కాటారంలో ‘వైద్యం’ ఎక్కడ..? అల్లాడిపోయిన పాము కాటు రోగి

by  |

దిశ, కాటారం : పాము కాటు వేసిన మహిళకు వైద్య సహాయం అందక పోవడంతో అల్లాడుతున్న ఉన్న పరిస్థితుల్లో బాధితురాలిని వైద్య సహాయం కోసం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. మండల కేంద్రానికి చెందిన బొడ్డు శాంత ఇంట్లో పనులు చేస్తుండగా ఆదివారం పాము కాటు వేసింది. చికిత్స కోసం కాటారంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లగా సిబ్బంది ఎవరూ అందుబాటులో లేరని కుటుంబ సభ్యులు ఆరోపించారు. బొడ్డు శాంత పరిస్థితి విషమించడంతో చికిత్స కోసం 108 అంబులెన్సులో మహాదేవపూర్‌లోని సామాజిక వైద్యశాలకు తరలించారు.

అక్కడ సిబ్బంది ప్రాథమిక వైద్య సహాయం అందించి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి రిఫర్ చేశారు. కాటారం ఆరోగ్య కేంద్రంలో 24 గంటలు వైద్య సేవలు అందించాల్సి ఉండగా, సిబ్బంది ఎవరూ లేకపోవడం రోగులకు ఇక్కట్లు తప్పడం లేదని పాము కాటు వేస్తే ప్రాణాలు కాపాడుకునేందుకు ఎంజీఎం తరలి వెళ్లాల్సి వస్తోందని, బిఎస్‌పీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు సదన్ కుమార్, కోశాధికారి బొడ్డు రాజ్‌కుమార్ ఆరోపించారు. కాటారం ఆరోగ్య కేంద్రంలో ఖాళీగా ఉన్న డాక్టర్లు, ఇతర పోస్టులను వెంటనే భర్తీ చేయాలని 24 గంటలు వైద్య సహాయం అందించి ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Next Story