బడ్జెట్‌లో వైద్యానికి ప్రత్యేక నిధి

by  |
బడ్జెట్‌లో వైద్యానికి ప్రత్యేక నిధి
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల దేశ ఆర్థికవ్యవస్థను దారుణంగా దెబ్బతీసిన కరోనా మహమ్మారి నేపథ్యంలొ కేంద్రం వైద్య రంగానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకోనుంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌లో వైద్య రంగం కోసమనే ప్రత్యేకంగా నిధిని ఏర్పాటు చేయాలని, ‘స్వస్థ్య సంవర్ధన్ నిధి’ పేరుతో ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. భవిష్యత్తులో వైద్య రంగం ఎదుర్కొనే సవాళ్లు, విపత్తులను అధిగమించేందుకు బడ్జెట్‌లో కేటాయింపులు ఉండటం మేలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ చేసిన ప్రతిపాదనలను అనుసరించి బడ్జెట్‌లో ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తోంది.

ఫిబ్రవరి 1న ప్రవేటపెట్టే బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ అంశపై ప్రకటించనున్నట్టు సమాచారం. వైద్య రంగం అత్యవసరమైనది కావున ‘స్వస్థ్య సంవర్ధన్ నిధి’లో ఉండే నిధులను పూర్తి ఆర్థిక సంవత్సరంలో వినియోగించకపోయినప్పటికీ తర్వాత దాన్ని కొనసాగించే విధంగా దీన్ని రూపొందించినట్టు తెలుస్తోంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ముసాయిదా ప్రకారం..కార్పొరేట్ పన్ను, ఆదాయ పన్నులపై విధించే విద్య, ఆరోగ్య సెస్ వసూళ్ల నుంచి పావు వంతు ఈ నిధి కోసం కేటాయించనున్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఆదాయ పన్ను, కార్పొరేట్ పన్నులపై 4 శాతం ఆరోగ్య, విద్య సెస్‌లను విధిస్తోంది. ఇందులో 3 శాతం విద్యా సెస్, 1 శాతం ఆరోగ్య సెస్. అంతేకాకుండా, ప్రస్తుత దేశ జీడీపీలో వైద్య రంగానికి 1.4 శాతాన్ని కేటాయిస్తుండగా, 2024 నాటికి దీన్ని 4 శాతానికి పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా ఉంది. 2019-20లో ఆరోగ్య, విద్య సెస్ ద్వారా ప్రభుత్వం రూ. 56 వేల కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకోగా, అందులో ఆరోగ్య సెస్ రూ. 14 వేల కోట్లుగా ఉంది.


Next Story

Most Viewed