గొర్లకాపరి కరెంట్ బిల్లు రూ. లక్షా 80 వేలు

by  |
గొర్లకాపరి కరెంట్ బిల్లు రూ. లక్షా 80 వేలు
X

దిశ, వరంగల్: విషయమేమిటంటే.. కరెంట్ ముట్టుకుంటే షాక్ కొట్టేది. కానీ, ఇప్పుడు కరెంట్ బిల్లు పట్టుకుంటే చాలు షాక్ కొడ్తోంది. కరోనా లాక్ డౌన్ పుణ్యమా అని మూడు నెలలుగా కరెంట్ బిల్లు రాలేదు. కొద్ది రోజులుగా కరెంట్ బిల్లులు చెల్లిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక్కొక్కరి బిల్లులు పరిశీలిస్తుంటే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. ఓ గొర్ల కాపరికి ఏకంగా రూ. లక్షా ఎనభై వేల బిల్లు రావడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే…. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రానికి చెందిన శీలం సదయ్య గొర్ల కాపరి. ఈయనకు రెండు గదుల రేకుల ఇల్లు ఉంది. ఇంట్లో రెండు బల్బులు, ఒక ఫ్యాన్, ఒక టీవీ ఉంది. మూడు నెలల తర్వాత విద్యుత్ బిల్లుల రీడింగ్ కోసం వచ్చి యావరేజ్ పేరిట సదయ్య ఇంట్లోనూ విద్యుత్ సిబ్బంది బిల్లు తీసిచ్చారు. ఆ బిల్లు చూసేసరికి సదయ్య గుండె గుబేల్ అంది. అక్షరాలా లక్షా 80 వేల రూపాయల బిల్లు వచ్చింది. దీంతో ఆందోళనకు గురైన సదయ్య విద్యుత్ అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. గొర్లు కాస్తేనేగానీ పొట్ట గడవని తన వృత్తి బాధ్యతను ఇంకొకరికి అప్పజెప్పి నాలుగు రోజులుగా కరెంట్ ఆఫీస్ లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. అయినా సదయ్య బాధను పట్టించుకునేవారే లేకుండా పోయారు. ఏఈకి ఫోన్ చేస్తే స్పందించటంలేదంటూ వాపోతున్నాడు. ఇప్పటికైనా విద్యుత్ అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని బాధితుడు వేడుకుంటున్నాడు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed