వరుసగా మూడోరోజు లాభపడ్డ సూచీలు!

by  |
Sensex
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా మూడోరోజు లాభాలను సాధించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ దేశీయంగా కీలక కంపెనీల షేర్లలో ఒడిదుడుకుల కారణంగా సూచీలు రోజంతా లాభాలకు, నష్టాలకు మధ్య కదలాడాయి. అమ్మకాల ఒత్తిడి కారణంగా స్టాక్ మార్కెట్లు చివరి వరకు తీవ్ర ఊగిసలాటకు గురయ్యాయని, ముఖ్యంగా బ్యాంకింగ్, రియల్టీ, మెటల్ రంగాలు అధిక ఒత్తిడిని ఎదుర్కొన్నాయని నిపుణులు అభిప్రాయపడ్డారు. అయితే ఎనర్జీ, ఎఫ్ఎంసీజీ, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాలు ప్రధాన మద్దతుతో లాభాలతో మార్కెట్లు ముగిశాయని విశ్లేషకులు తెలిపారు.

వీక్లీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ముగింపు కావడంతో చివరి గంట వరకు ట్రేడింగ్‌లో హెచ్చుతగ్గులు కొనసాగాయని విశ్లేషకులు పేర్కొన్నారు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 157.45 పాయింట్లు లాభపడి 58,807 వద్ద, నిఫ్టీ 47.10 పాయింట్ల లాభంతో 17,516 వద్ద ముగిసింది. నిఫ్టీలో బ్యాంకింగ్, ఫైనాన్స్, ఐటీ, ప్రైవేట్ బ్యాంక్, రియల్టీ, హెల్త్‌కేర్, కన్స్యూమర్ డ్యూరబుల్స్ రంగాలు పతనమయ్యాయి. మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, మీడియా, ఎఫ్ఎంసీజీ రంగాలు పుంజుకున్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఐటీసీ, ఎల్అండ్‌టీ, ఏషియన్ పెయింట్, రిలయన్స్, ఎంఅండ్ఎం, బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభాలను సాధించగా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టైటాన్, నెస్లె ఇండియా, ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్, టీసీఎస్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 75.80 వద్ద ఉంది.


Next Story

Most Viewed