త్వరపడండి.. ‘సింగరేణి’లో ఉద్యోగాల జాతర

by  |
త్వరపడండి.. ‘సింగరేణి’లో ఉద్యోగాల జాతర
X

దిశ, బెల్లంపల్లి : సింగరేణి సంస్థలో ఉద్యోగాల జాతర షురువైంది. తొలి విడతగా 372 ఉద్యోగాలకు సంస్థ యాజమాన్యం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ మేరకు సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగా మాత్రమే అభ్యర్ధుల ఎంపిక ఉంటుందని, కష్టపడి చదివి ఉద్యోగం సాధించాలని అభ్యర్థులకు సూచించారు. మిగిలిన పోస్టులకు కూడా దశలవారీగా నోటిఫికేషన్లు విడుదల చేస్తామని తెలిపారు.

ప్రస్తుతం ఏడు రకాల ఉద్యోగాలకు..

తొలి ఉద్యోగ నోటిఫికేషన్‌‌లో ఏడు రకాల ఉద్యోగాలకు సంబంధించి 372 పోస్టుల భర్తీకి సింగరేణి ధరఖాస్తులను ఆహ్వానించింది. వీటిలో 305 పోస్టులను సింగరేణి విస్తరించి ఉన్న ఉమ్మడి కరీంనగర్‌, ఆదిలాబాద్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాలకు చెందిన అభ్యర్థులకు కేటాయించినట్లు పేర్కొన్నారు. అన్‌ రిజర్వుడ్‌‌గా కేటాయించబడిన 67 పోస్టులకు తెలంగాణలోని అన్ని జిల్లాలకు చెందినవారు అర్హులేనని తెలిపారు. వయోపరిమితి, విద్యార్హతలు, జీతభత్యాలు, ఫీజు చెల్లింపు మొదలైన వివరాలను సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ వెబ్‌‌సైట్‌(www.scclmines.com)లోకి వెళ్లి అక్కడి హోంపేజీలోని career లింక్‌ను ఓపెన్‌ చేసి తెలుసుకోవచ్చని సూచించారు.

ఆన్‌‌లైన్‌ ద్వారానే దరఖాస్తు

అభ్యర్థులందరూ ఈ నెల22వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల నుండి ఫిబ్రవరి నాల్గవ వతేదీ సాయంత్రం ఐదు గంటల వరకూ ఆన్‌‌లైన్‌ ద్వారా సింగరేణి వెబ్‌‌సైట్‌‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఈ దరఖాస్తులతోపాటు తమ అర్హత సర్టిఫికెట్లను ఆన్‌‌లైన్‌‌లో అప్‌‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది కనుక ఎవరూ తమ దరఖాస్తు హార్డు కాపీలను సింగరేణి రిక్రూట్‌‌మెంట్‌ విభాగానికి పంపొద్దని సూచించారు. సైట్‌లో ఇవ్వబడిన ఎస్‌బీఐ లింకు ద్వారా రూ.200 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అన్ని ఉద్యోగాలకు గరిష్ఠ వయోపరిమతి 30 సంవత్సరాలు కాగా, ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలవారికి ఐదేళ్ల వరకూ సడలింపు ఉంటుందని తెలిపారు. ఇంటర్నల్‌ అభ్యర్థులకు వయో పరిమితి నిబంధన వర్తించదని, పరీక్ష ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

అర్హులు సద్వినియోగించుకోవాలి : సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్

సింగరేణి నిర్వహిస్తున్న ఉద్యోగ నియామకాలను అర్హులందరూ సద్వినియోగించుకోవాలి. రాత పరీక్ష ద్వారానే అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. పైరవీలు చేసి ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఎవరు చెప్పినా వాటిని నమ్మి మోసపొవద్దు. అలాంటి వారి గురించి వెంటనే సింగరేణి విజిలెన్స్ శాఖకు తెలియజేస్తే తగిన చర్యలు తీసుకుంటాం.


Next Story

Most Viewed