తిరిగి లాభాలు దక్కించుకున్న స్టాక్ మార్కెట్లు!

by  |
తిరిగి లాభాలు దక్కించుకున్న స్టాక్ మార్కెట్లు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుస నష్టాలు, సెలవుల తర్వాత సోమవారం అధిక లాభాలతో ట్రేడింగ్ మొదలుపెట్టాయి. మొదట ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ మిడ్-సెషన్ తర్వాత భారీ లాభాల దిశగా పయనించాయి. ముఖ్యంగా పండుగ సీజన్ మద్దతుతో రీటైల్ అమ్మకాలు రికార్డు స్థాయిలో జరగడం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి కూడా సానుకూల సంకేతాల కారణంగా సూచీలు పుంజుకున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అయితే స్టాక్ మార్కెట్లకు అన్నీ సానుకూల అంశాలే ఎదురై భారీ లాభాలతో ర్యాలీ చేసినప్పటికీ ప్రముఖ ఇండస్ఇండ్ బ్యాంక్ మాత్రం అత్యధికంగా 10.71 శాతం కుప్పకూలింది.

ఆ బ్యాంకు అనుబంధ సంస్థ బీఎఫ్ఐఎల్ ఎవర్‌గ్రీన్ రుణాలకు సంబంధించి అక్రమాలు జరిగాయనే వార్తల నేపథ్యంలో బ్యాంకు షేర్లు పతనమయ్యాయి. ఇక దేశీయంగా పలు పెట్రో ధరల తగ్గింపు నిర్ణయం వంటి కీలక అంశాలతో సూచీలు తిరిగి లాభాలను సాధించగలిగినట్టు నిపుణులు అభిప్రాయపడ్డారు. ఈ పరిణామాలతో బీఎస్ఈ సెన్సెక్స్ 60,500, నిఫ్టీ 18,000 కీలక మార్కును అధిగమించాయి. ఆ తర్వాత మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 518.04 పాయింట్లు ఎగసి 60,585 వద్ద, నిఫ్టీ 151.75 పాయింట్లు లాభపడి 18,068 వద్ద ముగిసింది.

నిఫ్టీలో పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 2 శాతానికి మించి లాభపడింది. రియల్టీ, మెటల్, మీడియా, ఐటీ, ఎఫ్ఎంసీజీ, ఫైనాన్స్ రంగాలు పుంజుకున్నాయి. బ్యాంకింగ్, ప్రైవేట్ బ్యాంక్, ఫార్మా, హెల్త్‌కేర్ రంగాలు నీరసించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో టైటాన్ ఆల్ట్రా సిమెంట్, బజాజ్ ఫిన్‌సర్వ్, టెక్ మహింద్రా, కోటక్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభాలను దక్కించుకున్నాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, ఎంఅండ్ఎం, ఎస్‌బీఐ, మారుతీ సుజుకి, ఏషియన్ పెయింట్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.06 వద్ద ఉంది.


Next Story

Most Viewed