సింగరేణిలో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి శ్రీకారం

by  |
సింగరేణిలో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి శ్రీకారం
X

దిశ, బెల్లంపల్లి: సింగరేణిలో బొగ్గు తరిగిన క్షేత్రాల్లో సోలార్ విద్యుదత్పత్తికి యాజమాన్యం శ్రీకారం చుట్టింది. సింగరేణిలో మూసేసిన ఉపరితలంపై సోలార్ విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించింది. సంస్థ మనుగడకు, ఇతర అవసరాలకు ఈ విద్యుత్ ను వినియోగించుకోవాలనే సదుద్దేశంతో యాజమాన్యం ఏర్పాట్లు చేపట్టింది. ఇందులో భాగంగా కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని తిర్యానీ మండలం గోలేటి ప్రాంతంలోని డోర్లి-1, డోర్లి-2లలో బొగ్గు క్షేత్రాలు తరిగిపోయిన కారణంగా కొన్నేళ్ల క్రితమే మూసేశారు. ఈ ఉపరితల గనులపై సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళికలు సిద్ధం చేసి యాజమాన్యానికి సమర్పించడంతోపాటు విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం కలిగిన నిపుణుల కమిటీ సలహాలను సైతం సేకరించింది. నిపుణుల కమిటీ సూచనల మేరకు డోర్లి-1పై 10 మెగావాట్ల విద్యుత్, డోర్లి-2పై ఐదు మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని సాధించవచ్చనే నిపుణుల సూచనల మేరకు అందుకు అవసరమైన స్థలాన్ని చదును చేసే పనులు మొదలయ్యాయి.

ఒక మెగావాట్ విద్యుత్ ఉత్పత్తికి 5ఎకరాల స్థలం అవసరం ఉండగా 15 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి 75ఎకరాల స్థలంలో యాజమాన్యం ఉపరితల గనుల్లో ఓబీలపై అవసరమైన సౌర ప్లేట్లను అమర్చేందుకు సన్నాహాలు చేస్తోంది‌. రామగుండం సెంటినరీ కాలనీలో యాజమాన్యానికి చెందిన 1500ఎకరాల ఖాళీ స్థలంలో సుమారు 350మెగావాట్ల సౌర విద్యుత్ ను ఉత్పత్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లను చేయడం జరిగింది. బెల్లంపల్లి రీజియన్ లో సోలార్ విద్యుత్ ఉత్పాదనలో అనుభవం కలిగిన ఆదాని గ్రూపు సంస్థతోపాటు గ్లోబల్ గ్రీన్ సంస్థకు సౌర విద్యుత్ ఉత్పాదన పనులను అప్పగించింది. దీంతో సౌరవిద్యుత్ ఉత్పాదనకు అవసరమైన ఏర్పాట్లను సంబంధిత సంస్థలు ప్రారంభించడం జరిగింది. సింగరేణి వ్యాప్తంగా మూసేసిన ఉపరితల గనులు, బొగ్గు నిక్షేపాలతో మూసేసిన భూగర్భ గనులు, యాజమాన్య పరిధిలో ఉండే సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో ఖాళీ స్థలాలను గుర్తించి వాటిలో వచ్చే ఐదేళ్లలో 1000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని సాధించేందుకు సంస్థ సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే బెల్లంపల్లి రీజియన్ లో ప్రాథమికంగా 15 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన సాంకేతిక సలహాలను ప్రణాళికలను సిద్ధం చేసి విద్యుదుత్పాదనకు ఏర్పాట్లు చేస్తోంది.

ఎప్పటికీ తరిగిపోనిది సోలార్ విద్యుత్

నిరంతరం ప్రకాశిస్తూ జగతికి వెలుగునిచ్చే సూర్య శక్తితో తయారయ్యే విద్యుత్ ఎప్పటికి తరిగిపోదు. సింగరేణి యాజమాన్యం మూసేసిన గనుల ఖాళీ ప్రదేశాల్లో ఉత్పత్తికి ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగానే బెల్లంపల్లి రీజియన్ లో 15మెగావాట్ల విద్యుత్ ఉత్పాదనకు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసి సంబంధిత సంస్థలకు అప్పగించాం. సోలార్ విద్యుత్ పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది.

– బెల్లంపల్లి సింగరేణి జనరల్ మేనేజర్ సంజీవరెడ్డి


Next Story

Most Viewed