ఆదిలో ఒడిదుడుకులు.. చివరికి లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

by  |
ఆదిలో  ఒడిదుడుకులు.. చివరికి లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు మంగళవారం ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల వార్తల కారణంగా ఉదయం నుంచే ఊగిసలాటకు గురైన సూచీలు చివరి వరకు అదే ధోరణిలో ర్యాలీ చేశాయి. అయితే, చివర్లో కీలక రంగాల నుంచి మద్దతు లభించడంతో స్టాక్ మార్కెట్లు మెరుగైన గరిష్ఠాల వద్ద నిలిచాయి. ప్రధానంగా దేశీయంగా ఇటీవల ఆందోళన కలిగిస్తున్న విద్యుత్ సంక్షోభం వల్ల మదుపర్లు అత్యంత ఎక్కువ జాగ్రత్తగా వ్యవహరించారు. దీనికితోడు యూరప్ మార్కెట్లు, ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు రావడంతో సూచీలు చివరి గంట వరకు అటీటూగా ట్రేడింగ్ అయ్యాయి. కానీ విద్యుత్ సంక్షోభం, కరెంట్ కోతలు ఉండవని కేంద్ర ప్రకటనతో చివర్లో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది.

ఇదే సమయంలో నిఫ్టీ ఇండెక్స్ మరోసారి 18 వేల మైలురాయిని తాకి వెనకడుగు వేసింది. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 148.53 పాయింట్లు ఎగసి 60,284 వద్ద క్లోజయింది. నిఫ్టీ 46 పాయింట్లు లాభపడి 17,991 వద్ద ముగిసింది. నిఫ్టీలో ఐటీ ఇండెక్స్ మినహా అన్ని రంగాలు పుంజుకున్నాయి. ముఖ్యంగా పీఎస్‌యూ బ్యాంక్ అధికంగా 3 శాతం, మీడియా, మెటల్, ఆటో, బ్యాంకింగ్, రియల్టీ రంగాలు బలపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో టైటాన్, బజాజ్ ఆటో, ఎస్‌బీఐ, బజాజ్ ఫిన్‌సర్వ్, నెస్లె ఇండియా, ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్, హిందూస్తాన్ యూనిలీవర్, కోటక్ బ్యాంక్ షేర్లు అధిక లాభాలను చూశాయి. హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, ఆల్ట్రా సిమెంట్, టీసీఎస్, ఎంఅండ్ఎం, భారతీ ఎయిర్‌టెల్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 75.49 వద్ద ఉంది.


Next Story