సెకండ్ వేవ్ కారణంగా ఎన్‌పీఏలు మరింత పెరిగే ఛాన్స్!

by  |
Rakesh Mohan
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్ సెకండ్ వేవ్ పరిణామాల వల్ల బ్యాంకింగ్ వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ఎన్‌పీఏలు మరింత పెరగవచ్చని, ఇది ఆర్థిక స్థిరత్వంపై ఒత్తిడిని పెంచుతుందని ఆర్‌బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ రాకేష్ మోహన్ అన్నారు. 2015 నుంచి నిరర్ధక ఆస్తులు(ఎన్‌పీఏ) ఒత్తిడితో భారత బ్యాంకింగ్ వ్యవస్థ ఎదుర్కొంటొందని ఆయన తెలిపారు. ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ అండ్ రీసెర్చ్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ డెవలపింగ్ కంట్రీస్ నిర్వహించిన వర్చువల్ సమావేశంలో మాట్లాడిన ఆయన.. ఎన్‌పీఏల ప్రమాదాన్ని తగ్గించేందుకు దివాలా కోడ్, ఇన్సాల్వెన్సీ సహా పలు చర్యలు తీసుకున్నప్పటికీ, 2020లో కరోనా మహమ్మారి కారణంగా ఈ ప్రక్రియకు విఘాతం ఏర్పడిందని ఆయన చెప్పారు.

కరోనాకు ముందు చెడు రుణాల విషయంలో మిగిలిన దేశాల కంటే క్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొంటున్నామన్నారు. ప్రస్తుత ఏడాది చివరి నాటికి ఎన్‌పీఏలు 13.5 శాతానికి పెరిగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. సెకెండ్ వేవ్ ప్రతికూల ప్రభావం మరింత ఇబ్బందికరంగా ఉండొచ్చని, ఆర్‌బీఐ మరింత పటిష్టతను కొనసాగించాలని ఆయన చెప్పారు. రియల్టీ, ఫైనాన్స్ రంగాల మధ్య పనితీరు వ్యత్యాసం ఏర్పడింది. ఇది బ్యాంకులు, రుణ గ్రహీతలు ఇద్దరికీ ఒత్తిళ్లను పెంచుతుంది. దీనివల్ల ఆర్థిక అస్థిరతకు దారితీస్తుందని ఆయన వివరించారు.


Next Story