టీ20 సిరీస్‌లో సీనియర్లకు రెస్ట్.. కేఎల్ రాహుల్‌కి కీలక బాధ్యతలు..!

by  |
టీ20 సిరీస్‌లో సీనియర్లకు రెస్ట్.. కేఎల్ రాహుల్‌కి కీలక బాధ్యతలు..!
X

దిశ, వెబ్‌డెస్క్: టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా దారుణ ప్రదర్శన నేపథ్యంలో న్యూజీలాండ్‌తో జరగబోయే టీ20 సిరీస్‌కు సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ వంటి సీనియర్లు ఈ సిరీస్‌కు దూరంగా ఉంటారని బీసీసీఐకి చెందిన ఓ అధికారి తెలిపారు. ఇక టీమ్‌ను కేఎల్ రాహుల్ నడిపిస్తాడని చెప్పాడు. ఇక ఈ సిరీస్‌ ప్రేక్షకుల మధ్యే జరుగుతుందని, పరిమిత సంఖ్యలో అనుమతిస్తామని చెప్పాడు.

ప్రపంచకప్ ముగిసిన వెంటనే ప్రారంభమయ్యే ఈ మూడు టీ20ల సిరీస్‌ కోసం భారత జట్టును రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉందని క్రిక్ బజ్ పేర్కొంది. ఇంగ్లాండ్ పర్యటన తర్వాత ఐపీఎల్ కోసం నేరుగా యూఏఈకి చేరిన భారత ఆటగాళ్లు ఆ వెంటనే టీ20 ప్రపంచకప్ కోసం సిద్ధమయ్యారు. ఆటగాళ్ల అలసటను పరిగణలోకి తీసుకున్న బీసీసీఐ న్యూజీలాండ్‌తో టీ20 సిరీస్‌కు సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినివ్వాలనే నిర్ణయానికి వచ్చింది.

ఇక న్యూజిలాండ్‌తో జైపూర్ వేదికగా నవంబర్ 17, రాంచిలో నవంబర్ 19, కోల్‌కతా వేదికగా నవంబర్ 21న వరుసగా మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఆ తర్వాత కాన్పూర్ వేదికగా (నవంబర్ 25-29), ముంబై వేదికగా (డిసెంబర్ 3-7) రెండు టెస్ట్‌ల సిరీస్‌లను బీసీసీఐ నిర్వహించనుంది.


Next Story