ఇరాన్‌లో 4.9 తీవ్రతతో భూకంపం..నలుగురు మృతి

by vinod kumar |
ఇరాన్‌లో 4.9 తీవ్రతతో భూకంపం..నలుగురు మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇరాన్‌లోని ఈశాన్య నగరం కష్మార్‌లో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.9గా నమోదైంది. ఈ ఘటనలో నలుగురు మరణించగా..120 మందికి పైగా గాయపడ్డట్టు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. మధ్యాహ్నం 1:24 గంటలకు సంభవించిన ఈ భూకంప కేంద్రం 10కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమై ఉన్నట్టు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. భూకంప తీవ్రత వల్ల కష్మార్ నగరం, సమీప గ్రామాల్లోని అనేక భవనాలు దెబ్బతిన్నాయని కష్మార్ గవర్నర్ హజతోల్లా షరియత్మదారి వెల్లడించారు. 35 మంది ఆస్పత్రి పాలయ్యారని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలిపారు. కాగా, టెక్టోనిక్ ప్లేట్ల పైన ఉన్న కారణంగా ఇరాన్ తరచుగా భూకంపాలను గురవుతుంది. ఇరాన్ చరిత్రలో అత్యంత వినాశకరమైన భూకంపం 2003లో సంభవించింది. 6.6 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపం కారణంగా ఆగ్నేయ నగరం బామ్‌లో 31,000 మందికి పైగా మరణించారు.Next Story

Most Viewed