక విద్యుత్ వైర్లను మాత్రమే వినియోగించాలని, జాయింట్లున్న వైర్లు వినియోగించకూడదని స్పష్టం చేశారు. తగినంత కెపాసిటీ కలిగిన ఎంసీబీలను వాడాలని సీఎండీ సూచించారు. విద్యుత్ వైర్లు, స్తంభాలకు పిల్లలను దూరంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే అప్రమత్తమై దగ్గరలోని విద్యుత్ సిబ్బందికి తెలియజేయాలని సీఎండీ రఘుమారెడ్డి పేర్కొన్నారు. విద్యుత్ లైన్లు తెగి పడినా, ఇతర అత్యవసర పరిస్థితులకు 1912, 100కు డయల్ చేసి సమాచారం అందించాలని కోరారు. స్వీయ జాగ్రత్తలు పాటిస్తూ పండుగను సుఖ సంతోషాలతో సురక్షితంగా జరుపుకోవాలని సీఎండీ ఆకాంక్షించారు.

ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణ రావు జయంతిని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ప్రధాన కార్యాలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎస్పీడీసీఎల్ సీఎఎండీ రఘుమారెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాళోజీ వైవిధ్యమైన ఉద్యమకారుడని, ప్రజల భాషలో కవిత్వాలు రాస్తూ ప్రజాకవిగా ప్రసిద్ధి చెందారని కొనియాడారు. ఆయన జయంతిని తెలంగాణ ప్రభుత్వం ‘తెలంగాణ భాషా దినోత్సవం’గా ప్రకటించడం హర్షనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు టీ శ్రీనివాస్, జే శ్రీనివాస రెడ్డి, పర్వతం, సీహెచ్ మదన్ మోహన్ రావు, ఎస్ స్వామి రెడ్డి, నరసింహ రావు, గోపాల్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..