కరోనా కట్టడికి సింగరేణి చర్యలు భేష్!

95
Singareni

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: సింగరేణిలో కరోనాను కట్టడి చేసేందుకు సంస్థ కృషి చేస్తోంది. కరోనా పరీక్షలతో పాటు ఐసోలేషన్, వైద్యసేవలు, వ్యాక్సినేషన్‌పై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే 1.27లక్షల మందికి పరీక్షలు, 27వేల మందికి వ్యాక్సినేషన్ చేశారు. 1400 బెడ్లతో ప్రత్యేక వార్డుల ఏర్పాటు చేయగా.. హైదరాబాదులో అత్యవసర వైద్య సేవలు, అత్యవసర మందులు, ఆక్సిజన్ సిలిండర్‌ల కొనుగోలు, ముందస్తు జాగ్రత్తగా ఐదుచోట్ల ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు వంటి చర్యలు చేపట్టారు. ఏడాది కాలంగా రూ.71 కోట్ల మేర వ్యయం చేసింది. సింగరేణి సంస్థ ఇప్పటివరకు 1,25,250 ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షల కిట్లను రూ.3.16కోట్లతో కొనుగోలు చేసింది. ఇప్పటివరకు 99,406 మందికి పరీక్షలు నిర్వహించారు. సింగరేణిలో 12,308మందికి పాజిటివ్‌గా నిర్ధారణ కాగా.. ఐసోలేషన్ సెంటర్లలో వైద్య సేవలు అందించారు.

ఇప్పటికే 9,938మంది పూర్తిగా కోలుకోగా.. 2267మంది చికిత్స పొందుతున్నారు. సింగరేణిలో 44వేల మంది కార్మికులుకాగా.. 783మంది కార్మికులు వైద్యం పొందుతున్నారు. మిగతా 1121మంది వారి కుటుంబ సభ్యులుకాగా.. 364మంది కాంటాక్టు కార్మికులున్నారు. హైదరాబాద్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో తరలించిన 867 అత్యవసర కేసులకు ప్రత్యేక వైద్యసేవలు అందించేందుకు రూ.38 కోట్లు వెచ్చించింది. 692 బెడ్లకు అదనంగా మరో 736 బెడ్లు సమకూర్చారు. ప్రత్యేక వార్డుల ఏర్పాటుకు రూ. 43 లక్షలు ఖర్చు చేసింది. క్వారంటైన్ సెంటర్లలో వైద్య సేవలు పొందే వారికి రూ. 80 లక్షలు వెచ్చించి.. వివిధ రకాల మందులు, పల్స్ ఆక్సిమీటర్ వంటి 18రకాల వస్తువులు ఉన్నకిట్లు ఇచ్చారు. రెమిడిసివిర్ ఇంజెక్షన్లు, ఫెవిపెరావిర్ మాత్రలకు రూ.5.55 కోట్లు వెచ్చించారు. రూ.1.28 కోట్లతో 370 ఆక్సిజన్ సిలెండర్ల ఏర్పాటు చేశారు.

రూ.3.60 కోట్లతో ఐదు ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసింది. రూ. 2 కోట్లతో అదనపు వైద్య సిబ్బంది నియమించారు. 35 మంది అదనపు డాక్టర్లు, 126 నర్సులు, 260 మంది సిబ్బందిని కాంట్రాక్టు పద్ధతిన నియమించారు. రూ.1.50కోట్లతో రోగులకు పౌష్టికాహారం అందిస్తున్నారు. శానిటేషన్ లిక్విడ్, మాస్కులు, హ్యాండ్ శానిటైజర్లు వైద్యులకు కావలసిన పీపీఈ కిట్లు, మాస్కులు కొనుగోలు చేశారు. రూ. 3.15 కోట్లతో వెంటిలేటర్లు, ఇతర అత్యవసర వైద్య పరికరాలు కొన్నారు. ఇప్పటికే 27,469మందికి వాక్సినేషన్ పూర్తి చేసింది. కరోనాతో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 15లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లిస్తోంది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..