సున్నిత అంశాల సమ్మిళితం కాజోల్ ‘త్రిభంగ’

92

దిశ, వెబ్‌డెస్క్: త్రీ జనరేషన్స్..త్రీ స్టోరీస్..అమ్మమ్మ, అమ్మ, మనవరాలు..ముగ్గురి జీవితాల చుట్టూ తిరిగే కథే ‘త్రిభంగ’. సమాజంలో నెలకొన్న చాలా సున్నితమైన అంశాలను టచ్ చేస్తూ తెరకెక్కిన ‘త్రిభంగ’ మూడు తరాల్లో ముగ్గురు మహిళల అనుభవాలను తెరపై ఆవిష్కరించింది. కాజోల్, తన్వి అజ్మీ, మిథిలా పాల్కర్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమాను రేణుక శహనే డైరెక్ట్ చేశారు. తన్వి అజ్మీ పాపులర్ రైటర్‌ నయనతారగా కనిపించగా..కాజోల్ తన కూతురు అనురాధగా బాలీవుడ్ యాక్ట్రెస్, క్లాసికల్ డ్యాన్సర్ పాత్రలో మెప్పించారు. ఇక మిథిలా పాల్కర్ కాజోల్‌ కూతురు మీషాగా హుందాగా నటించింది.

రైటర్‌గా సంతృప్తి పొంది సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నయనతార అవార్డులతో సత్కరించబడుతుంది. కానీ, ఇంట్లో ఉన్న తన ఇద్దరు పిల్లలను మాత్రం పట్టించుకోదు. ఓ గదిలో ఉంటూ రచనలు చేస్తుంటుందే తప్ప పిల్లల బాగోగులు చూసుకోకపోవడంతో అత్త చివాట్లు పెడుతుంది. దాన్ని అవమానంగా భావించిన నయనతార..అత్త, భర్తను కాదని పిల్లలను తీసుకుని బయటకు వెళ్లిపోతుంది. రచయితగా రోజుకో మెట్టు ఎదుగుతున్న క్రమంలో మరో వ్యక్తితో ప్రేమలో పడి రెండో పెళ్లి చేసుకుంటుంది. ఆ భర్త కూతురు(అనురాధ)కి తండ్రిగా కాకుండా కామాంధుడిగా మారుతాడు. తనతో ఫ్రెండ్లీగా మూవ్ అవుతున్నానని చెప్తూనే..లైంగికంగా వేధిస్తుంటాడు. అలాంటప్పుడు కూతురు పరిస్థితి ఏంటి? తల్లి అసలు విషయాన్ని తెలుసుకోగలిగిందా? బిడ్డ తల్లికి ఎందుకు దూరమైంది? అనేది ఓ జనరేషన్ కథ.

ఒక తల్లికి బిడ్డగా ఉన్నప్పుడు లైంగిక వేధింపులు ఎదుర్కొన్న అనురాధ..తనకు పుట్టబోయే బిడ్డకు మాత్రం అలాంటి పరిస్థితులు ఎదురుకాకూడదని అనుకుంటుంది. బాలీవుడ్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఓ వ్యక్తితో లివింగ్ రిలేషన్ షిప్‌లో ఉన్న అనురాధ గర్భవతి అవుతుంది. తనను ఎన్ని చిత్రహింసలు పెట్టినా భరించిన అను..కడుపులో ఉన్న బిడ్డపై ఆ వ్యక్తి చేయి పడటంతో అపరకాళిగా మారుతుంది. ఇంట్లో నుంచి అతన్ని తరిమికొట్టి సింగిల్ పేరెంట్‌గా మారిపోతుంది. యాక్ట్రెస్ కాబట్టి రోజుకో బాయ్ ఫ్రెండ్‌తో ఎంజాయ్ చేసినా తప్పులేదనుకుంటుంది. కానీ, ఈ విషయం తన కూతురి జీవితంపై ఎలా ప్రభావం చూపింది? అమ్మ ప్రవర్తనతో కూతురు ఎలాంటి అవమానాలు ఎదుర్కొంది? అనేది మరో జనరేషన్ కథ.

అమ్మమ్మ, అమ్మల కథలు విని, ప్రత్యక్షంగా చూసిన అమ్మాయి మీషా..వారిలా సింగిల్ పేరెంట్‌లా ఉండకూడదని డిసైడ్ అవుతుంది. ప్రేమ పెళ్లి చేసుకుని చక్కగా సెటిల్ అయిపోతుంది. అయితే పెళ్లి తనకు స్వేచ్ఛను ఇస్తుందా? కుటుంబ జీవితంలో ఇరుక్కుపోయిన తను ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది? ఎందుకు స్వేచ్ఛగా ఉండలేకపోయింది? అనేది మరో కథ.

అమ్మ చేసిన తప్పును పెద్ద తప్పుగా చూసి జాగ్రత్త పడినా అనురాధ.. తనకే తెలియకుండా కూతురికి ద్రోహం చేశానని, అదే విధంగా అమ్మ కూడా తనకు తెలియకుండా చేసిన తప్పే తమ జీవితాల మీద ప్రభావం చూపించిందని తెలుసుకుంటుందా? ఆ నిజం తెలిసేసరికి అమ్మ ఎలాంటి పరిస్థితుల్లో ఉంటుంది? ఈ మూడు జనరేషన్ల మధ్య ఉన్న గ్యాప్‌ను తొలగించే కీలక పాత్ర ఏంటి? అనేది చక్కగా ప్రజెంట్ చేశారు. మూడు తరాల మహిళల స్వభావాలు, సామాజిక పరిస్థితుల గురించి సింపుల్‌గా అందరికీ అర్థమయ్యేలా తెరకెక్కిన మూవీకి బెస్ట్ కాంప్లిమెంట్స్ అందుతున్నాయి. ఈ ఫిల్మ్ విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటోంది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..