రేపటి నుంచి రెండో డోస్?

by  |

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వారం రోజులుగా నిలిచిపోవడంతో సెకండ్ డోస్ అవసరమైనవారికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆలోచిస్తున్నది. కొవిషీల్డ్ డోస్ తీసుకున్నవారికి మళ్ళీ సెకండ్ డోస్ ఇవ్వడానికి దాదాపు ఒకటిన్నర నెల రోజుల గడువు ఉన్నందున వారి విషయంలో పెద్దగా ఆందోళన లేదు. కానీ కొవాగ్జిన్ ఫస్ట్ డోస్ తీసుకున్నవారిలో చాలా మందికి సెకండ్ డోస్ ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం స్టాక్ ఉన్నంత వరకు సెకండ్ డోస్ ప్రక్రియను సోమవారం నుంచి మొదలుపెట్టాలని వైద్యారోగ్య శాఖ భావిస్తోంది. ఒకటి రెండు రోజుల్లోనే కొవాగ్జిన్ డోసులన్నీ అయిపోవచ్చని వైద్యులు అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ దగ్గర సుమారు ఒకటిన్నర లక్షల కొవాగ్జిన్ డోసులు ఉన్నట్లు అంచనా. ముఖ్యమంత్రి ఇటీవల చేసిన ప్రకటన ప్రకారం 58,320 డోసులు ఉన్నాయి. రెండు రోజుల క్రితం రాష్ట్రానికి వచ్చిన లక్ష డోసులు, ముఖ్యమంత్రి ప్రకటన తర్వాత వచ్చిన డోసులను కలిపి చూస్తే కొవాగ్జిన్ వ్యాక్సిన్ దాదాపు లక్ష డోసుల మేరకు ఉండొచ్చని సమాచారం.

ఆ ప్రకారం మొత్తం ఒకటిన్నర లక్షల మందికి సెకండ్ డోస్ ఇవ్వడానికే ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహించే అవకాశం ఉంది. సుమారు రెండున్నర లక్షల మందికి కొవాగ్జిన్ సెకండ్ డోస్ ఇవ్వాల్సి ఉంటుందని, అయితే ప్రస్తుతం స్టాక్ ఉన్న మేరకు ఒకటిన్నర లక్షల మందికి ఇస్తే మళ్ళీ వచ్చే స్టాక్‌తో మిగిలినవారికి ఇవ్వవచ్చని ప్రజారోగ్య శాఖ అంచనా వేస్తోంది.

దీనికి తోడు 18-44 ఏజ్ గ్రూపువారి కోసం భారత్ బయోటెక్ సంస్థ నుంచి 98 వేల డోసుల్ని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ ఇప్పటికే సమకూర్చుకుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం తన సొంత ఖర్చుతో సమకూర్చుకున్నందున కేవలం ఆ ఏజ్ గ్రూపువారిక మాత్రమే ఇవ్వాలని రిజర్వు చేసి పెట్టుకుంది. 45 ఏళ్ళ వయసు పైబడినవారికి సెకండ్ డోస్‌గా వినియోగించుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ ఆ తర్వాత కేంద్రం నుంచి వచ్చే ‘ఉచిత‘ డోసులతో రీయింబర్స్ చేయవచ్చో లేదోననే అనుమానంతో వాడకుండా కోల్డ్ స్టోరేజీలో అధికారులు భద్రపరిచారు. వ్యాక్సిన్‌ను ఎంత తొందరగా ఎంత ఎక్కువ మందికి ఇవ్వగలిగితే అంతగా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని ప్రభుత్వం చెప్తున్నా సాంకేతిక సమస్యలతో ఆ ప్రక్రియకు విఘాతం కలిగించడం గమనార్హం.కొవాగ్జిన్ సెకండ్ డోస్ ఎప్పటి నుంచి ఇస్తారనే అధికారిక ప్రకటన కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు.

Next Story

Most Viewed