మార్కెట్లకు బ్లాక్‌డే..పీడిస్తోన్న కరోనా వైరస్!

by  |
మార్కెట్లకు బ్లాక్‌డే..పీడిస్తోన్న కరోనా వైరస్!
X

దిశ, వెబ్‌డెస్క్: వైరస్‌లు రెండు రకాలు. ఒకటి మనుషులను పట్టి పీడించేది. రెండోది ఫోన్లను, కంప్యూటర్లను పట్టి పీడించే వైరస్. అయితే, ఈసారి ఇవి కాకుండా మూడో రకం కూడా మొదలైంది. అదే..కరోనా వైరస్. అవును ఇది మనుషులను మాత్రమే కాకుండా ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలనూ పట్టి పీడించే సరికొత్త వైరస్. ఈ వైరస్ ఎలాంటిదంటే ఒక్కరోజులో పదుల లక్షల కోట్లను ఆవిరి చేసేయగలదు. నెమ్మదిగా మొదలైన ఈ వైరస్ మహమ్మారి చాపకింద నీరులా దేశాల మార్కెట్లనూ, మదుపర్ల సొమ్మునూ నమిలేస్తూ పోతోంది.

కేవలం రెండు రోజుల్లోనే రూ. 23 లక్షల కోట్లను దేశీయ మార్కెట్లు నష్టపోయాయి. గురువారం భారీగా నష్టపోయిన మార్కెట్లు శుక్రవారం దానికి మించిన నష్టాలను కలగజేశాయి. వైరస్ వేగాన్ని తట్టుకోలేక ఆసియా మార్కెట్లు భారీగా నష్టపోయాయి. మార్కెట్ల పతనాన్ని అధిగమించేందుకు ఎక్కువగా ఆధారపడే బంగారం వంటి కమొడిటీల్లో కూడా ఇలాంటి పతనమే నమోదవడం గమనార్హం. ఒక్క ఆసియా మార్కెట్లు మాత్రమే కాకుండా అంతర్జాతీయంగా అన్ని మార్కెట్లు నష్టాలను చూస్తున్నాయి. జపాన్ మార్కెట్ నిక్కీ 10 శాతం, కొరియా కోస్డాక్ 8 శాతం దిగజారడంతో మార్కెట్ల ట్రేడింగ్‌ను 20 నిమిషాల పాటు క్లోజ్ చేశారు. అమెరికా మార్కెట్లు సైతం భారీగా నష్టాలను నమోదు చేస్తుండటంతో ఆ ప్రభావం ఆసియా మార్కెట్లపై పడుతోంది. యూఎస్ మార్కెట్లు 10 శాతం వరకూ నష్టాలను చూస్తున్నాయి. అమెరికన్ మార్కెట్లకు 1987 తర్వాత ఇదే అత్యంత దారుణమైన పతనం కావడం గమనార్హం.

విశ్లేషకులు, మార్కెట్ నిపుణులు అంతా సర్దుకుంటుంది అని ఎంత చెబుతున్నప్పటికీ స్టాక్ మార్కెట్లు మాత్రం కరోనా వైరస్ భయానికి వణికిపోతున్నాయి. గత నెల రోజుల వ్యవధిలోనే రూ. లక్షల కోట్లను మింగేసిన ఈ మహమ్మారి నేటితో మరింత ఉధృతంగా సాగుతోంది. గురువారం నాటి భారీ నష్టాల తర్వాత శుక్రవారం ప్రారంభమైన మార్కెట్లు అంతే స్థాయిలో భారీ నష్టాలతో మొదలయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్ 3000 పైగా పాయింట్ల నష్టాల్ని నమోదు చేయడంతో స్టాక్ మార్కెట్లను 45 నిమిషాల పాటు నిలిపేశారు. నిఫ్టీ సైతం 966 పాయింట్ల నష్టలను నమోదు చేసింది. సెన్సెక్స్, నిఫ్టీ రెండూ 10 శాతం మేరకు నష్టాలతో మార్కెట్లను ఓపెన్ చేశాయి. నిఫ్టీ ఏకంగా మూడేళ్ల కనిష్ఠానికి పడిపోవడం గమనార్హం. యూఎస్ డాలరు మారకంతో పోలిస్తే రూపాయి విలువ రూ. 73.92 వద్ద ట్రేడవుతోంది. దేశీయంగా కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఈ పరిణామాలతో దేశీయంగా సూచీలన్నీ భారెగా నష్టాలను నమోదు చేస్తున్నాయి.

Tags : Sensex, Nifty, US Markets, Coronavirus Fears, Stock Market, BSE, NSE, Share, Stock, Indian Rupee, YES Bank, Brent Crude, US Dollar, Asian Markets, Shanghai Composite Index, Nikkei


Next Story

Most Viewed