Health : టెస్టికల్స్‌లో పేరుకుపోతున్న మైక్రో ప్లాస్టిక్స్.. సంతానలేమి సమస్యలకు అవే కారణమా..?

by Javid Pasha |   (  Updated:2025-06-16 06:07:59  IST  )

Health : టెస్టికల్స్‌లో పేరుకుపోతున్న మైక్రో ప్లాస్టిక్స్.. సంతానలేమి సమస్యలకు అవే కారణమా..?

Health : టెస్టికల్స్‌లో పేరుకుపోతున్న మైక్రో ప్లాస్టిక్స్.. సంతానలేమి సమస్యలకు అవే కారణమా..?
X

దిశ, ఫీచర్స్ : సంతానలేమి.. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది జంటలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యగా మారుతోంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(WHO) ప్రకారం ప్రతీ ఆరుగురు జంటలలో ఒకరు ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. పిల్లలు పుట్టకపోవడం, సంతానం పొందే సామర్థ్యం లేకపోవడం అనేది స్త్రీలలో, పురుషుల్లో లేదా ఇద్దరిలోనూ సంభవించవచ్చు. ఇందుకు శారీరక పరమైన, జీవనశైలి పరమైన కారణాలు ఉంటాయనే విషయం తెలిసిందే. అయితే ఇటీవలి అధ్యయనం మాత్రం మరో కొత్త విషయాన్ని కనుగొన్నది. ఏంటంటే.. పురుషుల వృషణాల్లోని కణజాలంలో మైక్రో ప్లాస్టిక్స్( Microplastics) పేరుకుపోయి సంతానలేమికి దారితీస్తున్నాయి.

అధ్యయనంలో భాగంగా న్యూ మెక్సికో యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు 23 మంది మానవ(humans) వృషణాల నుంచి, అట్లనే 47 కుక్కల(dogs) వృషణాల నుంచి టిష్యూల(testicular tissue)ను సేకరించి విశ్లేషించగా అన్నింటిలోనూ మైక్రోప్లాస్టిక్ సంబంధిత కాలుష్యం(Microplastic pollution) ఉన్నట్లు కనుగొన్నారు. ఇక కుక్కల వృషణ కణజాలంతో పోలిస్తే, మానవ వృషణాలలోనే 3 రెట్లు ఎక్కువగా (329.44 micrograms/gram tissue) మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నట్లు గుర్తించారు. ప్యాకేజింగ్ వస్తువులు, ఆహారాలు, పైపులు(pipes), అలాగే రోజువారీ వస్తువులలో ఉపయోగించే పాలిథీన్(Polyethylene-PE), పాలీవినైల్ క్లోరైడ్ (PVC) వంటి సాధారణ ప్లాస్టిక్స్ ఈ నమూనాల(in samples)లో కనిపించాయి. అయితే ఈ మైక్రో ప్లాస్టిక్స్, బాహ్య కాలుష్యాల మాదిరి కాకుండా, శరీరంలో లోతుగా చొచ్చుకుపోయచి స్త్రీ, పురుషుల సంతానోత్పత్తి ప్రక్రియను దెబ్బతీస్తున్నాయని, ముఖ్యంగా పురుషుల సంతోనోత్పత్తి సామర్థ్యాన్ని ఎక్కువగా దెబ్బతీస్తున్నాయని పరిశోధకులు పేర్కొంటున్నారు.

మానవులతో పోలిస్తే కుక్కల టిష్యూలలో పాలీవినైల్ క్లోరైడ్ (PVC) ఎక్కువ మోతాదులో ఉండి, స్పెర్మ్ సంఖ్య తక్కువగా ఉన్నట్లు కూడా పరిశోధకులు గుర్తించారు. ఎందుకంటే మైక్రోప్లాస్టిక్‌లు ఎండోక్రైన్ వ్యవస్థను అడ్డుకోవడం వల్ల ఇలా జరిగిందని రీసెర్చర్స్ పేర్కొన్నారు. కుక్కలు మానవులతో సమానమైన పర్యావరణంలో జీవిస్తాయి కాబట్టి, వాటిలో కనిపించిన మైక్రో ప్లాస్టిక్స్ కాలుష్యం, దాని ప్రభావం మనుషుల్లో కూడా దాదాపు అదే ప్రభావాన్ని కలిగిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ఇక మైక్రో ప్లాస్టిక్‌లు ఆహారం, నీరు, గాలి ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయని, రక్తం, ఊపిరితిత్తులు, ప్లాసెంటా, మెదడు వంటి ఇతర అవయవాలలో కూడా ఇవి కనుగొనబడ్డాయని పరిశోధకులు వెల్లడించారు. ఈ ‘అదృశ్య ఆక్రమణ(invisible invasion)’ సంతానోత్పత్తి ఆరోగ్యంపై దీర్ఘకాలిక ప్రభావాలను కలిగిస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అయితే టెస్టికల్స్‌లో చేరుతున్న మైక్రో ప్లాస్టిక్స్ ఏ విధంగా సంతానలేమికి దారితీస్తున్నాయి? దాని ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా ఎంతగా ఉందో తెలుసుకోవడానికి, కచ్చితమైన ప్రభావాలను అర్థం చేసుకోవడానికి మరిన్ని పరిశోధనలు కూడా అవసరమని పరిశోధకులు పేర్కొంటున్నారు.

Next Story