రేపు తిరుపతిలో సదరన్ కౌన్సిల్ సమావేశం

by  |
amith shaa
X

దిశ, ఏపీ బ్యూరో: దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్‌ల సమావేశానికి ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి నగరం సిద్ధమైంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతోపాటు 8 రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్‌లు ఈ కార్యక్రమంలో హాజరు కానున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రాల మధ్య సహకారం, అంతర్గత భద్రతతోపాటు మెుత్తం 8 రాష్ట్రాలకు సంబంధించి 48 అంశాలపై ఈ చర్చ జరగనుంది. దేశాభివృద్ధిలో రాష్ట్రాల భాగస్వామ్యం పెంపొందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే బెంగుళూరులో జరిగిన 28వ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై కూడా సమీక్ష చేయనున్నారు. ఆతిథ్య రాష్ట్రంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రముఖులకు తిరుమలలో ప్రత్యేక దర్శనంతోపాటు అన్ని సౌకర్యాలనూ కల్పించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.

దేశాభివృద్ధిలో రాష్ట్రాల భాగస్వామ్యంపై చర్చ

29వ సదరన్ కౌన్సిల్ సమావేశానికి తిరుపతి ముస్తాబైంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలో ఆదివారం జరిగే ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్, లక్షద్వీప్ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్‌లు, ముఖ్య అధికారులు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రాల మధ్య సహకారం, వివాదాలు, సరిహద్దు సమస్యలు, అంతర్గత భద్రత, మౌలిక సదుపాయాల కల్పన, పరిశ్రమలు, పర్యాటక అభివృద్ధి, పెండింగ్ అంశాలు, ఆర్థికాభివృద్ధి, ఎగుమతులు, కేంద్ర రాష్ట్రాల మధ్య సహకారం వంటి సమస్యలపై చర్చించనున్నారు. దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి 48 అంశాలపై ఈ చర్చ జరగనుంది. రాష్ట్రాల మధ్య సమన్వయం.. కేంద్ర, రాష్ట్రాల మధ్య పరిష్కారం కానీ పలు కీలకమైన అంశాలతోపాటు దేశాభివృద్ధిలో రాష్ట్రాల భాగస్వామ్యం పెంపొందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నారు.

సదరన్ కౌన్సిల్ సమావేశంలో హోదా అంశం

సదరన్ కౌన్సిల్ సమావేశంలో పునర్విభజన చట్టంలోని అంశాలపై ప్రత్యేకంగా ప్రస్తావించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయించారు. ఇప్పటికే ఈ సదరన్ కౌన్సిల్ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై సీఎం సమీక్ష సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా తమిళనాడు నుంచి తెలుగుగంగ ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు, పోలవరం ప్రాజెక్టు రూ.6,300కోట్లు బకాయిలు, రెవెన్యూ లోటు, రేషన్‌ బియ్యంలో హేతుబద్దత లేని రీతిలో కేంద్రం కేటాయింపులు, తెలంగాణ నుంచి రావాల్సిన సివిల్‌ సప్లైస్‌ బకాయిల అంశాలపై చర్చించాలని, ఎఫ్‌డి ఖాతాల స్థంభన, ఆస్తుల విభజనలో అపరిష్కృత అంశాలనూ ప్రస్తావించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. కేఆర్‌ఎంబి పరిధిలోకి జూరాల ప్రాజెక్టును తీసుకు రావాలన్న అంశాన్ని జోనల్‌ సమావేశంలో ప్రస్తావించాలని, నదుల అనుసంధానంలో కేంద్రం ప్రతిపాదనలపై చర్చించాలని నిర్ణయించింది. రాష్ట్రానికి మేలు జరిగేలా వీలైనంత త్వరగా సాకారమయ్యే ప్రణాళికలు, రాష్ట్రం సూచిస్తున్న ప్రత్యామ్నాయాలపైనా ప్రభుత్వం సమావేశంలో చర్చించేందుకు రెడీ అయ్యింది. అంతేకాదు కౌన్సిల్‌ సమావేశంలో ఇతర రాష్ట్రాలు ప్రస్తావించే అంశాల్లో రాష్ట్రానికి సంబంధించిన విషయాలు ఉంటే వాటిపై కూడా తగిన రీతిలో సిద్ధంగా ఉండాలని సీఎం జగన్ ఆదేశించడంతో అందుకు అధికారులు సన్నద్ధమయ్యారు.

సీఎం జగన్‌కు జనసేన పార్టీ సూచన

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలో తిరుపతి వేదికగా ఆదివారం సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరగనున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు జనసేన పార్టీ కీలక సూచనలు చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిలువరించడానికి సీఎంల జోనల్ కౌన్సిల్ మీటింగ్‌ను జగన్ ఒక అవకాశంగా తీసుకోవాలని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ట్విటర్ వేదికగా సూచించారు. తమిళనాడులోని సేలం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేందుకు అక్కడి ప్రభుత్వం ఏం చేసిందో జగన్ అడిగి తెలుసుకోవాలని జనసేన నేత నాదెండ్ల మనోహర్ సూచించారు. ఈ సందర్భంగా తమిళనాడు సీఎం స్టాలిన్ సమావేశం ఫొటోను మనోహర్ పోస్ట్ చేశారు.

Next Story